• facebook
  • whatsapp
  • telegram

ఉన్నత విద్యకు ఆర్థిక ఊతం

ప్రస్తుతం అన్ని ఖర్చులూ విపరీతంగా పెరిగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు తరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేద విద్యార్థులు ఉన్నత విద్యను నిరాటంకంగా కొనసాగించడం అంత తేలిక కాదు. వీరికి ఆర్థిక ఊతం అందించేందుకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం నడుం కట్టింది.

దేశంలో ఆర్థిక సమస్యల కారణంగా ఉన్నత విద్యను చదవలేనివారు భారీగా ఉన్నారు. ఇంటి నుంచి సరిపడా ధనం అందే అవకాశంలేక తీవ్ర ఇక్కట్ల మధ్య చదువును కొనసాగించే పిల్లలూ కనిపిస్తారు. మరోవైపు మరెందరో విద్యార్థులు నగరాలు, పట్టణాల్లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ చదువును కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయంగా చదువుకునే సమయంలో సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల విద్యార్థుల కష్టాలను తీర్చాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) యోచిస్తోంది. ఉన్నత విద్యాసంస్థల్లో ‘ఎర్న్‌ వైల్‌ లెర్న్‌- చదువుతూ సంపాదన’ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఈ మేరకు దేశంలో అన్ని కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో పాటు ఇతర విద్యాసంస్థలకు ఇటీవల సంబంధిత ముసాయిదాను యూజీసీ పంపించింది.

విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపకులకు పరిశోధన నిమిత్తం ఏటా లక్షల రూపాయల బడ్జెట్‌తో యూజీసీ ప్రాజెక్టులు మంజూరు చేస్తుంది. వాటి కోసం సమాచారాన్ని సేకరించేందుకు, ప్రయోగశాలల్లో సహాయకులుగా ఉండేందుకు అదే విద్యాలయంలో చదువుతున్న వారిని వేతనం చెల్లించి నియమించుకోవాలన్న నిబంధన ఉంది. ఇలాంటివి విద్యార్థులకు అరకొరగా ప్రయోజనం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో అందరికీ ఉపయుక్తమయ్యే ఇతర విధుల కోసం విద్యార్థులను వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా గ్రంథాలయ డిజిటలైజేషన్‌ ద్వారా దశాబ్దాలుగా మూలన పడిన అరుదైన గ్రంథాలు, పత్రికలను విద్యార్థులు, పౌరులు, భావితరాలకు అందుబాటులోకి తేవచ్చు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు సైతం ప్రస్తుతం విద్యార్థుల ప్రవేశం నుంచి పరీక్షల ఫలితాల విడుదల దాకా అన్నింటికీ అవుట్‌ సోర్సింగ్‌ సంస్థలపై ఆధారపడుతున్నాయి. అవే పనులను అవసరమైతే స్వల్ప శిక్షణ ఇచ్చి క్యాంపస్‌లో విద్యార్థులకు పార్ట్‌టైం ఉద్యోగాలుగా మలిస్తే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

చదువుకుంటూనే వారానికి గరిష్ఠంగా 20గంటలు క్యాంపస్‌లోనే పనులు చేస్తే సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు మేలు కలుగుతుందన్నది యూజీసీ ప్రతిపాదన. విద్యార్థులకు గంటల లెక్కన వేతనం అందిస్తారు. ఈ పనుల ద్వారా వారి చదువుకు అవసరమైన ధనం లభించడమే కాకుండా, వ్యక్తిత్వం పెంపొందుతుంది. సాంకేతిక నైపుణ్యం, వ్యవస్థాపక సామర్థ్యం పెరుగుతాయి. ప్రతి పనీ గౌరవప్రదమైనదే అని విద్యార్థి దశలోనే తెలుసుకుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఉన్నత విద్యలో డ్రాపవుట్లు తగ్గుతాయి. పట్టణ, గ్రామీణ భారతాల పరంగా ఉన్నత విద్యలో ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ఇది తోడ్పడుతుంది.

జాతీయ విద్యావిధానం 2020కు అనుగుణంగా తయారైన యూజీసీ ప్రతిపాదనను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత విద్యాలయాల యాజమాన్యాలదే. విద్యాలయ ప్రాంగణంలోనే కాకుండా సమీపంలో ఉండే సంస్థలు, కార్యాలయాల పనులను క్యాంపస్‌ నుంచే విద్యార్థులు నిర్వర్తించగలిగే అవకాశాలనూ పరిశీలించాలి. కార్పొరేట్‌ సంస్థలు ప్రాంగణ నియామకాలకు ఏడాది ముందుగానే విద్యార్థులు తీరిక సమయాల్లో ఆన్‌లైన్‌లో చేయగలిగేలా తేలికపాటి పనులను అప్పగించి వేతనాలు చెల్లించాలి. తద్వారా వారు చదువు పూర్తిచేసుకునే సమయానికి కొంత శిక్షణ లభిస్తుంది. ఆంధ్రా, నాగార్జున విశ్వవిద్యాలయాలు... గ్రంథాలయం పనులు, దూరవిద్యలో ప్రవేశాలు, మూల్యాంకనం వంటి ప్రక్రియల్లో వేతనంతో కూడిన పనులను విద్యార్థులకు అప్పగించేవి. చదువుకు ఆటంకం కలగని విధంగా విద్యార్థులకు పనులను అప్పగించడం వల్ల వారికి నైపుణ్యం అలవడుతుంది. సొంత కాళ్లపై నిలబడగలమన్న నమ్మకం వారిలో పెరుగుతుంది. అందుకే- ఉన్నత విద్యాసంస్థల్లో అవసరం మేరకు విద్యార్థులకు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు కల్పించేందుకు యాజమాన్యాలు, పాలక వర్గాలు చర్యలు తీసుకోవాలి.

- ప్రొఫెసర్‌ గుజ్జు చెన్నారెడ్డి 

(నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులు)
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎంబీబీఎస్‌తో ఉన్నత ఉద్యోగం

‣ స్టాటిస్టిక్స్‌తో ఉన్నత ఉద్యోగం

‣ సమ్మర్‌ జాబ్‌తో లాభాలెన్నో..

‣ ఆవిష్కర్తలకు అద్భుత అవకాశం

Posted Date: 22-05-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం