• facebook
  • whatsapp
  • telegram

మేటి స్కోరుకు ఇదిగో రూటు!

జేఈఈ మెయిన్ - 2023 సెష‌న్ - 2 ప్రిప‌రేష‌న్ విధానం

ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో జేఈఈ-మెయిన్‌-2023 సెషన్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మార్చి 15 నుంచి బోర్డు పరీక్షలు ఉన్నాయి. అంటే ఇంటర్‌ పరీక్షల తర్వాత జేఈఈ-మెయిన్‌ రాయడానికి అతి స్వల్ప వ్యవధి మాత్రమే ఉంటుంది.   ఇప్పుడున్న సమయంలో బోర్డు పరీక్షలతో పాటు జేఈఈ      సన్నద్ధతను మెరుగుపరుచుకునే మార్గం తెలుసుకుందాం! 

ఈ సంవత్సరం జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన జేఈఈ-మెయిన్‌-2023 సెషన్‌-1కు దేశవ్యాప్తంగా 8,60,064 మంది విద్యార్థులు బీఈ/బీటెక్‌ విభాగంలో రిజిస్టర్‌ చేసుకున్నారు. 8,23,967 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య కాస్త ఎక్కువనే చెప్పాలి. ఎంద]ుకంటే జేఈఈ-మెయిన్‌-2022 సెషన్‌-1కు 8,72,432 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. అందులో 7,69,589 మంది విద్యార్థులు మాత్రమే రాశారు.  

పరీక్ష పూర్తయిన రెండు మూడు రోజుల్లోనే రెస్పాన్స్‌ షీట్స్‌ ఇవ్వడమే కాకుండా కీలక అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ.. ఈనెల 6న సెషన్స్‌-1 పర్సంటైల్‌ ఫలితాలను ప్రకటించారు. అందులో దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ స్కోరు సాధించారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ఏడాది సెషన్‌-1లో ఏ విద్యార్థీ 300 మార్కులకు 300 మార్కుల స్కోరు సాధించలేదు. కానీ సెషన్‌-1 జేఈఈ-మెయిన్‌-2022లో కనీసం నలుగురు విద్యార్థులు ఈ ఘనతను సాధించారు. దీనికి అనేక కారణాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవాటిని విశ్లేషించుకుంటే.. సరైన ప్రణాళికతో రాబోయే సెషన్‌-2లో మెరుగైన ఫలితాలను సాధించవచ్చు.  

2023 సెషన్‌-1... పెరిగిన పేపర్ల స్థాయి 


జేఈఈ-మెయిన్‌-2022 నుంచీ ప్రశ్నపత్రాల స్థాయిని కొద్దిగా పెంచారు. జేఈఈ-మెయిన్‌ ఆల్‌ ఇండియా ర్యాంకు ఫలితాల్లో ప్రాముఖ్యం వహించేది మ్యాథ్స్‌ కాబట్టి, దాని స్థాయిని కాస్త పెంచినట్టే అనిపిస్తోంది. జేఈఈ-మెయిన్‌ 2022 రెండు సెషన్స్‌లోనూ మ్యాథ్స్‌ పేపర్ల స్థాయి ఇంచుమించు జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ పేపర్ల స్థాయిలో ఉంది. అదే పద్ధతిని ఈసారీ కొనసాగించారు. 


ఈసారి జేఈఈ-మెయిన్‌ సెషన్‌-1 బీఈ/బీటెక్‌ ప్రవేశ పరీక్షలో రోజుకు రెండు షిఫ్ట్‌ల ద్వారా మొత్తం 12 ప్రశ్నపత్రాలు ఇచ్చారు. మ్యాథ్స్‌లో 12్ల×30=360 ప్రశ్నలు, ఫిజిక్స్, కెమిస్ట్రీలలోనూ ఒక్కొక్క దాని నుంచి 360 ప్రశ్నలు వచ్చాయి. మ్యాథ్స్‌ నుంచి 20 శాతం, ఫిజిక్స్‌ నుంచి 5 శాతం, కెమిస్ట్రీ నుంచి 15 శాతం ప్రశ్నలు కాస్త తికమక పెట్టాయి. అయితే ఇది మధ్యస్థాయి విద్యార్థుల మనోగతం. సాధారణ స్థాయి విద్యార్థికి పై శాతాలు కాస్త ఎక్కువనే చెప్పాలి. 


ప్రశ్నల క్లిష్టత 

ఇది అందరికీ ఒకేలా ఉండదు. విద్యార్థిని బట్టి మారుతుంది. ఎ) బహుళ సంబంధిత అంశాల ప్రశ్నలు బి) సుదీర్ఘ గణన సాధ్య ప్రశ్నలు సి) పూర్తిస్థాయి కొత్త తరహా ప్రశ్నలు డి) అస్పష్టమైన విషయాలు కలిగిన ప్రశ్నలు.. సాధించటానికి చాలామంది ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఈ ప్రభావం మిగిలిన ప్రశ్నలపై పడుతుంది. 


సాధారణ స్థాయి విద్యార్థులు - 

మ్యాథ్స్‌: చాలా కష్టంగా ఉంది. ఫిజిక్స్‌: మధ్యమ స్థాయి నుంచి ఎక్కువ స్థాయిలో ఉంది. కెమిస్ట్రీ: కష్టంగా ఉంది. 


మధ్యమ స్థాయి విద్యార్థులు - 

మ్యాథ్స్‌: కష్టం, సుదీర్ఘ గణన సాధ్యం. ఫిజిక్స్‌: మధ్యమ స్థాయి. కెమిస్ట్రీ: కష్టం, సుదీర్ఘ గణన స్థాయి ప్రశ్నలు.


ఉత్తమ స్థాయి విద్యార్థి - 

మ్యాథ్స్‌: కష్టం. ఫిజిక్స్‌: తేలిక స్థాయి నుంచి మధ్యమ స్థాయి. కెమిస్ట్రీ: మధ్యమ స్థాయి. 

ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ జేఈఈ-మెయిన్‌-2023 సెషన్‌ ఫలితాల నుంచి గమనించినది ఏమిటంటే.. కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం- మ్యాథ్స్‌: సుదీర్ఘ గణన సాధ్య ప్రశ్నలు, ఫిజిక్స్‌: తేలిక స్థాయి నుంచి మధ్యమ స్థాయి ప్రశ్నలు, కెమిస్ట్రీ: మధ్యమ స్థాయి నుంచి సుదీర్ఘ గణనస్థాయి ప్రశ్నలతో పరీక్ష రూపొందింది.   

ఈ వివరాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో అటు బోర్డ్‌ పరీక్షల సన్నద్ధతను అనుసంధానం చేస్తూ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో... ఏయే అంశాలపై పట్టు పెంచుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చో తెలుసుకుందాం. 


ఇప్పుడున్న వ్యవధిలో ...

పేపర్‌లోని ఒకటి లేదా రెండు ప్రశ్నలనూ, వాటి స్థాయినీ పరిగణనలోకి తీసుకుని, అన్ని ప్రశ్నలు అలాగే ఉంటాయనే అభిప్రాయం నుంచి బయటకు రండి. 

జేఈఈ-మెయిన్‌-సెషన్‌-1 అన్ని ప్రశ్నపత్రాలనూ నిజాయతీగా సాధన చేయండి. 

వాటితోపాటు కనీసం జేఈఈ-మెయిన్‌-2022 ప్రశ్నపత్రాలను యథాతథంగా మాక్‌టెస్ట్‌ రూపంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా సాధన చేయండి. 

నెగెటివ్‌ మార్కులు ఉండటం వల్ల.. ఎన్ని ప్రశ్నలు రాశారన్నది కాదు- ఎన్ని కరెక్టుగా రాశామన్నదే ముఖ్యం. 

ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో.. ఎన్‌సీఈఆర్‌టీ థియరిటికల్‌ ఇన్ఫర్మేషన్‌ సాధన చేయడం మరవొద్దు. 

సెషన్‌-1లో ప్రశ్నల స్థాయిని బట్టి సెషన్‌-2 కూడా అలాగే ఉంటుందన్న భావన వదిలేసి, ‘పరీక్షలో ప్రశ్నల స్థాయి ఎలా ఉన్నా ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానం గుర్తిస్తాను’ అనే దృఢమైన అభిప్రాయంతో ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే దిశగా ఆలోచించండి. 

కష్టంగా ఉన్న/ కాస్త తికమక పెట్టిన/ గుర్తించిన సమాధానంపై విశ్వాసంలేని ప్రశ్నల్లో ఎక్కువ శాతం ఎసర్షన్‌-రీజన్‌/ స్టేట్‌మెంట్‌-1 అండ్‌ స్టేట్‌మెంట్‌-2 తరహా ప్రశ్నలే. వాటిపై ఎక్కువ దృష్టి సారించండి. 

సీబీఎస్‌ఈ ప్రాక్టికల్‌ మాన్యువల్‌ చదవడం మర్చిపోవద్దు. 

సెషన్‌-1 కంటే సెషన్‌-2 చాలా బాగా రాయాలనే మానసిక సంసిద్ధత చాలా ముఖ్యం. 

జేఈఈ-మెయిన్‌-2022 కటాఫ్‌ల మాదిరిగానే జేఈఈ-మెయిన్‌-2023 కూడా ఉండొచ్చు.


జేఈఈ-మెయిన్‌-2023 సెషన్‌-1 పర్సంటైల్‌ స్కోరుతో ఆలిండియా ర్యాంకు ఎంత సాధించవచ్చో చూడటం ముఖ్యం. జేఈఈ-మెయిన్‌-2022 తుది ఫలితాలతో పోల్చుకుంటూ దాన్నిక్కడ ఇస్తున్నాం. ఈ పట్టిక ద్వారా ప్రస్తుతం విద్యార్థి తాను సాధించిన పర్సంటైల్‌కు ఆలిండియా ర్యాంకు ఎంత సాధించవచ్చో అంచనాకు వచ్చి దాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు.


దేని నుంచి ఎన్ని ప్రశ్నలు?

సెషన్‌-1 మొత్తం 12 పేపర్ల నుంచి మ్యాథ్స్‌ 360 ప్రశ్నలు, ఫిజిక్స్‌ 360 ప్రశ్నలు, కెమిస్ట్రీ 360 ప్రశ్నలు ఇస్తే.. వాటిలో సబ్జెక్టుల వారీగా.. అంశాలవారీగా ప్రశ్నల తీరు ఈ విధంగా ఉంది. 


మ్యాథ్స్‌లో 

1) వెక్టర్స్‌ అండ్‌ 3డీ జామెట్రీ: 57 ప్రశ్నలు (16 శాతం)  
2) డెఫినిట్‌ ఇంటిగ్రేషన్స్‌ అండ్‌ ఏరియాస్‌: 35 ప్రశ్నలు (10 శాతం)
3) ఫంక్షన్స్‌ అండ్‌ ఇన్‌వర్స్‌ ట్రిగనోమెట్రీ: 24 ప్రశ్నలు (7 శాతం)  
4) పర్‌మ్యుటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, బైనామినల్‌ థియరమ్, స్టాటిస్టిక్స్‌: 81  ప్రశ్నలు (22 శాతం)  
5) సర్కిల్స్, కోనిక్స్‌: 26 ప్రశ్నలు (7 శాతం)  
6) కాంప్లెక్స్‌ నంబర్స్‌: 11 ప్రశ్నలు (3 శాతం) 
7) ఇన్‌డెఫినిట్‌ ఇంటిగ్రేషన్స్‌ అండ్‌ డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌: 16 ప్రశ్నలు (4 శాతం)  


పైన పేర్కొన అంశాలన్నీ తెలుగు రాష్ట్రాల రెండు సంవత్సరాల్లో ఉన్న బోర్డ్‌ సిలబస్‌లోని అంశాలన్న విషయం తెలుసుకోవాలి. అంటే సెకండ్‌ ఇయర్‌ బోర్డ్‌ సిలబస్‌లోని అంశాల మీద మాత్రమే దృష్టి సారిస్తే.. కనీసం 60 శాతం ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. మిగిలిన 40 శాతం ప్రశ్నలు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం బోర్డ్‌ సిలబస్‌ నుంచి వస్తాయి.  


అంటే జేఈఈ-మెయిన్‌-2023లో మ్యాథ్స్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు రేపు రాబోయే ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ సిలబస్‌ లోనివే. కాబట్టి పై అంశాలపై మరోసారి దృష్టి పెడితే అటు బోర్డ్‌ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతోపాటు ఇటు జేఈఈ-మెయిన్‌ మ్యాథ్స్‌లో కూడా మంచి ఫలితం సాధించవచ్చు. 


ఫిజిక్స్‌లో 

1) మోడర్న్‌ ఫిజిక్స్, కమ్యూనికేషన్‌ సిస్టమ్, సెమీ కండక్టర్స్‌ అండ్‌ లాజిక్‌ గేట్స్‌: 60 ప్రశ్నలు (16 శాతం)  
2) కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, మేగ్నటిజం అండ్‌ మేటర్, ఎలక్ట్రోమేగ్నిటిక్‌ ఇండక్షన్, ఎలక్ట్రో స్టాటిక్స్, ఏసీ, కెపాసిటెన్స్, ఎలక్ట్రోమేగ్నటిజం: 83 ప్రశ్నలు (23 శాతం)  
3) వేవ్స్, ఎలక్ట్రోమేగ్నెటిక్‌ వేవ్స్, ఎస్‌హెచ్‌ఎం: 32 ప్రశ్నలు (8 శాతం) 
4) ఆప్టిక్స్‌: 25 ప్రశ్నలు (6.9 శాతం) 


మొత్తం ఇంటర్మీడియట్‌ స్టేట్‌ బోర్డ్‌ సెకండియర్‌ సిలబస్‌ నుంచి సుమారు 55 శాతం ప్రశ్నలు అడగటం ద్వారా గమనించాల్సి విషయం ఏమిటంటే... కేవలం బోర్డ్‌ పరీక్షల ప్రిపరేషన్‌తోపాటు మళ్లీ అవే అంశాలపైన సెషన్‌-2 సన్నద్ధత సాగిస్తే, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫిజిక్స్‌లో సెషన్‌-2లో అద్భుత ఫలితాలను సాధించవచ్చు. మిగిలిన 45 శాతం ఇంటర్‌ మొదటి సంవత్సరం సిలబస్‌ అంశాల నుంచి వచ్చినవని గమనించాలి. 


కెమిస్ట్రీలో 
ఇంటర్‌బోర్డ్‌ రెండో సంవత్సరం సిలబస్‌లోని..
1) ఆర్గానిక్‌ కెమిస్ట్రీ (కర్బన రసాయన శాస్త్రాలు): 88 ప్రశ్నలు (27 శాతం) 
2) ఫిజికల్‌ కెమిస్ట్రీ (భౌతిక రసాయన శాస్త్రం): 60 ప్రశ్నలు (16 శాతం) 
3) ఇన్‌ఆర్గానిక్‌ కెమిస్ట్రీ (అకర్బన రసాయన శాస్త్రం): 79 ప్రశ్నలు (22 శాతం) 


 ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర అంశాలపై మాత్రమే దృష్టి సారిస్తే.. సుమారు 63 శాతం ప్రశ్నలపై పట్టు సాధించవచ్చు. అంతేకాకుండా కెమిస్ట్రీలో మంచి ఫలితాలను సెషన్‌-2లో సాధించవచ్చు.


బోర్డ్‌ పరీక్షల తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే నిర్వహించనున్న జేఈఈ-మెయిన్‌ సెషన్‌-2కి తయారవువుతున్న విదార్థులందరూ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో కాలయాపన చేయకుండా ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర అంశాలపై పట్టు సాధించాలి. దీనికోసం పైన పేర్కొన్న సబ్జెక్టులవారీ అంశాలపై రోజుకు ప్రతి సబ్జెక్టుకు అదనంగా 1-2 గంటల సమయం కేటాయించాలి. అటు బోర్డు పరీక్షకు ప్రాధాన్యమిస్తూ ఈ పనిచేయాలి.  


మరింత మెరుగైన పర్సంటైల్‌ సాధించాలంటే సెషన్‌-1లో చేసిన తప్పులు పునరావృతం కాకుండా రాబోయే రోజుల్లో శ్రద్ధగా సాధన చేయడం ఎంతైనా అవసరం. 

- ఎం. ఉమాశంకర్, 

శ్రీచైతన్య ఐఐటీ జాతీయ సమన్వయకర్త

మరింత సమాచారం... మీ కోసం!

‣ మాన‌సికంగా దృఢంగా ఉన్నారా? 

‣ కేంద్రీయ సంస్థ‌ల్లో యూజీ.. పీజీ!

‣ అత్యున్నత కొలువుకు పోటీపడతారా?

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ‘మ్యాట్‌’!

‣ డెక‌రేష‌న్ల‌కు కొన్ని కోర్సులు!

‣ వేదికపై ధీమాగా... నలుగురూ మెచ్చేలా!


 

Posted Date : 18-02-2023

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌