• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సొంత నోట్సుతో సిద్ధపడదాం!

సర్కారీ కొలువు సాధ్యం ఇలా

అకడమిక్‌ పరీక్షలకు నిర్దిష్టమైన సిలబస్, పుస్తకాలూ ఉంటాయి. అవి చదివితే చాలు; 90 శాతం మార్కులూ తెచ్చుకోవచ్చు. పోటీ పరీక్షల్లో సిలబస్‌ అనేది కేవలం మార్గదర్శకం లాంటిదే కానీ దాన్నుంచే ప్రశ్నలు వస్తాయన్న హామీ ఏమీ లేదు. అందువల్ల సిలబస్‌కు అనుగుణంగా రాసిన పుస్తకాలు సైతం పూర్తిస్థాయిలో ఫలితాన్నివ్వలేవు. అందుకే ప్రభుత్వ ఉద్యోగాల పోటీపరీక్షల్లో సొంత నోట్సు పాత్ర నిస్సందేహంగా చాలా పెద్దది! 

పోటీ పరీక్షల అభ్యర్థులు సిలబస్‌లోని అంశాల కోసం చాలా పుస్తకాలపై ఆధారపడాల్సి ఉంటుంది. దీంతో వీరికి సన్నద్ధత సందర్భంగా రకరకాల సమస్యలు ఎదురవుతాయి. వీటిని పరిష్కరించే ఏకైక మార్గం సొంత నోట్సు తయారీ. దీని  ప్రయోజనాలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరంగా తెలుసుకుందాం.

పూర్తిస్థాయిలో..

సివిల్స్, గ్రూప్‌-1 లాంటి పరీక్షల కోసం సుదీర్ఘ ప్రిపరేషన్‌కు సిద్ధపడే అభ్యర్థులు సిలబస్‌ను అనుసరిస్తూ పూర్తిస్థాయిలో సొంత నోట్సు తయారు చేసుకోవడం సముచితమైన నిర్ణయం అవుతుంది. ఇందుకోసం ప్రామాణికమైన విశ్వవిద్యాలయ పుస్తకాలు, నిపుణుల రచనలు, వికీపీడియా, గూగుల్‌ వీక్షణం, దిన పత్రికలు మొదలైనవాటిపై ఆధారపడి సిలబస్‌లోని చిన్న అంశానికి కూడా కావలసిన సమాచారంతో సొంత నోట్సు తయారుచేసుకోవాలి. ఒకసారి నోట్సు తయారు చేసుకున్న తరువాత దానికి ఆధారమైన పుస్తకాలపై ఆధారపడకుండా అనేకసార్లు ఆ నోట్స్‌ చదివే విధానం అనుసరించాలి.

పాక్షికంగా.. 

సొంత నోట్సు తయారుచేసేందుకు అనుసరించదగిన రెండో పద్ధతి ఇది. ముఖ్యంగా తగినంత సమయం లేనప్పుడూ, మధ్య స్థాయి ఉద్యోగ పరీక్షలకూ ఈ పాక్షిక నోట్సు పద్ధతిని అనుసరించటం మేలు. దీనిలో మూల వనరుగా ఒక ప్రధాన పుస్తకాన్ని పరిగణిస్తారు. సిలబస్‌ ప్రకారం తగిన స్థాయిలో సమాచారం ఉందనుకున్న అంశాలను ప్రధాన పుస్తకం నుంచి చదువుతారు. ఈ ప్రధాన పుస్తకంలో ఏదైనా సమాచారం సంతృప్తికరంగా, విస్తృతంగా లేదనుకున్నప్పుడు ఇతర పుస్తకాల నుంచి సమాచారం తీసుకుని సొంత నోట్సు తయారు చేసుకుంటారు. తర్వాత ఆ ఇతర పుస్తకాలను పరిగణించరు. ప్రధాన పుస్తకంతో పాటు. నోట్సుపైనే ఆధారపడి చదువుకోవాలి. 

సూక్ష్మ సమాచారంతో.. 

దిగువ స్థాయి ఉద్యోగాల సన్నద్ధతకు ఈ తరహా సూక్ష్మ నోట్సు తయారీ బాగా ఉపకరిస్తుంది. చాలా దిగువ స్థాయి ఉద్యోగాల్లో సిలబస్‌ చాలా పరిమితంగా ఉంటుంది. దానికి తోడు విస్తృతంగా తయారవ్వాల్సిన అవసరమూ ఉండదు. అందువల్ల సాధారణంగా ఒక ప్రధాన పుస్తకం సరిపోతుంది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, రైల్వే, బ్యాంకింగ్‌ మొదలైన సంస్థల పరీక్షలు ఈ కోవకు చెందుతాయి. అంకగణితం, రీజనింగ్‌ విభాగాల ప్రశ్నలకు విభిన్న మార్గాల్లో సాధన పద్ధతులుంటాయి. అందువల్ల అటువంటి సాధన పద్ధతులకు ఉండే షార్ట్‌ కట్ల వరకు నోట్సు తయారు చేసుకుంటే సరిపోతుంది. 

మర్చిపోకూడదని అభ్యర్థులు అనుకునే విషయాలను కూడా ఈ సూక్ష్మ నోట్సు రూపంలో రూపొందించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సమీకరణాలు, చిత్రాలు, ఫ్లో డయాగ్రమ్స్‌ మొదలైనవాటిని ఈ తరహా నోట్సులో ఉపయోగిస్తే  సులభంగా సన్నద్ధం కావచ్చు. పరీక్షకు ముందు జిస్ట్‌ లాంటి ఈ నోట్స్‌ చదవటం తేలిక. జ్ఞాపకశక్తిని పరిశీలించుకోవడమూ సులభమే. దీంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. సన్నద్ధత సమయం తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ తరహా పద్ధతుల్లో సొంత నోట్సు తయారు చేసుకోవచ్చు.


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పరీక్షలకు తగినట్టు పక్కా ప్రణాళిక!

‣ పాఠాలపై ఏకాగ్రతకు...!

‣ NEET: నీట్‌... ఆ తర్వాత!

‣ మేటి డిగ్రీ కళాశాలలు ఇవే!

Posted Date : 22-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌