• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక..గణాంక..వైద్య సేవల్లోకి కేంద్రం ఆహ్వానం!

740 ఖాళీలతో యూపీఎస్సీ ప్రకటన విడుదల

దేశంలో అత్యున్నత ఉద్యోగాల నియామకాలన్నీ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) ఆధ్వర్యంలో జరుగుతాయి. ఏటా క్యాలెండర్‌ ప్రకారం పోస్టులు భర్తీ చేయడం దీని ప్రత్యేకత. ఇటీవలే కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్, ఎకనామిక్‌ సర్వీస్, స్టాటిస్టికల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడ్డాయి. ఇవన్నీ లెవెల్‌- 10 హోదాతో ఉన్న పోస్టులే. వీటికి ఎంపికైనవారికి ఆకర్షణీయ వేతనంతోపాటు అత్యున్నత హోదా సొంతమవుతుంది. సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేట్లు/పోస్టు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఆ వివరాలు చూద్దాం...

సీఎంఎస్‌

ఎంబీబీఎస్‌ పూర్తయిన తర్వాత ప్రభుత్వోద్యోగంలో స్థిరపడాలనుకున్నవారికి కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌(సీఎంఎస్‌) చక్కని అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ విధానంలో ఎంపికైనవారు కేంద్రానికి చెందిన ఆసుపత్రుల్లో సేవలు అందించవచ్చు. జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ హోదాతో విధుల్లో చేరిన వీరు భవిష్యత్తులో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్, ఆ పై స్థాయులకు చేరుకోవచ్చు.  

ఎంపిక విధానం: ముందుగా కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి 500 మార్కులు కేటాయించారు. ఇందులో రెండు పేపర్‌లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులు. ఒక్కో పేపర్‌లోనూ 120 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ఒక్కోదాని వ్యవధి 2 గంటలు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఇందులో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది. 

ఎంబీబీఎస్‌ సిలబస్‌పై గట్టి పట్టున్నవారు సీఎంఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం కష్టమేమీ కాదు. పరీక్షలో విజయానికి గతంలో నిర్వహించిన సీఎంఎస్, నీట్‌ పీజీ, ఐఎన్‌ఐ సెట్‌ ప్రశ్నపత్రాల అధ్యయనం ఉపయోగపడుతుంది.

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. కోర్సు తుదిదశలో ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 687. వీటిలో సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌లో 314, రైల్వేలో అసిస్టెంట్‌ డివిజినల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ 300, న్యూదిల్లీ మునిసిపల్‌ కార్యాలయాల్లో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ 73 పోస్టులు ఉన్నాయి.

వయసు: ఆగస్టు 1, 2022 నాటికి 32 ఏళ్లకు మించరాదు. ఆగస్టు 2, 1990 కంటే ముందు జన్మించినవారు అనర్హులు. 

పరీక్ష తేదీ: జులై 17

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి. 

ఐఈఎస్‌

కేంద్ర ఆర్థిక సర్వీసుల్లో అత్యున్నత హోదాలో సేవలు అందించాలనే లక్ష్యం ఉన్నవారికి ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ (ఐఈఎస్‌) పరీక్ష దారి చూపుతుంది. దీనికి ఎంపికైనవారు జూనియర్‌ టైమ్‌ స్కేల్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, అనుబంధ విభాగాల్లో వీరికి విధులుంటాయి. గ్రూప్‌ ఎ విభాగంలో క్లాస్‌ -1 అధికారిగా కొనసాగుతారు. అనుభవం, పనితీరుతో సీనియర్‌ ఆఫీసర్, చీఫ్‌ ఆఫీసర్, ఆ పై హోదాలకు చేరుకోవచ్చు. 

ఎంపిక ఇలా: పరీక్షలో 2 భాగాలు ఉంటాయి. పార్ట్‌ 1లో 6 పేపర్లు రాయాలి. వీటికి వెయ్యి మార్కులు కేటాయించారు. జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ స్టడీస్‌ ఒక్కో పేపరు వంద మార్కులకు చొప్పున నిర్వహిస్తారు. జనరల్‌ ఎకనామిక్స్‌ 1,2,3 పేపర్లతోపాటు; ఇండియన్‌ ఎకనామిక్స్‌ ఒక పేపర్‌ ఉంటుంది. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. ఒక్కో పేపర్‌ వ్యవధి 3 గంటలు. ప్రశ్నపత్రాలు ఆంగ్లంలోనే ఉంటాయి. అలాగే సమాధానాలు సైతం అదే భాషలో రాయాలి. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉన్నాయి. పార్ట్‌ 1లో అర్హత సాధించినవారు పార్ట్‌ 2 ఇంటర్వ్యూకు హాజరవుతారు. ఈ విభాగానికి 200 మార్కులు కేటాయించారు. మొత్తం 1200 మార్కులకు గానూ అభ్యర్థి చూపిన ప్రతిభ, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది నియామకాలు చేపడతారు. 

ప్రశ్నల స్థాయి: జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్లలోని ప్రశ్నలు సాధారణ గ్రాడ్యుయేట్లు ఎవరైనా ఎదుర్కునేలా ఉంటాయి. జనరల్‌ ఇంగ్లిష్‌లో భాగంగా ఆంగ్లంలో వ్యాసం రాయాల్సి ఉంటుంది. మిగిలిన ప్రశ్నల ద్వారా ఆంగ్లాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకుంటారు. పదాలు ఉపయోగించడం (ఒకాబ్యులరీ), ప్యాసేజ్‌లు, ప్రెసీ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో దైనందిన జీవితంతో ముడిపడి ఉన్న అంశాల నుంచే ప్రశ్నలు అడుగుతారు. వర్తమాన వ్యవహారాలకు ప్రాధాన్యం ఉంటుంది. భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, చరిత్ర, భౌగోళిక వ్యవస్థ అంశాల నుంచీ ప్రశ్నలుంటాయి. అయితే వీటిని ఎదుర్కోవడానికి ఎలాంటి విద్యా నేపథ్యం, ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు. హైస్కూల్‌ సోషల్‌ పుస్తకాలు బాగా చదువుకుంటూ, తాజా అంశాలను అనుసరిస్తే మార్కులు పొందవచ్చు.  

ఎకనామిక్స్‌ ప్రశ్నపత్రాలు మాత్రం ఆ సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఉంటాయి. భావనలు ఉపయోగించి సమస్యను విశ్లేషించగలగాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోన్న సమస్యలనే ప్రశ్నలుగా మలుస్తారు. అందువల్ల సబ్జెక్టుపై గట్టి పట్టు ఉండడం తప్పనిసరి. పరీక్షలో విజయానికి ముందుగా మూడేళ్ల యూజీ ఎకనామిక్స్‌ పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమికాంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. అనంతరం పీజీ పుస్తకాలు బాగా చదవాలి. సివిల్‌ సర్వీసెస్‌ ఎకనామిక్స్‌ ఆప్షనల్‌ సబ్జెక్టు పాత ప్రశ్నపత్రాలు సాధనచేస్తే మంచిది. సబ్జెక్టు ప్రశ్నలు వ్యాసరూపంలో ఉంటాయి కాబట్టి రాత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. గతంలో నిర్వహించిన ఐఈఎస్‌ ప్రశ్నపత్రాలు పరిశీలించి, సన్నద్ధతను అందుకు అనుగుణంగా మలచుకోవాలి.  

ఖాళీలు: 24

అర్హత: ఎకనామిక్స్‌ / అప్లైడ్‌ ఎకనామిక్స్‌/ బిజినెస్‌ ఎకనామిక్స్‌ / ఎకనోమెట్రిక్స్‌ వీటిలో ఎందులోనైనా పీజీ కోర్సులు పూర్తిచేసినవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: ఆగస్టు 1, 2022 నాటికి 21 - 30 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఆగస్టు 2, 1992 కంటే ముందు; ఆగస్టు 1, 2001 తర్వాత జన్మించినవారు అనర్హులు. 

పరీక్షలు: జూన్‌ 24 నుంచి మొదలవుతాయి. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌లో ఉంది.

ఐఎస్‌ఎస్‌

స్టాటిస్టిక్స్‌లో మేటి భవిష్యత్తు ఆశించేవారు రాయాల్సిన పరీక్షల్లో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ (ఐఎస్‌ఎస్‌) ముఖ్యమైంది. ఈ ఉద్యోగానికి ఎంపికైనవారు జూనియర్‌ టైమ్‌ స్కేల్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభిస్తారు. నేషనల్‌ స్టాటిస్టికల్, సెంట్రల్‌ స్టాటిస్టికల్, నేషనల్‌ శాంపిల్‌ కార్యాలయాల్లో ఎక్కడైనా వీరికి విధులుంటాయి. గ్రూప్‌ ఎ విభాగంలో క్లాస్‌ -1 అధికారిగా కొనసాగుతారు. భవిష్యత్తులో వీరు సీనియర్, చీఫ్‌ ఆఫీసర్‌ హోదాలను పొందగలరు.

ఎంపిక ఇలా: పరీక్షలో 2 భాగాలు ఉన్నాయి. పార్ట్‌ 1లో వెయ్యి మార్కులకు 6 పేపర్లు రాయాలి. వీటిలో జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ స్టడీస్‌ ఒక్కో పేపరు వంద మార్కులకు చొప్పున ఉంటాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి 3 గంటలు. స్టాటిస్టిక్స్‌ 1, 2 పేపర్లు ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి 2 గంటలు. స్టాటిస్టిక్స్‌ 3, 4 పేపర్లు డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉంటాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి 3 గంటలు. ఒక్కో స్టాటిస్టిక్స్‌ పేపరు (1,2,3,4)కు 200 మార్కులు. స్టాటిస్టిక్స్‌ 1,2 పేపర్లలో 80 చొప్పున ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. అంటే ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు. డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉన్న 3, 4 పేపర్లలో సగం ప్రశ్నలు షార్ట్‌ ఆన్సర్, చిన్న సమస్యల రూపంలో ఉంటాయి. మిగతా సగంలో లాంగ్‌ ఆన్సర్, కాంప్రహెన్షన్‌ ప్రాబ్లమ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రాలు ఆంగ్లంలోనే ఉంటాయి. అలాగే సమాధానాలూ ఇంగ్లిష్‌లోనే రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉన్నాయి. పార్ట్‌ 1లో అర్హత సాధించినవారు పార్ట్‌ 2 ఇంటర్వ్యూకు హాజరవుతారు. ఈ విభాగానికి 200 మార్కులు కేటాయించారు. పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కులతో తుది నియామకాలు చేపడతారు.  

ప్రశ్నల స్థాయి: జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్లలోని ప్రశ్నలు సాధారణ గ్రాడ్యుయేట్లు ఎవరైనా ఎదుర్కునేలా అడుగుతారు. వీటికోసం ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరం లేదు. పైన పేర్కొన్న ఐఈఎస్‌లోని జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఇంగ్లిష్‌ అంశాల నుంచే స్టాటిస్టికల్‌ సర్వీస్‌లోనూ ప్రశ్నలు వస్తాయి. స్టాటిస్టిక్స్‌ ప్రశ్నపత్రాలు మాత్రం ఆ సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఉంటాయి. అందువల్ల స్టాట్‌పై గట్టి పట్టు ఉండాలి. ముందుగా యూజీ స్టాటిస్టిక్స్‌ పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమికాంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. అనంతరం పీజీ పుస్తకాలతోపాటు ఐఎస్‌ఎస్‌ పాత ప్రశ్నపత్రాలు పరిశీలించడం ద్వారా పరీక్షపై పూర్తి అవగాహన లభిస్తుంది. అలాగే స్టాటిస్టిక్స్‌లో నెట్, ఐఎస్‌ఐ పాత ప్రశ్నపత్రాలు సాధనచేస్తే ఉపయోగం ఉంటుంది. 

ఖాళీలు: 29 అర్హత: స్టాటిస్టిక్స్‌ / మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌ / అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌ వీటిలో ఎందులోనైనా యూజీ / పీజీ కోర్సులు పూర్తిచేసినవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: ఆగస్టు 1, 2022 నాటికి 21 - 30 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఆగస్టు 2, 1992 కంటే ముందు; ఆగస్టు 1, 2001 తర్వాత జన్మించినవారు అనర్హులు.  

పరీక్షలు: జూన్‌ 24 నుంచి మొదలవుతాయి. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌లో ఉంది.

సీఎంఎస్, ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌...ఈ మూడింటిలో ఏ సర్వీస్‌కి ఎంపికైనప్పటికీ లెవెల్‌-10 హోదా దక్కుతుంది. అంటే వీరికి రూ.56,100 మూల వేతనం అందుతుంది. అలాగే డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు కలుపుకుని వీరు మొదటి నెల నుంచే రూ.లక్షకుపైగా వేతనం అందుకోవచ్చు. భవిష్యత్తులో ఉన్నత స్థానానికీ చేరుకోవచ్చు. ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌లకు ఎంపికైనవారికి దాదాపు సివిల్‌ సర్వెంట్లకు ఉన్న ప్రాధాన్యం దక్కుతుంది. సీఎంఎస్‌లో సేవలు అందించేవారికి నాన్‌ ప్రాక్టీస్‌ అలవెన్సు(ఎన్‌పీఏ) చెల్లిస్తారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: పై మూడు పోస్టులకు ఏప్రిల్‌ 26 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష ఫీజు: ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు. మిగిలినవారికి రూ.200.

వయసు: పై మూడు పోస్టులకు గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీలైతే ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది. 

వెబ్‌సైట్‌: https://upsc.gov.in

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌