• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పాఠాలపై ఏకాగ్రతకు...!

ప్రత్యక్ష తరగతులైనా, ఆన్‌లైన్‌ బోధన అయినా విద్యార్థులు కొన్నిసార్లు పాఠాలపై దృష్టి నిలపలేకపోతుంటారు. పరీక్షల సన్నద్ధ్దత సమయంలోనూ ఇతర విషయాలపై ధ్యాస మళ్లుతుంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రాణాయామం చేయాలని ఎందరో సూచిస్తుంటారు. మరి విద్యార్థులకు మానసిక ఏకాగ్రత అలవడటానికి ఉపయోగపడే ప్రాణాయామం, క్రియలను వివరంగా తెలుసుకుందామా?

విద్యార్థులు తరగతుల్లో బోధనపై ఏకాగ్రత చూపి, విద్యాభ్యాసం చేయటానికి ‘త్రాటక క్రియ’ ఎంతగానో ఉపకరిస్తుంది. దీన్ని సాధన చేస్తే కంటి దోషాలు తగ్గిపోవడమే కాకుండా మానసికంగా ఏకాగ్రత మెరుగవుతుంది.  

త్రాటక క్రియ 

నూనె దీపాన్ని/ కొవ్వొత్తిని వెలిగించి బల్ల మీద పెట్టాలి. దీపం నుంచి సుమారు నాలుగడుగుల దూరంలో సుఖాసనంలో నిటారుగా కూర్చోవాలి. దీపం చివరన (దీప శిఖరం) దృష్టి నిలపాలి. కనురెప్పలు మూయకుండా తదేక దృష్టితో కళ్ల నుంచి నీరు కారేవరకూ చూడాలి. దీన్ని బాహ్య త్రాటకం అంటారు. 

మొదట్లో ఎక్కువసేపు చేయలేకపోయినప్పుడు కళ్లు మూసుకుని దీపం శిఖర భాగాన్ని అంతర్‌ దృష్టితో గమనించాలి. దీన్ని అంతరంగ త్రాటకం అంటారు. సాధన చేస్తున్న కొద్దీ బాహ్య త్రాటకంలో ఎక్కువ సమయం దృష్టిని నిలుపగలుగుతారు. 

త్రాటక క్రియ పూర్తయిన తర్వాత కళ్లు మూసుకుని విశ్రమించాలి. ఈ క్రియను దీపంతోనే కాకుండా అద్దంలో ప్రతిబింబం, పువ్వు, నీడ, గోడ, ఆకు చివరి భాగం, కాగితంపై నల్లటి బిందువు, సూర్యోదయం, నక్షత్రం, నీటి ధార లాంటి లక్ష్యాలను నిర్దేశించుకుని కూడా సాధన చేయొచ్చు. 

ప్రయోజనాలు 

ఈ క్రియ వల్ల కంటి సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. మస్తిష్కంలో నిద్రాణమైవున్న శక్తులు జాగృతమవుతాయి. బుద్ధి వికాసం జరుగుతుంది.

అనులోమ, విలోమ ప్రాణాయామం

సుఖాసనంలో కూర్చుని తల, వెన్నెముక నిటారుగా ఉంచాలి. ఎడమచేతిని ధ్యాన ముద్రలో ఎడమ మోకాలు లేదా తొడపై ఉంచుకోవాలి. కుడి చేతి చూపుడు వేలు, మధ్య వేలును అరచేతికి ఆనించాలి. 

మిగిలిన మూడు వేళ్లను నిటారుగా చాపాలి. దీన్ని ‘నాసికా ముద్ర’ అంటారు. 

ఈ ముద్రలో ఉన్న కుడిచేతి బొటన వేలితో కుడి నాసిక మూసి ఎడమ నాసిక ద్వారా శబ్దం లేకుండా శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకున్న తర్వాత కుడిచేతి ఉంగరం వేలు, చిటికెన వేలుతో ఎడమ నాసికను మూసి, కుడి నాసికపై ఉన్న బొటన వేలును తీసి, కుడి నాసిక ద్వారా శ్వాసను బయటకు వదలాలి. నాసికా ముద్రను ఉపయోగిస్తూ మళ్లీ కుడి నాసిక ద్వారా శ్వాస తీసుకుని ఎడమ నాసిక ద్వారా శ్వాసను బయటకు వదలివేయాలి. 

ఎడమ నాసిక ద్వారా శబ్దం లేకుండా శ్వాసను తీసుకొని, కుడి నాసిక ద్వారా శ్వాసను వదలడం, మళ్లీ కుడి నాసిక ద్వారా శ్వాసను తీసుకుని ఎడమ నాసిక ద్వారా వదలడాన్ని ఒక ఆవృతమంటారు. ఇలాంటివి ప్రతిసారీ సుమారు తొమ్మిది ఆవృత్తాలు చేయాలి.

ప్రయోజనాలు

ఈ ప్రాణాయామ సాధన వల్ల శ్వాస నియంత్రణ, మానసిక విశ్రాంతి లభిస్తాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. మెదడు, ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. హృదయ స్పందనల వేగం తగ్గుతుంది. మెదడు ఉత్తేజితమై జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. శరీరం, మనసు రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉంటాయి.


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫార్మసీలో మేటి సంస్థలివీ!

‣ సన్నద్ధత సాగడం లేదా?

Posted Date : 16-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌