• facebook
  • whatsapp
  • telegram

అందరికంటే భిన్నంగా.. మరింత మెరుగ్గా!

ప్రభావపూరితంగా భావ ప్రకటన ఉండాలి

‘క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌’లో అన్ని దశలనూ విజయవంతంగా అధిగమిస్తూపోతేనే తుది ఎంపిక జాబితాలో చోటు లభించేది! ప్రతి దశలోనూ వడపోతల్లో నెగ్గాల్సి ఉంటుంది. అంటే నైపుణ్యాలను విజయవంతంగా ప్రజెంట్‌ చేసుకోవాలి. సామర్ధ్యాలను ఎలా చాటిచెప్పాలో, అందుకు ఎలాంటి భావనలు అవసరమో తెలుసుకుందాం!  

జ్వలించే తపన ఉంటే బలమైన లక్ష్యం సాధించగలం. తపన లేని లక్ష్యం ఒక కోరికగా మాత్రమే మిగిలిపోతుంది. ఏయే దశల్లో మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్‌ చేసుకోవాలన్న అంశాలపై స్పష్టత ఉండాలి. ఉదా: ఒక సినిమా వాల్‌పోస్టర్‌ ప్రేక్షకుడిని సినిమా హాలు వరకు తీసుకువెళ్లగలదు. ఆ సినిమా జయాపజయాలు ప్రధానంగా అందులోని నటీనటుల ప్రతిభపై ఆధారపడి ఉంటాయి. సరిగ్గా అలాంటిదే రెజ్యూమె. అది మిమ్మల్ని ఇంటర్వ్యూ హాలు వరకూ తీసుకువెళ్తుంది. అక్కడ మీ జయాపజయాలు మీ ప్రతిభా ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయి. రెజ్యూమె మీ నైపుణ్యాలకూ, సామర్థ్యానికీ ప్రతినిధి కాబట్టి ఆకర్షణీయంగా చదివించగలిగే ప్రత్యేకత అందులో ఉండాలి.  

రెజ్యూమె ఆకర్షణీయంగా, గొప్పగా ఉండాలని పెద్ద పెద్ద పదాలు, అసాధారణ లక్షణాలను అందులో దట్టించేస్తుంటారు. తీరా ఇంటర్వ్యూ హాలుకు వెళ్ళాక అభ్యర్థి రెజ్యూమెకు పూర్తి భిన్నంగా ప్రజెంట్‌ అవుతారు. ఇలాంటి అభ్యర్థులు తొలి అయిదు నిమిషాల్లోనే హాలు నుంచి బయటకు వచ్చేస్తారు. అందుకే రెజ్యూమెలో మీ వాస్తవ లక్షణాలతో, మిమ్మల్ని స్పష్టంగా చూపిస్తూ స్టేట్‌మెంట్‌ తయారుచేసుకోండి. దానిలోని ప్రతి పదానికీ మీరు ఒక ప్రతినిధిగా కనిపించేలా ఉండాలి.  

ఇంగ్లిష్‌లో మాట్లాడడమే కమ్యూనికేషన్‌గా భావించి చాలామంది అందుకు శిక్షణ తీసుకుంటారు. ఇందులో కొంత నిజమున్నప్పటికీ అందరికంటే భిన్నంగా, మరింత మెరుగ్గా మిమ్మల్ని మీరు ప్రజెంట్‌ చేసుకునే మార్గం అన్వేషించండి. కమ్యూనికేషన్‌ సామర్థ్యాలను అంచనా వేసేటప్పుడు భాషతో పాటు, విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలను గమనిస్తారు. భావ ప్రకటనకు భాష ఒక మాధ్యమం మాత్రమే. అలాగే మీరు చెప్పాలనుకున్న  విషయం సులభంగా ఎదుటివారికి అర్థమయ్యేలా తెలియజేయండి. 

ఉదా: ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, అకౌంటింగ్‌- ఇలా స్పెషలైజేషన్‌ ఏదైనా ఆ కోర్‌ సబ్జెక్టును ఎదుటివారికి సరళంగా, సూటిగా, సక్రమంగా, అర్థమయ్యేలా తెలియజేయడమే మెరుగైన కమ్యూనికేషన్‌. అలాంటి సామర్థ్యమున్న అభ్యర్థులనే ఎంపిక చేసుకుంటారు రిక్రూటర్లు. మీ తదుపరి మజిలీ కార్పొరేట్‌ ఉద్యోగం అయితే- అక్కడ బాధ్యతల నిర్వహణలో పరస్పరం సహోద్యోగులతో, పై అధికారులతో సుహృద్భావ సంబంధాలు, వృత్తి నిర్వహణలో అవసరమైన సమాచార పంపిణీకి ఈ భావ ప్రసరణ సామర్థ్యం సహకరిస్తుంది. భావప్రకటన సంభాషణలు, రాతపూర్వకం లేదా ఏ రూపంలోనైనా ఉండొచ్చు.   

చురుగ్గా, త్వరితంగా 

చేరబోయే ఉద్యోగికి ఏ విషయాన్నయినా చురుగ్గా, త్వరితంగా నేర్చుకునే సామర్థ్యం ఉండాలని కంపెనీలు ఆశిస్తాయి. వృత్తి వ్యవహారాల నిర్వహణలో ఇతరులకన్నా ఈ క్విక్‌ లర్నర్స్‌లో ఉత్పాదక సామర్థ్యం అధికం. సంస్థలో చేరాక కొత్త సవాళ్ళతో కూడుకున్న పనులను అప్పగించాక ఆ నూతన అంశాలపై వీరికి శిక్షణ తీసుకోడానికి ఎక్కువ కాలం పట్టదు.  

సమస్య- పరిష్కారం  

కార్యనిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సృజనాత్మకతతో పరిష్కరించే సామర్థ్యాన్ని పరిగణిస్తారు. సమస్యలను మొలకలోనే పరిష్కరించగలగాలి. ఇతరుల కోసం ఎదురుచూడకుండా.. సమస్య జటిలం కాకముందే పరిష్కరించగల సామర్థ్యం ఉన్న ఉద్యోగులను సంస్థ కోరుకుంటుంది. అభ్యర్థి నిజాయితీ, కష్టించి పనిచేసే తత్వం చాలా ముఖ్యం. వృత్తికి విధేయుడై అంకితభావంతో పనిచేసే లక్షణం ఉండాలి. 

వ్యక్తిగత విశ్వసనీయత  

పనిపై సమగ్ర అవగాహన, వృత్తిగత విలువలున్న వ్యక్తులను ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలు కూడా పురోగమన దిశలో ఉండాలి. ఇలాంటి వ్యక్తులపై సంస్థలు ఎక్కువ నమ్మకం ఉంచుతాయి. అందుకనే, ప్రాంగణ ఎంపికకు హాజరయ్యేవారు ఈ లక్షణాలను వృద్ధి చేసుకోవాలి. ఇతర శాఖలోని ఏ స్థాయి వ్యక్తులతోనయినా స్నేహపూర్వకంగా ఉంటూ తగిన విధంగా రాజీ లేకుండా వ్యవహరించాలి.  

భిన్న నైపుణ్యాలు  

ఒకే వ్యక్తి వివిధ నైపుణ్యాలతో వివిధ పనులు చేయగలిగిన స్థాయి ఉండాలి. వ్యక్తి ఏదో ఒక పనికి కట్టుబడకుండా అనేక సామర్థ్యాలు పెంచుకోవాలి. సమయపాలనతో వృత్తి నైపుణ్యాలు పెంచుకుంటూ కొద్ది సమయంలోనే ఉత్పాదక సామర్థ్యం మెరుగుపరచుకోగలగాలి. ఇలాంటి నైపుణ్యాలున్న వ్యక్తులనే సంస్థలు తమ ఉద్యోగులుగా తీసుకుంటాయి.

యాజమాన్య భావన 

కొంతమంది తమ పని మాత్రమే చేసుకుంటూ, ఇతర శాఖలతో సమన్వయాన్ని పట్టించుకోరు. సంస్థ వ్యాపార స్వరూప స్వభావాలను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా తన వృత్తి నిర్వహించాలి. ఇక్కడ సంస్థదో లక్ష్యం, ఉద్యోగిది మరో లక్ష్యం కాకూడదు. ఉద్యోగి తన ఉద్యోగ పరిధిలో తానొక యజమానిగా భావించాలి. కార్పొరేట్‌ సంస్థల్లో, బహుళజాతి సంస్థల్లో యజమానుల సమక్షం ఉండదు. వృత్తి నిపుణులే సంస్థను నడిపిస్తారు. అందుకే, ప్రతి ఉద్యోగీ తానే యజమాని అన్న ‘యాజమాన్య భావన’తో ఉండాలి. సంస్థలో ఏ సమస్య ఎదురయినా అది తన సమస్యగానే భావించాలి. రిస్క్‌ తీసుకోగలిగిన మనోవైఖరి ఉన్నవారికీ, తన కంఫర్ట్‌ జోన్‌ దాటి సృజనాత్మకతతో సమస్యలు పరిష్కరించగలిగినవారికే అవకాశాలు అధికం.


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ CSIR UGC NET: సైన్స్‌లో పరిశోధనకు అధికారిక అర్హత!

‣ సవాళ్లను అధిగమించే సత్తాకు పరీక్ష

‣ తీరదళంలో కమాండెంట్‌ కొలువులు

‣ మందిలో మన ముద్ర వేసేద్దాం!

Posted Date: 13-12-2021


 

ప్రజెంటేషన్‌

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం