• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సవాళ్లను అధిగమించే సత్తాకు పరీక్ష

ఇంటర్నేషనల్‌ లైఫ్‌స్కిల్స్‌ ఒలింపియాడ్స్‌

ఉన్నత చదువులు చదివినా.. తగిన జీవన నైపుణ్యాలు లేకపోతే రాణించలేరు. వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే ఈ నైపుణ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ప్రాథమిక స్థాయిలో గమనించి, పెంపొందించుకోవడానికి తోడ్పడేవే ‘ఒలింపియాడ్‌’ పోటీలు. అంతర్జాతీయస్థాయిలో జరిగే ఈ పోటీలు  నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్నిస్తాయి!

2021-2022 సంవత్సరానికి ప్రపంచస్థాయిలో నాలుగు ‘క్రిటికల్‌ లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్స్‌’ను నిర్వహిస్తున్నట్లు సింగపూర్‌ సామాజిక విద్యాసంస్థ ‘స్కిల్‌జన్‌ ఒలింపియాడ్‌ ఫౌండేషన్‌’ ప్రకటించింది. విద్యార్థుల జీవన నైపుణ్య సామర్థ్యాన్ని పరీక్షించే ఏకైక ఒలింపియాడ్‌ ‘ఇంటర్నేషనల్‌ లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌ (ఐఎల్‌ఎస్‌ఓ)’. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షను 3-12 తరగతుల పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దీంట్లో భాగంగా వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక జీవితాల్లో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనే నైపుణ్యాలు బాలలకు ఏవిధంగా ఉన్నాయో ప్రాథమికంగా అంచనా వేస్తారు. ఈ ఒలింపియాడ్స్‌ ప్రత్యేకత ఏమిటంటే... దీంట్లో నేర్చుకున్న నాయకత్వ లక్షణాలు, విలువలు, కలిసి పనిచేయడం, భావవ్యక్తీకరణ, సహానుభూతి, లక్ష్యాలు నిర్దేశించుకోవడం.. లాంటి నైపుణ్యాలను నిజ జీవితంలో నిర్ణయాలు తీసుకునే సమయంలో విద్యార్థులు అన్వయించుకోగలుగుతారు.

దీంట్లో 

1) ఎథిక్స్‌ అండ్‌ వేల్యూస్‌ ఒలింపియాడ్‌ 

2) ఎకనమిక్స్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌ 

3) లీడర్‌షిప్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌ 

4) ఇంటర్నేషనల్‌ లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌ 

అనే నాలుగు రకాలున్నాయి. తరగతినిబట్టి విద్యార్థులు వీటిలో పాల్గొనవచ్చు. 72 దేశాల విద్యార్థుల కోసం నిర్దేశించిన ఈ కార్యక్రమానికి పిల్లల పేర్లను రిజిస్టర్‌ చేయడం మొదలయింది. కనీస రుసుము రూ.580 చెల్లించి సంస్థ వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. దీంట్లో జీవన నైపుణ్యాల మార్గదర్శకాలు, సాధన ప్రశ్నలు, మాక్‌ టెస్టులు ఉంటాయి. 2019-2020లో జరిగిన ఒలింపియాడ్‌లో 70కి పైగా దేశాలకు చెందిన పిల్లలు పాల్గొన్నారు. 

‘నిజ జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌ ప్రధానోద్దేశం. ఈ కార్యక్రమంలో జీవన నైపుణ్యాలను నేర్చుకోవడమే కాకుండా.. సామర్థ్యాల పరంగా తాము ఏ స్థాయిలో ఉన్నామనే విషయాన్ని ఇతర దేశాలకు చెందిన పిల్లలతో పోల్చి చూసుకునే అవకాశం కలుగుతుంది. పౌరులుగా, విద్యార్థులుగా, ఉద్యోగులుగా నిజ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను అధిగమించడానికి ఒలింపియాడ్‌ తోడ్పడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు, పాఠశాలలు తమ పిల్లలు, విద్యార్థులను ‘ఇంటర్నేషనల్‌ లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌’లో పాల్గొనేలా ప్రోత్సహించాలి’ అంటున్నారు స్కిల్‌జన్‌ ఒలింపియాడ్‌ ఫౌండేషన్‌ చీఫ్‌ కన్వీనర్‌ సిద్దార్థ్‌ త్రిపాఠి. 

జీవన నైపుణ్యాలపై హార్వర్డ్‌ యూనివర్సిటీ 2011లో జరిపిన పరిశోధన ఆధారంగా ‘లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌’ను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా 6-18 సంవత్సరాల మధ్య ఉన్న కోటి మందిలో 21వ శతాబ్దపు జీవన నైపుణ్యాలను సాధించడానికి తోడ్పడటం దీని లక్ష్యం. 

2022లో ఫిబ్రవరి 10 నుంచి 13 వరకూ ఆన్‌లైన్‌లో ఈ ఒలింపియాడ్స్‌ జరుగుతాయి. 

అదనపు సమాచారం కోసం http://www.lifeskillsolympiad.org వెబ్‌సైట్‌ చూడవచ్చు. 

రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: డిసెంబరు 30, 2021. 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తీరదళంలో కమాండెంట్‌ కొలువులు

‣ మందిలో మన ముద్ర వేసేద్దాం!

Posted Date : 08-12-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌