• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జ్ఞాపకశక్తి మెరుగుకు కొన్ని ఆసనాలు

చదివిన విషయాలు పరీక్షలు రాసేటప్పుడు గుర్తుకురాకపోవటం చాలామంది విద్యార్థుల సమస్య. మధ్యమధ్యలో పునశ్చరణ చేసుకుంటే దీన్నుంచి కొంత బయటపడవచ్చు. యోగాసనాల సాయం కూడా తీసుకోవచ్చు. ఏకాగ్రతనూ, జ్ఞాపకశక్తినీ పెంచే కొన్ని ఆసనాల గురించి తెలుసుకుందాం! 

సంతులనాసనం

పాదాలను దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడాలి. కుడికాలిని వెనుకకు మడిచి కుడి చేతితో కాలి మడమ దగ్గర పట్టుకోవాలి. కుడి మోకాలిని ఎడమ మోకాలికి దగ్గరగా ఉంచి, కుడికాలి మడమను వీలైనంతగా పిరుదులకు దగ్గరగా తీసుకు రావాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని ముందు నుంచి పైకి తీసుకెళ్లాలి. ఈ స్థితిలో శరీర బరువు మొత్తాన్నీ ఒకే కాలి మీద స్థిరంగా నిలిపి ఉంచాలి. కళ్లు తెరిచి దృష్టిని దూరంగా ఏదైనా బిందువుపై కేంద్రీకరించి, పూర్తి ఆసనస్థి‡తిలో ఇరవై నుంచి ముప్పది సెకన్ల వరకు ఉండాలి. ముందుగా చేతిని పక్కనుంచి, తర్వాత కుడి కాలిని కిందికి దించి ఆసన స్ధితి నుంచి బయటకు రావాలి. కొద్ది సెకన్ల విరామం తర్వాత ఎడమ కాలిని మడిచి కుడిచేతిని పైకెత్తి రెండో వైపు ఆసనాన్ని చేయాలి. 

ప్రయోజనాలు: ఈ ఆసనాన్ని రోజూ సాధన చేస్తే శారీరక స్థిరత్వం లభిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. 

ఏకపాద ప్రణామాసనం

పాదాలను దగ్గరగా ఉంచి నిలబడాలి. కుడికాలి పాదాన్ని పైకి లేపి మడిచి ఎడమ మోకాలి పై భాగంలో తొడకు ఆనించాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులను ఛాతీ దగ్గరకు తెచ్చి నమస్కార ముద్రలో ఉంచాలి. దృష్టిని సుమారు అయిదారడుగుల దూరంలో కేంద్రీకరించాలి. పూర్తి ఆసన స్థితిలో ఇరవై నుంచి ముప్పై సెకన్ల వరకు ఉండే ప్రయత్నం చేయాలి. ఆసన స్థితి నుంచి బయటకు వచ్చేటప్పుడు ముందుగా చేతులను కిందికి దించి తర్వాత కుడికాలిని నేల పైకి తీసుకురావాలి. కొద్ది సెకన్ల విరామం తర్వాత మళ్లీ ఎడమకాలిని మడిచి ఆసనాన్ని వేయాలి.

ప్రయోజనాలు: ఈ ఆసనాన్ని రోజూ సాధన చేస్తే శారీరక మానసిక స్థిరత్వం కలుగుతుంది. ఏకాగ్రత... తద్వారా జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందుతాయి.

వీరాసనం

కాళ్లు చాపి రెండు చేతులను నడుము పక్కన నేలపై ఉంచి నిటారుగా కూర్చోవాలి. ముందుగా కుడి కాలిని కుడి తొడ పక్కకు వచ్చేలా మడుచుకోవాలి. అదే విధంగా ఎడమకాలినీ మడుచుకోవాలి. రెండు మోకాళ్లనూ వీలైనంత దగ్గరగా ఉంచే ప్రయత్నం చేయాలి. పిరుదులను పూర్తిగా నేల మీదే విశ్రాంతి స్థి‡తిలో ఉంచాలి. రెండు చేతులు మోకాళ్లపై ఉంచి ఈ ఆసనంలో సుమారు అర నిమిషం వరకు ఉండాలి. ఆసన స్థితి నుంచి బయటకు వచ్చేటప్పుడు ముందుగా కుడి కాలినీ తర్వాత ఎడమ కాలినీ ముందుకు చాపి విశ్రాంతి తీసుకోవాలి.

ప్రయోజనాలు: ఈ ఆసనాన్ని సాధన చేస్తే కాళ్లు, మోకాళ్లకు సంబంధించిన కీళ్లు, నరాలు, కండరాలు ఉత్తేజితమవుతాయి. శరీరం  స్థిరంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయి.

శశాంకాసనం

రెండు చేతులను మోకాళ్లు లేదా తొడలపై ఉంచి వజ్రాసనంలో కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులను ముందు నుంచి నిటారుగా పైకి తీసుకెళ్లాలి. శ్వాసను వదులుతూ నాభి నుంచి శరీరాన్ని ముందుకు వంచుతూ ముక్కు లేదా నుదురు నేలపై ఉంచాలి. చేతులను ముందుకు చాపి నేలపై ఉంచాలి. వెన్నెముక పూర్తి విశ్రాంతి స్థితిలో ఉంటుంది. నిస్సార శ్వాస (షాలో బ్రీతింగ్‌) జరగడాన్ని గమనించాలి. శ్వాసక్రియ ఇబ్బందిగా ఉన్నట్లయితే రెండు మోకాళ్లను కొంచెం వెడల్పు చేసుకుంటే ఈ ఆసన స్థితిలో ఎక్కువ సమయం ఉండగలుగుతారు. ఆసన స్థితి నుంచి బయటికి వచ్చేటప్పుడు శ్వాస తీసుకుంటూ తల, చేతులను ఒకేసారి పైకి లేపి నిటారుగా తీసుకురావాలి. శ్వాస వదులుతూ రెండు చేతులను ఇరువైపుల నుంచి కిందకు తెచ్చి వజ్రాసన స్థితిలో విశ్రాంతి తీసుకోవాలి.

ప్రయోజనాలు: ఈ ఆసనం వల్ల ఉదర కండరాలు చైతన్యమవుతాయి. వెన్నెముకకు పూర్తి విశ్రాంతి లభిస్తుంది. శారీరక స్థిరత్వం, మానసిక ప్రశాంతత పొందుతారు. 

శవాసనం

శుభ్రమైన చాప పరిచి దానిపై వెల్లకిలా పడుకోవాలి. కాలి మడమలు లోపలికీ, కాలి వేళ్లు బయటకూ ఉండేలా రెండు కాళ్లను అడుగు.. అడుగున్నర దూరంలో ఉంచాలి. చేతులను శరీరం పక్కన ఉంచాలి. అర చేతులు ఆకాశం వైపు ఉండేలా పెట్టి చేతి వేళ్లను కొంచెం ముడిచి ఉంచాలి. కళ్లు మూసుకుని తలను స్థిరంగా ఉంచాలి. శరీరంలోని ప్రతి అవయవాన్నీ ప్రయత్న పూర్వకంగా సడలించి విశ్రాంతి స్థితిలో ఉంచాలి. పాదాల వేలి చివర్ల నుంచి తల పైభాగం వరకు ప్రతి అవయవాన్నీ మనో నేత్రంతో గమనిస్తూ విశ్రాంతి కలిగిస్తున్నట్టుగా భావించాలి. శరీరం చాలా తేలికగా మారటం, శ్వాస క్రియ వేగం తగ్గడం గమనించాలి. శరీరం విశ్రాంతి స్థితి పొందిన తర్వాత మనసుకు కూడా విశ్రాంతి కలిగించే ప్రయత్నం చేయాలి. శరీరం, మనసు పూర్తి విశ్రాంతి స్థితిలో జాగరూకతతో.. చైతన్య స్థితిలో ఉండాలి. ఈ ఆసన స్థితి నుంచి బయటకు వచ్చేటపుడు కాళ్లు, చేతులను కదిలించి తలను కుడి, ఎడమ వైపులకు తిప్పాలి. ఆ తరువాత పడుకున్న స్థితిలో కుడి వైపు తిరిగి ఎడమ చేతిని ఛాతీ దగ్గరగా నేలపై ఉంచి పైకి లేచి సుఖాసనంలో కూర్చోవాలి.

ప్రయోజనాలు: ఈ ఆసనం వల్ల శరీరంలోని బాహ్య, అంతర అవయవాలు విశ్రాంతి పొందుతాయి. మానసిక వ్యాకులత తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా నిద్రలేమి సమస్య దూరమవుతుంది.


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ NEET: నీట్‌... ఆ తర్వాత!

‣ మేటి డిగ్రీ కళాశాలలు ఇవే!

Posted Date : 17-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌