• facebook
  • whatsapp
  • telegram

సముద్ర జీవులకు శబ్దకాలుష్యం ముప్పు

సాగర జలాల్లో కనీసం 2.4లక్షల రకాల జీవజాతులు మనుగడ సాగిస్తున్నాయి. వీటిలో తిమింగిలాలు, షార్క్‌లు, డాల్ఫిన్లు, తాబేళ్లు, చేపలతో పాటు మొక్కలు తదితరాలెన్నో ఉంటాయి. ఆహారం, రక్షణ, సంతానోత్పత్తి కోసం సముద్రజీవులు పలు రకాల శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. జల రవాణా, చమురు నిక్షేపాల వెలికితీత వంటి కార్యకలాపాల వల్ల ఏర్పడుతున్న జలాంతర శబ్ద కాలుష్యం- సముద్రజీవుల ఉనికికి సవాలు విసురుతోంది.

సముద్రజీవులు శబ్దాలను ఉత్పత్తి చేయడం ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకొంటాయి. ఒకచోటు నుంచి మరోచోటుకు ప్రయాణించడానికి, ఆహారాన్ని గుర్తించడానికి, ఇతర జంతువుల నుంచి రక్షణ పొందడానికి, తోటి జీవులతో జట్టు కట్టడానికి ఈ శబ్దాలు తోడ్పడతాయి. చేపల వేట, వాణిజ్యం, సైనిక కార్యకలాపాల నిమిత్తం నౌకలను, యంత్రాలను వినియోగించడం ఎక్కువవుతోంది. చమురు నిక్షేపాల కోసం ధ్వని ఆధార సర్వేలు చేపట్టడం, చమురు తవ్వకాలు, డ్రెడ్జింగ్‌ పనులు వంటివీ జలావరణ వ్యవస్థలో తీవ్ర శబ్దకాలుష్యానికి కారణమవుతున్నాయి. ఈ కాలుష్యం సముద్రజీవుల శబ్ద సంకేతాలను ఆటంకపరచి వాటి జీవనాన్ని ప్రభావితం చేస్తోంది.

గాలిలోకన్నా నీటిలో శబ్దం మరింత వేగంగా, దూరంగా ప్రయాణిస్తుంది. జలాంతర శబ్దకాలుష్యం జీవుల మధ్య సమాచారానికి విఘాతం కలిగించడమే కాకుండా వాటి సామూహిక ప్రవర్తన, ఆహార అన్వేషణ, వేట, సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తున్నాయి. పర్యవసానంగా వాటి సంఖ్య అంతకంతకు తరిగిపోతోంది. సముద్రజీవులు వినికిడి కోల్పోవడానికి, వాటిలో ఒత్తిడి పెరగడానికి, తల్లి జీవులు పిల్లలను కనుగొనలేకపోవడానికి ఈ కాలుష్యమే ప్రధాన కారణం. 2021 నాటి ఆర్కిటిక్‌ కౌన్సిల్‌ నివేదిక- ఆర్కిటిక్‌ మహాసముద్రంలో జలాంతర శబ్దస్థాయులు ఆరేళ్లలోనే రెట్టింపు అయినట్లు వెల్లడించింది. ఇతర మహాసముద్రాల్లో ఇంతటి శబ్దకాలుష్యం తలెత్తడానికి 30-40 ఏళ్ల సమయం పట్టింది. ఆర్కిటిక్‌ మహాసముద్రంలో లోతు అంతగాలేని ప్రాంతాలు, శీతల జలాలు ఎక్కువ. ఇవన్నీ శబ్దకాలుష్యాన్ని తీవ్రతరం చేస్తాయి. శబ్దకాలుష్యం వల్ల పెద్ద చేపలు వలసపోవడంతో వాణిజ్యపరంగా పట్టే మత్స్యాల పరిమాణం 80శాతం వరకు తరిగిపోయినట్లు 2018 నాటి అధ్యయనం తేల్చింది. తీవ్రస్థాయి ధ్వని తరంగాల వల్ల రక్తనాళాలు, మెదడు, ఊపిరితిత్తులు వంటి కీలక అవయవాలు దెబ్బతిని తిమింగిలాలు, ఇతర జీవులు చలనం కోల్పోతున్నట్లు 2016, 2020 నాటి పరిశోధనలు ధ్రువీకరించాయి. సైప్రస్‌ తీరంలో గతనెల కొన్ని తిమింగిలాలు చలనం కోల్పోయాయి. అక్కడ చేపట్టిన నావికా విన్యాసాలు, తుపాకీ కాల్పుల కారణంగా వెలువడిన అతిధ్వనులవల్లే అవి చనిపోయినట్లు అంతర్జాతీయ సముద్రవనరుల సంరక్షణ సంస్థ ‘ఓషియన్‌ కేర్‌’ నిర్ధారించింది! ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల విశాఖ, గోవా తీరాల్లో అధ్యయనం చేపట్టగా- నౌకల నుంచి విడుదలయ్యే శబ్దాల వల్ల భారత సముద్రజలాల్లో ఉండే బాటిల్‌నోస్‌ డాల్ఫిన్లు, పైలట్‌, స్పర్మ్‌ తిమింగిలాలు, సీల్‌ల మనుగడకు ముప్పు పొంచి ఉన్నట్లు తేలింది. పశ్చిమతీరంలో కంటే తూర్పుతీరంలోనే శబ్దకాలుష్యం అధికంగా ఉంటున్నట్లు వారు గుర్తించారు. ‘అంతర్జాతీయ జంతు సంక్షేమనిధి’ నిరుడు విడుదల చేసిన నివేదిక- జలాంతర శబ్దకాలుష్యాన్ని తగ్గించేందుకు పలు సూచనలు చేసింది. నౌకల వేగం, పరిమాణంతో పాటు వాటి రూపకల్పనలో మార్పులను ప్రతిపాదించింది. దీనివల్ల సముద్ర జీవులకు హాని తగ్గడమే కాకుండా, చమురు వినియోగం, వాయు కాలుష్యం సైతం తగ్గుతాయని నివేదిక పేర్కొంది.

ముఖ్యమైన సముద్రజీవుల ఆవాస ప్రాంతాల్లో ఉన్న నౌకా మార్గాలను మార్చుకోవాలి. రసాయన ట్యాంకర్లను రవాణాచేసే ఒక సంస్థ తమ ఓడల వేగాన్ని తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల్లో వాటిని నడిపేందుకు ముందుకొచ్చింది. ఇతర నౌకాయాన సంస్థలు, ప్రభుత్వాలు సైతం ఇటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది. సముద్ర జీవుల వలస, సంతానోత్పత్తి వంటి సమయాల్లో నౌకల వేగాన్ని తగ్గించాలి. జీవవైవిధ్యానికి కీలకమైన సముద్ర ప్రాంతాలను గుర్తించి, వాటిని ‘నిశ్శబ్ద ప్రాంతాలు’గా మార్చాలి. సముద్ర గర్భాల్లోని చమురుపై ఆధారపడటం తగ్గించుకుని, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాలి. సముద్ర సర్వేల్లో అతి ధ్వనుల కోసం సోనార్లు, ఎయిర్‌ గన్‌లను వినియోగించడం తగ్గించి, తీవ్రత తక్కువగా ఉండే సాంకేతికతలను వినియోగించాలి. బహుముఖ చర్యలతో జలాంతర శబ్దకాలుష్యాన్ని తగ్గిస్తేనే- ఐరాస సుస్థిరాభివృద్ధి గమ్యాల్లో ఒకటైన జలాంతర జీవుల పరిరక్షణ సాధ్యమవుతుంది.

- ఎం.రామ్‌మోహన్‌ 

(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భూమి ఎందుకు కుంగిపోతుంది?

‣ భూ ఫలకాల మహా ఉత్పాతం

‣ ఒక అభ్యర్థి.. ఒక్కచోటే పోటీ!

‣ భయపెడుతున్న ఎల్‌ నినో

Posted Date: 18-03-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం