‣ రాబోయే పరీక్షలో మార్పులు ఏమిటి?
ప్రవేశపరీక్షల సిలబస్‌లో మార్పులు జరగటం అసాధారణమేమీ కాదు. జేఈఈ-అడ్వాన్స్‌డ్-2023కు సంబంధించిన నూతన సిలబస్‌ను ఏడాది ముందుగానే ప్రకటించారు! ఒక్కో సబ్జెక్టులో ఏ చాపర్టర్లు చేర్చారు, వేటిని తొలగించారనేది గ్రహించటం ముఖ్యం. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్న ఎంపీసీ విద్యార్థులు రాయబోయే పరీక్షలో ఈ మార్పులన్నీ ఉంటాయి!
జాతీయ స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష - జేఈఈ అడ్వాన్స్‌డ్-2021లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులందరికీ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. మొత్తం 23 ఐఐటీల్లో 16,232 పైగా ఉన్న ఇంజినీరింగ్ సీట్లతోపాటు సంబంధిత కోర్సుల్లో ప్రవేశానికి జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష జేఈఈ-అడ్వాన్స్‌డ్-2021ను ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
జేఈఈ-అడ్వాన్స్‌డ్-2022ను ఈసారి ఐఐటీ-బాంబే నిర్వహిస్తుందని అనుకుంటున్నారు. ఈ విషయం మీద పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ ఐఐటీ బాంబే గనుక దీనికి ప్రాతినిథ్యం వహిస్తే జేఈఈ-అడ్వాన్స్-2022 రాయబోయే విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గతంలో 2007, 2010, 2015లలో కూడా ఐఐటీ బాంబేనే ఈ పరీక్షను నిర్వహించిందని. జేఈఈ-అడ్వాన్స్‌డ్-2022 రాయబోయే విద్యార్థులు ఒకసారి ఆయా సంవత్సరాల ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నల శైలిని అర్థంచేసుకుంటే ఎలాంటి సన్నద్ధత అవసరమో కొంత అవగాహన వస్తుంది.
ముఖ్యమైన విషయం ఏమిటంటే.. జేఈఈ-అడ్వాన్స్‌డ్-2022 సిలబస్... దానిలో మార్పులు. జేఈఈ-అడ్వాన్స్‌డ్-2022 సిలబస్‌లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులూ లేవు. 2021 జేఈఈ-అడ్వాన్స్‌డ్ సిలబస్సే 2022కి కూడాను.
అయితే 2021 నవంబర్ 24న జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఐఐటీ-ఖరగ్‌పూర్ వారి జేఈఈ-అడ్వాన్స్‌డ్-2021 వెబ్‌సైట్లో జేఈఈ-అడ్వాన్స్‌డ్-2023కు సంబంధించిన నూతన సిలబస్‌ను ఒక సంవత్సరం ముందుగానే ప్రకటించారు.
దీంతో చాలామంది విద్యార్థులకు చాలా సందేహాలు వస్తున్నాయి. సిలబస్ ఎంత పెంచారు? పెంచారా? తగ్గించారా? పెంచితే ఏంటి లాభం? దానిని ఎలా పూర్తి చేసుకోవాలి? తగ్గిస్తే ఎంత తగ్గించారు?
జేఈఈ-మెయిన్, జేఈఈ-అడ్వాన్స్‌డ్ సిలబస్‌లకు ఉన్న వ్యత్యాసం ఏమిటి? జేఈఈ-మెయిన్ సిలబస్‌లోని అంశాలను జేఈఈ-అడ్వాన్స్‌లోకి కూడా ఇచ్చారా? ఇలాంటి ప్రశ్నలు వేధిస్తున్న సమయంలో జేఈఈ-అడ్వాన్స్‌డ్-2021 సిలబస్‌నే జేఈఈ-అడ్వాన్స్‌డ్-2022కు కూడా అన్వయిస్తూ దానినే ప్రామాణికంగా తీసుకుంటూ కొత్తగా జేఈఈ-అడ్వాన్స్‌డ్-2023 సిలబస్‌లో చేర్చిన లేదా తొలగించిన అంశాలను విద్యార్థుల సందేహ నివృత్తి కోసం వివరంగా ఇస్తున్నాం.
పాత, కొత్త సిలబస్‌ల మధ్య వ్యత్యాసం
1. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో కొత్తగా చేర్చిన జేఈఈ-అడ్వాన్స్‌డ్-2023 సిలబస్‌లో సింహభాగం జేఈఈ-మెయిన్ సిలబస్‌లోదే.
2. మ్యాథ్స్‌లో పూర్తి స్థాయిలో కొత్తగా చేర్చినవి:
ఎ) సెట్స్, రిలేషన్స్
బి) స్టాటిస్టిక్స్
సి) త్రీ డైమెన్షన్ జామెట్రీలో లైన్స్ అండ్ ప్లేన్స్‌పై కొద్దిగా ఎక్కువగా
3. మ్యాథ్స్‌లో పూర్తిగా తొలగించిన అంశాలు
‣ ప్రపోర్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ (యాజ్ సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్)
4. ఫిజిక్స్‌లో తొలగించిన అంశాలు
‣ యంగ్స్ మాడ్యూల్స్ బై సియర్ల్‌స్ మెథడ్.
5. ఫిజిక్స్‌లో మిగిలిన అంశాలలో స్పష్టత ఇచ్చారు.
6. ఫిజిక్స్‌లో జతచేసిన అంశాలలో ఎక్కువ భాగం జేఈఈ-మెయిన్‌కి సంబంధించిన అంశాలే. అయితే ప్రతి చాప్టర్‌లో ఏయే అంశాలు ఉంటాయో ఇదివరకటి కంటే స్పష్టత ఇచ్చారు.
7. కెమిస్ట్రీలో కూడా ప్రతి అధ్యాయంలో జతచేసిన అంశంపై స్పష్టత ఇచ్చారు.
8. కెమిస్ట్రీలో పూర్తిగా తొలగించినవి
ఎ) న్యూక్లియర్ కెమిస్ట్రీ
బి) ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో- ‘కెమికల్ మెథడ్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఆఫ్ మోనో-ఫంక్షనల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫ్రమ్ బైనరీ మిక్చర్స్.’
9. కొత్తగా జతచేసిన సిలబస్ నుంచి 90 శాతం ఇదివరకువాటిని అంత స్పష్టంగా సిలబస్‌లో ఇవ్వకపోయినా జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో ప్రశ్నలు ఇచ్చారు.
చివరగా గుర్తుంచుకోవాల్సినవి
‣ ఇచ్చిన కొత్త టాపిక్స్ నుంచి నేరుగా ఇచ్చే ప్రశ్నలకు అవకాశం తక్కువ.
‣ కొత్తగా జతచేసిన సిలబస్‌లో మిక్స్‌డ్ టైప్ ప్రశ్నలు రావడానికి అవకాశం అధికం.
‣ ముఖ్యంగా కెమిస్ట్రీలో ఇచ్చిన ప్రతి కొత్త అంశం నుంచీ ప్రశ్నలను జేఈఈ మెయిన్స్ తరహాలో ప్రాక్టీస్ చేయడం ఎంతో మంచిది.
‣ సిలబస్‌లో కొత్త అంశాలు చేర్చారనడం కంటే.. స్పష్టత ఎక్కువ ఇచ్చారని చెప్పొచ్చు.
జేఈఈకి ప్రిపేర్ అవుతున్నవారందరూ జీఈఈ-అడ్వాన్స్‌డ్ స్థాయిలో ప్రిపేర్ అయితే జేఈఈ-అడ్వాన్స్‌డ్‌తోపాటు జేఈఈ-మెయిన్స్‌లో కూడా మంచి ఫలితాలను సాధించవచ్చు.
*************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఇలా మొదలు పెట్టండి ఇంజినీరింగ్!
‣ అందరికంటే భిన్నంగా.. మరింత మెరుగ్గా!