• facebook
  • whatsapp
  • telegram

పచ్చదనానికి గొడ్డలిపెట్టు

కంచెలకు మంచెలకు అడవులు బలి

పచ్చదనాన్ని పెంపొందించడంలో ఇటీవల ప్రభుత్వాల శ్రద్ధ పెరిగింది. కోట్ల సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాలు విరివిగా కొనసాగుతున్నాయి. అడవుల పరిరక్షణకూ పాలకులు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు. పోడు వ్యవసాయం, కలప అక్రమ రవాణాలను అరికట్టడం ద్వారా అడవుల్లో చెట్ల నరికివేత గణనీయంగా తగ్గింది. కానీ అటవీ గ్రామాల ప్రజలు కంచెలు, మంచెలు, పందిళ్ల ఏర్పాటుకు, వంటచెరకు కోసం స్థానికంగా ఉన్న చెట్లపైనే ఆధారపడుతున్నారు. దేశంలో వేల గ్రామాలు అటవీ ప్రాంతాలు లేదా వనాల సరిహద్దుల్లో ఉన్నాయి. పశువులు, ఇతరత్రా రక్షణ కోసం అక్కడ నివసించే ప్రజలు తమ ఇళ్లు, పంటభూముల చుట్టూ కంచె ఏర్పాటు చేసుకుంటారు. ఇంటిముందు పందిళ్లు, పంటచేను కాపలాకోసం మంచెలు నిర్మించుకుంటారు. వీటికి అవసరమైన గుంజలు, బడితెలు వంటి వాటి కోసం అడవులపై ఆధారపడుతున్నారు. అందుకోసం బిల్లుడు, సండ్ర, బొజ్జ (కొండ తంగేడు), నల్లమద్ది, రేల, నల్ల కొడిశ, కారెంగ, గొట్టి, దంతె వంటి చెట్లను నరుకుతున్నారు.

కనిపించని నష్టం

ప్రతి అటవీగ్రామంలో ఏటా వందల సంఖ్యలో కంచెలు, మంచెలు, పందిళ్లు ఏర్పాటుచేస్తారు. వీటి కోసం పెద్దసంఖ్యలో చెట్లను నరుకుతున్నారు. ఇది అడవుల్లో పచ్చదనానికి విఘాతంగా మారుతోంది. వనాల్లోని చెట్లు ఒక గుంజ పరిమాణానికి పెరగడానికి పదినుంచి ఇరవై ఏళ్లు పడుతుంది. సాధారణంగా కంచెలు రెండు, మూడేళ్ల వరకే నిలుస్తాయి. కొన్ని ఏడాదిలోనే దెబ్బతింటాయి. మళ్ళీ కొత్తవాటిని ఏర్పాటుచేయడానికి చెట్లను నరకాలి. ఫలితంగా ఎంతటి దట్టమైన అడవులైనా క్రమంగా క్షీణదశకు చేరుకుంటాయి. స్వాతంత్య్రానంతరం వృద్ధిచెందిన జనాభా అవసరాలకు అనుగుణంగా మన దేశంలో అటవీ విస్తీర్ణం పెరగకపోగా, తగ్గింది. హరితహారం, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలతో ఇప్పుడిప్పుడే అడవులు కోలుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కంచెలు మంచెల ఏర్పాటుకోసం ఇంకా అడవులపై ఆధారపడుతుంటే పచ్చదనం పెంచాలన్న లక్ష్యం నెరవేరదు. వాటి స్థానంలో రాతి, కాంక్రీటు గుంజలను, వైరును కంచెల ఏర్పాటుకు వినియోగించాలి. కొంత ఖర్చుతో కూడుకున్నదైనా పర్యావరణ శ్రేయస్సుదృష్ట్యా ఈ విధానం మేలు. పంటభూముల గట్లపై గచ్చకాయ, గోరింటాకువంటి మొక్కలను పెంచుతూ జీవకంచె (బయో ఫెన్సింగ్‌) ఏర్పాటు చేసుకునేలా స్థానికులను ప్రోత్సహించాలి. ఇతర ప్రత్యామ్నాయాలనూ అన్వేషించాలి. వంటచెరకు సేకరణ సైతం అడవులకు కనిపించని నష్టం కలిగిస్తోంది. అటవీగ్రామాల్లో చాలా వరకు వంటగ్యాసు సదుపాయం ఉన్నా కొంతమంది పూర్తిగా, చాలామంది పాక్షికంగా వంటచెరకును ఉపయోగిస్తున్నారు. అడవిలో ఎండిపోయిన, పడిపోయిన చెట్లనుంచి వంటచెరకు సేకరిస్తారు. కట్టెలను అమ్ముకుని జీవనం సాగించేవారు తమ ఆదాయం కోసం పచ్చని చెట్లను నరికి, ఎండిపోయేలా చేస్తున్నారు. చిలుకలు, గుడ్లగూబలు, వడ్రంగి పిట్టలు వంటి పక్షిజాతులు గూళ్లను ఏర్పాటు చేసుకోవడానికి ఎండిపోయిన చెట్లు ఉపయోగపడతాయి. పక్షులు వీటిపై వాలి ఆహారాన్ని వెతుక్కుంటాయి. ఎండిపోయిన చెట్లు చీమలు, చెదలు వంటి క్రిమికీటక జాతులకు ఆవాసంగా, ఆహారంగా ఉపయోగపడతాయి. ఇలా వృద్ధిచెందిన క్రిమికీటకాలను తొండలు, బల్లులు, ఉడుములు, అడవి వాలుగలు (పాంగోలిన్‌)వంటి సరీసృపాలు, పక్షిజాతులు ఆహారంగా తీసుకుంటాయి. ఎండిపోయినచెట్లు చివరకు మట్టిగా రూపాంతరం చెంది భూమిలో కలిసిపోతాయి. తద్వారా మృత్తిక తిరిగి పరిపుష్టం అవుతుంది. వంటచెరకు కోసం అడవులపై ఆధారపడటం వల్ల వీటన్నింటికీ అవరోధం ఏర్పడుతోంది.

ప్రోత్సాహకాలు అవసరం

కంచెలు, పందిళ్ల ఏర్పాటు, వంటచెరకు సేకరణకు అడవులపై ఆధారపడటాన్ని ఆయా గ్రామాల ప్రజలు, అటవీశాఖ సిబ్బంది చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అది అనాదిగా వస్తున్న అలవాటు. నరుకుతున్న చెట్లు టేకు, ఏగిస, జిట్రేగి వంటి కలపవృక్షాలు కాకపోవడం, ఆయా అవసరాల్లో వ్యాపారపరమైన అంశం పెద్దగా లేకపోవడంతో దాన్ని చిన్న విషయంగా భావిస్తున్నారు. తీవ్రమైన అటవీ నేరాలుగా వాటిని పరిగణించడంలేదు. కానీ, ఈ కార్యకలాపాలవల్ల అడవులకు పెద్ద నష్టమే కలుగుతోంది. కంచె, పందిళ్ల ఏర్పాటుకు ఉపయోగించే కలపకు, వంటచెరకుకు డబ్బురూపంలో లెక్కగడితే, వాటిని ఉపయోగించే ఒక్కోకుటుంబం సంవత్సరానికి కనీసం ఇరవైనుంచి ముప్ఫైవేల రూపాయలు వెచ్చించవలసి ఉంటుందని అంచనా. ప్రత్యామ్నాయ కంచె ఏర్పాట్లకు ప్రభుత్వాలు సహాయం చేయాలి. గుజరాత్‌ రాష్ట్రం ఈ దిశగా ప్రోత్సాహకాలు అందిస్తోంది. అటవీశాఖ ఆధ్వర్యంలో రక్షిత అటవీప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌, పొయ్యిలను పరిమిత సంఖ్యలోనే పంపిణీ చేస్తున్నారు. వీటిని మరింతగా పెంచి అందరూ తప్పనిసరిగా గ్యాస్‌ పొయ్యిలను ఉపయోగించేలా చూడాలి. పొగ కారణంగా తలెత్తే వాయుకాలుష్యం, అనారోగ్య సమస్యలపైనా ప్రజలను చైతన్యవంతులను చేయాలి. అడవులపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించాలి. అప్పుడే వనాల్లో పచ్చదనం మరింతగా పాదుకొంటుంది.        

- ఎం.రామ్‌మోహన్‌

(అటవీ క్షేత్రాధికారి, ములుగు)
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భారత్‌తో స్నేహవారధి ఉపయుక్తం

‣ పారుబాకీలను కరిగించే వ్యూహం

Posted Date: 22-10-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం