• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పదునుగా ప్రిపరేషన్‌!

సర్కారీ కొలువు సాధ్యం ఇలా

ప్రతి పనికీ ఒక అత్యుత్తమ మార్గం ఉంటుందని నిర్వహణ శాస్త్రం విశ్వసిస్తుంది. అదేవిధంగా విస్తృతమైన సిలబస్‌ ఉండే పోటీ పరీక్షల్లో అత్యుత్తమ విజయాలు సాధించేలా చేసే సన్నద్ధతకు హేతుబద్ధ మెలకువలను గత వారం పరిశీలించాం. ఈ వారం అలాంటివే మరికొన్ని తెలుసుకుందాం! 

చదవాల్సిన సిలబస్‌ మీద అవగాహన వచ్చిన తర్వాత ఆ మొత్తం సిలబస్‌ని లభ్యమవుతున్న సమయంలో పూర్తి చేసేందుకు షెడ్యూల్‌ అనేది ఉపకరిస్తుంది. పకడ్బందీగా షెడ్యూల్‌ని తయారుచేసినప్పుడు మొత్తం కంటెంట్‌ కవర్‌ అవుతుంది దానితోపాటు సమయ నిర్వహణా సులభం అవుతుంది. అందువల్ల పటిష్ఠమైన అధ్యయనం కోసం పకడ్బందీగా షెడ్యూల్‌ తయారీ అనేది చక్కని మెలకువగా గుర్తిస్తారు.

వాస్తవిక స్థితిని పరిగణించాలి

షెడ్యూల్‌ తయారు చేసేటప్పుడు అభ్యర్ధి తన శారీరక, మానసిక, ఆర్థిక స్థితిని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. శారీరక సామర్థ్యం లేకుండా రోజుకి 10 నుంచి 12 గంటలు చదవాలని షెడ్యూల్‌ తయారు చేసుకున్నంతమాత్రాన ఉపయోగం ఉండదు. కొంతమంది అభ్యర్థులకు ఆర్థికపరమైన బలం ఉండదు. వారు అటు సంపాదిస్తూ ఇటు చదువుకోవాల్సిన సందర్భంలో ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్‌ రూపొందించుకుంటే సఫలమవుతారు.

షెడ్యూల్ని అతిక్రమించవద్దు

నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం కంటెంట్‌ చదవటం చాలా ముఖ్యం. ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలనుకుంటే అన్ని రోజులు ఆ సబ్జెక్ట్‌కు కేటాయించి పూర్తి చేయాలి. ఒక రోజులో ఎన్ని గంటలు చదవాలనుకుంటే అన్ని గంటలూ చదవాల్సిందే. తయారు చేసుకున్న షెడ్యూల్‌ని అతిక్రమించకుండా చదివినప్పుడు అభ్యర్థుల్లో ప్రేరణ, ఆత్మవిశ్వాసం బాగా పెరిగినట్లుగా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం చదివితే కంటిన్యుటీ బలంగా ఉంటుంది కాబట్టి జ్ఞాపకశక్తి కూడా బలంగా ఏర్పడుతుంది.

ఒకవేళ అతిక్రమించాల్సి వస్తే....

అనారోగ్య సమస్యలు, కళాశాల కార్యక్రమాలు, లేక చిరుద్యోగులు అయితే ఆఫీస్‌ పని గంటల వల్లనో, సామాజిక సంబంధాల వల్లనో కొన్ని సందర్భాల్లో షెడ్యూల్ని అతిక్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సందర్భంలో ముందుగా రూపొందించుకున్న షెడ్యూల్‌ని అనుసరిస్తూనే అదనపు చదువు గంటలు ఏర్పాటు చేసుకోవాలి; చదవలేకపోయిన అంశాలపై దృష్టి పెట్టాలి. అదనపు పని గంటల ద్వారా కోల్పోయినదాన్ని పూరించాలి. కానీ షెడ్యూల్‌ వాయిదా వేస్తే మాత్రం నష్టమే ఎక్కువ. కంటెంట్‌ ప్లాన్‌ని తయారుచేసుకునేటప్పుడే వారంలో ఒకటి లేదా రెండు రోజుల సమయాన్ని ఖాళీగా ఉంచినట్లయితే ఇటువంటి సందర్భాలలో ఆ సమయాన్ని వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది.

విరామం కూడా అవసరమే

అధ్యయనాల ప్రకారం సగటున మానవులు 25 నుంచి 35 నిమిషాల సమయం మాత్రమే ఏకాగ్రతతో ఒక విషయంపై  దృష్టి నిలపగలరు. ఆపై ఎంత ప్రయత్నం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో తమ శక్తుల్ని వినియోగించలేరు. అందువల్లనే పాఠశాలలో కళాశాలలో సగటున ఒక పీ‡రియడ్‌ కాలవ్యవధి నలభై నిమిషాలు ఉండాలని నిర్ణయించారు. అదే సూత్రం పోటీ పరీక్షల అభ్యర్థులకు కూడా ఉపయోగపడుతుంది.షెడ్యూల్‌ తయారు చేసుకునేటప్పుడు ప్రతి 40..50 నిమిషాలకోసారి 10 నుంచి 15 నిమిషాల విరామాన్ని ఏర్పాటు చేసుకుని మనసుకు ఆహ్లాదం కలిగించే సంగీతం, స్వల్ప నిద్ర లాంటివి అనుసరించవచ్చు. అలా గంట గంటకూ మధ్యలో కొంత విరామాన్ని పాటిస్తూ ప్రతి మూడు నాలుగు గంటలకి అదనంగా మరికొంత సమయాన్ని ఇవ్వటం ద్వారా మనసు ఏకాగ్రతతో ఉంటుంది. తద్వారా గ్రహణ శక్తి బాగా పెరుగుతుంది.

మనసు మాట వింటున్నారా?

కంటెంట్‌ అధ్యయనంలో కొన్ని రోజుల తర్వాత విసుగుదల అనేది రావటం సహజం. పోటీ పరీక్షల్లో పోటీ ఎక్కువగా ఉంటుందనీ, అటువంటి విసుగుని పట్టించుకోకుండా దీర్ఘకాలిక అధ్యయనం చేసినట్లయితే దుష్ఫలితాలే ఎక్కువ వస్తాయని తెలుస్తుంది. దీనికి కారణం మనసు ఏకాగ్రత కోల్పోవటమే. అటువంటి సందర్భాల్లో మనసుకు మిత్రులని కలవాలని అనిపించవచ్చు. కొత్త ప్రాంతాలకు వెళ్లాలనో, కొత్త సినిమా చూడాలనో కోరుకోవచ్చు. రెండు మూడు రోజులు చదువును పక్కన పెట్టమని చెప్పవచ్చు. ఇటువంటి సందర్భాల్లో మనసుకు ప్రాధాన్యమిస్తూ కొన్ని స్వీయ నియంత్రణలు విధించుకోవాలి. ఆటవిడుపులు తప్పనిసరిగా ఉండాలి. ఈ అధ్యయన మెలకువలను అనుసరించినప్పుడే ఫలితాలు పొందుతారు.


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పది ప్రశ్నలతో పరీక్షిద్దాం!

‣ ప్రతి విషయానికీ అతిగా ఆలోచనలా?

‣ మార్కులు మాత్రమేనా.. అంతకుమించి!

‣ పక్కా సంసిద్ధత... ప్రేరణ!

Posted Date : 06-12-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.