‣ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్
ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో జావాదే హవా అన్నది నిన్నటిమాట. ఇప్పుడు పైతాన్‌కు మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఐటీలో దీటైన కెరియర్‌ను నిర్మించుకోవాలి అనుకునేవారికి పైతాన్ నేర్చుకోవడం ఒక అదనపు అర్హతగా మారింది. మరి దీని పూర్తి వివరాలేంటో మనమూ చూసేద్దాం.
పైతాన్‌ను 1991లో గైడోవాన్ రోసమ్ అభివృద్ధి చేశారు. సీ, జావాలతో పోలిస్తే దీనిలో ప్రోగ్రామ్స్ చిన్నవిగా ఉంటాయి. సింటాక్స్ కూడా సులువుగా అర్థమయ్యేలా ఉంటుంది. ఒక లైన్‌ను చూస్తే ఆంగ్లం చదివినట్లే చాలావరకూ అర్థం కావడం దీని ప్రత్యేకత. అయితే రన్ అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఇంతకాలం తక్కువగా వినియోగంలో ఉంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటాసైన్స్... వంటి రంగాలకు డిమాండ్ పెరగటంతో ఇందులో వినియోగించే పైతాన్ లాంగ్వేజ్‌కు కూడా ఆదరణ పెరిగింది.
‣ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్స్‌లో పైతాన్ ఉంది. ఇది శక్తిమంతమైనదే కాక, ఉపయోగించేందుకు తేలికైనది కూడా. భద్రత కలిగి ఉండటం దీంతో లభించే మరో ప్రయోజనం. ఇదో క్రాస్ ఫ్లాట్‌ఫాం, ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్. అంటే ఒక ప్లాట్‌ఫాంలో అభివృద్ధి చేసిన కోడ్‌ను మరో ప్లాట్‌ఫాంలో సులభంగా ఉపయోగించవచ్చు. విండోస్, మాక్, లైనక్స్... ఇలా ఎందులోనైనా కోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీనిలో డైనమిక్ కోడింగ్ ప్రాధాన్యం ఉంటుంది.
‣ ముఖ్యంగా డేటా సైన్స్‌లో పైతాన్ వాడకం ఎక్కువగా ఉంది. డేటా సైన్స్‌లో ఉపయోగించేందుకు వీలుగా ఉండే స్పెషల్ లైబ్రరీలు ఇందులో అధికంగా ఉండటమే దీనికి కారణం. నంపై, పాండాస్, స్కైపై, సెలీనియం, ఓపెన్ సీవీ, లిబ్రోసా, మాడ్‌మామ్, టెన్సర్‌ఫ్లో, సీబోర్న్, పిల్లో వంటి లైబ్రరీలతో కోడర్స్ పని మరింత సులభమవుతుంది.
ఎలా నేర్చుకోవాలి?
పైతాన్‌ను నేర్చుకునేందుకు ముందుగా ప్రాథమిక అంశాలైన వేరిబుల్స్, డేటాటైప్స్, ఆపరేటర్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆరేస్, ఫ్లో కంట్రోల్, మెథడ్స్, ఫైల్‌్ హ్యాండ్లింగ్, ఊప్స్, రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ మీద అవగాహన పెంచుకోవాలి. అనంతరం వీలైనంత సాధన చేయడం ద్వారా దీనిపై పూర్తిస్థాయిలో పట్టు సాధించవచ్చు.
‣ పైతాన్‌ను ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో నేర్చుకునే అవకాశం ఉంది. కోర్సెరా, యుడెమీ వంటి ఆన్‌లైన్ సంస్థల్లో ఉచితంగా దీన్ని నేర్చుకోవచ్చు. తాజాగా గూగుల్ సంస్థ ‘ఐటీ ఆటోమెటేషన్ పైతాన్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్’ కోర్సును కూడా ప్రవేశపెట్టింది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకే వెళ్లి చదవాల్సిన అవసరం లేదు. ఎక్కడినుంచైనా దీనిపై పట్టు సాధించే అవకాశం ఉంది.
ఉపయోగాలేంటి...
‣ డెస్క్‌టాప్ అప్లికేషన్లు, మొబైల్ అప్లికేషన్లు, వీడియో గేమ్స్, వెబ్ యాప్స్, క్లౌడ్ - బేస్డ్ యాప్స్, వెబ్ ఫ్రేమ్ వర్క్స్, జీయూఐ (గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్) బేస్డ్ సాఫ్ట్‌వేర్లు, వీఆర్ అండ్ ఏఆర్... ఇలా దేనికైనా పైతాన్‌ను ఉపయోగించే వీలుంది. గూగుల్ తన వినియోగదారులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు పైతాన్‌ను వినియోగిస్తోంది. క్లౌడ్ ప్లాట్‌ఫాం డ్రాప్‌బాక్స్‌లో సర్వర్, క్లైంట్ అప్లికేషన్లను దీని సాయంతోనే తయారుచేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో మెషిన్ లెర్నింగ్ ద్వారా వీక్షకుల ఆసక్తిని గమనించి, వారిని క్లస్టర్లుగా విభిజించి షోలను రికమెండ్ చేసేందుకూ పైతాన్‌నే ఉపయోగిస్తున్నారు. అలాగే యూట్యూబ్, మొజిల్లా, మైక్రోసాఫ్ట్, సిస్కో, క్వారా, ఫేస్‌బుక్ వంటి ప్రముఖ సంస్థలు ఈ లాంగ్వేజ్‌ను ఉపయోగిస్తున్నాయి. నాసా శాస్త్రవేత్తలు గణాంకాలు చేసేందుకు సైతం దీన్ని వాడుతున్నారు.
ఉద్యోగావకాశాలు...
పైతాన్ డెవలపర్స్‌కు ఇప్పుడు అధికంగా డిమాండ్ ఉండటం వల్ల వీరికి పూర్తి ఉద్యోగ భద్రత ఉంది. ఐటీలో అత్యధిక వేతనాలు అందుకుంటున్నవారిలో వీరు కూడా ఉన్నారు. వెబ్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్రేమ్ వర్క్స్, వెబ్ టెస్టింగ్, గేమ్ డెవలప్‌మెంట్, బిగ్ డేటా, స్మార్ట్ డివైజెస్ - ఐవోటీలో పైతాన్ నిపుణులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరింత మంది ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం ద్వారా తమ కెరియర్‌కు అదనపు వేగాన్ని జోడించవచ్చు.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఇంటర్న్‌షిప్ చేసేముందు ఇవి చూసుకోండి!
‣ ఆన్‌లైన్‌లో లైఫ్ స్కిల్స్ ఒలింపియాడ్
‣ మొబైల్ యాప్ డెవలపర్లకు డిమాండ్!