• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మార్కులు మాత్రమేనా.. అంతకుమించి!

కాలేజీలూ, యూనివర్సిటీల్లో చదువుకోవడమంటే.. కోర్సు పూర్తి చేయడం, పట్టా తెచ్చుకోవడం మాత్రమే కాదు. ఇది మంచి మార్కులు తెచ్చుకోవడానికే పరిమితమైనది కాదు. క్యాంపస్‌లో విద్యాభ్యాస కాలంలో అంతకుమించిన జీవిత, వ్యక్తిత్వ వికాస పాఠాలనూ నేర్చుకోవచ్చు. అంతేకాదు- భావి జీవితానికి అవసరమయ్యే ఎన్నో నైపుణ్యాలకూ అక్కడే పునాది పడేలా శ్రద్ధ తీసుకోవడం అవసరం!

నిర్దిష్ట పరిజ్ఞానం సంపాదించడమే, ఉత్తీర్ణత మాత్రమే ధ్యేయమైతే.. దూరవిద్య ద్వారానూ వివిధ కోర్సులను పూర్తిచేయొచ్చు. కానీ విద్యాసంస్థలో చేరితే చదువుతోపాటుగా క్రమశిక్షణ, సమయపాలన లాంటి మంచి అలవాట్లతోపాటుగా అదనపు నైపుణ్యాలూ అలవడతాయి. మెరికల్లాంటి సహ విద్యార్థుల సహవాసంతో వారి మెరుగైన లక్షణాలను అందిపుచ్చుకోవచ్చు. చేయాల్సిందల్లా - మంచి మిత్రులను సంపాదించటం, అంకితభావంతో, ఆసక్తితో విద్యార్జన చేయటం. 

ఆసక్తిగా వినడం

విద్య నేర్చుకోవడంలో భాగంగా అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. దానికి ఏకాగ్రత, సహనం ఎంతో అవసరమవుతాయి. విద్యార్థి భవిష్యత్తులో ఉద్యోగిగా మారినా ఈ నైపుణ్యం ఎంతో అవసరమవుతుంది. ఎదుటివారు చెప్పినదాన్ని సరిగా విన్నప్పుడే అందుకు అనుగుణంగా స్పందించడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా సంకేతాలు, సంజ్ఞలు, హావభావాలు, మాట్లాడుతున్నప్పుడు వచ్చే స్థాయీ భేదాలూ వీటన్నింటి ద్వారా ఎదుటివారి ప్రవర్తననూ అర్థం చేసుకోగలుగుతారు.

స్పష్టంగా, మెరుగ్గా

పెద్దవాళ్లనూ, విద్యనేర్పే గురువులనూ గౌరవించమని అందరూ చెబుతుంటారు. దాని ఆచరణ విద్యాసంస్థల్లో చేరడం ద్వారా చిన్నతనంలోనే మొదలవుతుంది. కళాశాల దశ వ్యకిత్వ వికాసానికి బాట వేస్తుంది. అధ్యాపకులూ, ప్రొఫెసర్లతో, సమాజంలో అనుభవజ్ఞులైన నిపుణులతో నమ్రతగా మెలగడం తెలుస్తుంది. ఎవరితోనైనా సూటిగా, స్పష్టంగా, మెరుగ్గా మాట్లాడటం క్రమంగా అలవాటు అవుతుంది.

ప్రశ్నించే తత్వం

ఏదైనా పాఠ్యాంశం అర్థంకానప్పుడు ప్రశ్నించి తెలుసుకుంటారు విద్యార్థులు. తరగతిలోని అందరి ముందూ మొహమాట పడకుండా ధైర్యంగా ప్రశ్నించగలుగుతారు. అర్థరహితమైన బిడియాన్ని వదుల్చుకోగలుగుతారు. ఈ ప్రశ్నించే నైజం, చొరవ భవిష్యత్‌ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. పౌరులుగా, ఉద్యోగులుగా ఎన్నో అసమానతలను ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు. అలాంటప్పుడు ధైర్యంగా తమ గళాన్ని వినిపించగలుగుతారు.

ఆలోచనలకు పదును

తోటి విద్యార్థులతో కలసి చదువుకోవడం వల్ల ఇతరులతో మర్యాదగా, సున్నితంగా వ్యవహరించడమెలాగో తెలుస్తుంది. వివిధ అనుభవాల ద్వారా విద్యార్థులు ఈ విషయాన్ని నేర్చుకుంటారు. తోటి విద్యార్థుల సలహాలు, పొగడ్తలు, విమర్శలు, భిన్నాభిప్రాయాలు, ప్రతిస్పందనలు... ఇవన్నీ కూడా వారి ఆలోచనలకు పదునుపెడతాయి. ఎప్పుడూ ఒకే రకంగా మూస ధోరణిలో ఆలోచించడకుండా సృజనాత్మకంగా ఆలోచించే అవకాశాలూ పెరుగుతాయి.

పరిష్కార నైపుణ్యం

చదువుకునే సమయంలో రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి తోటి విద్యార్థులతో అపార్థాలూ తలెత్తుతుంటాయి. అలాంటప్పుడు కలసి మాట్లాడుకుని వాటిని పరిష్కరించుకుంటూ ఉంటారు. అంటే చిన్నతనంలోనే సమస్యా పరిష్కార నైపుణ్యం అలవడటానికి విద్యా సంస్థలు ఎంతగానో తోడ్పడతాయి. అలాగే తాము ఇబ్బందులు, ఆపదల్లో ఉన్నప్పుడు ఇతరుల సహాయాన్ని కోరడానికీ వెనకాడరు.

నలుగురితో చర్చించడం

విద్యార్థులు ఎదుర్కొంటోన్న వివిధ రకాల ఇబ్బందులను అందరూ కలిసి చర్చించుకుంటారు. ఆ తర్వాత వీటిని యాజమాన్యం దృష్టికి తీసుకెళతారు. ఇలా సమస్యా పరిష్కారానికి నలుగురూ కలసి పనిచేయాలనే ఆలోచనకు విద్యా సంస్థలోనే పునాది పడుతుంది. సమస్య గురించి కాకుండా దాని పరిష్కార మార్గాల గురించి నలుగురితో చర్చించగలుగుతారు. ఇలా మాట్లాడటం వల్ల సానుకూల దృక్పథమూ పెరుగుతుంది. 

పంచుకునే లక్షణం

తమ వస్తువులను జాగ్రత్త పదిలపరుచుకోవడంతోపాటు తోటి స్నేహితులతో పంచుకోవడమూ విద్యార్థులకు అలవాటు అవుతుంది. అంటే ఎదుటివాళ్లకు అవసరం అయినప్పుడు స్పందించి సాయం అందించే మంచి గుణానికి విద్యా సంస్థల్లో పునాది పడుతుంది.

కలిసి మెలిసి

కోర్సులో భాగంగా వివిధ ప్రాజెక్టులను పూర్తిచేయాల్సి ఉంటుంది. వీటిని ఒక్కరే చేయడం సాధ్యం కాకపోవచ్చు. అందుకని కొంతమంది విద్యార్థులు బృందంగా ఏర్పడి  ఉమ్మడిగా కలిసి చేస్తుంటారు. అంటే విద్యార్థి దశ నుంచే ఒక పని పూర్తిచేయడం కోసం పది మందితో కలిసి పనిచేయడం అలవాటవుతుంది.

నిజానికి ఎదుటివారు చెప్పే మాటల కంటే... చుట్టూ కనిపించే దృశ్యాలు, పరిస్థితులే విద్యార్థులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. అంటే విన్న మాటలకంటే ఎదురుగా కనిపించే దృశ్యాలే మనసు మీద చెరగని ముద్ర వేస్తాయి. అధ్యాపకులను గౌరవించడం, సమయానికి విలువనివ్వడం, తెలియని విషయాలను ప్రశ్నించడం... ఇవన్నీ రోజూ విద్యార్థుల కళ్లముందే జరుగుతుంటాయి. ఈ సంఘటనలన్నీ వారిలో సానుకూలతను పెంచుతాయి. చక్కని వాతావరణంలో చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తులో మంచి పౌరులుగా మారి... సమాజానికి తమ అమూల్యమైన సేవలను అందిస్తారనడంలో సందేహం లేదు.
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అందిపుచ్చుకుంటే అవకాశాలెన్నో!

‣ సొంత నోట్సుతో సిద్ధ్దపడదాం!

Posted Date : 24-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌