• facebook
  • whatsapp
  • telegram

అందిపుచ్చుకుంటే అవకాశాలెన్నో!  

మహిళా లోకానికి రక్షణ తోరణాలు

దేశ రక్షణ రంగంలో ప్రవేశించటానికి వీలుకల్పించే ఉన్నత పోటీ పరీక్ష ఎన్‌డీఏ ప్రకటన డిసెంబరు 22న వెలువడనున్నది. కొలువుల అవకాశాల్లో, ఉద్యోగ ప్రయోజనాల్లో అమ్మాయిలకు సముచిత భాగస్వామ్యం కల్పించనుండటం ఈ నోటిఫికేషన్‌ విశిష్టత! ఈ నేపథ్యంలో సాహస ప్రవృత్తి ఉన్న మహిళల కోసం ప్రస్తుతం రక్షణ రంగంలో ఉన్న ఉద్యోగాలు, శాశ్వత కమిషన్‌ ప్రయోజనాల వివరాలు తెలుసుకుందాం! 

రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాలెన్నో ఉన్నాయి. వాటిలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ అండ్‌ నేవల్‌ అకాడెమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) ముఖ్యమైందిగా చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఈ పరీక్షకు పురుష అభ్యర్థులకే అవకాశం ఉండేది. అయితే డిసెంబరులో వెలువడే ఎన్‌డీఏ ప్రకటన మొదలుకొని మహిళలకూ అందులో అవకాశం కల్పిస్తారు. అలాగే నిర్ణీత వ్యవధి (షార్ట్‌ సర్వీస్‌) పోస్టుల్లో ఎంపికైన పురుషులకే శాశ్వత కమిషన్‌లోకి మార్చేవారు. ఇకపై మహిళలూ అందులో భాగం కానున్నారు. 

ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ

యూపీఎస్‌సీ ఏడాదికి రెండుసార్లు ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్ష నిర్వహిస్తోంది. ఒక్కో విడతలోనూ సుమారు 400 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో ఎంపికైనవారు పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్‌డీఏ)లో చదువుకుంటూ, ఉద్యోగ ప్రాథమిక శిక్షణను పొందుతారు. ఈ అకాడెమీలో బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు అందిస్తున్నారు. విద్య, వసతి, భోజనం, దుస్తులు...అన్నీ ఎన్‌డీఏ చూసుకుంటుంది. విజయవంతంగా చదువు పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ, న్యూదిల్లీ డిగ్రీ పట్టాలను ప్రదానం చేస్తుంది. అనంతరం ట్రేడ్‌ శిక్షణ సంబంధిత కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ సమయంలో ప్రతినెల రూ.56,100 స్టైపెండ్‌ అందిస్తారు. శిక్షణ అనంతరం వీరు ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్, ఏర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ (పైలట్‌)/ గ్రౌండ్‌ డ్యూటీ ఆఫీసర్‌ హోదాతో కెరీర్‌ ప్రారంభిస్తారు. ఈ మూడూ సమాన స్థాయి ఉద్యోగాలు. అందరికీ ఒకటే పేస్కేల్‌ అమలవుతుంది. మొదటి నెల నుంచే రూ.లక్షకుపైగా వేతనం పొందవచ్చు. 

చీఫ్‌ కావచ్చు

విధుల్లో చేరినవాళ్లు రెండేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకున్న తర్వాత ప్రమోషన్‌ పొందవచ్చు. ఆరేళ్ల తర్వాత మరొకటి, పదమూడేళ్లకు మరో ప్రమోషన్‌ అందుతుంది. 13 ఏళ్లు పనిచేసినవాళ్లు ఆర్మీ, నేవీ, ఏర్‌ ఫోర్స్‌ల్లో వరుసగా... లెఫ్టినెంట్‌ కల్నల్, కమాండర్, వింగ్‌ కమాండర్‌ స్థాయికి చేరుకుంటారు. అనంతరం ప్రతిభ ప్రాతిపదికన మిగిలిన హోదాలు అందుతాయి. వీరు భవిష్యత్తులో ఆర్మీ, నేవీ, ఏర్‌ ఫోర్స్‌ విభాగాలకు అధిపతులూ కావొచ్చు. అందువల్ల రాబోయే రోజుల్లో మహిళలు సైతం ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌లకు ఉన్నతాధికారి కావడానికి అవకాశం ఉంది. మొత్తం రక్షణ రంగానికే అధిపతి కూడా కావచ్చు. ప్రస్తుతం చీఫ్‌ హోదా పొందుతున్నవారిలో దాదాపు అందరూ గతంలో ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్షతో రక్షణ రంగంలో చేరినవారే కావడం విశేషం.  

ప్రవేశ మార్గాలెన్నో...

దేశంలో క్రమం తప్పకుండా ఉద్యోగాలు భర్తీ చేసే సంస్థల్లో ఆర్మీ, నేవీ, ఏర్‌ ఫోర్స్‌ ముందుంటున్నాయి. వీటిలో దాదాపు అన్ని పోస్టులకూ ఏడాదికి రెండు సార్లు క్యాలండర్‌ ప్రకారం ప్రకటనలు వెలువడుతాయి. పరీక్ష, అయిదు రోజుల పాటు కొనసాగే ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్‌ టెస్టుల ద్వారా ఖాళీలు భర్తీ చేస్తారు. ఎంపికలో ఆప్టిట్యూడ్, ఆంగ్లంలో ప్రావీణ్యం, సామాజిక అంశాలపై అవగాహన, మానసిక, శారీరక దృఢత్వం గమనిస్తారు. కింది పేర్కొన్న ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌ల్లో ఏ పోస్టుకు ఎంపికైనప్పటికీ మూలవేతనం రూ.56,100 అందుతుంది. ఎంఎస్‌పీ, ఇతర ప్రోత్సాహకాలు అదనంగా ఉంటాయి. ఆయా విభాగాల వారీ ఉద్యోగాలు, వాటికి కావాల్సిన అర్హతలు ఇలా ఉన్నాయి. 

ఆర్మీలో...

గ్రాడ్యుయేట్‌ యూపీఎస్సీ, గ్రాడ్యుయేట్‌ నాన్‌ యూపీఎస్సీ, గ్రాడ్యుయేట్‌ టెక్‌ ఎంట్రీ విధానాల్లో పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

గ్రాడ్యుయేట్‌ యూపీఎస్సీ: సీడీఎస్‌ఈతో ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ(ఓటీఏ) పోస్టులు భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 19 - 25 ఏళ్లలోపు ఉండాలి.  

గ్రాడ్యుయేట్‌ నాన్‌ యూపీఎస్సీ: ఇందులో ఎన్‌సీసీ స్పెషల్, జడ్జ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ (జాగ్‌) ల ద్వారా పోస్టులు భర్తీ చేస్తారు. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి. ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ పరీక్షలో కనీసం బి గ్రేడ్‌ తప్పనిసరి. జేఏజీ(జాగ్‌) ఎంట్రీకి 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత, వయసు 27 ఏళ్లలోపు ఉండాలి.

గ్రాడ్యుయేట్‌ టెక్‌ ఎంట్రీ: సంబంధిత బ్రాంచ్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ చదివుండాలి. 27 ఏళ్లలోపు వయసువారు అర్హులు.  

మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌: బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసినవాళ్లు ఇందులో చేరవచ్చు. ఖాళీలు ఉన్నప్పుడే ఈ ప్రకటన వెలువడుతుంది.

ఏర్‌ ఫోర్స్‌లో...

వాయుసేనలో ఉద్యోగాలను ఏర్‌ ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏఎఫ్‌క్యాట్‌) తో భర్తీ చేస్తారు. ఈ విధానంలో ఎంపికైన మహిళలు పైలట్‌ కావచ్చు. శిక్షణలో మేటి ప్రతిభ చూపినవారిని ఫైటర్‌ పైలట్‌గానూ తీసుకుంటారు. ఏఎఫ్‌క్యాట్‌లో ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌), ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ (ఫ్లయింగ్‌) ఉద్యోగాలు లభిస్తాయి.

ఫ్లయింగ్‌ బ్రాంచ్‌: ఈ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్‌ / ప్లస్‌ 2 లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ తప్పనిసరి. వయసు 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు కనీసం 162.5 సెం.మీ ఉండాలి. ఎలాంటి దృష్టి దోషం ఉండరాదు. 

గ్రౌండ్‌ డ్యూటీ - టెక్నికల్‌ బ్రాంచ్‌: ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (ఎల్రక్టానిక్స్‌/ మెకానికల్‌) పోస్టులకు సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో 60 శాతం మార్కులతో బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవాళ్లు అర్హులు. ఇంటర్‌/ +2లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

గ్రౌండ్‌ డ్యూటీ - నాన్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇందులో అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్‌ విభాగాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ విభాగానికి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అకౌంట్స్‌ శాఖకు 60 శాతం మార్కులతో బీకాం పూర్తిచేసినవారు అర్హులు. ఎడ్యుకేషన్‌ విభాగానికి ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ అన్నిపోస్టులకు వయసు 20 నుంచి 26 ఏళ్లలోపు, ఎత్తు 152 సెం.మీ.ఉండాలి.

ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ: ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికెట్‌ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వీరికి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు 10+2 లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లోనూ 60 శాతం ఉండాలి.

మెటీరియాలజీ బ్రాంచ్‌: ఏదైనా సైన్స్‌ స్ట్రీమ్‌లో 50 శాతం మార్కులతో పీజీ తోపాటు యూజీలో మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 20 - 26 ఏళ్లలోపు ఉండాలి.

నేవీలో...

ఏటీసీ, అబ్జర్వర్, లా, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, నేవల్‌ ఆర్కిటెక్చర్, పైలట్‌ (మేరీటైమ్‌ రికనయిసెన్స్‌ స్ట్రీమ్‌), నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టరేట్‌ పోస్టులకు మహిళలు అర్హులు

నేవల్‌ ఆర్కిటెక్చర్‌: మెకానికల్‌/ సివిల్‌/ ఏరోనాటికల్‌/ మెటలర్జీ/ నేవల్‌ ఆర్కిటెక్చర్‌ విభాగాల్లో ఎందులోనైనా బీఈ/ బీటెక్‌ పూర్తిచేసినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 19 1/2 - 25 ఏళ్లలోపు ఉండాలి. 

అబ్జర్వర్‌: బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులు అర్హులు. వయసు 19 - 24 ఏళ్లలోపు ఉండాలి.  

ఎడ్యుకేషన్‌ విభాగం: పీజీలో నిర్దేశిత సబ్జెక్టుల్లో కనీసం ద్వితీయ శ్రేణితో ఉత్తీర్ణత సాధించాలి. యూజీలోనూ కొన్ని సబ్జెక్టులు చదివుండడం తప్పనిసరి లేదా నిర్దేశిత బ్రాంచిల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేయాలి. వయసు 21 - 25 ఏళ్లలోపు ఉండాలి.

లాజిస్టిక్స్‌: బీటెక్‌ / ఎంబీఏ / ఎంసీఏ / ఎమ్మెస్సీ (ఐటీ) వీటిలో ఎందులోనైనా ప్రథమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. వర్క్స్‌ విభాగానికి బీటెక్‌ (సివిల్‌) లేదా బీఆర్క్‌ వాళ్లు అర్హులు. క్యాటరింగ్‌ పోస్టులకు హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఎమ్మెస్సీ/ ఎంబీఏ లేదా ప్రథమ శ్రేణితో పీజీ డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తిచేసినవాళ్లు అర్హులు. వయసు 19 1/2 - 25 ఏళ్లలోపు ఉండాలి.

లా: ఈ పోస్టులకు ఎల్‌ఎల్‌బీ అవసరం. వయసు 22 - 27 ఏళ్లలోపు ఉండాలి.

ఏర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ): ఈ ఖాళీలకు ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత, వయసు 19 1/2 - 25 ఏళ్లలోపు ఉండాలి. 

పైలట్‌ జనరల్‌: ఈ పోస్టులకు ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు అర్హులు. వయసు 19 - 24 ఏళ్లలోపు ఉండాలి.

నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టరేట్‌ (ఎన్‌ఏఐ): ఈ విభాగానికి నిర్దేశిత బ్రాంచీల్లో బీఈ/ బీటెక్‌ చదివినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు  19 1/2 - 25 ఏళ్లలోపు ఉండాలి.

శాశ్వత కమిషన్‌తో ఎంత మేలు?

దేశ రక్షణ రంగంలో శాశ్వత కమిషన్‌లో అవకాశం వచ్చినవారు పదవీ విరమణ వరకు ఉద్యోగంలో కొనసాగవచ్చు. కనీసం 20 ఏళ్ల సేవలు అందించే అవకాశం వీరికి ఉంటుంది!

రక్షణ రంగంలో అధికారి హోదాలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ), పర్మనెంట్‌ కమిషన్‌ (పీసీ) అనే రెండు రకాల ఉద్యోగాలుంటాయి. పలు విద్యార్హతలు, వివిధ పరీక్షలతో వీటిలో అవకాశం లభిస్తుంది. అయితే షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో ఎంపికైనవాళ్లు పదేళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఆ తర్వాత అప్పటి అవసరాలు, అభ్యర్థుల ఆసక్తి, సమర్థత ప్రాతిపదికన మరో నాలుగేళ్లు సర్వీస్‌ పొడిగిస్తారు. అనంతరం ఈ విధానంలో ఎంపికైన మహిళలు తప్పనిసరిగా వైదొలగాల్సి వచ్చేది. అదే పురుషులైతే అప్పటి అవసరాలు, ఆసక్తి, సమర్థత ప్రాతిపదికన పర్మనెంట్‌ కమిషన్‌ (శాశ్వత విధులు) లోకి తీసుకునేవారు. తాజా తీర్పు నేపథ్యంలో పురుషులతో సమానంగానే మహిళలనూ శాశ్వత ఉద్యోగంలోకి తీసుకోవాలి. ఈ విషయంలో వాళ్లకు అనుసరిస్తున్న ప్రమాణాలనే వీరికీ వర్తింపచేయాలి. ఎస్‌ఎస్‌సీలో విధులు నిర్వర్తించి, వైదొలిగినవారికి గ్రాట్యుటీ తప్ప పింఛను, ఇతర ప్రయోజనాలు దక్కవు. కొత్తగా మరో ఉద్యోగం కోసం ప్రయత్నించుకోవాలి. శాశ్వత కమిషన్‌లో అవకాశం వచ్చినవారు పదవీ విరమణ వయసు వచ్చే వరకు ఉద్యోగంలో కొనసాగవచ్చు. లేదా కనీసం 20 ఏళ్ల సేవలు అందించి వైదొలగవచ్చు. దీంతో గ్రాట్యుటీ, పింఛను, ఇతర సౌకర్యాలను పురుష ఉద్యోగులతో సమానంగా అందుకోవచ్చు.  

ప్రయోజనాలివీ...

ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌ల్లో యూజీ, పీజీ అర్హతలతో ఉన్నవన్నీ దాదాపు సమాన స్థాయి ఉద్యోగాలే. అందువల్ల వాటిలో ఏ విభాగంలో చేరినప్పటికీ జీతం, హోదా, ప్రయోజనాలన్నీ ఒకేలా ఉంటాయి. కొత్తగా విధుల్లో చేరినవారు ఆర్మీలో అవకాశం లభిస్తే లెఫ్టినెంట్, నేవీలో అయితే సబ్‌ లెఫ్టినెంట్, ఏర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌/ గ్రౌండ్‌ డ్యూటీ ఆఫీసర్‌ హోదాలు పొందుతారు. చేరిన విభాగాన్ని అనుసరించి దాదాపు ఏడాది నుంచి 18 నెలల శిక్షణ ఉంటుంది. ఈ వ్యవధిలో నెలకు రూ.56,100 (లెవెల్‌ 10) స్టయిపెండ్‌ చెల్లిస్తారు. విధుల్లో చేరిన తర్వాత రూ.56,100 మూలవేతనానికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనంగా లభిస్తాయి. 

ఏ విభాగంలో చేరినప్పటికీ రూ.15,500 మిలటరీ సర్వీస్‌ పే(ఎంఎస్‌పీ) ప్రతి నెలా అందుతుంది. ఒక వేళ పైలట్‌ పోస్టులో చేరితే ఎంఎస్‌పీతోపాటు ప్రతినెలా  రూ.25,000 ఫ్లయింగ్‌ అలవెన్సు చెల్లిస్తారు. ఇంజినీర్లకు (గ్రౌండ్‌ డ్యూటీ విభాగాల్లో విధులు నిర్వర్తించేవారికి) సైతం ట్రేడ్‌ అలవెన్సులు ఉంటాయి. ఇవే కాకుండా నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు ఒక్కొక్కరికీ నెలకు    రూ.2250 చొప్పున ఇద్దరు పిల్లలకు చెల్లిస్తారు. వసతి గృహంలో ఉండి చదువుకుంటే ఒక్కొక్కరికీ నెలకు   రూ.6750 చొప్పున హాస్టల్‌ సబ్సిడీ అందుతుంది. గ్రూప్‌ ఇన్సూరెన్స్, కుటుంబానికి ఆరోగ్య ఇన్సూరెన్స్, తక్కువ ధరకు క్యాంటిన్‌ సామగ్రి, రాయితీతో కూడిన ప్రయాణాలు, నియామకాలు, చదువుల్లో పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్లు..ఇలా ప్రోత్సాహాలు ఉన్నాయి. మొదటి నెల నుంచే రూ.లక్షకుపైగా వేతనం అందుకోవచ్చు. 

విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాన్ని బట్టి ఫీల్డ్‌ ఏరియా, హై ఆల్టిట్యూడ్, ట్రాన్స్‌పోర్టు ఆలవెన్సులు దక్కుతాయి. తక్కువ వ్యవధిలోనే ప్రమోషన్లు అందుకోవచ్చు. ఆర్మీలో..రెండేళ్ల సర్వీస్‌తో కెప్టెన్, ఆరేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకుంటే మేజర్, 13 ఏళ్ల సర్వీస్‌తో లెఫ్టినెంట్‌ కల్నర్‌ హోదాకి చేరుకోవచ్చు. నేవీ, ఏర్‌ ఫోర్స్‌ల్లోనూ ఇలానే పదోన్నతులు ఉంటాయి. తర్వాతి స్థాయి ప్రమోషన్లను సేవలు, పరీక్షల్లో చూపిన ప్రతిభ ప్రాతిపదికన కేటాయిస్తారు.

ఉమన్‌ సోల్జర్‌ 

ఆర్మీలో ఉమన్‌ మిలటరీ పోలీస్‌ పోస్టుల భర్తీకి గత రెండేళ్ల నుంచి శ్రీకారం చుట్టారు. పదో తరగతి విద్యార్హతతో వీటికి పోటీపడవచ్చు. ఫిజికల్, మెడికల్‌ టెస్టు, పరీక్షలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఫిట్‌నెస్‌ టెస్టులో 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల 30 సెకన్లలో పరుగెత్తాలి. పది అడుగుల దూరానికి లాంగ్‌ జంప్, మూడు అడుగుల ఎత్తుకు హైజంప్‌ చేయగలగాలి. ఇందులో అర్హులకు వైద్య పరీక్షలు అనంతరం రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. వీరికి సంబంధిత కేంద్రాల్లో 33 వారాలపాటు శిక్షణ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి సిపాయ్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. శిక్షణ అనంతరం రూ.21,700 మూలవేతనం అందుతుంది. దీనికి అదనంగా గ్రేడ్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ...మొదలైనవి ఉంటాయి. కనీసం 15 ఏళ్లపాటు ఉద్యోగంలో కొనసాగినవాళ్లు పెన్షన్‌కు అర్హత సాధిస్తారు. 21 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎత్తు కనీసం 152 సెం.మీ. తప్పనిసరి. 

సీఏపీఎఫ్‌ల్లోనూ...

యూపీఎస్‌సీ నిర్వహించే సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌) పరీక్షకూ మహిళలు పోటీ పడవచ్చు. ఈ విధానంలో ఎంపికైనవారు బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ...తదితర విభాగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ హోదాతో సేవలు అందించవచ్చు. అలాగే పదో తరగతి విద్యార్హతతో ఎస్‌ఎస్‌సీ నిర్వహించే పరీక్షతోనూ పైన పేర్కొన్న విభాగాల్లో కానిస్టేబుల్‌ హోదాతో ఉద్యోగంలో చేరవచ్చు. 

వెబ్‌సైట్లు: https://joinindianarmy.nic.in

https://www.joinindiannavy.gov.in/

http://indianairforce.nic.in

https://upsc.gov.in
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గేమింగ్‌ రంగానికి ఉజ్జ్వల భవిత

‣ ఎలా ఎంచుకోవాలి.. సరైన కెరియర్‌?

‣ విదేశీ భాషలు.. విశేష అవకాశాలు!

‣ జ్ఞాపకశక్తి మెరుగుకు కొన్ని ఆసనాలు

Posted Date : 24-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌