• facebook
  • whatsapp
  • telegram

స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరియర్ అవకాశాలు

ఇంటర్‌, డిగ్రీ, పీజీ అర్హతతో ప్రవేశాలుఆటలతో.. ఎన్ని మార్గాలో! స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌.. క్రీడలకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న చదువుల్లో అధిక ఆదరణ పొందుతున్న కోర్సు ఇది. ఎందుకంటే దీని ద్వారా అనేక కెరియర్లలోకి సునాయాసంగా ప్రవేశించే అవకాశం ఉంది. కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు తక్కువ పోటీ, అధిక అవకాశాలు ఉన్న స్పోర్ట్స్‌ సంబంధిత ఉద్యోగాల్లో రాణించవచ్చు. అవేంటో పూర్తి వివరాలు చూద్దామా!


మేనేజ్‌మెంట్‌ రంగంలో క్రీడలు ప్రత్యేకమైనవి. ఆటలంటే ఆసక్తి ఉండి ఆ రంగంలో నేరుగా ప్రవేశించే ఉద్దేశం లేనివారికి ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం. ఆటలకు దగ్గరగా ఉంటూ ఆర్థికంగా లాభదాయకమైన కెరియర్‌ కావాలి అనుకునే వారు స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల ద్వారా ఈ ఉద్యోగాల్లోకి ప్రవేశించవచ్చు. ఇందులో వివిధ రకాలు ఉన్నాయి.


ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌

క్రీడలు, మార్కెటింగ్‌ కార్యకలాపాలను కలగలిపి అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అందులో ‘స్పోర్ట్స్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌’ ప్రధానమైనది. మ్యాచ్‌లు, ఇతర క్రీడా సంబంధిత కార్యక్రమాలు దేశవిదేశాల్లో ప్రణాళికాబద్ధంగా జరగడంలో వీరు ముఖ్యపాత్ర పోషిస్తారు. టోర్నమెంట్‌లు, టీమ్‌ డిన్నర్స్, అవార్డు కార్యక్రమాలు.. ఇలాంటివన్నీ జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తారు. అనుభవాన్ని బట్టి ముఖ్యమైన స్పోర్ట్స్‌ లీగ్స్, కాంప్లెక్స్‌లు, క్రీడా సంస్థలకు పనిచేసే వీలుంటుంది. 

వీరు కార్యక్రమానికి సంబంధించిన సహాయ ఉద్యోగులను నియమించుకోవడంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఈవెంట్‌ కాంట్రాక్టర్లతో వివిధ అంశాలపై చర్చించడం, వేదికలను నిర్ణయించడం, షెడ్యూల్స్‌కు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూసుకోవడం, వేదిక అన్నివిధాలా సిద్ధంగా ఉందో లేదో పరిశీలించడం, కార్యక్రమం సజావుగా సాగేలా అన్ని విధాలైన చర్యలూ తీసుకోవడం.. ఇలా వివిధ రకాల విధులుంటాయి. 

వీరికి క్రీడలపై అవగాహనతోపాటు చక్కని కమ్యూనికేషన్‌ స్కిల్స్, బడ్జెటింగ్‌ నైపుణ్యాలు, పెద్దస్థాయి కార్యక్రమాలను ఎటువంటి ఇబ్బందీ లేకుండా నిర్వహించగలిగే సామర్థ్యం, పరిస్థితులను చక్కబెట్టే తెలివి, నెట్‌వర్కింగ్‌ నైపుణ్యాలు ఉండాలి.


మీడియా

క్రీడలకు సంబంధించిన వార్తాంశాలను ప్రపంచానికి తెలిపే స్పోర్ట్స్‌ మీడియా సుస్థిరమైన రంగం మాత్రమే కాదు, అధికావకాశాలను అందించగలిగేది. స్పోర్ట్స్‌ ఇన్ఫర్మేషన్‌ అనలిస్ట్‌ నుంచి జర్నలిస్ట్‌ వరకూ.. ఫొటోగ్రాఫర్‌ నుంచి ఎడిటర్‌ వరకూ ఇందులో చాలా పోస్టులున్నాయి. పత్రికలు, టీవీ, రేడియో, డిజిటల్‌ వేదికల్లో ప్రొడక్షన్, టెక్నికల్‌ విభాగాల్లో పనిచేసే వారంతా ఈ కోవలోకే వస్తారు. ప్రస్తుతం ఉన్న దాదాపు ప్రతి మీడియా సంస్థకు ప్రత్యేక క్రీడా విభాగాలున్నాయి. వీటన్నింటిలోనూ ఉద్యోగం, ఇంటర్న్‌షిప్‌ల కోసం అభ్యర్థులు ప్రయత్నించవచ్చు.


రిటైలింగ్‌

భారత్‌లో కొన్నేళ్లుగా క్రీడా సంబంధిత వస్తువుల ఉత్పత్తి పరిశ్రమ స్థిరమైన అభివృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది. ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెరుగుతూ ఉండటంతో చాలామంది ఆటలు, ఇతర శారీరక శ్రమను పెంచి తద్వారా ఆరోగ్యకరంగా ఉంచే విధానాలవైపు అడుగులు వేస్తున్నారు. దీనివల్ల స్పోర్ట్స్‌ ఎక్విప్‌మెంట్, సంబంధిత వ్యాపారం బాగా పెరిగింది. ప్రభుత్వం పెట్టుబడులు పెడుతూ నేషనల్‌ స్పోర్ట్స్‌ అకాడమీలను నెలకొల్పడంతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. మనదేశంలో అధికంగా ఉన్నది ‘ఆర్గనైజ్డ్‌ రిటైలింగ్‌’. ఇటీవల ఆన్‌లైన్‌ రిటైలింగ్‌ పెరగడంతోపాటు చిన్న తరహా పరిశ్రమల వ్యాపారం కూడా అధికంగా జరుగుతోంది. అందువల్ల దీనిలో అవకాశాలు ఎక్కువ. ఈ తరహా కెరియర్‌లోకి రావాలి అనుకునేవారు డిగ్రీ అందుకున్నాక రిటైలింగ్, మాన్యుఫ్యాక్చరింగ్‌ పరిశ్రమలో పనిచేయడం ద్వారా తమ ప్రయాణం ప్రారంభించవచ్చు. వీరికి క్రీడా సంబంధిత వస్తువులపై అవగాహన ఉండటంతోపాటు మార్కెటింగ్‌ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి.


ఏజెంట్‌

ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ పరిశ్రమలో పనిచేయాలి అనుకునేవారికి స్పోర్ట్స్‌ ఏజెంట్‌ ఒక చక్కని కెరియర్‌ ఆప్షన్‌. ఈ ఏజెంట్లు అథ్లెట్లు, ప్లేయర్లను వెనక ఉండి నడిపిస్తారు. ఆటగాళ్లకు కెరియర్‌లో వీరు అన్నివిధాలా సహాయకారులుగా ఉంటారు. కాంట్రాక్టులు, డీల్స్‌ మాట్లాడటం, ఆటగాళ్లు సరైన నిర్ణయాలు తీసుకునేలాగానూ, అలాగే వాటి అమల్లో సాయం చేసేలా ఉండటం వంటి పనులుంటాయి. ఆటగాళ్ల ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ను నడిపించడంలో ఏజెంట్లది కీలకపాత్ర. వీరికి అద్భుతమైన మేనేజ్‌మెంట్, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌ ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా నెట్‌వర్కింగ్‌ బాగుండాలి. వీరి నిర్ణయాలు, పనితీరు ఆటగాళ్లకు లాభదాయకంగా, కొత్త అవకాశాలు సృష్టించేలా ఉండాలి. అందువల్ల వీరికి చాలా ప్రాముఖ్యం ఉంది.


మార్కెటింగ్‌ అండ్‌ అడ్వర్టైజింగ్‌

క్రీడా పరిశ్రమలో మార్కెటింగ్, సేల్స్‌ విభాగంలో పనిచేయాలి అనుకునేవారికి ఇదో మంచి అవకాశం. ఈ విభాగంలో ఉన్నవారు క్రీడా బృందాలు, ఆటగాళ్లు, ఏజెన్సీలు, ఈవెంట్లు, వేదికలు.. ఇలా దేనికైనా, ఎవరికైనా ప్రచార సేవలు అందిస్తారు. తద్వారా వారి మార్కెట్‌ పెరిగేందుకు దోహదం చేస్తారు. ఇందులో మేనేజ్‌మెంట్, సేల్స్, మార్కెటింగ్, కంటెంట్‌ క్రియేషన్‌.. ఇలా విభిన్నమైన పోస్టుల్లో పనిచేయొచ్చు. వీరికి ప్రధానంగా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉండాలి.


కోర్సులిలా..

ఇంటర్‌ తర్వాత గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తిచేసిన తర్వాత ఈ కెరియర్లలో దేన్నయినా ఎంచుకునే వీలుంటుంది. యూజీ తర్వాత పీజీ కోర్సుల్లోనూ చేరవచ్చు. మన దేశంలో ఉన్న ప్రముఖ క్రీడా విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ- మణిపూర్, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ - ముంబయి, ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ - ముంబయి, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ - పుణె.. ఇలా ప్రముఖ కళాశాలల్లో స్పోర్ట్స్‌ కోర్సులు అభ్యసించవచ్చు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐడీబీఐ బ్యాంకులో 2,100 కొలువులు

‣ నూతన ఆవిష్కరణలే ధ్యేయం!

‣ ‘ఏఐ’ ముప్పు తప్పేలా!

‣ నాయకత్వ లక్షణాలు పెంచుకుందాం!

Posted Date: 28-11-2023


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌