• facebook
  • whatsapp
  • telegram

ప్రాక్టీస్‌ + రివిజన్‌ విజయసూత్రం!

నీట్‌ - 2022 టాపర్‌ సిద్ధార్థరావు

తీవ్రమైన పోటీ ఉండే జాతీయస్థాయి మెడికల్‌ ప్రవేశపరీక్ష ... నీట్‌లో అగ్రశ్రేణిలో నిలవడం అంత తేలికైన పనేమీ కాదు. సబ్జెక్టుపై స్పష్టత, పునశ్చరణ, సాధన ఇవి చాలా ముఖ్యం. అఖిల భారత స్థాయిలో నీట్‌లో 5వ ర్యాంకు సాధించిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు తన విజయానికి దారితీసిన కారణాలను ‘చదువు’కు వివరించాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే!

వారాంతపు పరీక్షలు చాలా ముఖ్యం. ప్రతి పరీక్షనూ సవాల్‌గా స్వీకరించాలి. తరచూ పరీక్షలు రాస్తుంటే సంబంధిత పాఠ్యాంశాలను క్షుణ్ణంగా చదవాల్సి వస్తుంది. అలా పరీక్షలకు సన్నద్ధం కావడం వల్ల పాఠ్యాంశాలపై పట్టు చిక్కుతుంది.

ఎంత చదివావో.. అంతమేరకు పునశ్చరణ (రివిజన్‌) కూడా చాలా ముఖ్యమే. ఎప్పటికప్పుడూ చదివిన పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి. ఎందుకంటే రెండేళ్ల పాఠ్యాంశాలను ఒకేసారి గుర్తుపెట్టుకోవడమంటే దాదాపుగా అసాధ్యమే. రెండేళ్లలో ఎంత త్వరగా పాఠ్యాంశాలను పూర్తి చేయగలిగితే అంత మంచిది. ఎందుకంటే కనీసం మూడుసార్లైనా పునశ్చరణ చేసుకోవాలి. అప్పుడే రెండేళ్ల పాటు మనం పడిన కష్టం బుర్రకు ఎక్కుతుంది. మూడోసారి పునశ్చరణకు వచ్చేసరికి ఇక ఎక్కడ తప్పులు చేస్తున్నామనే అవగాహన వస్తుంది. ఏ కాన్సెప్ట్‌ విషయంలో తప్పులు దొర్లుతున్నాయనేది గ్రహిస్తే వాటిపై ఎక్కువ దృష్టిపెట్టడానికి అవకాశం ఉంటుంది. వారాంతపు పరీక్షల్లో ఎన్ని మార్కులు సంపాదించామనేదాని కంటే.. ఎన్ని తప్పులు చేస్తున్నామనే దానిపై ఎక్కువ దృష్టిపెట్టాలి. అలా చేయడం వల్ల చేసిన తప్పులను మళ్లీ చేయకుండా సరిదిద్దుకోవచ్చు. మొదట్లో ఎక్కువ తప్పులు చేసినా ఫరవాలేదు. కానీ పదే పదే వాటిపై దృష్టిపెట్టడం వల్ల.. చివరికొచ్చేసరికి చాలా తక్కువ తప్పులు దొర్లడానికీ, అసలు తప్పులు లేకుండా ఉండటానికీ అవకాశాలు మెరుగవుతాయి. నేను ఇలాగే నీట్‌కు సన్నద్ధమయ్యాను. నా ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం దాదాపుగా ఆన్‌లైన్‌లోనే గడిచింది. కొవిడ్‌ కొంచెం తగ్గాక ఆఖర్లో నేరుగా తరగతులు నిర్వహించారు. అప్పటివరకూ ఎప్పుడూ వారాంతపు పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించలేదు. కానీ ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహించాక పెట్టిన తొలి వారాంతపు పరీక్షలో మాత్రం మొదటి ర్యాంకు వచ్చింది. దీంతో నాలో విశ్వాసం పెరిగింది. కష్టపడితే నేను మొదటి ర్యాంకు రేసులో నిలబడవచ్చనిపించింది.

కాన్సెప్టును అర్థం చేసుకోవాలి

తరగతి గదిలో పాఠాలు వినడం ఎంత ముఖ్యమో.. ఆ పాఠాలను మనకు మనమే చదువుకోవడం అంతే ముఖ్యం. నేను గంటల తరబడి ఏమీ చదివేవాణ్ని కాదు. కాకపోతే పరీక్షకు సంబంధించి ఎంతమేరకు పాఠ్యాంశాలున్నాయో.. వాటన్నింటినీ పూర్తి చేసేంతవరకూ చదివేవాణ్ని. సాధ్యమైనంత ఎక్కువసేపు చదవడం, ప్రాక్టీసు చేయడం మాత్రం మంచిదే. పాఠ్యాంశాలను బట్టీపట్టడం కంటే.. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కాన్సెప్ట్‌ అర్థమైతే.. పాఠ్యాంశాలను సులువుగా మెదడులో భద్రపర్చవచ్చు. ఎందుకంటే కాన్సెప్ట్‌ అర్థమైతే.. నీట్‌లో కనీసం 600 మార్కులు సాధించవచ్చు. 

బయాలజీ సబ్జెక్టులను మాత్రం లైన్‌ టు లైన్‌ చదవాలి. పాఠ్యాంశంలోని ప్రతి వరుసనూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి సంవత్సరం బట్టీ కొట్టడానికి వీలుగా నీట్‌లో బయాలజీ నుంచి ప్రశ్నలు వచ్చేవి. కానీ ఈ సంవత్సరం కాన్సెప్టు బేస్‌డ్‌గా అడిగారు. రెండు ఆప్షన్లు ఒకే రకంగా ఉండి.. రెండూ దగ్గర దగ్గర సమాధానాలున్నవాటిని ఎక్కువగా అడిగారు. 

నాకు నీట్‌ బయాలజీలో ఎక్కువ మార్కులు రావడానికి కారణం మా జువాలజీ లెక్చరర్‌ శ్రీలక్ష్మి.. బోటనీ లెక్చరర్‌ బసవరాజు. నాకు సందేహమొచ్చిందంటే వెంటనే అడిగేవాణ్ని. మా అధ్యాపకులు కూడా ఎటువంటి విసుగూ ప్రదర్శించకుండా ఎన్నిసార్లు అడిగినా కాదనకుండా వివరించేవారు. అభ్యర్థులు ఎప్పుడు సందేహాలు వచ్చినా వాటిని నివృత్తి చేసుకోవాలి. పక్కవాళ్లు ఏమైనా అనుకుంటారేమోనని మొహమాటపడితే నష్టపోతారు. సాధారణంగా బైపీసీ విద్యార్థులు బయాలజీ సులువుగా ఉంటుందని అనుకుంటారు. కానీ ఈ సంవత్సరం బయాలజీలో ప్రశ్నలు కఠినంగా ఇచ్చారు. కాబట్టి ఏ సబ్జెక్టును కూడా సులువుగా ఉంటుందని అంచనా వేయొద్దు. అన్ని సబ్జెక్టులు కఠినంగానే ఉంటాయనే.. అలాంటి కఠిన ప్రశ్నలతోనే పరీక్షల్లో సన్నద్ధమవ్వాలి. తద్వారా ఒకవేళ కఠినంగా ప్రశ్నపత్రం వచ్చినా రాయడం సులభమవుతుంది. బయాలజీ మాదిరే ఫిజిక్స్‌ పాఠ్యపుస్తకాన్ని క్షుణ్నంగా చదవాలి. థియరీని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు.

ఒత్తిడి అధిగమించడానికి..

వారం వారం పరీక్షలను సన్నద్ధమవడం ఒత్తిడితో కూడుకున్నదే. దీన్ని అధిగమించడానికి ఎక్కువగా సన్నిహిత మిత్రులతో మాట్లాడేవాణ్ని. కుటుంబ సభ్యులతోనూ కాలక్షేపం చేసేవాణ్ని. శనివారం వారాంతపు పరీక్ష వరకు మాత్రం దృష్టంతా పరీక్షపైనే!  ఒక్కసారి పరీక్ష అయిన తర్వాత మానసిక ఉల్లాసానికి ప్రాధాన్యం ఇచ్చేవాణ్ని. పరీక్ష అయిపోయిన తర్వాత రెండు, మూడు గంటల పాటు మళ్లీ అదే ప్రశ్నపత్రాన్ని రాసేవాడిని. ప్రశ్నకు ఐదు ఆప్షన్లు ఇస్తారు కదా.. అందులో సరైన సమాధానాన్ని.. తప్పు సమాధానాన్ని ఎంచుకోమని చెబుతారు. నేను ఆ రెండింటితో పాటు మిగిలిన మూడింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించేవాడిని. ప్రశ్నపత్రం నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. 

ఇన్ని పరీక్షలు రాయడం సమయం వృథా అనుకుంటారు కొందరు. కానీ...

ఎన్ని పరీక్షలు ఎక్కువగా రాస్తే.. అంతగా అవగాహన పెరుగుతుంది. ప్రతి వారాంతపు పరీక్షా ఒక సవాలే. ప్రతి ప్రశ్నపత్రాన్ని విశ్లేషించడమూ ముఖ్యమే.

కొన్ని కఠిన ప్రశ్నపత్రాలు వచ్చినప్పుడు విశ్లేషణకు ఆరు గంటలు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాగా రాశాననే అవగాహన వచ్చిన తర్వాత మానసిక ఉల్లాసం వైపు దృష్టిపెట్టేవాడిని. మొదట్లో నేను ఆలిండియా అనాలసిస్‌లో టాప్‌ 10లో రాలేదు. కానీ చివరికొచ్చేసరికి టాప్‌ 1వ స్థానాన్ని దక్కించుకున్నాను. అందరికంటే ఉన్నతంగా నిలవాలనే పట్టుదల, కసి ఉండాలే తప్ప.. అదే ధ్యాసలో పడి ఒత్తిడి పెంచుకోవద్దు.  

అన్ని రోజులూ ఒకే విధంగా ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మొదట్లో తొలి 10 స్థానాల్లో లేనే లేను. తర్వాత పుంజుకుని అగ్రస్థానంలో నిలిచాను కదా! ఎవరి మీద వారు నమ్మకం పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఆ నమ్మకం, పట్టుదలే ఉత్తమ ర్యాంకుల దిశగా నడిపిస్తాయి. సానుకూల దృక్పథంతో ఆలోచించటం ముఖ్యం.  
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కోర్సు పూర్తికాగానే కొలువులు!

‣ స్కోరుపెంచే జనరల్‌ సైన్స్‌!

‣ ఒకేసారి యూజీ+పీజీ

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

Posted Date : 19-09-2022

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌