• facebook
  • whatsapp
  • telegram

భయపెడుతున్న ఎల్‌ నినో

వరసగా మూడేళ్ల పాటు లా నినా ప్రభావంతో భారత్‌లో మంచి వర్షాలు కురిశాయి. 2023లో ఎల్‌ నినో మూలంగా ఇండియా ఉష్ణ తాపానికి, వర్షాభావానికి గురి కావచ్చని వాతావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. రుతుపవనాలపై ఆధార పడిన భారత వ్యవసాయానికి ఎల్‌ నినో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

భూ మధ్య రేఖ దగ్గర పసిఫిక్‌ మహాసముద్ర జలాలు వేడెక్కినప్పుడు ఎల్‌ నినో సంభవిస్తుంది. ఇది మూడేళ్లకు కానీ, అయిదేళ్లకు కానీ పునరావృతమవుతూ ఉంటుంది. పసిఫిక్‌ జలాలు చల్లబడితే లా నినా ఏర్పడుతుంది. గడచిన మూడేళ్లూ లా నినాను చవిచూశాం. ఈ ఏడాది ఎల్‌ నినో వంతు అని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. 2023లో ఎల్‌ నినో ఎంత తీవ్రంగా ఉంటుందన్న దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఎల్‌ నినో సంభవిస్తే దిల్లీ, బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అనావృష్టి పరిస్థితులు ఏర్పడవచ్చు. మధ్య, వాయవ్య భారత రాష్ట్రాల్లో ఎండలు మండిపోవచ్చని అంచనా. ఇండియాలో 1901 తరవాత సంభవించిన అత్యుష్ణ సంవత్సరాల్లో అయిదోది 2022వ సంవత్సరమేనని వాతావరణ శాఖ ప్రకటించింది. 19వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రత కన్నా 2022లో భూ ఉష్ణోగ్రత 1.1 డిగ్రీల సెల్సియస్‌ అధికమని అమెరికాకు చెందిన నాసా వెల్లడించింది. 2023లో ఎల్‌ నినో ఏర్పడితే భూ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరగవచ్చు. 2024లో ఉష్ణోగ్రత మరింత అధికమై కొత్త రికార్డు సృష్టించే ప్రమాదం ఉంది.

ద్రవ్యోల్బణానికి రెక్కలు

సాధారణంగా సముద్రాల ఉపరితలంలోని నీటిని గాలులు అటూ ఇటూ తోయడం వల్ల అడుగున ఉన్న చల్లని జలాలు పైకి వస్తాయి. ఎల్‌ నినో ఏర్పడినప్పుడు గాలుల వేగం తగ్గి ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. ఫలితంగా సముద్రాల ఉపరితలంలో పోషకాలు లేని నీరు నిలిచిపోతుంది. కిందనున్న చల్లని జలాల్లోని పోషకాలు పైకి రాక చేపల వేటలో దిగుబడి తగ్గిపోతుంది. సముద్రాలు, భూ వాతావరణం మధ్యనున్న సంబంధాలు ప్రపంచంలో కొన్ని చోట్ల అనావృష్టిని, మరి కొన్ని చోట్ల అతివృష్టిని కలిగిస్తాయి. ఉపరితల జలం వేడెక్కడం వల్ల పసిఫిక్‌ మహాసముద్రంలో పుట్టే తుపానుల సంఖ్య పెరిగిపోతుంది. వాతావరణం సగటుస్థాయికన్నా వేడెక్కి వర్షాభావమూ సంభవిస్తుంది.

భారత ఉపఖండంలో ఏటా జూన్‌-సెప్టెంబరు మధ్య వర్షాకాలం ఉంటుంది. ఎల్‌ నినో ఏర్పడిన సంవత్సరాల్లో వర్షాభావం కాని, అనావృష్టి కాని సంభవిస్తాయి. 80శాతం ఎల్‌ నినో సంవత్సరాలు వర్షాభావాన్ని కలిగించాయి. ఇండియా జీడీపీలో 20శాతం వ్యవసాయ రంగం నుంచే లభిస్తోంది. ఎల్‌ నినో తెచ్చిపెట్టే వర్షాభావం వల్ల పంట దిగుబడులు తగ్గితే ఆహార ధరలు అధికమవుతాయి. బియ్యం, గోధుమ, చక్కెర, పప్పుల ధరలు మండిపోవచ్చు. వినియోగ ధరల సూచీ పెరుగుదలలో 40శాతానికి ఆహార ధరలే కారణం. ద్రవ్యోల్బణాన్ని రెండు నుంచి ఆరు శాతం మధ్య కట్టడి చేయాలని రిజర్వు బ్యాంకు లక్షిస్తోంది. ఇటీవల ద్రవ్యోల్బణం రేటు 5.72శాతానికి దిగి వచ్చినా ఎల్‌ నినో వల్ల అది అదుపు తప్పే ప్రమాదం ఉంది. రానున్న నెలల్లో భారత్‌లో ద్రవ్యోల్బణం ఆరు శాతాన్ని మించిపోవచ్చని రిజర్వు బ్యాంకు ఇటీవలే హెచ్చరించింది. మరోవైపు భారత శ్రామిక బలగంలో సగంమందికి వ్యవసాయమే ఆధారం. ఎల్‌ నినో వల్ల వారందరి ఉపాధిపై విషమ ప్రభావం పడుతుంది.

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఇప్పటికే ఆహార ధాన్యాలు, వంట నూనెల ధరలు ఆకాశానికంటి ఆఫ్రికాలో ఆకలి కేకలు హెచ్చుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌ నినోతో వ్యవసాయ దిగుబడులు తగ్గితే అన్నార్త దేశాల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. కొవిడ్‌ కాలంలోనే కాకుండా ఇటీవలా పొరుగున ఉన్న రాజ్యాలకు, కొన్ని ఆఫ్రికా దేశాలకు భారత్‌ ఆహార ధాన్యాలను పంపింది. ఎల్‌ నినో వల్ల ఇండియాలో ఆహార దిగుబడులు, ఆహార నిల్వలు తరిగిపోతే ఇతర దేశాలను ఆదుకొనే అవకాశం ఉండదు. వాతావరణ మార్పుల కారణంగా భూ ఉష్ణోగ్రత పెరిగినందువల్ల నిరుడు అమెరికా, ఐరోపా, చైనాలలో ఎండలు మండిపోయాయి. నదులు, జలాశయాలు ఎండిపోయి  పంటల వైఫల్యం సంభవించింది. పాకిస్థాన్‌, నైజీరియాలలో వరదలు జల విలయాన్ని సృష్టించడంతో పంటలు నాశనమయ్యాయి. పాకిస్థాన్‌లో గోధుమ పిండి కోసం జనం కొట్లాడుకోవడం చూస్తూనే ఉన్నాం. ఎల్‌ నినో, లా నినాల రాకను ముందుగానే అంచనా వేయడానికి శాస్త్ర సాంకేతిక సాధనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటూ ఎల్‌ నినో, లా నినా సంవత్సరాల్లో ఎలాంటి పంటలు వేయాలి, ఎంతమేర ఆహార నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలో ముందుగానే అంచనా వేసుకోవాలి. వాతావరణ మార్పుల వల్ల మున్ముందు ఎల్‌ నినో, లా నినాలలో ఏది పెరుగుతుందో ఇంకా స్పష్టత లేదు. ఈ అంశాన్ని కచ్చితంగా నిర్ధారించడానికి సూపర్‌ కంప్యూటర్లు, భారీ నిధులతో ప్రపంచ దేశాలు సంసిద్ధం కావాలని అంతర్జాతీయ శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు.

- ఆర్య
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అడ్డగోలు అప్పులు... జనానికే తిప్పలు!

‣ సాగు మారితేనే ఆహార భద్రత

‣ వివాదాల సేతుసముద్రం

‣ భగ్గుమంటున్న పుడమి

Posted Date: 14-02-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం