• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచ సవాళ్లకు జీ7 పరిష్కారాలు

సంపన్న పారిశ్రామిక దేశాల సంఘమైన జీ7 దేశాధినేతల సదస్సు నేటి నుంచి ఈనెల 21వ తేదీ వరకు హిరోషిమాలో జరుగనుంది. జీ7 సభ్యదేశాల్లోని ఫ్రాన్స్‌, ఇటలీ, కెనడాలకన్నా ఇండియా జీడీపీ అధికం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ఈ ఏడాది జీ20కి అధ్యక్షత వహిస్తోంది.  అందువల్ల జీ7 సదస్సుకు మన దేశాన్నీ ఆహ్వానించారు.

ప్రపంచ శాంతి సుస్థిరతలు, భద్రత, ఇంధనం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పుల గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తూ పరిష్కారాలను కనుగొనడానికి జీ7 కృషి చేస్తోంది. 1973లో సంపన్న దేశాల ఆర్థిక మంత్రుల తాత్కాలిక సమావేశం క్రమంగా జీ7గా రూపుదిద్దుకొంది. అమెరికా, జపాన్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా, ఇటలీలతోపాటు ఐరోపా సమాఖ్య (ఈయూ) కూడా జీ7 సభ్యురాలు. చైనాకు జీ7లో సభ్యత్వం లేదు. ప్రస్తుతం జీ20 దేశాలకు నేతృత్వం వహిస్తున్న భారత్‌తోపాటు ఇతర ప్రధాన దేశాలైన ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, వియత్నాం, దక్షిణ కొరియాలకూ జపాన్‌ ఆహ్వానం పంపింది. ఆఫ్రికన్‌ యూనియన్‌కు అధ్యక్షత వహిస్తున్న కొమొరోస్‌, పసిఫిక్‌ దీవుల వేదికకు అధ్యక్ష హోదాలో ఉన్న కుక్‌ ఐలాండ్స్‌, ఆగ్నేయాసియా దేశాల కూటమికి నేతృత్వం వహిస్తున్న ఇండొనేసియా దేశాధినేతలనూ ఆహ్వానించింది. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిది (ఐఎంఎఫ్‌) ప్రధాన కార్యనిర్వాహకులనూ పిలిచింది.

ప్రధాన సవాళ్లు

జీ7 సదస్సు ముందు రెండు ప్రధాన సవాళ్లు ఉన్నాయి. ఒకటి- ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర, రెండు- ఆసియా-పసిఫిక్‌లో చైనా ఆధిపత్యం చలాయించాలని చూడటం. మరోవైపు కొవిడ్‌ మహమ్మారి తెచ్చిపెట్టిన నష్టాల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఈ పెను సమస్యలను అధిగమించడానికి ఆర్థిక సహాయం అందించడంతోపాటు వినూత్న పరిష్కారాలు, విధాన నిర్ణయాలను హిరోషిమా జీ7 సదస్సు తీసుకోవాల్సి ఉంది. 2008నాటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి అమెరికా జీ20 దేశాల మద్దతు కోరినప్పటి నుంచి జీ7 ప్రాముఖ్యం తగ్గిందని ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే, 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తిన తరవాత జీ7 మళ్ళీ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో తాను పోషించాల్సిన పాత్ర గురించి అంతవరకు ఊగిసలాటకు లోనైన జీ7 కొత్త లక్ష్యాలతో ముందుకుసాగాలని నిర్ణయించుకుంది. గడచిన 16 నెలల్లో జీ7 రష్యన్‌ చమురు ఎగుమతుల ధరపై పరిమితి విధించింది. ఉక్రెయిన్‌ పునర్నిర్మాణం గురించీ చర్చించింది. ఆసియా-పసిఫిక్‌లో చైనా ఆర్థిక, సైనిక కార్యకలాపాలపై దృష్టి సారించింది. రష్యా, చైనాల విషయంలో సూత్రరీత్యా ఏకీభావాన్ని ప్రదర్శిస్తున్న జీ7 దేశాలు అంతర్జాతీయ ఆర్థిక, సైనిక సమస్యలపై ఉమ్మడి పంథాను అనుసరించలేకపోతున్నాయి. హిరోషిమా జీ7 సభలో రష్యాతో వాణిజ్యంపై కొత్త ఆంక్షలు విధించాలని అమెరికా ఆశిస్తోంది. ఇప్పటి వరకు రష్యా పట్ల అనుసరిస్తున్న విధానంలోని లోపాలను అధిగమించాలని భావిస్తోంది. కానీ, దీనికి జపాన్‌ నుంచి, ఐరోపా దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అణ్వస్త్రరహిత ప్రపంచ సాధన అంశాన్ని హిరోషిమా జీ7 సభలో చర్చించాలని జపాన్‌ భావిస్తోంది. అయితే, ఇది జీ7లో అణ్వస్త్ర దేశాలైన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లకు రుచించని విషయమని వేరే చెప్పనక్కర్లేదు.

శాంతికి బాటలు

ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జీ7 ముందున్న బాధ్యత. ఆసియాలో మయన్మార్‌, ఉత్తర కొరియాలతో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ దేశాలకు చైనా మద్దతు ఉన్నమాట నిజమే కానీ, జీ7 పరంగా ఎలాంటి చొరవ తీసుకుంటారా అని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అలాంటి చొరవ చూపితేనే జీ7 నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు ఆమోదించగలుగుతాయి. సంపన్న దేశాల ప్రత్యేక క్లబ్‌గా జీ7 మిగిలిపోతుందా లేక అంతర్జాతీయ సంక్షోభాలను అధిగమించే బాధ్యతను తలకెత్తుకొంటుందా అన్నది కీలక ప్రశ్న. జీ7 దేశాలు తమ బాగు తాము చూసుకోవడానికి పరిమితం కాకుండా ప్రపంచం కష్టాల్ని తమ బాధగా స్వీకరించినప్పుడే నాయకత్వ పాత్రను పోషించగలుగుతాయి. కాబట్టి హిరోషిమాలో జీ7 సభ కేవలం రష్యా, చైనాల చుట్టూనే తిరగకుండా మయన్మార్‌, ఉత్తర కొరియా, హైతీ, పాకిస్థాన్‌, సూడాన్‌, ట్యునీసియా దేశాల్లో రగులుతున్న సంక్షోభాల నివృత్తిపైనా దృష్టి పెట్టాలి. ఐక్యరాజ్యసమితిలా జీ7కు చట్టబద్ధమైన, సంస్థాగత ప్రతిపత్తి లేనప్పటికీ, ఆ సంఘానికి ప్రపంచంలో గణనీయ పలుకుబడి ఉంది. హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ వ్యాప్తిని అరికట్టడానికి, వర్ధమాన దేశాలకు ఆర్థిక సహాయం చేయడానికి, వాతావరణ మార్పులను నియంత్రించడానికి జీ7 తనంతటతాను చొరవ తీసుకుంది. 2015లో పారిస్‌లో వాతావరణ మార్పుల నిరోధ ఒప్పందం కుదరడానికి జీ7 ప్రధాన పాత్ర పోషించింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర అనిశ్చితిలో ఉన్నందువల్ల సుస్థిరాభివృద్ధి సాధనకు జీ7 ముందడుగు వేయాలి. ఆర్థిక, మానవీయ, వాతావరణ సంక్షోభాలను ఎదుర్కోవడానికి పకడ్బందీగా చర్యలు ప్రతిపాదించి, వాటి అమలుకు సారథ్యం వహించాలి. సాయుధ సంఘర్షణలను రూపుమాపి ప్రపంచ శాంతికి బాటలు వేయాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది జీ7కు అధ్యక్షత వహిస్తున్న జపాన్‌తో భారత్‌ ఇప్పటికే సహకారాన్ని పెంపొందించుకుంది. హిరోషిమా సభలో ఆహార భద్రత, వర్ధమాన దేశాల అభివృద్ధికి ఆర్థిక సహాయం, పర్యావరణం, వాతావరణం, ఇంధనం, డిజిటలీకరణ, ప్రకృతి ఉత్పాతాల నిభాయింపు వంటి కీలకాంశాలపై భారత్‌ జీ7 దేశాలతో చర్చలు జరిపి, కార్యాచరణ పథకాల రూపకల్పనకు కృషి చేయాలి. ఈ సభలో భారత ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించి, పరిష్కారానికి పిలుపిచ్చే అవకాశం ఉంది.

శాంతి పరిరక్షణపై చర్చలు

జపాన్‌ నుంచి ప్రధాని మోదీ పపువా న్యూగినియా దేశానికి వెళతారు. అక్కడ ఈ నెల 22న ఇండియా-పసిఫిక్‌ దీవుల సహకార వేదిక మూడో శిఖరాగ్ర సభ జరగనుంది. భారత్‌ చొరవతో ఫిజి, పపువా న్యూగినియా, టువాలు, టోంగా వంటి 14 పసిఫిక్‌ ద్వీప దేశాలతో 2014లో ఈ వేదిక ఏర్పడింది. పపువా న్యూగినియాను భారత ప్రధానమంత్రి ఒకరు సందర్శించడం ఇదే మొదటిసారి. అక్కడి నుంచి ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్ళి ఈ నెల 24న అక్కడ క్వాడ్‌ శిఖరాగ్ర సభలో పాల్గొనవలసి ఉంది. అయితే, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆస్ట్రేలియా పర్యటన ఆగిపోవడంతో క్వాడ్‌ సదస్సు రద్దయింది. దీంతో హిరోషిమాలోనే జీ7 సభతోపాటు క్వాడ్‌ను నిర్వహించే అవకాశం ఉంది. చైనా దూకుడును అడ్డుకొని ఆసియా-పసిఫిక్‌లో శాంతి రక్షణకు తీసుకోవలసిన చర్యలపై చర్చలు జరపనున్నాయి.
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ బార్క్‌లో 4,162 కొలువులు

‣ మ్యూజిక్‌లో బెస్ట్‌ కోర్సులివిగో..

‣ చదువుకుంటూ సంపాదించు!

‣ దివ్యమైన కోర్సులకు వేదిక

Posted Date: 22-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం