• facebook
  • whatsapp
  • telegram

కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం! 

సీఎంఎస్, ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌ల్లో 875 ఖాళీలు

దేశంలో అత్యున్నత ఉద్యోగాల నియామకాలు యూపీఎస్‌సీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఏటా క్యాలెండర్‌ ప్రకారం పోస్టులు భర్తీ చేయడం దీని ప్రత్యేకత. ఇటీవలే కంబైన్డ్‌   మెడికల్‌ సర్వీసెస్, ఎకనామిక్‌ సర్వీస్, స్టాటిస్టికల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడ్డాయి. వీటికి ఎంపికైనవారికి ఆకర్షణీయ వేతనంతోపాటు మేటి హోదా సొంతమవుతుంది. సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేట్లు/పోస్టు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. 


సీఎంఎస్, ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌లో ఏ సర్వీస్‌కి ఎంపికైనా లెవెల్‌-10 హోదా దక్కుతుంది. వీరికి రూ.56,100 మూల వేతనం అందుతుంది. అలాగే డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలతో మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం పొందవచ్చు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు. ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌లకు ఎంపికైనవారికి దాదాపు సివిల్‌ సర్వెంట్లకు ఉన్న ప్రాధాన్యం దక్కుతుంది. సీఎంఎస్‌లో సేవలు అందించేవారికి నాన్‌ ప్రాక్టీస్‌ అలవెన్సూ (ఎన్‌పీఏ) చెల్లిస్తారు.    


కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌

ఎంబీబీఎస్‌ పూర్తయిన తర్వాత ప్రభుత్వోద్యోగంలో స్థిరపడాలనుకున్నవారికి కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (సీఎంఎస్‌) చక్కని అవకాశం. ఎంపికైనవారు కేంద్రీయ ఆసుపత్రుల్లో సేవలు అందించవచ్చు. జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ హోదాతో విధుల్లో చేరిన వీరు భవిష్యత్తులో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్, ఆపై స్థాయికీ చేరుకోవచ్చు.  

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష 500 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులు. ఒక్కో పేపర్‌లోనూ 120 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ఒక్కోదాని వ్యవధి 2 గంటలు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో మూడో వంతు తగ్గిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది. 

విజయానికి: ఎంబీబీఎస్‌ సిలబస్‌పై గట్టి పట్టున్నవారు సీఎంఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలరు. పరీక్షలో విజయానికి గతంలో నిర్వహించిన సీఎంఎస్, నీట్‌ పీజీ, ఐఎన్‌ఐ సెట్‌ ప్రశ్నపత్రాల అధ్యయనం ఉపయోగపడుతుంది. 

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. కోర్సు తుదిదశలో ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు: 827. సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌లో 163, రైల్వేలో 450, న్యూదిల్లీ మునిసిపల్‌ కార్యాలయాల్లో 214 పోస్టులు ఉన్నాయి.

వయసు: ఆగస్టు 1, 2024 నాటికి 32 ఏళ్లకు మించరాదు. ఆగస్టు 2, 1992 తర్వాత జన్మించినవారు అర్హులు. సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌ పోస్టులకు 35 ఏళ్ల వరకు అవకాశం.

పరీక్ష తేదీ: జులై 14

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి. 


ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌

కేంద్ర ఆర్థిక సర్వీసుల్లో అత్యున్నత హోదాలో సేవలందించాలనే లక్ష్యం ఉన్నవారికి ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ (ఐఈఎస్‌) పరీక్ష దారి చూపుతుంది. ఎంపికైనవారు జూనియర్‌ టైమ్‌ స్కేల్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, అనుబంధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తారు. గ్రూప్‌- ఏ విభాగంలో క్లాస్‌-1 అధికారిగా కొనసాగుతారు. అనుభవం, పనితీరుతో సీనియర్‌ ఆఫీసర్, చీఫ్‌ ఆఫీసర్, ఆపై హోదాలకు చేరుకోవచ్చు. 

ఎంపిక: పరీక్షలో 2 భాగాలు ఉంటాయి. పార్ట్‌ 1లో 6 పేపర్లు రాయాలి. వీటికి వెయ్యి మార్కులు. జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ స్టడీస్‌ ఒక్కో పేపర్‌కూ వంద మార్కులు. జనరల్‌ ఎకనామిక్స్‌ 1, 2, 3 పేపర్లతోపాటు; ఇండియన్‌ ఎకనామిక్స్‌ ఒక్కో పేపర్‌కు 200 మార్కులు. ప్రతి పేపర్‌ వ్యవధి 3 గంటలు. ప్రశ్నపత్రాలు ఆంగ్లంలోనే ఉంటాయి. అలాగే సమాధానాలూ అదే భాషలో రాయాలి. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉన్నాయి. పార్ట్‌ 1లో అర్హత సాధించినవారు పార్ట్‌ 2 ఇంటర్వ్యూకు హాజరవుతారు. ఈ విభాగానికి 200 మార్కులు కేటాయించారు. మొత్తం 1200 మార్కుల్లో అభ్యర్థి చూపిన ప్రతిభ, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది నియామకాలు చేపడతారు. 

ప్రశ్నలు: జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్లలోని ప్రశ్నలు సాధారణ గ్రాడ్యుయేట్లు ఎవరైనా ఎదుర్కునేలా ఉంటాయి. జనరల్‌ ఇంగ్లిష్‌లో ఆంగ్లంలో వ్యాసం రాయాలి.. మిగిలిన ప్రశ్నల నుంచి ఆంగ్లాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకుంటారు. పదాలు ఉపయోగించడం (ఒకాబ్యులరీ), ప్యాసేజ్‌లు, ప్రెసీ అంశాల్లో వీటిని అడుగుతారు. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో దైనందిన జీవితంతో ముడిపడి ఉన్న అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. వర్తమాన వ్యవహారాలకు ప్రాధాన్యం. భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, చరిత్ర, భూగోళం అంశాల నుంచీ ప్రశ్నలుంటాయి. హైస్కూల్‌ సోషల్‌ పుస్తకాలు బాగా చదువుకుంటూ, తాజా అంశాలను అనుసరిస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.  

ఎకనామిక్స్‌: ఈ ప్రశ్నపత్రాలు ఆ సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఉంటాయి. భావనలు ఉపయోగించి సమస్యను విశ్లేషించగలగాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోన్న సమస్యలనే ప్రశ్నలుగా మలుస్తారు. అందువల్ల సబ్జెక్టుపై గట్టి పట్టు తప్పనిసరి. పరీక్షలో విజయానికి ముందుగా మూడేళ్ల యూజీ ఎకనామిక్స్‌ పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమికాంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. అనంతరం పీజీ పుస్తకాలు బాగా చదవాలి. సివిల్‌ సర్వీసెస్‌ ఎకనామిక్స్‌ ఆప్షనల్‌ సబ్జెక్టు పాత ప్రశ్నపత్రాలు సాధన చేస్తే మంచిది. సబ్జెక్టు ప్రశ్నలు వ్యాసరూపంలో ఉంటాయి కాబట్టి రాత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. గతంలో నిర్వహించిన ఐఈఎస్‌ ప్రశ్నపత్రాలు పరిశీలించి, సన్నద్ధతను అందుకు అనుగుణంగా మలచుకోవాలి.  

ఖాళీలు: 18

అర్హత: ఎకనామిక్స్‌/ అప్లైడ్‌ ఎకనామిక్స్‌/ బిజినెస్‌ ఎకనామిక్స్‌/ ఎకనోమెట్రిక్స్‌ వీటిలో ఎందులోనైనా పీజీ కోర్సులు పూర్తిచేసినవారు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: ఆగస్టు 1, 2024 నాటికి 21 - 30 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఆగస్టు 2, 1994 - ఆగస్టు 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. 

పరీక్షలు: జూన్‌ 21 నుంచి మొదలవుతాయి. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌.ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌

స్టాటిస్టిక్స్‌లో మేటి భవిష్యత్తు ఆశించేవారు రాయాల్సిన పరీక్షల్లో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ (ఐఎస్‌ఎస్‌) ముఖ్యమైంది. ఈ ఉద్యోగానికి ఎంపికైనవారు జూనియర్‌ టైమ్‌ స్కేల్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభిస్తారు. నేషనల్‌ స్టాటిస్టికల్, సెంట్రల్‌ స్టాటిస్టికల్, నేషనల్‌ శాంపిల్‌ కార్యాలయాల్లో ఎక్కడైనా వీరికి విధులుంటాయి. గ్రూప్‌- ఏ విభాగంలో క్లాస్‌-1 అధికారిగా కొనసాగుతారు. భవిష్యత్తులో వీరు సీనియర్, చీఫ్‌ ఆఫీసర్‌ హోదాలను పొందగలరు.

ఎంపిక: పరీక్షలో 2 భాగాలు ఉన్నాయి. పార్ట్‌ 1లో వెయ్యి మార్కులకు 6 పేపర్లు రాయాలి. వీటిలో జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ స్టడీస్‌ ఒక్కో పేపరు వంద మార్కులకు ఉంటాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి 3 గంటలు. స్టాటిస్టిక్స్‌ 1, 2 పేపర్లు ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి 2 గంటలు. స్టాటిస్టిక్స్‌ 3, 4 పేపర్లు డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉంటాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి 3 గంటలు. ఒక్కో స్టాటిస్టిక్స్‌ పేపరు (1,2,3,4)కు 200 మార్కులు. స్టాటిస్టిక్స్‌ 1,2 పేపర్లలో 80 చొప్పున ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు. డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉన్న 3, 4 పేపర్లలో సగం ప్రశ్నలు షార్ట్‌ ఆన్సర్, చిన్న సమస్యల రూపంలో ఉంటాయి. మిగతా సగంలో లాంగ్‌ ఆన్సర్, కాంప్రహెన్షన్‌ ప్రాబ్లమ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రాలు ఆంగ్లంలోనే ఉంటాయి. అలాగే సమాధానాలూ ఆ భాషలోనే రాయాలి. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉన్నాయి. పార్ట్‌-1లో అర్హత సాధిస్తేనే పార్ట్‌-2 ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ విభాగానికి 200 మార్కులు కేటాయించారు. పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన తుది మార్కులతో నియామకాలుంటాయి.  

ప్రశ్నలు: జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్లలోని ప్రశ్నలు సాధారణ గ్రాడ్యుయేట్లు ఎవరైనా ఎదుర్కునేలా అడుగుతారు. వీటికోసం ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరం లేదు. ఐఈఎస్‌లోని జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఇంగ్లిష్‌ అంశాల నుంచే స్టాటిస్టికల్‌ సర్వీస్‌లోనూ ప్రశ్నలు వస్తాయి. 

స్టాటిస్టిక్స్‌: ఈ ప్రశ్నపత్రాలు మాత్రం పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఉంటాయి. అందువల్ల స్టాట్‌పై గట్టి పట్టు ఉండాలి. ముందుగా యూజీ స్టాటిస్టిక్స్‌ పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమికాంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. అనంతరం పీజీ పుస్తకాలతోపాటు ఐఎస్‌ఎస్‌ పాత ప్రశ్నపత్రాలు పరిశీలించడం ద్వారా పరీక్షపై పూర్తి అవగాహన లభిస్తుంది. అలాగే స్టాటిస్టిక్స్‌లో నెట్, ఇండియన్‌ స్టాటిస్టిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ పాత ప్రశ్నపత్రాలు సాధన చేస్తే ఉపయోగం ఉంటుంది. 

ఖాళీలు: 30

అర్హత: స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/ అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌ వీటిలో ఎందులోనైనా యూజీ/ పీజీ పూర్తిచేసినవారు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: ఆగస్టు 1, 2024 నాటికి 21 - 30 ఏళ్లలోపు ఉండాలి. ఆగస్టు 2, 1994 - ఆగస్టు 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు.  

పరీక్షలు: జూన్‌ 21 నుంచి మొదలవుతాయి. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌.


గడువు, ఫీజు..

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: పై మూడు పోస్టులకు ఏప్రిల్‌ 30 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష ఫీజు: ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు. మిగిలినవారికి రూ.200.

వయసు: పై మూడు పోస్టులకు గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీలైతే ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు వర్తిస్తుంది. 

వెబ్‌సైట్‌: https://upsc.gov.in

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎస్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు

‣ ఇంటర్‌తో కేంద్ర సర్వీసుల్లోకి!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

Posted Date : 16-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.