• facebook
  • whatsapp
  • telegram

జీవ వైవిధ్యంతోనే సుస్థిర అభివృద్ధి

ప్రకృతి వనరుల పరిరక్షణ ద్వారా సుస్థిర అభివృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ఏటా మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ దిశగా ప్రపంచ దేశాలు ఎన్నో తీర్మానాలు, ప్రణాళికలకు కట్టుబడి అనేక ఒప్పందాలు చేసుకున్నాయి. వాటి అమలులో మాత్రం అవి చిత్తశుద్ధి కనబరచకపోవడం విచారకరం.

మానవాళి సహా వన్యప్రాణులు, జలచరాలు, కీటకాలు, వృక్షాలు, సూక్ష్మ క్రిములు తదితర ప్రకృతిలోని జీవరాశులన్నీ జీవవైవిధ్యం పరిధిలోకి వస్తాయి. ప్రకృతి సమతౌల్యంతో పాటు ఆహార భద్రత, పేదరిక నిర్మూలన, సుస్థిర జీవనోపాధులు వంటివి జీవవైవిధ్య పరిరక్షణతో ముడివడి ఉన్నాయి. వనరుల వినియోగంలో పొదుపు పాటిస్తేనే ప్రకృతి వ్యవస్థలను, జీవజాలం ఉనికిని కాపాడుకోగలుగుతాం. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. తీర, అటవీ ప్రాంత వ్యవస్థలు, అరుదైన వృక్షాలు, వన్యప్రాణులు వేగంగా అంతరించిపోతున్నట్లు అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. భూతాపం అంతకంతకు పెరుగుతుండటం వల్ల 2050 నాటికి భూభాగంపై నాలుగింట ఒక వంతు సున్నితమైన జీవరాశులు అంతరించిపోయే దుస్థితి నెలకొంది.

ఒప్పందాల అమలే కీలకం

జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతున్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు వచ్చే పదేళ్లలో ఎలాంటి కార్యాచరణ చేపడతాయన్నది ఎంతో కీలకం. దశాబ్దాల పాటు తీవ్ర చర్చోపచర్చల తరవాత నిరుడు మాంట్రియల్‌ వేదికగా జరిగిన జీవవైవిధ్య (కాప్‌-15) సదస్సులో చరిత్రాత్మక ఒప్పందానికి ఆమోదం లభించింది. ఇప్పటివరకు జీవవైవిధ్య వ్యవస్థలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేయడంతో పాటు భూగోళాన్ని పరిరక్షించడం అందులోని కీలకాంశం. ఒప్పందంలో భాగంగా ప్రపంచ దేశాలు కాలుష్యం, వాతావరణ మార్పుల నుంచి భూమిని, మహా సముద్రాలను, రకరకాల జీవుల్ని కాపాడేందుకు పటిష్ఠ కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ రాయితీలను, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి, అంతరించిపోతున్న జీవజాతులను పరిరక్షించుకోవాలని తీర్మానించారు. మాంట్రియల్‌ ఒప్పందం ప్రకారం- జీవ వైవిధ్యానికి హాని కలిగించే రాయితీలను 2030 నాటికి పూర్తిగా తొలగించాలి. లేదంటే వాటిని సంస్కరించాలి. జీవవైవిధ్య పరిరక్షణ కోసం ఏటా నిధులు సమకూర్చడం ఒప్పందంలోని మరో కీలకాంశం. ఈ నిధుల కోసం పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది.

వాతావరణ మార్పులకు కారణమైన భూతాపానికి కళ్ళెం వేయాలని పారిస్‌ వాతావరణ సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాలు లక్షించాయి. ఆ మేరకు కుదుర్చుకున్న ఒప్పందం అమలులో పురోగతి ఊగిసలాడుతోంది. జీవవైవిధ్య పరిరక్షణ ఒప్పందం అమలులోనూ ప్రపంచ దేశాలు ఈ తరహా ధోరణి కనబరిస్తే... ప్రమాదాన్ని చేజేతులా కొనితెచ్చుకున్నట్లే అవుతుందన్నది పర్యావరణవేత్తల ఆందోళన. జీవవైవిధ్య పరిరక్షణ కోసం ఒప్పందాల రూపకల్పనలో భారత్‌ దశాబ్దాలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. దేశంలోని ప్రభుత్వ వ్యవస్థలు మాత్రం జీవవైవిధ్య చట్టాల అమలు, వనరుల పరిరక్షణలో విఫలమవుతున్నాయన్న విమర్శలున్నాయి. అటవీ వనాల జీవవైవిధ్య సమతుల్యతలో ముఖ్య పాత్ర పోషించే ఏనుగుల్ని కాపాడే విషయంలో ఒడిశా, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రాలు అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో అనేకచోట్ల సున్నితమైన అటవీ, తీర వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న తీరును ‘కాగ్‌’ ఇటీవలి నివేదికలో వివరించింది. దశాబ్దాల నాటి రియో ఒప్పందం కార్యాచరణలో భాగంగా మన దేశంలో ‘జీవవైవిధ్య పరిరక్షణ చట్టం-2002’ అమలులోకి వచ్చింది. జీవవైవిధ్యానికి కీలకమైన వనరుల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, స్థానిక సమూహాల భాగస్వామ్యంతో ఈ వనరులను రక్షించుకోవడంతో పాటు వారికి వాణిజ్య ప్రయోజనాలను అందించాలని ఈ చట్టం చెబుతోంది.

సహజ వనరుల సంరక్షణ

జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ గణాంకాల ప్రకారం- దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గడిచిన రెండు దశాబ్దాల్లో సుమారు 5.50లక్షల గ్రామస్థాయి జీవవైవిధ్య సంఘాలు ఏర్పాటు అయ్యాయి. అవి రిజిష్టర్ల రూపకల్పన, వనరుల పరిరక్షణ, సున్నిత జీవవైవిధ్య ప్రదేశాల గుర్తింపు వంటి అంశాల్లో చురుగ్గా పనిచేసేలా శిక్షణ కల్పించి, ఆర్థిక వనరులు అందించాలి. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగాలు విఫలమవుతున్నాయి. చాలామేర రాష్ట్ర, జిల్లాస్థాయి జీవవైవిధ్య ప్రాధికార సంస్థల్లో సరిపడా సిబ్బంది లేకపోవడం, నిధుల కొరత వల్ల ఆశించిన స్థాయిలో లక్ష్యం నెరవేరడం లేదు. జీవవైవిధ్య, జన్యుపరమైన వనరులను వినియోగించే ఔషధ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తులు విధిగా జీవవైవిధ్య బోర్డుల నుంచి అనుమతి తీసుకోవాలి. అందులో లాభాల వాటాను గ్రామస్థాయిలోని జీవవైవిధ్య కమిటీల ద్వారా వనరుల పునరుద్ధరణకు వినియోగించాలి. కీలకమైన ఈ మార్గదర్శకాలను అమలుచేసే స్థాయిలో యంత్రాంగాలను బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ కనబరచడం లేదు. జీవవైవిధ్య వనరుల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ కార్యాచరణను రూపొందించి అమలు చేయాలి. అటవీ, తీర ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా స్థానిక ప్రకృతి వనరులకు నష్టం వాటిల్లకుండా చూడాలి. స్థానిక సమూహాలతో సంప్రతింపుల మేరకు ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలి. అందుబాటులో ఉన్న సహజ వనరులను సుస్థిర ప్రాతిపదికన వినియోగించుకోవాలి. భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రభుత్వ వ్యవస్థలు చిత్తశుద్ధితో చట్ట నిబంధనలను అమలు చేయాలి. గిరిజన, ఇతర అటవీ ఆధారిత సమూహాల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా జీవవైవిధ్య వనరుల పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రభుత్వాలు జీవవైవిధ్య పరిరక్షణకు నడుం బిగించే దిశగా పౌరుల్లో చైతన్యం రేకెత్తించాలి.

ప్రతికూల ప్రభావం

ఆహార వనరుల ఉత్పత్తి, వినియోగంలో సమతౌల్యం కొరవడుతోంది. ఏటా 40కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు నదులు, సముద్ర జలాల్లో కలుస్తున్నాయి. ఈ వ్యర్థాలు తీర వ్యవస్థల స్వరూపాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా కొన్ని రకాల సముద్ర జీవజాతులు ఉనికి కోల్పోతున్నాయి. 2050నాటికి పెరగనున్న జనాభాకు తగిన ఆహారం అందాలంటే ప్రస్తుతమున్న ఆహారోత్పత్తి 70శాతం పెరగాలి. అయితే పరిస్థితులు ప్రతికూలంగా ఉంటున్నాయి. భూగర్భ జలాలు, భూసారం తగ్గిపోతుండగా... ఎరువులు, క్రిమిసంహారకాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. వీటికి తోడు వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.అడవుల కోత, పెరిగిన కాలుష్యం మూలంగా వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు వరదలు, తుపానులు, కరవు కాటకాల రూపంలో పెరిగిపోతున్నాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డిజిటల్‌ సాగుతో లాభాల పంట

‣ జీఎస్టీ ఎగవేతకు కళ్ళెం

‣ ప్రపంచ సవాళ్లకు జీ7 పరిష్కారాలు

‣ ఉన్నత విద్యకు ఆర్థిక ఊతం

‣ భారత్‌ జోడు గుర్రాల సవారీ

‣ రక్షణ స్వావలంబనకు ప్రైవేటు బాసట

‣ సాంకేతిక తోడ్పాటుతో.. ప్రయాణం భద్రం

Posted Date: 24-05-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం