• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక‌, గ‌ణాంక నిపుణుల‌కు ఘ‌న‌మైన కొలువులు

యూపీఎస్సీ-ఐఈఎస్‌/ ఐఎస్ఎస్-2021 ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

అర్థ‌, గ‌ణాంక(స్టాటిస్టిక్స్‌) శాస్త్రాల్లో అత్యున్న‌త ఉద్యోగాల భ‌ర్తీకి వ‌రుస‌గా ఇండియ‌న్ ఎకనామిక్ స‌ర్వీస్ (ఐఈఎస్‌), ఇండియన్ స్టాటిస్టిక‌ల్ స‌ర్వీస్ (ఐఎస్ఎస్‌) ప్ర‌క‌ట‌నలు వెలువ‌డ్డాయి. ఏడాదికి ఒకసారి యూపీఎస్సీ ఈ ప‌రీక్ష‌లను నిర్వ‌హిస్తోంది. దీనికి సంబంధించి ఉమ్మ‌డిగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఐఈఎస్‌లో 15, ఐఎస్ఎస్‌లో 11 పోస్టులకు నియామ‌కాలు చేప‌ట్ట‌నున్నారు. అబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్ ప‌రీక్ష‌లు, ఇంట‌ర్వ్యూల్లో చూపిన ప్ర‌తిభ ఆధారంగా ఈ పోస్టుల‌కు ఎంపిక చేస్తారు. సంబంధిత విభాగాల్లో యూజీ లేదా పీజీ పూర్తి చేసుకున్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం..

అర్హతలు

ఐఎస్ఎస్ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/ అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌ వీటిలో ఎందులోనైనా యూజీ/ పీజీ కోర్సులు పూర్తిచేసి ఉండాలి. ఐఈఎస్ ప‌రీక్ష‌కైతే ఎకనామిక్స్‌ / అప్లైడ్‌ ఎకనామిక్స్‌/ బిజినెస్‌ ఎకనామిక్స్‌ / ఎకనోమెట్రిక్స్‌ వీటిలో ఎందులోనైనా పీజీ కోర్సుల్లో ఉత్తీర్ణ‌త సాధించాలి. ఈ రెండు ప‌రీక్ష‌ల‌కు ప్రస్తుతం ఆఖరు సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు ఆగస్టు 1, 2021 నాటికి 21 - 30 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఆగస్టు 2, 1991 కంటే ముందు; ఆగస్టు 1, 2000 తర్వాత జన్మించిన వారు అనర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

ఐఎస్ఎస్‌ ప‌రీక్ష విధానం

ఈ పరీక్షలో 2 భాగాలు ఉంటాయి. పార్ట్‌ 1లో 6 పేపర్లు వెయ్యి మార్కులకు ఉంటాయి. వీటిలో జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ స్టడీస్‌ ఒక్కో పేపరు వంద మార్కులకు చొప్పున ఉంటాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి 3 గంటలు. స్టాటిస్టిక్స్‌ 1, 2 పేపర్లు ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి 2 గంటలు. స్టాటిస్టిక్స్‌ 3, 4 పేపర్లు డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉంటాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి 3 గంటలు. ఒక్కో స్టాటిస్టిక్స్‌ పేపరు (1, 2, 3, 4)కు 200 మార్కులు. స్టాటిస్టిక్స్‌ 1, 2 పేపర్లలో 80 చొప్పున ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. అంటే ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు. డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉన్న 3, 4 పేపర్లలో సగం ప్రశ్నలు షార్ట్‌ ఆన్సర్, చిన్న సమస్యల రూపంలో ఉంటాయి. మిగతా సగంలో లాంగ్‌ ఆన్సర్, కాంప్రహెన్షన్‌ ప్రాబ్లమ్‌ ప్రశ్నలు వస్తాయి. 

ఐఈఎస్ ఎగ్జామ్‌ తీరు..

ఇందులోనూ 2 భాగాలుంటాయి. పార్ట్‌ 1లో 6 పేపర్లు క‌లిపి వెయ్యి మార్కులకు ఉంటాయి. వీటిలో జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ స్టడీస్‌ ఒక్కో పేపరు వంద మార్కుల చొప్పున కేటాయించారు. జనరల్‌ ఎకనామిక్స్‌ 1,2,3 పేపర్లతోపాటు; ఇండియన్‌ ఎకనామిక్స్‌ ఒక పేపర్‌ ఉంటుంది. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు. కాల‌ వ్యవధి 3 గంటల చొప్పున ఇచ్చారు. 

ఈ రెండు స‌ర్వీసుల‌ ప‌రీక్ష‌ల ప్రశ్నపత్రాలు ఆంగ్లంలోనే ఉంటాయి. సమాధానాలూ అదే భాషలో రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉన్నాయి. పార్ట్‌ 1లో అర్హత సాధించినవారు పార్ట్‌ 2 ఇంటర్వ్యూకు హాజరవుతారు. ఈ విభాగానికి 200 మార్కులు కేటాయించారు. మొత్తం 1200 మార్కులకు గానూ అభ్యర్థి చూపిన ప్రతిభ, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది నియామకాలు చేపడతారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌.

విధులు

దేశంలో అత్యున్న‌త ఉద్యోగాల‌కు యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుంది. ఈ సంస్థ నిర్వ‌హించే ప‌రీక్ష‌ల్లోనే ఐఈఎస్‌, ఐఎస్ఎస్ ఉన్నాయి. కేంద్ర ఆర్థిక స‌ర్వీసుల్లో ఉన్న‌తస్థాయి హోదాలో సేవ‌లు అందించాల‌నే ల‌క్ష్యం ఉన్న‌ వారికి ఈ ప‌రీక్షలు దారి చూపుతాయి. వీటిలో ఎంపికైన అభ్య‌ర్థులు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ‌, అనుబంధ విభాగా(నేషనల్‌ స్టాటిస్టికల్, సెంట్రల్‌ స్టాటిస్టికల్, నేషనల్‌ శాంపిల్)ల్లో విధులు నిర్వ‌ర్తిస్తారు. జూనియర్‌ టైమ్‌ స్కేల్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభిస్తారు. గ్రూప్‌ ఎ విభాగంలో క్లాస్‌ -1 అధికారిగా కొనసాగుతారు. మొదటి నెల నుంచే రూ.56,100 (లెవెల్‌ 10) మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ మొదలైనవి కలుపుకుని సుమారు రూ.తొంభై వేలు, ఆపైన అందుకోవచ్చు. అనుభవం, పనితీరుతో కెరియర్‌లో అత్యున్నత హోదాకు చేరుకోవచ్చు. దాదాపు సివిల్‌ సర్వెంట్లకు ఉన్నంత ప్రాధాన్యం స్టాటిస్టికల్‌ సర్వీస్‌లో ఎంపికైనవారికీ ఉంటుంది. 

సిల‌బ‌స్‌.. ప్ర‌శ్న‌ల స‌ర‌ళి

ఎకనామిక్స్‌ ప్రశ్నపత్రాలు మాత్రం ఆ సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఉంటాయి. థియరీ ఉపయోగించి సమస్యను విశ్లేషించగలగాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోన్న సమస్యలనే ప్రశ్నలగా మలుస్తారు. అందువల్ల సబ్జెక్టుపై గట్టి పట్టు ఉండడం తప్పనిసరి. ముందుగా మూడేళ్ల యూజీ ఎకనామిక్స్‌ పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమికాంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. అనంతరం పీజీ పుస్తకాలు బాగా చదవాలి. సివిల్‌ సర్వీసెస్‌ ఎకనామిక్స్‌ ఆప్షనల్‌ సబ్జెక్టు పాత ప్రశ్నపత్రాలు సాధన చేస్తే మంచిది. సబ్జెక్టు ప్రశ్నలకు వ్యాసరూపంలో జవాబులు రాయాల్సివున్నందున రాత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. గతంలో నిర్వహించిన ఐఈఎస్‌ ప్రశ్నపత్రాలు పరిశీలించి, సన్నద్ధతను అందుకు అనుగుణంగా మలచుకోవాలి.
 

స్టాటిస్టిక్స్‌ ప్రశ్నపత్రాలు కూడా ఆ సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఉంటాయి. అందువల్ల స్టాట్‌పై గట్టి పట్టు ఉండాలి. ముందుగా యూజీ స్టాటిస్టిక్స్‌ పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమికాంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. అనంతరం పీజీ పుస్తకాలతోపాటు స్టాటిస్టిక్స్‌లో నెట్, యూపీఎస్‌సీ పాత ప్రశ్నపత్రాలు సాధనచేస్తే మంచిది. 
 

జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్లలోని ప్రశ్నలు సాధారణ గ్రాడ్యుయేట్లు ఎవరైనా ఎదుర్కునేలా అడుగుతారు. జనరల్‌ ఇంగ్లిష్‌లో భాగంగా ఆంగ్లంలో వ్యాసం రాయాల్సి ఉంటుంది. మిగిలిన ప్రశ్నలు ఆంగ్లాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకునేలా ఉంటాయి. పదాలు ఉపయోగించడం (ఒకాబ్యులరీ), ప్యాసేజ్‌లు, ప్రెసీ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ నాలెడ్జ్‌లో ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడి ఉన్నవే ఎక్కువగా వస్తాయి. వర్తమాన వ్యవహారాలకు ప్రాధాన్యం ఉంటుంది. భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, చరిత్ర, భౌగోళిక అంశాల నుంచీ ప్రశ్నలుంటాయి. అయితే వీటిని ఎదుర్కోవడానికి ఎలాంటి విద్యా నేపథ్యమూ, ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు. హైస్కూల్‌ సోషల్‌ పుస్తకాలు బాగా చదువుకుంటూ, తాజా అంశాలను గమనిస్తే సరిపోతుంది.  

ద‌ర‌ఖాస్తు విధానం

ఆస‌క్తితో పాటు అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఏప్రిల్ 27, 2021 సాయంత్రం 6 గంట‌ల వరకు చివ‌రి గడువుగా ఉంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ప‌రీక్ష ఫీజు మినహాయించారు. మిగిలిన అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. జులై 16 నుంచి ప‌రీక్ష‌లు మొదలవుతాయి. 

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

Posted Date : 14-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌