• facebook
  • whatsapp
  • telegram

కలుషిత వ్యర్థాల నిర్వహణ ప్రాణావసరం

నేడు ప్రపంచ పునర్వినియోగ దినోత్సవం

నానాటికీ భారీగా పుట్టుకొస్తున్న వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం, వాటిని పునర్వినియోగంలోకి తేవడం ప్రస్తుతం ప్రపంచం ముందున్న పెద్ద సవాలు. ప్లాస్టిక్స్‌, లోహాలు, కాగితాలు తదితరాల వ్యర్థాలను పునర్వినియోగంలోకి    తేవడంద్వారా అదనపు ముడిపదార్థాలకోసం సహజ వనరులపై ఒత్తిడిని తగ్గించగల వీలుంది. వ్యర్థాలను సరిగ్గా సేకరించకపోవడం, సరైన పద్ధతుల్లో    పునరుద్ధరణ జరక్కపోవడంవల్ల గాలి, నీరు, నేల తీవ్రంగా కలుషితమవుతున్నాయి. వ్యర్థాలను పెద్దమొత్తంలో తగలబెట్టడంవల్ల భూతాపానికి కారణమైన కార్బన్‌ డయాక్సైడ్‌ అధికంగా విడుదల అవుతోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలమూలాన సముద్ర జీవజాలానికీ ఎనలేని నష్టం వాటిల్లుతోంది. వీటన్నింటిపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి  అయిదేళ్ల క్రితం మార్చి 18న ప్రపంచ  పునర్వినియోగ దినోత్సవాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ పునర్వినియోగ బ్యూరో (బీఐఆర్‌) ప్రారంభించిన ఈ దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యూఎన్‌ఐడీఓ) గుర్తింపు లభించింది. కొవిడ్‌ సమయంలో వ్యర్థాలను సేకరించి పునర్వినియోగానికి విశేషంగా కృషిచేసిన వారిని గుర్తించేలా ఈ ఏడాది ప్రపంచ  పునర్వినియోగ ఫౌండేషన్‌ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 

పరిశ్రమలు, పురపాలికలు, వ్యవసాయం, నిర్మాణం-కూల్చివేతలు తదితరాలద్వారా ఇనుము, ఇతర లోహాలు, ప్లాస్టిక్‌, గ్లాసు, రబ్బరు, పేపర్ల వంటి ఘన వ్యర్థాలు నిత్యం పెద్దయెత్తున విడుదల అవుతున్నాయి. మరోవైపు ఈ-వ్యర్థాల ముప్పూ పొంచి ఉంది. దేశీయంగా పట్టణాల్లోనే రోజుకు లక్ష టన్నులకు పైగా ఘన వ్యర్థాలు ఉద్భవిస్తున్నాయని అంచనా. సాంకేతికతను అందిపుచ్చుకోకపోవడం, సరైన సేకరణ పద్దతులు కొరవడటం వంటివి ఘన వ్యర్థాల నిర్వహణలో సమస్యగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్‌ భూతం పెను సవాలు విసురుతోంది. 2015-16లో భారత్‌లో 15.89 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. అయిదేళ్లలో అవి 34 లక్షల టన్నులకు మించిపోయినట్లు కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. ప్లాస్టిక్‌ చేతి సంచుల నిరోధానికి ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకున్నా అవి ఫలవంతం కాకపోవడం వ్యవస్థీకృతంగా నెలకొన్న లోపాలకు అద్దంపడుతుంది. భారత్‌లో వృథాగా పారేస్తున్న వ్యర్థాలద్వారా రోజుకు పదమూడు లక్షల ఘనపు మీటర్ల బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చని వ్యర్థాల నుంచి ఇంధన నివేదిక లోగడ అంచనా వేసింది. బయోగ్యాస్‌ద్వారా 72 మెగావాట్ల విద్యుత్తును, వ్యవసాయానికి ఏటా 50 లక్షల మెట్రిక్‌ టన్నుల కంపోస్టును అందించవచ్చని విశ్లేషించింది. 

ప్రపంచ ఎలెక్ట్రానిక్‌ వ్యర్థాల పర్యవేక్షణ నివేదిక-2020 ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా 5.36 కోట్ల టన్నుల ఎలెక్ట్రానిక్‌ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. వాటిలో 17.4శాతమే పునరుత్పాదనకు నోచుకొన్నాయి. ఈ-వ్యర్థాల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలుస్తోంది. 2019-20లో భారత్‌ 10.14 లక్షల టన్నుల ఈ-వ్యర్థాలను ఉత్పత్తి చేసినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 32శాతం అధికం. ప్రమాదకరమైన పదార్థాలతో కూడిన ఈ-వ్యర్థాల నిర్వహణ 95శాతానికి పైగా అనధికారిక విధానాల్లోనే సాగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇరవై ఎకరాల్లో ఈ-వ్యర్థాలను వేరుచేయడం, ప్లాస్టిక్‌ పునర్వినియోగం, విలువైన లోహాలను సంగ్రహించడం తదితర విభాగాలతో దేశంలోనే తొలి ఎకో పార్కు  ఏర్పాటుకు అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది.

భారత్‌లోని నగరాలను వ్యర్థ రహితంగా మార్చేందుకు గతేడాది రెండో దశ స్వచ్ఛ భారత్‌ మిషన్‌-అర్బన్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుంచీ వ్యర్థాలు సేకరించి సక్రమ  పద్ధతుల్లో నిర్వహించాలి. ప్లాస్టిక్‌  కాలుష్యానికి అడ్డుకట్ట వేసేలా అంతర్జాతీయ స్థాయిలో విధానాల రూపకల్పనకు ఐక్యరాజ్య సమితి పర్యావరణ అసెంబ్లీ (యూఎన్‌ఈఏ)లో 175 దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. దీన్ని చరిత్రాత్మక మాంట్రియల్‌ ప్రొటోకాల్‌, ప్యారిస్‌ ఒప్పందంతో పోలుస్తున్నారు. ప్రధాని మోదీ పేర్కొన్న విధంగా వ్యర్థాలను పునర్వినియోగంలోకి తెచ్చుకోవడం భారత్‌ ముందున్న కర్తవ్యం. ఇందుకోసం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు ఏర్పాటయ్యేలా చూడాలి. ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ కోసం తెచ్చిన చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనధికారిక  వ్యర్థ నిర్వహణ కేంద్రాలపై చర్యలు తీసుకోవడమూ తప్పనిసరి. ప్రభుత్వాల చర్యలకు జన చేతన జతకూడితేనే వ్యర్థాల సమస్యను రాబోయే రోజుల్లో మహోత్పాతంగా మారకుండా నివారించగలం.

- దివ్యాన్షశ్రీ
 

 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 18-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం