• facebook
  • whatsapp
  • telegram

భారత్‌ జోడు గుర్రాల సవారీ

భారత్‌కు దౌత్యపరంగా 2023 చాలా ప్రాధాన్య సంవత్సరం. జీ20, షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ)ల అధ్యక్ష హోదాలో ఇండియా ఈ సంవత్సరం కీలక సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. పొరుగు దేశమైన చైనాకు ఈ రెండు   సంస్థల్లోనూ సభ్యత్వం ఉంది. పాకిస్థాన్‌ మాత్రం ఎస్‌సీఓలోనే భాగస్వామి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో రెండు కూటముల సమావేశాలు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

భూగోళంపై 60శాతం ప్రదేశంలో విస్తరించిన జీ20 దేశాల్లో మూడింట రెండు వంతుల ప్రపంచ జనాభా నివసిస్తోంది. ఇందులో భారత్‌, చైనా, అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, రష్యా, ఫ్రాన్స్‌, జర్మనీ, సౌదీ అరేబియా తదితర ప్రధాన దేశాలతోపాటు ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాలూ సభ్యులుగా ఉన్నాయి. బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ వంటి మరికొన్ని దేశాలు అతిథి హోదాలో పాలుపంచుకొంటున్నాయి. ఈ కూటమి ప్రపంచ జీడీపీలో 80శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75శాతం వాటా కలిగి ఉంది. జీ20 ప్రధానంగా ఆర్థిక కూటమి అయినప్పటికీ వాతావరణ మార్పులు వంటి అనేక ముఖ్యమైన సమస్యలనూ పరిశీలిస్తుంది. ఈ ఏడాది భారత్‌లో జీ20 వరసగా రెండు విభాగాల్లో సమావేశాలు నిర్వహిస్తోంది. మొదటిదైన ‘ఫైనాన్షియల్‌ ట్రాక్‌’లో ఆర్థిక వ్యవహారాలు, రెండోదైన ‘షెర్పా ట్రాక్‌’లో అభివృద్ధి వ్యవహారాల గురించి చర్చలు జరుగుతాయి. జీ20 దేశాల నేతలతోపాటు ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ప్రధాన కార్యనిర్వాహకులూ ఈ సదస్సుల్లో పాల్గొంటారు. ఈ ఏడాది జనవరిలో దేశంలోని మొత్తం 32 ప్రదేశాల్లో ప్రారంభమైన జీ20 సభలు సెప్టెంబరు 9-10 తేదీల్లో దిల్లీలో జరిగే శిఖరాగ్ర సమావేశంతో ముగుస్తాయి.

షాంఘై సహకార సంస్థ భేటీ

ఐరోపా-ఆసియా దేశాలతో కూడిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)- 40శాతం ప్రపంచ జనాభాకు, 20శాతం ప్రపంచ జీడీపీకీ నిలయం. భారత్‌, చైనా, రష్యా, పాకిస్థాన్‌, కజఖ్‌స్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, తజికిస్థాన్‌ వంటి ఎనిమిది దేశాలు ఎస్‌సీఓలో సభ్యులు. మరికొన్ని దేశాలు పరిశీలక హోదాలో, సంభాషణల భాగస్వాముల హోదాలో సమావేశాలకు హాజరవుతాయి. ఈ సంస్థ రాజకీయ, ఆర్థిక, భద్రతా సమస్యల గురించి చర్చలు జరుపుతుంది. భారత్‌కు తరచూ తలనొప్పులు తెచ్చిపెట్టే చైనా, పాకిస్థాన్‌ రెండూ ఎస్‌సీఓలో సభ్యులుగా ఉన్నాయి. ‘సెక్యూర్‌ ఎస్‌సీఓ’ అనేది ఈ ఏడాది నినాదం. భద్రత, ఆర్థికం, అనుసంధానం, ఐక్యత, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణను గౌరవించడం, పర్యావరణ రక్షణలను ‘సెక్యూర్‌ ఎస్‌సీఓ’గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వచించారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, పాకిస్థాన్‌లో రాజకీయ అస్థిరత తలెత్తడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ నినాదం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది భారత్‌లో వరసగా ఎస్‌సీఓ సమావేశాలు జరుగుతున్నాయి. మార్చి 10న ఎస్‌సీఓ దేశాల సుప్రీంకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సమావేశమయ్యారు. 14వ తేదీన ఎస్‌సీఓ దేశాల ఇంధన మంత్రులు వీడియో సమావేశం జరిపారు. 15న క్రీడా మంత్రుల సమావేశం జరిగింది. 17న వారణాసిలో పర్యాటక మంత్రులు సమావేశమయ్యారు. మార్చి 29న ఎస్‌సీఓ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో- ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని భారత్‌ పిలుపిచ్చింది.

ఎస్‌సీఓ సభ్య దేశాలు ఒకరి సార్వభౌమత్వాన్ని మరొకరు గౌరవించాలని, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించకూడదని, సైనికంగా బలప్రయోగానికి దిగకూడదని కూటమి నిబంధనావళి పేర్కొంటోంది. దాన్ని సభ్యదేశాలన్నీ పాటించాలని భారత్‌ కోరింది. ఊహించినట్లుగానే ఈ సమావేశంలో చైనా, పాక్‌ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు వీడియో ద్వారా పాల్గొన్నారు. ఏప్రిల్‌ 28న దిల్లీలో జరిగిన ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశమూ ఉగ్రవాదం సామాజిక-ఆర్థిక ప్రగతికి గొడ్డలిపెట్టని తీర్మానించింది. ఈ సమావేశానికీ పాక్‌ వీడియో ద్వారానే హాజరైంది. మే నాలుగు, అయిదో తేదీలలో గోవాలో జరిగిన ఎస్‌సీఓ  విదేశాంగ మంత్రుల సమావేశంలో ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ వత్తాసు పలుకుతోందంటూ   భారత్‌ ఆరోపించింది. అదే రోజు జమ్మూలో ఉగ్రదాడిలో కొందరు భారతీయ జవాన్లు మరణించారు. ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశంలో జమ్మూకశ్మీర్‌ సమస్యను పాకిస్థాన్‌ లేవనెత్తడంపై భారత్‌ మండిపడింది. సరిహద్దులో ప్రశాంతత ఏర్పడనంత వరకు భారత్‌, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడవని స్పష్టం చేసింది. అయినా రెండు దేశాల విదేశాంగ మంత్రులు గోవాలో సమావేశమయ్యారు. ఉభయ దేశాల మధ్య విభేదాలను చర్చలతో పరిష్కరించుకునే అవకాశం ఉందని సూచించారు. కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌తో మాట్లాడటానికి ఏమీ లేదని భారత్‌ స్పష్టం చేసింది. పాక్‌ తన ఆక్రమణలో ఉన్న కశ్మీర్‌ ప్రాంతాన్ని ఖాళీ చేయనంతవరకు చర్చల ప్రసక్తే లేదని పేర్కొంది.  

ప్రపంచానికి భరోసా

దక్షిణాసియా, పశ్చిమాసియా దేశాలు వ్యూహపరంగా స్వయంనిర్ణయాధికారాన్ని నిలబెట్టుకుంటూ అమెరికాతో తగిన దూరం పాటించాలని ఎస్‌సీఓ సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి క్విన్‌ గాంగ్‌ సందేశమివ్వడాన్ని భారత్‌ను ఉద్దేశించి చేసిన పరోక్ష హెచ్చరికగా పరిగణించవచ్చు. మరోవైపు చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక కారిడార్‌ ప్రాజెక్టుపై భారత్‌ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఎస్‌సీఓలో భారత్‌-చైనా అభిప్రాయాలు జీ20 శిఖరాగ్ర సభపై నీలినీడలు ప్రసరించబోవని ఆశిద్దాం. ఈ ఏడాది జీ20, ఎస్‌సీఓలకు అధ్యక్షత వహిస్తున్న భారత్‌ అంతర్జాతీయ స్థాయిలో పరిణత విధానాలను అనుసరించగలననే భరోసాను ప్రపంచానికి ఇవ్వాలి. మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టుతో పాకిస్థాన్‌లో ఏర్పడిన రాజకీయ కల్లోలాన్ని విస్మరించలేం. జులైలో ఎస్‌సీఓ సమావేశం జరిగేటప్పటికి పాక్‌ పరిస్థితులు ఏ మలుపు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

గణనీయమైన పురోగతి..

ఇంతవరకు జరిగిన రెండు విడతల జీ20 ఫైనాన్షియల్‌, షెర్పా ట్రాక్‌ సంభాషణల్లో ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, మౌలిక వసతుల నిర్మాణం, ఆరోగ్యం వంటి కీలకాంశాలపై గణనీయ పురోగతి కనిపించింది. మూడు, నాలుగు విడతల చర్చలు సెప్టెంబరు అయిదు, ఆరు తేదీలకల్లా పూర్తవుతాయి. ఆరు, ఏడో తేదీల్లో ఫైనాన్షియల్‌, షెర్పా విభాగాల సంయుక్త సమావేశాలు జరుగుతాయి. ఎనిమిదో తేదీన జీ20 దేశాల విదేశాంగ, ఇంధన శాఖల మంత్రులు సమావేశమవుతారు. సెప్టెంబరు 9,10 తేదీల్లో దిల్లీలో శిఖరాగ్ర సభ జరుగుతుంది. ఈ సభ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక గతిని గాఢంగా ప్రభావితం చేయనున్నాయి.
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో కొలువులు

‣ క్రీడా నిర్వహణ కోర్సుల్లోకి ఆహ్వానం

‣ డిగ్రీ, పీజీతో సిపెట్‌లో ఉద్యోగాలు

‣ బోధనలో రాణించాలని ఉందా?

Posted Date: 22-05-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం