• facebook
  • whatsapp
  • telegram

సాంకేతిక తోడ్పాటుతో.. ప్రయాణం భద్రం

రహదారి భద్రతకు డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాలు ఎంతగానో తోడ్పడతాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు జీపీఎస్‌ సాంకేతికతను ఉపయోగించుకునే దిశగా కృషి జరుగుతోంది. రహదారి పరిస్థితులు, రద్దీ, ప్రకృతి విపత్తులు తదితర సమాచారాన్ని ముందుగానే తెలియజేయడం ద్వారా దుర్ఘటనలను నివారించవచ్చు. ఈ మేరకు రాబోయే కాలంలో అధునాతన సాంకేతికతలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఏటా మే నెల 17వ తేదీన ప్రపంచ టెలికమ్యూనికేషన్‌ దినోత్సవం జరపాలని 1969లో ఐక్యరాజ్యసమితి నిశ్చయించింది. అదే రోజున ప్రపంచ సమాచార సాంకేతిక సమాజ దినోత్సవం జరపాలని 2006లో సమితి నిర్ణయించింది. తరవాత ఆ రెండింటినీ కలిపి ప్రపంచ టెలికమ్యూనికేషన్స్‌, సమాచార సమాజ దినోత్సవం (డబ్ల్యూటీఐఎస్‌డీ)గా నిర్వహించాలని 193 సభ్యదేశాలు గల అంత ర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) సిఫార్సు చేసింది. 2023 డబ్ల్యూటీఐఎస్‌డీ నినాదం- అభివృద్ధిలో బాగా వెనకబడిన దేశాల (ఎల్‌డీసీల)ను సమాచార, కమ్యూనికేషన్‌ సాంకేతికతల సాయంతో పురోగమన మార్గంలో పరుగెత్తించడం. 46 పేద దేశాల్లో 270 కోట్లమందికి అంతర్జాల సౌకర్యం లేదని ఐటీయూ గుర్తించింది. వీరిని ఇంటర్‌నెట్‌తో అనుసంధానించి, డిజిటల్‌ సాంకేతికతలతో వారి జీవితాలను రూపాంతరం చెందించాలని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఐటీయూ పిలుపిచ్చింది. రహదారి భద్రత కోసం డిజిటల్‌ సాంకేతికతలను వినియోగించాలని ఈ సంవత్సరం ఐటీయూ సర్వోన్నత సమావేశం నిర్ణయించింది. 2013లో కూడా రహదారి భద్రతకు సమాచార, కమ్యూనికేషన్‌ సాంకేతికతల (ఐసీటీ) వినియోగం అనే నినాదంతో డబ్ల్యూటీఐఎస్‌డీని నిర్వహించారు. 2030కల్లా రహదారి ప్రమాదాల్లో మరణాలను సగానికి సగం తగ్గించాలని ఐరాస పిలుపు ఇచ్చింది. తద్వారా ఏటా 6,75,000 మంది ప్రాణాలను రక్షించవచ్చని తెలిపింది. కృత్రిమ మేధ (ఏఐ)తో రహదారి భద్రతా సాధన కార్యక్రమాన్ని 2021లో ఐటీయూ ప్రారంభించింది. ప్రధాని మోదీ ఈ ఏడాది మార్చి 22న దిల్లీలో ఐటీయూ ప్రాంతీయ కార్యాలయం- నవీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం భారత్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌, ఇరాన్‌, మాల్దీవుల మధ్య టెలికమ్యూనికేషన్‌ రంగంలో సహకార వృద్ధికి తోడ్పడుతుంది. అదే రోజు భారత్‌ 6జీ దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. 6జీ పరిశోధన, అభివృద్ధి ప్రయోగ వేదికనూ ప్రారంభించారు. భారత ఉపరితల రవాణా శాఖ ఏటా జనవరి 11-17 మధ్య జాతీయ రహదారి భద్రతా వారోత్సవాన్ని నిర్వహిస్తోంది.

అతి వేగంతో ప్రమాదాలు

పరిమితికి మించిన వేగంతో మోటారు వాహనాలను నడపడం వల్లే చాలా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఎంతోమంది ప్రముఖులనూ బలిగొన్నాయి. మాజీ రాష్ట్రపతి జైల్‌సింగ్‌(78) పయనిస్తున్న కారు వేగంగా ఒక ట్రక్కును ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. 1994లో పంజాబ్‌లో ఈ ప్రమాదం జరిగిన నెల రోజులకు జైల్‌సింగ్‌ మరణించారు. 1997లో పారిస్‌లో ప్రిన్సెస్‌ డయానా తనను వెంబడిస్తున్న ఫొటోగ్రాఫర్లను తప్పించుకొనే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. కేంద్ర మాజీమంత్రి గోపీనాథ్‌ ముండే రహదారి ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ 2022లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇలాంటి ఘటనలు ఇంకెన్నో! మద్యం, మత్తు పదార్థాలు సేవించి నడపడం, హెల్మెట్లు, సీటు బెల్టులు లేకుండా ప్రయాణించడం, వాహనంపై పరిమితికి మించి బరువు వేయడం, మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ, సంగీతం వింటూ పరధ్యానంగా మోటారు వాహనాలను నడపడం రోడ్డు ప్రమాదాలకు హేతువులుగా మారుతున్నాయి. బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషీ సునాక్‌ ఇటీవల కారు వెనకసీటులో సీటు బెల్టు లేకుండా ప్రయాణిస్తున్నందుకు పోలీసులు జరిమానా విధించారు. తన పొరపాటును అంగీకరించిన రిషీ సునాక్‌, క్షమాపణలు చెప్పి జరిమానా చెల్లించారు. మనదేశంలో ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అమెరికా, ఐరోపా, గల్ఫ్‌ దేశాలలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్న ఫలితంగా రోడ్డు ప్రమాదాలు తక్కువగా ఉంటున్నాయి.

నివారణ సాధ్యమే..

ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించడంతోపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్ని వినియోగించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు. అంతేకాదు, దుర్ఘటనలు చోటుచేసుకోకుండా నివారించడమూ సాధ్యమవుతుంది. ఉపగ్రహ జీపీఎస్‌ సేవలు వాహన చోదకులకు ఈ విషయంలో ఎంతో అక్కరకొస్తున్నాయి. అమెరికా సైన్యం కోసం రూపొందిన జీపీఎస్‌ వ్యవస్థ 1980ల నుంచి 24 ఉపగ్రహాల సాయంతో ప్రజలందరికీ ఉపయోగపడుతోంది. భారత్‌ కూడా సొంతంగా ఏడు ఉపగ్రహాలతో జీపీఎస్‌ తరహా నావిగేషన్‌ యంత్రాంగాన్ని రూపొందించుకొంది. దీన్ని నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాన్‌స్టలేషన్‌ (నావిక్‌)గా వ్యవహరిస్తున్నారు. ఇది భారత్‌తో పాటు భారత సరిహద్దు నుంచి 1500 కిలోమీటర్ల పరిధిలో భూతల, గగనతల, సముద్రతల వాహనాలకు తోడ్పడుతోంది. ఇంతవరకు ఇలాంటి నావిగేషన్‌ వ్యవస్థ అమెరికా, రష్యా, ఐరోపా సమాఖ్య (ఈయూ), చైనాలకు మాత్రమే ఉంది.

జీపీఎస్‌ సాధనాలను విడిగానైనా, వాహనాల్లో అమర్చికాని ఉపయోగించవచ్చు. వీటిని స్వదేశంలోనే తయారు చేస్తున్నారు. రహదారిపై రద్దీ, గతంలో ప్రమాదాలు జరిగిన స్థలాలు, వాహన రాకపోకల గురించి జీపీఎస్‌ సాధనాలు ముందే తెలుపుతాయి. మున్ముందు రోడ్డు ప్రమాదాల నివారణలో కీలక పాత్ర పోషించేలా జీపీఎస్‌ను ఆధునికీకరిస్తున్నారు. జీపీఎస్‌ సాధనాలు మరెన్నో ప్రయోజనాలను అందించబోతున్నాయి. అలాగని జీపీఎస్‌ సర్వశక్తిమంతమని భావించకూడదు. ప్రజలు తమ జాగ్రత్తలో తాము ఉండాలి. రవాణా నిబంధనలను పాటించాలి. ప్రపంచంలో కేవలం 30 దేశాల్లోనే కట్టుదిట్టమైన రహదారి భద్రతా నిబంధనలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇటువంటి నిబంధనావళి రూపకల్పన, వాటి అమలుకు కావలసిన సాంకేతికతల విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాలకు తోడ్పడాలి. కర్బన ఉద్గారాలను పెంచని హరిత ఇంధనాల వినియోగం, అధునాతన ఎలెక్ట్రిక్‌, ఉదజని వాహనాల రూపకల్పనకు ప్రపంచం నడుంకట్టాలి.

బాధ్యతగా ముందడుగు

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా 13 లక్షల మంది మరణిస్తున్నారు. 2-5 కోట్లమంది క్షతగాత్రులవుతున్నారు. భారత్‌లో 28 కోట్ల ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. వీటి సంఖ్య ఏటా రెండు కోట్ల చొప్పున పెరుగుతోంది. స్వర్ణ చతుర్భుజి తదితర ప్రాజెక్టుల కింద విశాలమైన రహదారులు నిర్మించడం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి జరుగుతోంది. అయినా, నిబంధనల అతిక్రమణ కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రహదారి ప్రయాణాల విషయంలో ప్రజలు తమ ధోరణిని మార్చుకుని నిబంధనలను నిక్కచ్చిగా పాటించాలి. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా ముందడుగు వేస్తేనే రహదారి భద్రత సిద్ధిస్తుంది.
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 1600 కేంద్ర కొలువులు

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు తుది సన్నద్ధత

‣ బోధన ఉద్యోగాలకు తొలి మెట్టు.. నెట్‌

‣ ఇంటర్‌తో ఉపాధ్యాయ విద్య.. డీఎడ్‌

Posted Date: 22-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం