• facebook
  • whatsapp
  • telegram

మందిలో మన ముద్ర వేసేద్దాం!

 గ్రూప్‌ డిస్కషన్స్‌లో మెలకువలు పాటిస్తే విజయం

రాతపరీక్షలను సులువుగా, మెరుగ్గా రాసే విద్యార్థుల్లో కూడా కొందరు బృందచర్చ అనగానే కొంత సమస్యాత్మకమని భావిస్తుంటారు. ఎంబీఏ లాంటి కోర్సుల్లో సీట్లు సంపాదించటంలో, కార్పొరేట్‌ ఉద్యోగ సాధనలో బృందచర్చలకు (గ్రూప్‌ డిస్కషన్స్‌)కు ఎంతో ప్రాధాన్యం ఉంది. వీటి మెలకువలూ, సాధారణంగా విద్యార్థులు చేసే పొరపాట్లు తెలుసుకుందాం! 

ప్రదీప్‌ తన ఐదో క్యాంపస్‌ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్‌ కాకపోయేసరికి స్నేహితుని సలహాతో కెరియర్‌ కౌన్సెలర్‌ను సంప్రదించాడు. ప్రదీప్‌తో కొంత సమయం వెచ్చించిన కౌన్సెలర్, అతని సామర్ధ్యాన్ని మదింపు వేశాడు. లోపాలు సరిదిద్దుతూ అతి ముఖ్యమైన బృందచర్చల్లో విజయం సాధించేందుకు కొన్ని సూచనలందించాడు.  

కార్పొరేట్‌ సంస్థలు తమకు అవసరమైన మానవ వనరులను క్యాంపస్‌ సెలెక్షన్స్‌ ద్వారా ఎంపిక చేసుకునేందుకు రాత పరీక్షలు, బృందచర్చలు, ఇంటర్వ్యూ లాంటి ప్రక్రియలను అనుసరిస్తాయి. ఉద్యోగులను ఎంపిక చేసుకోవడంలో వీటికున్న ప్రాధాన్యం, సంస్థలో వాటి అవసరం గురించి ఏ కొద్దిమంది విద్యార్థులకు మాత్రమే అవగాహన ఉంటుంది. 

ప్రాంగణ నియామకాల్లో తమ విద్యార్థులు విజయం సాధించేందుకు కాలేజీలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. అయితే కార్పొరేట్‌ సంస్థల్లో ఈ అభ్యర్థులు చేయబోయే ఉద్యోగానికీ, ఈ పరీక్షల్లో వారు విజయం సాధించడానికీ ఉన్న అవినాభావ సంబంధం చాలా తక్కువమందే తెలియజెపుతారు. ఈ అనుసంధానతను అభ్యర్థులు గ్రహించాలి. 

కార్పొరేట్‌ వ్యాపార నిర్వహణలో... 

వ్యాపార నిర్వహణలో బృందచర్చ అతిముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సంస్థల్లో కొత్తకొత్త వ్యాపార వ్యూహాల గురించీ, సవాళ్ళకు అనుసరించాల్సిన పరిష్కారవ్యూహాల గురించీ చర్చిస్తుంటారు. కార్పొరేట్‌ సంస్థల్లో విజయం సాధించాలంటే స్పష్టమైన భావప్రకటన సామర్థ్యం, భాషపై పట్టు, నాయకత్వలక్షణాలు తప్పనిసరి. బృందచర్చల సమయంలో వ్యక్తి మనో వైఖరి, స్వీయప్రేరణ లాంటి లక్షణాలను మదింపువేసి అభ్యర్థిని ఎంపిక చేసుకుంటారు. 

కార్పొరేట్‌ వ్యాపార సంస్థ, ప్రభుత్వరంగ సంస్థ.. ఇలా ఏ వ్యాపార సంస్థ విజయానికైనా వివిధస్థాయి ఉద్యోగులు సంఘటితంగా, జట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు వ్యాపార నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను చర్చించి శాఖాపరంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలపైనే సంస్థ మనుగడ ఆధారపడి ఉంటుంది. అందుకే, సంస్థల్లో ఈ చర్చలు పారదర్శకంగా జరుగుతాయి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న చర్చల్లో పాల్గొనే ఉద్యోగుల్లో మానసిక పరిపక్వత, పని సంస్కృతి లాంటి లక్షణాలూ, నైపుణ్యాలూ ఉన్నప్పుడే సంస్థల్లో విజయవంతంగా రాణించగలరు. ఇలాంటి ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి బృంద చర్చలు అవసరం. ఇలా ఎంపికైన అభ్యర్థుల్లో కార్పొరేట్‌ సహజ వాతావరణంలో ఇతర ఉద్యోగులతో కలిసిమెలిసి పనిచేస్తూ విధులను నిర్వహించే సామర్ధ్యం ఉండాలి. సహోద్యోగులు, పై అధికారులు, వినియోగదారులు, యాజమాన్య ప్రతినిధులు... ఇలా అన్నికోణాలలో సమానస్థాయిలో భేషజాలు లేకుండా విషయచర్చ జరగాలి.  

స్పష్టంగా- ధీమాగా...

కొంతమంది బృందంగా ఒక అంశంపై సాగించే చర్చే గ్రూప్‌ డిస్కషన్‌. దీనిలో సభ్యులు ఒక అంశం గురించి వారి అభిప్రాయాలను తెలియజేస్తారు. జట్టులోని సభ్యుడిగా, మీ అభిప్రాయాలను తెలియజెప్పేందుకు జంకకూడదు. మీరు వెలిబుచ్చే అభిప్రాయాలు స్పష్టంగా ఉండాలి. మీరు సాగించే చర్చలో ఆత్మవిశ్వాసం కనిపించాలి.  

ఎలా ప్రారంభించాలి?  

బృందచర్చ ప్రారంభంలో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఈ చర్చలో నాలుగు లేదా ఐదు సార్లు మాట్లాడే ప్రయత్నం చేస్తూ కనీసం నిమిషానికి మించకుండా మాట్లాడి క్లుప్తీకరించండి. మీ చర్చలోని అంశాలను పక్కదారి పట్టించడం, ఇతరులను డామినేట్‌ చేయడం మీకు ప్రతికూల అంశాలవుతాయి.

మానసిక పరిపక్వత

బృందచర్చ ఒక మాటల యుద్ధం కాదు. ఇక్కడ ఇతరులను ఓడించడాన్ని గెలుపుగా భావించవద్దు. ఇతర సభ్యులకు కూడా వారి అభిప్రాయాలను తెలియజెప్పే అవకాశం కల్పించండి. ఇతరులు మాట్లాడే సమయంలో మధ్యలో మీరు మాట్లాడవలసివస్తే వారి అనుమతి తీసుకుని మాట్లాడండి. కొన్నిసార్లు కొన్ని అభిప్రాయాలు అంగీకరించలేనివిగా ఉండవచ్చు. వాటిని సమయస్ఫూర్తితో అంగీకరిస్తూనే తోసిపుచ్చి మీ అభిప్రాయాలు తెలియజెప్పాలి. 

విషయస్పర్థ మాత్రమే

ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం బృందచర్చకు అవసరమైన ఒక లక్షణం. చర్చల్లో ఇతరులపై ఆధిపత్య ప్రదర్శన సరికాదు. అభ్యర్థుల మధ్య విషయస్పర్థ తప్ప, మనఃస్పర్థ్ధలకు దారితీయని మానసిక పరిపక్వత ఉండాలి. తాము పనిచేయబోయే సంస్థల్లో బృందచర్చల అవసరాన్ని అర్థÄం చేసుకోవటం ముఖ్యం. అంతేకానీ తాము బృంద   చర్చల్లో చాలాసేపు మాట్లాడామనో, ఎక్కువ విషయాలు చర్చించామనో భావించేవారు వ్యక్తిగత విజయాలే తప్ప, సమష్టి విజయం సాధించలేరు. ఎంతటి సమర్థుడైనా, ఈ లక్షణాలు లేకపోతే బృందచర్చల్లో ఎంపిక కాలేరు.

విద్యార్థిలో ఏం పరిశీలిస్తారు?

కార్పొరేట్‌పరంగా తమ సంస్థలో ఉద్యోగులుగా చేరబోయే అభ్యర్థుల వ్యక్తిత్వాలనూ, నైపుణ్యాలనూ బేరీజు వేసుకుని ఎంపిక చేసుకోవడానికి విలువైన సాధనం.. బృందచర్చ. భావవ్యక్తీకరణకు ఇవెంతో ఉపయోగపడుతాయి. 

వ్యక్తిలో అంతర్లీనంగా దాగిఉన్న సామర్థ్యాలను వెలికితీసేందుకు సాధారణ పరీక్షలు సరిపోవు. ఈ చర్చల్లో విద్యార్థి మనో వైఖరిని తెలుసుకోవచ్చు.  

చర్చలు నిర్వహించే సమయంలో విద్యార్థుల ఆలోచనా విధానాలను పరిశీలిస్తారు. ఇతరుల ఆలోచనలను అనుసరించే లక్షణముందా, వీటిని ఎలా కమ్యూనికేట్‌ చేయగలుగుతున్నాడు, ఇతరులు చెప్పే విషయాలు శ్రద్ధగా విని, వారి భావాలను తనకు కావలసిన రీతిలో మలచుకుంటూ తన పాయింటుకు అనుసంధానించగలడా.. ఇవన్నీ విశ్లేషిస్తారు.

చర్చల సమయంలో జట్టులోని ఇతర సభ్యులతో విద్యార్థి ఇంటరాక్షన్, ఇన్‌వాల్వ్‌ మెంట, చేసే చర్చలో విలువైన విషయాలున్నాయా.. ఇవన్నీ పరిశీలిస్తారు.  

అభ్యర్థులు కేవలం వారి వ్యక్తిగత అజెండాకు కట్టుబడుతున్నారా? సంస్థ ప్రయోజనాలకు కట్టుబడి పనిచేస్తున్నారా? జట్టులోని ఇతరుల అభిప్రాయాలపై ఎంతటి శ్రద్ధచూపుతున్నారు, తమ అభిప్రాయాలకు భిన్నంగా ఇతర సభ్యులు వెలిబుచ్చే అభిప్రాయాలను  విశాలదృక్పథంతో స్వేకరిస్తున్నారా? లేదా? అనేవి గమనిస్తుంటారు. 

ఏదైనా అంగీకరించగల ఓపెన్‌మైండ్‌ విద్యార్థిలో ఉందో లేదో చూస్తారు.  

ప్రయోజనాలేంటి?  

ఉద్యోగులను కార్పొరేట్‌ జీవనశైలికీ, పనిసంస్కృతికీ అలవాటు చేయడానికి ఈ బృందచర్చ తగిన శిక్షణనిస్తుంది. పై అధికారులతో, వినియోగదారులతో అవసరమైన సమావేశాలు నిర్వహించి తమ వ్యాపారాన్ని ప్రజెంట్‌ చేయడానికి కావలసిన నైపుణ్యాలు మెరుగుపరుస్తుంది. నిజానికి ఈ బృందచర్చ సంస్థలో చేరేముందే అభ్యర్థికి ఒక ట్యుటోరియల్‌గా పనికివస్తుంది. అందుకే, ఎంపిక ప్రక్రియలో బృందచర్చకు అంత ప్రాధాన్యం! 


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ AF CAT - 2022: వాయుసేనలో విశిష్ట కొలువులు

‣ పదునుగా ప్రిపరేషన్‌!

‣ మీ గురించి మీరు ఆకట్టుకునేలా చెప్పగలరా?

‣ శాస్త్రీయంగా చదివేద్దాం!

Posted Date: 07-12-2021


 

ప్రజెంటేషన్‌

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం