• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

నియామక సంస్థలు కోరుకుంటున్న నైపుణ్యాలు

 

 

డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ లాంటి వృత్తివిద్యలు పూర్తిచేసినవారు త్వరగా ఉద్యోగం సంపాదించాలనుకుంటారు. అసలు నియామక సంస్థలు ఏ నైపుణ్యాలు ఉన్నవారి కోసం అన్వేషిస్తున్నాయో గ్రహించటం ముఖ్యం. ఫోర్బ్స్‌ తాజా అధ్యయనం రానున్న పదేళ్లలో కొలువులకు అవసరమయ్యే నైపుణ్యాలను గుర్తించింది. వీటిని పెంపొందించుకుంటే.. త్వరగా ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యం నెరవేరుతుంది!  

 

ప్రపంచం నూతన పారిశ్రామిక విప్లవం వైపు సాగుతూ అంతటా పెను మార్పులు వేగవంతమవుతున్నాయి. ఆటోమేషన్‌ విస్తృతమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగార్థులు సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకున్నంత మాత్రాన సరిపోదు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా యంత్రాలకు అసాధ్యమైన సాఫ్ట్‌స్కిల్స్‌ను నేర్చుకోవాలి; వృద్ధి చేసుకోవాలి. ఫోర్బ్స్‌ ప్రకారం.. రాబోయే పది సంవత్సరాల్లో గిరాకీ పెరిగే 10 కీలక నైపుణ్యాలేమిటో చూద్దాం.

 

మార్పునకు అనుకూలత

మార్పును స్వాగతించేవారిలో ముందు ఉండగలగాలి. పనిచేసే చోట భవిష్యత్తులో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే మార్పులూ, చేర్పులకు సిద్ధంగా ఉండగలగాలి. మారిన పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మెరుగుపరుచుకునేవారికి కార్యాలయాల్లో ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుంది. స్వీకరించగలిగే స్వభావం ఉంటేనే మార్పు అనేది సాధ్యమవుతుంది. ఈ స్వభావం ఉన్నవాళ్లు విశాల దృక్పథం, కుతూహలం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తితో ఉంటారు. వీళ్లు తమ దృష్టిని ఎప్పుడూ అవకాశాల మీదే నిలుపుతారుగానీ.. అడ్డంకుల మీద కాదు.

 

డిజిటల్‌ లిటరసీ

రోజువారీ విధుల్లో భాగంగా.. వివిధ ఉపకరణాలు, సాఫ్ట్‌వేర్, యాప్‌లను సురక్షితంగా, నమ్మకంగా ఉపయోగించగలిగే నేర్పునే డిజిటల్‌ లిటరసీగా చెప్పొచ్చు. ఈ సామర్థ్యాన్ని సాధించాలంటే డిజిటల్‌ సాధనాల వాడకంపై చక్కని పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఈ నైపుణ్యం ఉన్నవాళ్లు సులువుగా భావవ్యక్తీకరణ చేస్తూ ఇతరులకు సహకరిస్తూ పనిచేయగలుగుతారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని సమర్థంగా, వేగంగా పనిచేయడానికి దీన్ని వినియోగించగలుగుతారు. రోజువారీ పనుల్లో భాగంగా వినియోగదారులకు సంస్థ తరపున ఈ-మెయిల్స్‌ పంపించాల్సి ఉంటుంది. యాప్‌ల ద్వారా వినియోగదారులకు సమాచారాన్ని అందించాల్సి రావచ్చు. ఈ నైపుణ్యంతో సమాచారాన్ని వీలైనంత వేగంగా, కచ్చితంగా అందించడానికి వీలవుతుంది. వృత్తిపరంగా ఎదుగుదలకు తోడ్పడే నైపుణ్యంగా దీన్ని చెప్పొచ్చు.

 

నాయకత్వ లక్షణాలు

సాధారణంగా ఉన్నతోద్యోగులకు మాత్రమే ఈ లక్షణాలు ఉంటే సరిపోతుంది అనుకుంటారు. అది సరైన అభిప్రాయం కాదు. ఇది ప్రతి ఉద్యోగికీ అవసరమైన నైపుణ్యం. బృందంలో ఒకడిగా పనిచేయాలన్నా, మూసధోరణికి భిన్నంగా ఆలోచించాలన్నా, భిన్న సంస్కృతుల వ్యక్తులున్నచోట ఇమడాలన్నా నాయకత్వ సామర్థ్యం అవసరమే. బహుళజాతి సంస్థల్లో పనిచేసినప్పుడు.. భిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రాజెక్టు, బృందం లేదా విభాగాన్ని ముందుకు నడిపించడంలో ఈ నైపుణ్యం ఉన్నవాళ్లు త్వరగా విజయం సాధించగలుగుతారు.

 

సహకారం

బృందంలో సభ్యులుగా ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలి. వేర్వేరు ప్రదేశాల్లో ఉంటూ కూడా ఒకే ప్రాజెక్టు మీద పనిచేయాల్సి రావచ్చు. అలాంటివారికి ఈ నైపుణ్యం ఎంతో అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో పని వాతావరణంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బృందంలో చక్కని నైపుణ్యాలు ఉన్నవాళ్లూ, లేనివాళ్లూ ఇద్దరూ ఉంటారు. ప్రాజెక్టులో భాగంగా.. వీరందరినీ సమన్వయపరుచుకుంటూ పనిచేయాలి. ఆలోచనలను పంచుకుంటూ కలిసికట్టుగా, సమర్థంగా పనులను పూర్తిచేయాలి.

 

సమయపాలన 

ఆఫీసులో పనిచేసినా.. ఇంటి నుంచి పనిచేసినా.. లేదా సొంతంగా అంకుర సంస్థను ప్రారంభించినా సమయపాలన ఎంతో అవసరం. నిజానికి విద్యార్థి దశ నుంచీ దీన్ని అలవరుచుకుంటే వృత్తి జీవితంలో ఏమాత్రం ఇబ్బందీ ఎదురుకాదు. ఈ నియమాన్ని పాటించేవాళ్లు అదనంగా పనిచేయాల్సిన అవసరమూ ఉండదు. ఎందుకంటే అందుబాటులో ఉన్న సమయలోనే మొత్తం పనిని పూర్తిచేయగల నేర్పు వీరికి అలవడుతుంది. ప్రాథమ్యాలను గుర్తించగలుగుతారు. వాటికి అనుగుణంగా సమయాన్ని విభజించుకుని కేటాయించిన సమయంలోనే పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఈ నియమాన్ని పాటించేవాళ్లు మానసికంగా ఆరోగ్యంగానూ ఉండగలుగుతారు. వ్యక్తిగత, వృత్తి జీవితాల మధ్య చక్కని సమన్వయాన్ని సాధించగలుగుతారు. ఎప్పుడు ఏ పని చేయాలనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉంటుంది. కాబట్టి పనుల్లో ఎలాంటి ఆటంకాలకూ అవకాశం ఉండదు. నిర్ణీత సమయంలోనే పనులను పూర్తిచేసి గుర్తింపూ పొందుతారు. 

 

సృజనాత్మకత 

ఊహలకు రెక్కలు తొడిగి.. అందమైన ఆలోచనలకు చక్కని రూపాన్ని ఇవ్వగలిగేదే సృజన. రోజువారీ పనులను యంత్రాల సహాయంతో సులువుగా, వేగంగా చేయొచ్చు. కానీ సృజనాత్మకంగా ఆలోచించగలగడం ఒక్క మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది. సమస్యలను విభిన్నంగా పరిష్కరించడం, మూసధోరణికి భిన్నంగా ఆలోచించగలడం.. లాంటివి ఈ నైపుణ్యం కిందికే వస్తాయి. ఇలా ఆలోచించగలిగేవారు ఏ రంగంలో ఉన్నా.. ఎంతమందిలో ఉన్నా.. తమ ప్రత్యేకతతో గుర్తింపును సొంతం చేసుకోగలుగుతారు. సృజనాత్మకంగా ఆలోచించేవారి ప్రతిభ కూడా సరిహద్దులు దాటి విస్తరిస్తుంది. 

 

డేటా లిటరసీ

సంస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని వివిధ సంస్థలు తమ విలువైన ఆస్తిగా భావిస్తాయి. అలాంటి సమాచారాన్ని సేకరించి, జాగ్రత్తగా భద్రపరిచి, అవసరానికి సమర్థంగా వినియోగించాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాలున్న ఉద్యోగులను నియమించుకోవడానికే సంస్థలు ఆసక్తి చూపిస్తాయి. నిజానికి గోప్యతను పాటిస్తూ, సమాచారాన్ని భద్రంగా నిక్షిప్తం చేయడం అనేది ఎంతో ముఖ్యమైన నైపుణ్యం. ఈ సామర్థ్యం ఉన్నవాళ్లు యాంత్రికంగా కాకుండా.. బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తించగలుగుతారు.

 

విమర్శనాత్మక దృక్పథం 

విజయానికి చేరువచేసే నైపుణ్యమిది. ఈ సామర్థ్యం ఉన్నవాళ్లు వివిధ సమస్యలనూ, పరిస్థితులనూ.. వ్యక్తిగత అభిప్రాయాలు, పక్షపాతాల ఆధారంగా కాకుండా.. వాస్తవాల ఆధారంగా విశ్లేషించగలుగుతారు. ఈ నైపుణ్యం ఉంటే ప్రశ్నించి, నిజాన్ని వెలికితీయగలిగే నేర్పు అలవడుతుంది. వివిధ కోణాల్లో పరిశీలించి, విశ్లేషించి సమస్యలకు పరిష్కారాలను కనుక్కోగలుగుతారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నేర్పుగా బయటపడే మార్గాల గురించి ఆలోచించగలుగుతారు. 

 

భావోద్వేగ ప్రజ్ఞ 

మన అభిప్రాయాలను వ్యక్తం చేయాలన్నా, పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం నియంత్రించుకోవాలన్నా ఈ ప్రజ్ఞ ఎంతో అవసరం. స్వీయ భావోద్వేగాలు తమపైనా.. చుట్టూవున్న వారి మీదా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఈ నైపుణ్యం ఉన్నవాళ్లు అర్థం చేసుకోగలుగుతారు. అందువల్ల ఉద్వేగాలను అదుపులో ఉంచుకుని పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించగలుగుతారు. అంతేకాదు- ఎదుటివారి దృష్టి కోణాన్ని అర్థం చేసుకునే సహానుభూతినీ పెంచుకోగలుగుతారు. ఈ ప్రజ్ఞ ఉంటే.. సమస్యను తమ కోణం నుంచే కాకుండా ఇతరుల దృష్టి కోణం నుంచీ చూడగలిగే నేర్పు అలవడుతుంది 

 

కుతూహలం, నిరంతర అభ్యాసం 

వయసు, పనిచేసే రంగాలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన నైపుణ్యం ఇది. నేర్చుకోవాలనే తపన ఉంటే.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని వారు తీర్చిదిద్దుకోగలుగుతారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉద్యోగాలనూ, పదోన్నతులనూ సొంతం చేసుకోగలుగుతారు. అర్హతలెన్ని ఉన్నా..అనుభవం గడించినా.. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపనే లేకపోతే.. మొదలుపెట్టినచోటే ప్రయాణం నిలిచిపోతుంది. ఈ నైపుణ్యం ఉన్నవాళ్లు మాత్రమే అడ్డంకులను అధిగమించి అవకాశాలను సృష్టించుకోగలుగుతారు. 

 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆన్‌లైన్‌ పరీక్షలు రాసేముందు!

‣ ఆహార సంస్థలో అందుకోండి ఉద్యోగాలు!

‣ నీట్‌ కటాఫ్‌ ఎంత?

‣ ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!

Posted Date : 14-09-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌