• facebook
  • whatsapp
  • telegram

క్రీడా నిర్వహణ కోర్సుల్లోకి ఆహ్వానం

ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ప్రకటన

మైదానంలో ఆడేవారు కొద్దిమందే.. కానీ ఆ ఆటనూ, ఆటగాళ్లనూ నడిపించేవారు చాలామంది! పోటీలు సవ్యంగా జరగడానికీ, దేశంలో క్రీడారంగం మరింత అభివృద్ధి చెందడానికీ వీరి కృషి ఎంతో అవసరం. అందునా గత కొంతకాలంగా మన దేశంలో ప్రొఫెషనల్‌ మ్యాచుల సంఖ్య పెరిగింది. దానితోపాటే ఈ రంగంలో కెరియర్‌ అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి. స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీల్లో ప్రవేశాలకు దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలన్నీ ప్రస్తుతం దరఖాస్తులు తీసుకుంటున్నాయి. అన్నింటికీ ఇంచుమించుగా మే నెలాఖరు వరకూ దరఖాస్తు గడువు ఉంది. మరి ఈ రంగం గురించి మరిన్ని వివరాలు, ఉద్యోగావకాశాలు.. అన్నీ తెలుసుకుందామా!

క్రీడలపై ఆసక్తి ఉండి, నేరుగా ఆడే అవకాశం - ఉత్సాహం లేనివారు.. గతంలో వివిధ ఆటలతో పరిచయం ఉన్నవారికి స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ చక్కని ఎంపిక. నేరుగా ఆడకపోయినా వెనకుండి నడిపించే ఈ రంగంలో అవకాశాలకు కొదవే లేదు. నచ్చిన స్పెషలైజేషన్‌తో ఉద్యోగంలోకి అడుగుపెట్టవచ్చు. అలా తర్ఫీదునిచ్చేందుకు స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చాలా విద్యాసంస్థలు అందిస్తున్నా, ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తే..

1. నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ - మణిపుర్‌

2. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఏఎస్‌ఎం) - ముంబయి

3. ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎస్‌ఎం) - ముంబయి

4. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎస్‌ఎస్‌టీ) - పుణె

పైన చెప్పిన సంస్థలు అందించే కోర్సులను ప్రస్తావించవచ్చు. ఈ డిగ్రీలకు జాతీయంగా మంచి గుర్తింపు ఉండటమే కాక, దేశవిదేశీ సంస్థల నుంచి చక్కని ఉద్యోగావకాశాలు అందుకునేందుకు ఇవి దోహదం చేయగలవు.

క్రీడా ప్రపంచం విభిన్నంగా ఉంటుంది. ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకునేవారికి.. ఆ పోటీని ఆస్వాదించేవారికి.. ఇది చాలా నచ్చుతుంది. అంతేకాదు, దీని ద్వారా ఉన్నతస్థాయి క్రీడాకారులు, సంస్థలతో కలిసి పనిచేయవచ్చు. నేరుగా ఆడకపోయినా ఆటకు కావాల్సిన సకలం సమకూరుస్తూ దగ్గరుండి చూసుకోవచ్చు. ఇందులో స్పోర్ట్స్‌ అడ్మినిస్ట్రేటర్, ప్రమోటర్, మార్కెటింగ్‌ మేనేజర్, లాజిస్టిక్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్, ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్, ఈవెంట్‌ మేనేజర్, ఫొటోగ్రాఫర్స్‌.. ఇలా రకరకాలైన విభాగాల్లో పనిచేసే అవకాశం ఉంది. వీరే కాక స్పోర్ట్స్‌ మేనేజర్స్, మార్కెటర్స్, ఏజెంట్స్‌.. ఇలా చాలామంది ఉంటారు. ఈ విభాగపు నిపుణులు బృందం/ ఆటగాడు, అథ్లెట్స్, స్పోర్ట్స్‌ క్లబ్స్, టోర్నమెంట్‌ లొకేషన్స్, ఈవెంట్‌ స్పాన్సర్స్‌.. ఇలా మొత్తం అన్నింటినీ, అందరినీ మేనేజ్‌ చేయాలి. ఒకరకంగా సర్వం వారై నడిపించాల్సిన బాధ్యత వీరిది.

కోర్సులు

స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో అండర్‌గ్రాడ్యుయేట్‌ స్థాయిలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్‌ సైన్స్‌లో బీఏ, బీబీఏ, బీఎస్సీ చేసే అవకాశం ఉంది. పీజీ స్థాయిలో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, ఎమ్మెస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్, ఎంబీఏ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్, డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులు చేయొచ్చు. 

ఐఎస్‌బీఆర్‌ బెంగళూరు సంస్థ స్పోర్ట్స్‌ మేనేజ్మెంట్‌లో పీజీడీఎం కోర్సును డ్యూయల్‌ స్పెషలైజేషన్‌తో అందిస్తోంది. ఇందులో మార్కెటింగ్, ఆపరేషన్స్, జర్నలిజం, బ్రాండింగ్, వెన్యూ మేనేజ్‌మెంట్‌.. ఇలా ఏదైనా ఎంచుకోవచ్చు. 

ఏదైనా డిగ్రీ అర్హతతో పీజీ ఎంబీఏలో స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ చదవొచ్చు. డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు కూడా చేసే అవకాశం ఉంది.

భారత్‌లో ఆటలు ఆడేవాళ్లకి, చూసేవాళ్లకి కొదవే లేదు. హాకీ, ఫుట్‌బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్‌.. అన్నింటికీ మించి క్రికెట్‌! అధిక ఆదరణ పొందుతున్నాయి. ఎఫ్‌ఐసీసీఐ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) - ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ల తాజా నివేదిక ప్రకారం.. 2022 చివరినాటికి ఈ రంగంలో అనూహ్యంగా అవకాశాలు పెరిగాయి. ఏటికేడు దాదాపు ఇవి 12 శాతం చొప్పున పెరుగుతూ వస్తున్నాయి. భవిష్యత్తులో మనదేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు మరిన్ని జరిగేలా బాటలు వేస్తున్నాయి.

ఉపాధి

అధికశాతం స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో ఉన్నాయి. పట్టా పుచ్చుకున్న అనంతరం ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. అయితే ఈ కోర్సులకు ఫీజు కాస్త అధికంగా ఉంటుందనే చెప్పాలి. ఇందులో రెండుమూడేళ్ల డిగ్రీ అందుకునేందుకు సగటున రూ.4 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఫీజు. అదే సమయంలో  ఉద్యోగం వచ్చాక జీతభత్యాలు కూడా అధికంగానే ఉంటాయనే విషయాన్ని గమనించాలి.
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ బోధనలో రాణించాలని ఉందా?

‣ ఎంబీబీఎస్‌తో ఉన్నత ఉద్యోగం

‣ స్టాటిస్టిక్స్‌తో ఉన్నత ఉద్యోగం

‣ సమ్మర్‌ జాబ్‌తో లాభాలెన్నో..

‣ ఆవిష్కర్తలకు అద్భుత అవకాశం

Posted Date: 03-05-2023


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌