• facebook
  • whatsapp
  • telegram

నూతన ఆవిష్కరణలే ధ్యేయం!

‘ఆకాంక్ష’ స్కాలర్‌షిప్‌ విజేత సౌమ్య

ఏడాదికి రూ.లక్షన్నర గ్రాంటు మంజూరు


దేశం మొత్తం మీద ఒక్కరికి మాత్రమే అందించే స్కాలర్‌షిప్‌ అది.. వేలాది దరఖాస్తులు వస్తాయి, వాటన్నింటినీ దాటుకుని తన ప్రతిభతో ఆ ఉపకార వేతనానికి ఎంపికైంది హైదరాబాద్‌ బిట్స్‌ పిలానీ విద్యార్థిని సౌమ్య తివరయ. ఇదెలా సాధ్యమైందో తన మాటల్లోనే..


మాది దిల్లీ. నాన్న వ్యాపారం, అమ్మ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటారు. స్టెమ్‌ కోర్సులపై చిన్నప్పటి నుంచీ నాకు ఆసక్తి ఎక్కువ. ఆ దారిలోనే ప్రస్తుతం బీఈ కంప్యూటర్‌ సైన్స్, ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్‌ చదువుతున్నా. ప్రోగ్రెస్‌ సాఫ్ట్‌వేర్‌ అనే సంస్థ ఇలా స్టెమ్‌ కోర్సులు చదివే విద్యార్థినికి ఏటా స్కాలర్‌షిప్‌ ఇస్తుందని తెలిసి ‘ఆకాంక్ష’ కార్యక్రమానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేశా. అంతమందిలో నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా చదువుకయ్యే ఖర్చులకే కాదు, తర్వాత కాలంలో కెరియర్‌కు కూడా సాయపడుతుంది. ఈ స్కాలర్‌షిప్‌ను స్టెమ్‌ కోర్సుల్లో అండర్‌గ్రాడ్యుయేట్‌గా ఉన్న విద్యార్థినికి ఇస్తారు. మన దేశంలో ఒక్కరికి మాత్రమే ఇది లభిస్తుంది. 


దీనికోసం పోర్టల్‌లో రెజ్యూమె, లెటర్‌ ఆఫ్‌ రికమెండేషన్‌తో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత టెలిఫోన్‌లో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం అమెరికా దేశ ప్రతినిధులతో చర్చ ఉంటుంది. ఈ ప్రక్రియలో మనం చూపిన ప్రతిభ ఆధారంగా వారు అంతిమ నిర్ణయం తీసుకుంటారు. ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా ఏడాదికి రూ.లక్షన్నర వరకూ గ్రాంటు లభిస్తుంది, ట్యూషన్‌ ఫీజుతోపాటు ఇతర కాలేజీ ఖర్చులను సంస్థ వారు భరిస్తారు. పైగా గుర్తింపు లభిస్తుంది, అయితే ఎంపిక అయిన తర్వాత కూడా విద్యార్థి కనీసం 7.5 గ్రేడ్‌ పాయింట్లు ఏటా తెచ్చుకుంటూ ఉండాలి.


ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నా

ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీలో మూడో ఏడాది పూర్తిచేస్తున్నా. ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌)లో ఇంటర్న్‌షిప్‌ కూడా చేస్తున్నా. టెక్‌ పరిశ్రమకు సంబంధించి అవగాహన పెరిగేందుకు ఈ ఇంటర్న్‌షిప్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు చేసేందుకు ఇప్పటికే పలు బృందాలతో కలిసి పనిచేశా. అదే దారిలో సీఎంఎస్‌ వెబ్‌ పోర్టల్‌లో పనిచేస్తూ కోడింగ్‌ అనుభవం లేకపోయినా కొత్త వెబ్‌సైట్లను తయారుచేయడంపై కృషిచేశాను. దీని ద్వారా కార్పొరేట్‌ ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో, పరిశ్రమ అవసరాలు ఏంటో, ఇంకా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నా. 


ఏఐఎంల్‌పై ఆసక్తి 

చిన్నతనం నుంచి నాకు శాస్త్రసాంకేతిక రంగాలపై ఆసక్తి ఎక్కువ. కొత్తగా ఏదైనా కనిపెట్టాలనే కుతూహలం ఉండేది. కాలేజీలో చేరాక అధ్యాపకుల సహకారంతో వివిధ ప్రాజెక్టుల్లో వారితో కలిసి పనిచేశాను. ఆ సమయంలోనే నాకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ (ఏఐఎంఎల్‌) రంగాలపై ఆసక్తి ఉందని గమనించాను. ఇందులో మరిన్ని ఉన్నత చదువులు చదవాలని ప్రయత్నిస్తున్నా. మెషిన్‌లెర్నింగ్‌ను ఆరోగ్యరంగానికి అనుసంధానిస్తూ పరిశోధనలు చేయడమే నా ముందున్న లక్ష్యం. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో మరిన్ని ఆవిష్కరణలు అవసరం. ఇందుకోసం నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే ఇందుకు సంబంధించి పలు కోర్సులు చేశాను. అలా నేర్చుకోవడం వల్ల నాపై నాకు నమ్మకం కలిగింది. 


మొదట ఈ రంగం ఎంచుకునేటప్పుడు నాకిది సరైనదా కాదా అనే సందిగ్ధత కొంత ఉండేది. కానీ కోర్సులో చేరి చదవడం మొదలుపెట్టాక రిసెర్చ్‌ పేపర్లు అవీ చదువుతూ ఉంటే ఎంతో ఆసక్తిగా ఉండేది. అప్పుడే అర్థమైంది- నాకిది సరిపోతుందని. కుటుంబం, అధ్యాపకుల సహకారంతో ఇంకా బాగా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. తరగతి గది పాఠాలతోపాటు ఇతర కార్యక్రమాలపైనా దృష్టి పెట్టేటప్పుడు కొంత ఒత్తిడి సహజం. కొన్నిసార్లు మనం అనుకున్న మార్గంలో పయనించడం కష్టమవుతుంది, చాలామంది ప్రశ్నిస్తారు, మన మీద మనకే నమ్మకం కోల్పోయే సందర్భాలు సైతం ఉంటాయి.. కానీ వాటన్నింటినీ తట్టుకుని నిలబడినప్పుడే అనుకున్నది చేయగలం. ఒక్కసారి మనసుకు ఇది సరైనదనిపిస్తే వెనక్కి తిరిగి చూసుకోకుండా ప్రయత్నించడమే మంచిది. 


ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా ఏడాదికి రూ.లక్షన్నర వరకూ గ్రాంటు లభిస్తుంది. స్టెమ్‌ కోర్సుల్లో అండర్‌గ్రాడ్యుయేట్‌గా ఉన్న విద్యార్థినికి దీన్ని ఇస్తారు. చదువుకయ్యే ఖర్చులకే కాదు, తర్వాత కాలంలో కెరియర్‌కూ ఇది సాయపడుతుంది. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐడీబీఐ బ్యాంకులో 2,100 కొలువులు

‣ ‘ఏఐ’ ముప్పు తప్పేలా!

‣ నాయకత్వ లక్షణాలు పెంచుకుందాం!

‣ జేఈఈ మెయిన్‌ విజయానికి కీలకాంశాలు

‣ ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!

‣ ఎయిమ్స్‌ సంస్థల్లో 3 వేల ఉద్యోగాలు

‣ స్టేట్‌ బ్యాంకులో 8,773 క్లర్క్‌ కొలువులు

Posted Date: 28-11-2023


  • Tags :

 

ఇత‌రాలు

మరిన్ని