‣ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ప్రకటన విడుదల
గణాంక శాస్త్ర విభాగంలో అత్యున్నత స్థాయిని అందించే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్‌ఎస్) ప్రకటన వెలువడింది. యూజీ లేదా పీజీ స్టాటిస్టిక్స్ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. యూపీఎస్‌సీ నిర్వహించే ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షలు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో పోస్టుల్లోకి తీసుకుంటారు. ప్రకటనకు సంబంధించి పూర్తి వివరాలు..
ఐఎస్‌ఎస్‌కు ఎంపికైనవారు జూనియర్ టైమ్ స్కేల్ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభిస్తారు. నేషనల్ స్టాటిస్టికల్, సెంట్రల్ స్టాటిస్టికల్, నేషనల్ శాంపిల్ ఆఫీస్‌ల్లో వీరు విధులు నిర్వర్తిస్తారు. గ్రూప్ ఎ విభాగంలో క్లాస్-1 అధికారిగా కొనసాగుతారు. మొదటి నెల నుంచే రూ.56,100 (లెవెల్ 10) మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ మొదలైన వాటితో కలిపి సుమారు రూ.లక్ష అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే పదోన్నతులు, గుర్తింపు పొందవచ్చు. అనుభవం, పనితీరుతో కెరియర్‌లో అత్యున్నత హోదాకూ చేరుకోవచ్చు. దాదాపు సివిల్ సర్వెంట్లకు ఉన్నంత ప్రాధాన్యం స్టాటిస్టికల్ సర్వీస్‌లో ఎంపికైనవారికీ దక్కుతుంది.
పరీక్షలో..
2 భాగాలు ఉంటాయి. పార్ట్-1లో వెయ్యి మార్కులకు 6 పేపర్లు రాయాలి. వీటిలో జనరల్ ఇంగ్లిష్, జనరల్ స్టడీస్ ఒక్కో పేపరు వంద మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ వ్యవధి 3 గంటలు. స్టాటిస్టిక్స్ 1, 2 పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో వస్తాయి. ఒక్కో పేపర్ వ్యవధి 2 గంటలు. స్టాటిస్టిక్స్ 3, 4 పేపర్లు డిస్క్రిప్టివ్ తరహాలో ఉంటాయి. ఒక్కో పేపర్ వ్యవధి 3 గంటలు. ఒక్కో స్టాటిస్టిక్స్ పేపరు (1, 2, 3, 4)కు 200 మార్కులు. స్టాటిస్టిక్స్ 1, 2 పేపర్లలో 80 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు. డిస్క్రిప్టివ్ తరహాలో ఉన్న 3, 4 పేపర్లలో సగం ప్రశ్నలు షార్ట్ ఆన్సర్, చిన్న సమస్యల రూపంలో ఉంటాయి. మిగతా సగంలో లాంగ్ ఆన్సర్, కాంప్రహెన్షన్ ప్రాబ్లమ్ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రాలు ఆంగ్లంలోనే ఉంటాయి. అలాగే సమాధానాలూ ఇంగ్లిష్‌లోనే రాయాలి. ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉన్నాయి. పార్ట్-1లో అర్హత సాధించినవారు పార్ట్-2 ఇంటర్వ్యూకు హాజరవుతారు. ఈ విభాగానికి 200 మార్కులు కేటాయించారు.
ప్రశ్నలిలా..
జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లిష్ పేపర్లలోని ప్రశ్నలు సాధారణ గ్రాడ్యుయేట్లు ఎదుర్కొనేలా అడుగుతారు. వీటికోసం ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు. స్టాటిస్టిక్స్ ప్రశ్నపత్రాలు ఆ సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటాయి. అందువల్ల సబ్జెక్టుపై పట్టుకోసం యూజీ స్టాటిస్టిక్స్ పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమికాంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. అనంతరం పీజీ పుస్తకాలతోపాటు ఈ పరీక్షకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు సాధన చేస్తే మంచిది. జనరల్ ఇంగ్లిష్‌లో భాగంగా అడిగిన అంశానికి సంబంధించి అభ్యర్థి ఆంగ్లంలో వ్యాసం రాయాలి. మిగిలిన ప్రశ్నలు ఆంగ్లాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేలా ఉంటాయి. పదాలు ఉపయోగించడం (ఒకాబ్యులరీ), ప్యాసేజ్‌లు, ప్రెసీ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. జనరల్ నాలెడ్జ్‌లో ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడి ఉన్నవే ఎక్కువగా వస్తాయి. వర్తమాన వ్యవహారాలకు ప్రాధాన్యం. భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, చరిత్ర, భూగోళం అంశాల నుంచీ ప్రశ్నలుంటాయి. వీటిని సాధారణ నైపుణ్యంతోనే ఎదుర్కోవచ్చు. ఈ సబ్జెక్టుల్లో హైస్కూల్ స్థాయి పుస్తకాలు బాగా చదివితే సరిపోతుంది.
ఖాళీలు: 33
అర్హత: స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్ వీటిలో ఎందులోనైనా యూజీ/ పీజీ కోర్సులు పూర్తిచేసినవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: ఆగస్టు 1, 2023 నాటికి 21 - 30 ఏళ్లలోపు ఉండాలి. ఆగస్టు 2, 1993 - ఆగస్టు 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్‌లైన్ దరఖాస్తులు: మే 9 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయించారు. మిగిలిన అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.
పరీక్షలు: జులై 23, 2023 నుంచి మొదలవుతాయి. ఇవి మూడు రోజుల పాటు కొనసాగుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌లోనే ఉంది.
వెబ్‌సైట్: https://upsc.gov.in/
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ మ్యూజిక్‌లో బెస్ట్ కోర్సులివిగో..