• facebook
  • whatsapp
  • telegram

విపత్తులకు పరిష్కారం... సంసిద్ధతే!

ముందుగా మేల్కొనకపోతే ముప్పే

ఏటా ప్రకృతి విపత్తులు పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాల్ని హరిస్తున్నా వాటిని ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాల తీరుమాత్రం మారడం లేదు. విపత్తులకు సంబంధించి సరైన రీతిలో సంసిద్ధత ఉండటంలేదు. ముందస్తు హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థల అభివృద్ధి జరగలేదు. విపత్తు వేళ సమర్థంగా స్పందించి సహాయ చర్యలు, పునరావాసం, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ వంటి అంశాల్లో గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొనే ప్రక్రియపై సరిగ్గా దృష్టిసారించడంలేదు.  పట్టణాలు, నగరాలను భారీ వర్షాలతో ముంచెత్తుతున్న వరదలను ఎదుర్కొనేందుకు, వరద నీటిని దారిమళ్లించేందుకు చేపట్టాల్సిన నిర్మాణాలు నత్తనడకన సాగుతుండటం యంత్రాంగం ఉదాసీనతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇలాంటి వ్యవహార శైలికి తోడు సమస్య ఒకచోట ఉంటే పరిష్కారం ఇంకోచోట చూపుతూ, అవసరం తక్కువుండే చోట అధిక మోతాదుల్లో నిధులు గుమ్మరించే ప్రభుత్వాల తీరు కూడా సమస్యకు సరైన పరిష్కారం దక్కనీయడం లేదు.

తీవ్రస్థాయిలో కుండపోతగా వర్షాలు కురవడం, ఆకస్మిక వరదలు ముంచెత్తడం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు ప్రజల ప్రాణాల్ని బలిగొనడం సర్వసాధారణంగా మారింది. గత మూడేళ్లలో దేశంలో సుమారు 6,800 మంది ఈ తరహా ప్రకృతి విపత్తుల కారణంగా ప్రాణాలు విడిచినట్లు ఇటీవల కేంద్ర హోంశాఖ లోక్‌సభకు వెల్లడించింది. 2018-19లో 2,400, 2019-20లో 2,422 2020-21లో 1,986 మరణాలు నమోదయ్యాయి. అత్యధిక మరణాల్లో పశ్చిమ్‌బంగ అగ్రస్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో మూడేళ్లలో 964 మరణాలు చోటు చేసుకొన్నాయి. ఆ తరవాత మధ్యప్రదేశ్‌లో 833, కేరళలో 708 మరణాలు నమోదయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రాణనష్టం పెరిగింది. పశ్చిమ్‌బంగలో వరసగా మూడేళ్లుగా ప్రకృతి విపత్తుల కారణంగా అధిక మరణాలు చోటుచేసుకున్నాయి. కొండచరియలు విరిగిపడటం, తుపానులు, వరదలు వంటివి శాపంగా పరిణమిస్తున్నాయి. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టతీవ్రత పశ్చిమ్‌బంగలో అధికంగా ఉండగా, నిధుల కేటాయింపులో పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల కింద- మహారాష్ట్రకు రూ.1,288 కోట్లు, ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.773.20 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.728 కోట్లు కేంద్రం కేటాయించింది. పశ్చిమ్‌బంగకు కేటాయించిన నిధులు రూ.404.40 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే, అత్యధికంగా మరణాలు నమోదవుతూ, గత అయిదేళ్లలో నాలుగు తుపాన్లు ఎదుర్కొన్న పశ్చిమ్‌ బంగకు నిధులు మాత్రం తక్కువగా అందినట్లు స్పష్టమవుతోంది.

మరోవైపు, హిమాలయ పర్వత రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తుల్ని ఎదుర్కొనే విషయంలోనూ ప్రభుత్వాల పనితీరు ఆశాజనకంగా లేదు. హిమానీ నదాలు కరగడం, మంచుకొండలు విరిగిపడే పరిస్థితుల్ని గమనించేందుకు నిర్దిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. హిమాలయాల్లో 3500 మీటర్ల ఎత్తుకన్నా పైభాగంలో మానిటరింగ్‌ స్టేషన్లు లేవని నిపుణులు చెబుతున్నారు. భారత హిమాలయాల్లో పది వేల హిమానీ నదాలు ఉండగా, అందులో వెయ్యికిపైగా ఉత్తరాఖండ్‌లోనే ఉన్నాయి. వీటిని ఒక్కోదాన్ని విడిగా పర్యవేక్షించడం సులభం కాదు. అయితే రిమోట్‌ సెన్సింగ్‌ సమాచారం సహాయంతో, భారీ స్థాయిలో నీటి నిల్వచేరి ప్రమాదకరంగా మారిన వాటిని సత్వరమే గుర్తించాలి. కొండచరియలు విరిగిపడే అవకాశం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో- సునామీ హెచ్చరిక వ్యవస్థ స్థాయిలో భారీ వర్షాలను ముందుగానే గుర్తించే ఏర్పాట్లు ఉండాలి. ఎగువ భాగంలోని లోయల్లో నీటి స్థాయులు, పరిమాణాల్ని నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. విపత్తులను ఎదుర్కొనే విషయంలో సంసిద్ధత లేకపోవడం ప్రమాదకర లోపమని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఇకపోతే- తుపాన్లు వంటివి సంభవించినప్పుడు విద్యుత్తు లైన్లు, స్తంభాలు, గృహాలు, ప్రభుత్వ భవనాలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలకు కలిగే నష్టం అపారం. ప్రభుత్వపరంగా సన్నద్ధత సమర్థంగా ఉంటే నష్ట తీవ్రతను కొంతమేర తగ్గించే అవకాశం ఉంది. ఇందుకోసం ముందస్తు హెచ్చరికలు పకడ్బందీగా ఉండాలి. వాతావరణ విభాగం నుంచి గ్రామాలు, ప్రజాబాహుళ్యానికి చేరేలా ముందస్తు హెచ్చరికలు అందించే వ్యవస్థ, యంత్రాంగం మనకు అందుబాటులోకి రాలేదు. ఈ తరహా వ్యవస్థలను అన్ని రాష్ట్రాలూ అందిపుచ్చుకోవాల్సి ఉంది. సమగ్రస్థాయిలో ఆర్థిక, సాంకేతిక సాధన సంపత్తి సమకూరినప్పుడే విపత్తుల్ని సమర్థంగా ఎదుర్కొనడం సాధ్యమవుతుంది.

- డి.శ్రీనివాస్‌
 

Posted Date: 24-08-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం