• facebook
  • whatsapp
  • telegram

ముప్పు ముంగిట ప్రపంచం

వాతావరణ మార్పులతో భారత్‌కే అధిక నష్టం

‘ముప్పు మన ముంగిట్లోకి వచ్చేసింది. ఇక ఒక్కరోజు కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదు. తక్షణం కార్యాచరణ ప్రారంభించాల్సిందే’ అంటూ వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వాల కమిటీ (ఐపీసీసీ) ఆరో అంచనా నివేదిక హెచ్చరించింది. రాబోయే 20 ఏళ్లలో పారిశ్రామిక యుగానికి ముందు (1850-1900) స్థాయి కంటే సగటు భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుతుందని, ఇది మానవాళికి ‘కోడ్‌ రెడ్‌’ అని ఐపీసీసీ తాజా నివేదిక వెల్లడించింది. సువిశాల దేశం, అపారమైన తీరప్రాంతం, అధిక జనసాంద్రతవంటి కారణాలతో- వాతావరణ మార్పు, భూతాప ప్రభావం భారతదేశంపై గరిష్ఠస్థాయిలో ఉన్నట్లు స్పష్టీకరించింది. సముద్రమట్టాలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా నష్టం వాటిల్లుతోంది. 7,516 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం కలిగిన భారతదేశంలోనే ఎక్కువ భూమి ముంపునకు గురవుతుందని, తరచూ వరదలు, భూమి కోతవంటి విపత్తులు సంభవిస్తాయని చెప్పింది. ఉప్పునీరు చొచ్చుకురావడం వల్ల తీరప్రాంత భూములు గతంలో కంటే చాలా ఎక్కువ స్థాయిలో వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయని నివేదిక హెచ్చరించింది. ఉద్గారాలు ఇదే స్థాయిలో కొనసాగితే ఈ శతాబ్దం మధ్యకాలానికి భారత్‌లో ఏటా వరదల బారిన పడేవారి సంఖ్య 3.5 కోట్లకు చేరుతుందని, ఉద్గారాలు కొద్దిగా పెరిగినా శతాబ్దాంతానికి 4.5 నుంచి అయిదు కోట్ల మంది దాకా ప్రభావితం అవుతారని నివేదిక వెల్లడించింది.

ఆర్థికభారం అపారం

ప్రపంచంలో అన్ని దేశాలూ కలిసి 2021లో విడుదల చేసిన బొగ్గుపులుసు వాయువు 3,640 కోట్ల టన్నులు. ఒక టన్ను బొగ్గుపులుసు వాయువు విడుదలైతే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రూ.6,515 (86 డాలర్ల)మేర నష్టం వాటిల్లుతుంది. ప్రపంచంలోనే అత్యధిక నష్టం ఇండియాకే ఉంటుంది. 2021 సంవత్సరంలో భారతదేశం 288 కోట్ల టన్నుల బొగ్గుపులుసు వాయువును వెలువరించింది. ఆ సంవత్సరం మన ఆర్థికవ్యవస్థపై పడిన భారం అక్షరాలా రూ.18.76 లక్షల కోట్లు! 2030 నాటికి భారత్‌లో 448 కోట్ల టన్నుల బొగ్గుపులుసు వాయువు వెలువడుతుందని, ఆ భారం రూ.29.20 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా. సముద్ర మట్టాలు పెరిగి భూభాగం ముంపునకు గురి కావడం, నదుల్లో సంభవించే వరదలవల్ల ఉత్పన్నమయ్యే ఆర్థికభారం సైతం భారత్‌లోనే అత్యధిక స్థాయిలో ఉన్నాయి. భూతాపాన్ని నిర్దేశించిన స్థాయిలో తగ్గించగలిగితేనే ఈ శతాబ్ది మధ్యనాటికి ఈ విపత్తులవల్ల ప్రత్యక్ష నష్టాలు రూ.1.81 లక్షల కోట్ల మేర ఉంటాయి. భూతాపం పెరుగుతూ పోతే మాత్రం అదే సమయానికి ఈ నష్టం రూ.2.72 లక్షల కోట్లకు చేరుతుందని ఐపీసీసీ నివేదిక చెబుతోంది.

తీవ్రమైన వాతావరణ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా పంటల ఉత్పాదకతను దెబ్బతీస్తాయి. ఇండియాలో 2050 నాటికల్లా బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, ఇతర చిరుధాన్యాల ఉత్పత్తి 9శాతం దాకా పడిపోతుంది. దక్షిణ భారతదేశంలో మొక్కజొన్న ఉత్పత్తి ఏకంగా 17శాతం పడిపోతుంది. పంట ఉత్పత్తులు తగ్గడం వల్ల దేశవ్యాప్తంగా ఆహార ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీంతో ఆహారభద్రత, ఆర్థికవృద్ధి సైతం ప్రమాదంలో పడతాయి. భారతీయ మత్స్యపరిశ్రమపై పెను ప్రభావం పడనుంది. చేపలు సముద్రంలోని మొక్కలు, నాచుమీద ఆధారపడి జీవిస్తాయి. గడిచిన 60 ఏళ్లలో వాతావరణ మార్పులతో పశ్చిమ హిందూమహాసముద్రంలో ఈ సముద్ర మొక్కలజాతులు, నాచు లాంటివి 20శాతం దాకా అంతరించిపోయాయి. మేత లేక ఎన్నో రకాల మత్స్యజాతులు క్రమంగా అంతరించే దశకు చేరుకొంటున్నాయి. ఉష్ణోగ్రతలు ఇదేస్థాయిలో పెరుగుతూ పోతే 2050 నాటికి గంగ, బ్రహ్మపుత్ర నదులకు తరచూ వరదలు వస్తాయి. ఇటు అనావృష్టి, అటు అతివృష్టి భారతీయులను సతమతం చేస్తాయి. సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరినప్పడు ప్రపంచంలోని 3-14శాతం జీవజాతులు మాయమైపోతాయంటూ ఐసీసీసీ ఆందోళన వ్యక్తం చేసింది. భూతాపం పెరగడం వల్ల భారతదేశంలోని పేదల ఆహార భద్రతకు పెనుముప్పు ఎదురుకానుందని అంచనా వేసింది.

విద్యుత్‌ వాహనాలతో ప్రయోజనమెంత?

పెట్రోలు, డీజిల్‌ వాహనాల కంటే విద్యుత్‌ వాహనాల వాడకం వల్ల కాలుష్యం, కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని అందరూ చెబుతున్నారు. కానీ, మన దేశంలో విద్యుదుత్పత్తి ఎక్కువగా థర్మల్‌ కేంద్రాల ద్వారానే జరుగుతోంది. వాహనాలకు వాడే విద్యుత్తును అధికంగా ఉత్పత్తి చేయడం ద్వారా వాతావరణంలోకి విడుదల చేసే బొగ్గుపులుసు వాయువు మరింత ఎక్కువవుతుంది. సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి... అంటే సౌర, పవన ప్లాంట్ల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తు నామమాత్రంగానే ఉంటోంది. ప్రజారవాణాకు ఉపయోగించే అన్నిరకాల వాహనాల పైనా సౌరఫలకాలను ఏర్పాటుచేస్తే ఆ వాహనానికి అవసరమైన విద్యుత్తులో కొంతవరకైనా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. వాతావరణ మార్పు ప్రభావాల నుంచి మానవాళిని రక్షించడానికి త్వరపడాలని ఐపీసీసీ నివేదికలో పేర్కొంది. ప్రజలంతా వేడి ప్రపంచానికి అలవాటు పడాలని సూచించింది. ఇంతకుముందు నివేదికల్లో ప్రస్తావించిన గడువు కంటే మరింత ముందుగానే వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తోందని హెచ్చరించింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేసినా మానవాళి మనుగడ ప్రమాదంలో పడుతుందని స్పష్టం చేసింది. గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు, కర్బన ఉద్గారాలను ప్రభుత్వాలు తమ ప్రయత్నంతో తగ్గించుకోవాలి. అదే సమయంలో వాతావరణం వేడెక్కేందుకు దోహదం చేసే ఏసీలు, ఫ్రిజ్‌ల వాడకాన్ని పౌరుల స్థాయిలోనూ అరికడితేనే భవిష్యత్‌ తరాలకు సురక్షితమైన ధరిత్రిని అందించగలం. లేనిపక్షంలో ఈ తరంలోనే కనీవినీ ఎరుగని విధ్వంసాలను చూడాల్సి వచ్చే పెను ప్రమాదం పొంచి ఉంది.

వణుకు పుట్టిస్తున్న ‘వెట్‌బల్బ్‌’

నీరు ఆవిరి కావడంవల్ల పెరిగే ఉష్ణోగ్రతను వెట్‌బల్బ్‌ ఉష్ణోగ్రత అంటారు. ఇందులో వేడితో పాటు తేమ కూడా కలిసి ఉంటుంది. బాగా ఉష్ణదేశాల్లో ఉండేవాళ్లూ వెట్‌బల్బ్‌ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌కు చేరితే ఆరుబయట పనిచేయలేరు. ఒకవేళ ఇది 35 డిగ్రీల సెల్సియస్‌కు చేరితే మానవాళి మనుగడకే ప్రమాదం. ప్రస్తుతం భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అరుదుగా 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతోంది. చాలాచోట్ల 25-30 డిగ్రీల సెల్సియస్‌ మధ్యలో ఉంది. ఉద్గారాలు ఇదే స్థాయిలో పెరిగితే లఖ్‌నవూ, పట్నా లాంటి నగరాల్లో వెట్‌బల్బ్‌ ఉష్ణోగ్రతలు ఈ శతాబ్దాంతానికల్లా 35 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయి. భువనేశ్వర్‌, చెన్నై, ముంబయి, ఇండోర్‌, అహ్మదాబాద్‌ లాంటి నగరాల్లో 32-34 డిగ్రీల వరకు చేరుకునే ప్రమాదముంది. ఈ శతాబ్దాంతానికి అస్సాం, మేఘాలయ, త్రిపుర, పశ్చిమ్‌ బెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌ లాంటి రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని, దేశంలోని అన్ని ప్రాంతాల్లో 30 డిగ్రీల సెల్సియస్‌కు వెట్‌బల్బ్‌ ఉష్ణోగ్రత చేరుకుంటుందని నివేదిక హెచ్చరించింది.

 

- రఘురామ కామేశ్వరరావు పువ్వాడ

 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 04-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం