• facebook
  • whatsapp
  • telegram

  పునశ్శుద్ధే జలమంత్రం

* తరిగిపోతున్న నీటి వనరులు

గంగానది జలం తాగేందుకు పనికిరాదని, ఏడుచోట్ల మాత్రం శుద్ధి చేసిన తరవాత తాగొచ్చని కేంద్ర కాలుష్య నివారణ శాఖ అంచనా. గంగా పరీవాహక ప్రాంతాలైన భాగీరథి, రుద్రప్రయాగ్‌, దేవప్రయాగ్‌, రాయివాలా, రిషికేశ్‌, బిజ్నోర్‌, పశ్చిమ్‌ బంగలోని డైమండ్‌ హార్బర్‌లలో నీటిని శుద్ధి తరవాత తాగేందుకు వాడుకోవచ్చని నిపుణులు తేల్చారు. గంగానది తీర ప్రాంతంలో దాదాపు 1,100 పారిశ్రామిక సంస్థలు వ్యర్థాలను నదిలోకి వదులుతున్నాయి. కేంద్ర పర్యావరణ, జలశక్తి మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రణాళికతో పారిశ్రామిక వ్యర్థాలు గంగానదిలోకి చేరకుండా చర్యలు తీసుకోవడంలో దాదాపు సఫలీకృతమయ్యాయి. కానీ, గంగానదిలోకి వస్తున్న మురుగునీరు, పురుగు మందులు కలిసిన వ్యవసాయ వ్యర్థాలను అరికట్టడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటికితోడు జనవరి 2019 కుంభమేళా తాలూకు వ్యర్థాలను శుభ్రపరచకుండా గంగానదిలో కలపడం వల్ల సమస్య మరింత జటిలమైంది. కేంద్ర ప్రభుత్వం జూన్‌ 2014లో రూ.20 వేల కోట్ల అంచనాలతో నమామి గంగే పేరిట గంగానది పరిశుద్ధత కోసం భారీ పథకాన్ని చేపట్టింది. జూన్‌ 2018 వరకూ ప్రభుత్వం కేవలం రూ.6,211.27 కోట్ల నిధులు మంజూరు చేయగా అందులో రూ.4,322.37 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. దాంతో 2020 నాటికే ముగియాల్సిన ఈ పథకాన్ని 2024 దాకా పొడిగించడం జరిగింది.

గత మూడు దశాబ్దాల కాలంలో గంగానది తీరప్రాంతంలో భూగర్భ జలాలు వేసవిలో సుమారు యాభై శాతం తగ్గినట్లు పరిశోధనలలో తేలింది. వాతావరణ మార్పు వల్ల ఒకవైపు హిమాలయాల నుంచి ఉత్పన్నమయ్యే గంగానదీ జలాలు క్షీణిస్తుండగా, మరోవైపు వర్షపాతం తగ్గుదల, నీటి కాలుష్యం వల్ల సమస్య క్లిష్టతరంగా మారింది. దీనికితోడు భూగర్భ జల వనరుల క్షీణత జత కావడంతో, పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో రెండు దశాబ్దాల నాటికి ప్రస్తుతం 1,569 మైళ్ల పొడవునా ప్రవహించే గంగానది ఉనికికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించి గంగానది ప్రవహించే 11 రాష్ట్రాల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గంగా పరిరక్షణకు సమష్టిగా ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మన దేశంలో దాదాపు 60 కోట్ల మంది తీవ్రమైన నీటి ఎద్దడికి గురవుతారని 2018లో నీతిఆయోగ్‌ నివేదిక హెచ్చరించింది. దేశంలోని 21 నగరాల్లో 2020 నాటికి భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటే ప్రమాదం ఉందని పేర్కొంది. మనదేశ జనాభా ప్రపంచంలో 17 శాతం. నీటి వనరులు మాత్రం కేవలం నాలుగు శాతం. దేశంలో సగటున వ్యక్తికి వార్షిక నీటి అందుబాటు 1951లో 5,200 క్యూబిక్‌ మీటర్లు ఉండగా, 2050 నాటికి 1,100 క్యూబిక్‌ మీటర్ల కనిష్ఠ స్థాయికి చేరే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం సగటున వార్షిక నీటి లభ్యత కనీసం 1,000 క్యూబిక్‌ మీటర్లు అవసరమవుతుంది. అంటే 2050 నాటికి మనదేశం నీటి ఎద్దడికి గురయ్యే దేశాల జాబితాలో చేరే ప్రమాదం ఉంది. భారత్‌లో 15 శాతం ఆహార ఉత్పత్తికి, 85 శాతం తాగునీటి అవసరాలకు భూగర్భ జలాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. నగరాల్లో భూములను పూర్తిగా భవనాలమయం చేయడం, నీటి వనరులను దుర్వినియోగపరచడం వల్ల భూగర్భ జలాలు పాతాళానికి చేరుకున్నాయి. సేంద్రియ వ్యవసాయాన్ని విడిచి రసాయనాలు, కృత్రిమ ఎరువుల్ని విచ్చలవిడిగా వాడటంతో భూసారం క్షీణించింది. సాగునీటి అవసరం పెరగడంతో భూగర్భ జలాలపై ఒత్తిడి అధికమై, అవి తగ్గుముఖం పట్టాయి. వీటికితోడు నదుల్లో నీటి కాలుష్యం వల్ల సమస్య మరింత జటిలమైంది. నగరాల్లో పారిశ్రామిక వ్యర్థాలు శుద్ధి పరచకుండా విడిచిపెట్టడం వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. చెన్నై, బెంగళూరు, దిల్లీ నగరాల్లో సమస్య తీవ్రరూపం దాల్చింది.

భారత్‌లో ఉపయోగించిన నీటిని శుద్ధిపరచి పునర్వినియోగించడం చాలా తక్కువే. చాలావరకు వాడిన నీటిని నేరుగా చెరువులు, నదుల్లోకి వదిలేస్తున్నారు. రాజధాని దిల్లీ నగరంలో గృహాల్లో వాడిన నీటిలో 90 శాతం యమునా నదిలో కలపడం వల్ల అది ప్రపంచంలోని కలుషితమైన నదుల జాబితాలో ఒకటిగా చేరింది. గృహాలు, పరిశ్రమల్లో వాడిన నీటిని శుద్ధిపరచి మళ్లీ వాడుకునే అవకాశం మెండుగా ఉన్నా ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నగరంలో 525 మిలియన్‌ లీటర్ల నీటి వాడకం ఉండగా అందులో 480 మిలియన్‌ లీటర్ల వాడిన నీటిని శుద్ధిపరిచి థర్మల్‌ విద్యుదుత్పత్తి పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. ముంబయి మహానగరంలో రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన నీటిని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శాస్త్రీయ విధానంతో అతి తక్కువ ఖర్చుతో శుద్ధిపరచి పునర్వినియోగించే దిశగా ఇటీవల చర్యలు చేపట్టారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రభుత్వాలు, పరిశ్రమలు ప్రముఖ వాణిజ్య వర్తక సమూహాలు పౌరసంఘాలు సమష్టిగా కృషి చేసి, వాడిన నీటిని శుద్ధిపరచే కేంద్రాలను నెలకొల్పి, శుద్ధి పరిచిన నీటిని మళ్లీ వాడుకున్నట్లయితే నగరాల్లో భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ వల్ల భూగర్భ జలాల కాలుష్యం కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ చర్యలకు తోడు వర్షపు నీటిని సంరక్షిస్తే భూగర్భ జలాల నిల్వలు పెరిగే అవకాశం ఉంది. నీటి పునర్వినియోగంపై ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాళికల్ని తీసుకొస్తే దేశంలో జలసిరి కళకళలాడుతుంది. మన ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ విషయంలో శాశ్వత ప్రాతిపదికన తగిన చర్యలు చేపడతాయని ఆశిద్దాం!

- బీఎన్వీ పార్థసారథి

Posted Date: 28-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం