• facebook
  • whatsapp
  • telegram

విధానాల్లో లోపమే పర్యావరణానికి శాపం

అనుమతుల్లో ‘ర్యాంకింగ్‌’ ఆందోళన

అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతుల మంజూరు ప్రక్రియలో చొరవ చూపిన రాష్ట్రాలకు ర్యాంకింగ్‌ ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. పారిశ్రామిక విస్తరణపై కేంద్రం చూపుతున్న శ్రద్ధ... కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ లక్ష్యాలకు ఆటంకంగా పరిణమిస్తోంది. పరిశ్రమలకు అటవీ, పర్యావరణ అనుమతులిచ్చే ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర అథారిటీలు లోపభూయిష్ఠ విధానాలను అవలంబిస్తున్నాయి. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ నిర్లక్ష్య ధోరణివల్ల దేశంలో సున్నితమైన పర్యావరణ వ్యవస్థలకు, అటవీ, సహజ వనరులకు తీరని నష్టం వాటిల్లుతోంది. ఈ లోపాలను అధిగమించేందుకు పర్యావరణ అనుమతుల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనాలను పెంచడంపై కేంద్రం దృష్టి సారించాల్సి ఉంది. అందుకు భిన్నంగా రాష్ట్రాల మధ్య పోటీ పెట్టి అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం ఆరాటపడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

నిబంధనలకు గ్రహణం

దేశంలోని పర్యావరణ చట్టాల్లో సమూల మార్పులకు సిఫార్సు చేసిన టీఎస్‌ఆర్‌ సుబ్రమణియన్‌ కమిటీ నివేదికను ఎప్పుడు అమలు చేస్తారంటూ ఇటీవల సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్రం మాత్రం ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతులిచ్చే రాష్ట్రాల్లోని పర్యావరణ ప్రభావ మదింపు సంస్థలకు ర్యాంకింగ్‌ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ వ్యవస్థల్లో జవాబుదారీతనం పెంపుదలకు ఉన్న అవకాశాలను నీరుగారుస్తూ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు  ప్రభుత్వ వ్యవస్థలు ప్రయత్నిస్తున్నాయని పర్యావరణ నిపుణులు విమర్శిస్తున్నారు. భోపాల్‌ ఘోర దుర్ఘటన అనంతరం భారత్‌లో పరిశ్రమలు, ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతులు మంజూరు చేసే వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 అనుబంధంగా అనుమతుల ప్రక్రియ కోసం పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ)-2006 నోటిఫికేషన్‌ను అమలు చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా ఈఐఏ ప్రక్రియను చిత్తశుద్ధితో అమలు చేస్తే- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కాలుష్య తీవ్రతతో పాటు ఆర్థిక, సామాజిక, పర్యావరణ నష్టాలను గణనీయంగా తగ్గించే అవకాశాలున్నాయి. ఇండియాలో పరిస్థితి అందుకు భిన్నంగా సాగుతోంది. 1994లో మొదలైన ఈఐఏ నిబంధనలను ‘సరళతరం’ పేరుతో నిర్వీర్యం చేయడంవల్ల అనుమతుల ప్రక్రియ మొక్కుబడి తంతుగా మారిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏకగవాక్ష విధానంలో ‘పరివేష్‌’ వ్యవస్థను అమలు చేస్తోంది. అనుమతుల ప్రక్రియ అనేక దశల్లో అనేక సాంకేతిక అంశాలతో ముడివడి ఉంటుంది. అభివృద్ధి ప్రాజెక్టుల స్థాయి, అవి ఏర్పాటయ్యే ప్రాంతాలనుబట్టి పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తారు. ప్రభావిత ప్రాంతం అడవుల పరిధిలోకి వస్తే అటవీ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, అటవీ హక్కుల గుర్తింపు చట్టాల మేరకు అనుమతులిస్తారు. తీర పరిధిలో ఉంటే కోస్తా యాజమాన్య నిబంధనలు, గిరిజన ప్రాంతాలైతే పీసా గ్రామసభల నిబంధనలకు లోబడి అనుమతులను మంజూరు చేస్తారు. ఏదైనా పరిశ్రమ లేదా ప్రాజెక్టువల్ల ఉత్పన్నమయ్యే పర్యావరణ, అటవీ, సామాజిక ప్రభావాన్ని అంచనా వేసి- నష్ట భర్తీకి చేపట్టే చర్యలను నివేదించే అంశం కీలకమైంది. ఈ నివేదికల రూపకల్పన కోసం ప్రైవేటు, ప్రభుత్వ ఏజెన్సీలు గుర్తింపు పొందిన ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థలపైనే అధికంగా ఆధారపడుతున్నాయి. ఆ నివేదికల ఆధారంగా నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ సైతం కొన్నేళ్లుగా వివాదాస్పదంగా మారింది. ఈఐఏ అవాస్తవాలను నివేదిస్తే శిక్షించే చట్టబద్ధ ఏర్పాటులేదు. కనీసం జరిమానాలు విధించే దిశగా నిబంధనలూ లేవు.

ప్రక్షాళన అవసరం

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు పర్యావరణ చట్టాల అమలులో ఇష్టారాజ్యంగా ఉన్న లైసెన్స్‌రాజ్‌ వ్యవస్థ సమగ్ర ప్రక్షాళనకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. నేడు పర్యావరణ మంత్రిత్వ శాఖ ధోరణి చూస్తుంటే తన హామీలను తానే తుంగలో తొక్కేస్తున్న తీరు కళ్లకు కడుతోంది. 2014లో కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి టీఎస్‌ఆర్‌ సుబ్రమణియన్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ దేశంలో పర్యావరణ చట్టాల అనుమతుల విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై కీలక సిఫార్సులు చేసింది. విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో రెండేళ్ల క్రితం ప్రమాదం తలెత్తిన సందర్భంగా పర్యావరణ అనుమతుల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపై పెద్దయెత్తున చర్చలు జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో నిపుణులతో కూడిన కమిటీలు అనేక కీలక సూచనలు చేశాయి. సమూల మార్పుల కోసం కొత్తగా పర్యావరణ నష్ట యాజమాన్య చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ఏక గవాక్ష విధానం ద్వారా అనుమతులు మంజూరు చేసే వ్యవస్థలను బలోపేతం చేయాలంటూ కమిటీ చేసిన సూచనలను సమీక్షించుకోవాలి. పర్యావరణ, అటవీ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, జల వాయు కాలుష్య నియంత్రణ చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ఈ చట్టాల అమలుకు ఉమ్మడి వ్యవస్థలు పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలి. పర్యావరణ అనుమతులకు పచ్చజెండా ఊపే వివిధ రంగాల స్వతంత్ర నిపుణులను, ఈఐఏ నివేదికలు రూపొందించే సంస్థల జవాబుదారీతనం పెంచేలా చట్టాల్లో మార్పులు అవసరం. దేశంలో పర్యావరణ చట్టాల అమలుకు ప్రత్యేకంగా అఖిల భారత పర్యావరణ సర్వీసు వ్యవస్థల ఏర్పాటుకు కమిటీ చేసిన కీలక సిఫార్సులపై దృష్టి సారించాలి. సమాజ సంక్షేమాన్ని ప్రతిబింబించే రీతిలో పర్యావరణ చట్టాల పటిష్ఠ అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా చర్యలు చేపట్టాలి. అటువంటి పకడ్బందీ చర్యలద్వారానే ప్రజలకు భరోసా దక్కుతుంది.

పరిమిత విధులు

అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో ప్రభుత్వ వ్యవస్థల్లో మితిమీరిన అవినీతి- ప్రైవేటు ఏజెన్సీలు వాస్తవాలను మరుగు పరిచేందుకు అవకాశం ఇస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా తీర ప్రాంతాలు, చిత్తడి, మడ, అటవీ నేలల విశిష్టత, గిరిజన ప్రాంతాల స్థితిగతులు నివేదికల్లో ప్రతిబింబించడం లేదు. ఆ నివేదికలను సమీక్షించే కేంద్ర, రాష్ట్ర నిపుణుల కమిటీలకు పరిమిత విధులు, బాధ్యతలు మాత్రమే ఉంటాయి. ప్రాజెక్టుల ప్రతిపాదనల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రభుత్వాలనుంచి వచ్చే ఒత్తిడివల్ల అధిక శాతం ప్రాజెక్టుల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే అనుమతులు ఇచ్చేసే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా గడచిన అయిదు దశాబ్దాల కాలంలో సుమారు 40వేల చదరపు కిలోమీటర్ల అటవీ భూములను ఖనిజ తవ్వకాలు, పరిశ్రమల ఏర్పాటు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకోసం బదలాయించారు.

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 11-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం