• facebook
  • whatsapp
  • telegram

ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!

బ్రిటన్‌ ప్రధాని పీఠంపై లిజ్‌ ట్రస్‌

బ్రిటన్‌ ప్రధాని ఎన్నికల్లో భారత్‌ మూలాలున్న రిషి సునాక్‌పై లిజ్‌ ట్రస్‌ విజయం సాధించారు. గతంలో బ్రిటన్‌ విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆమెకు ప్రస్తుతం ఇంటా బయటా అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. దేశీయంగా నిరుద్యోగిత, అధిక ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను ట్రస్‌ సత్వరం చక్కబెట్టాలి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంతోపాటు యావత్‌ ప్రపంచ భద్రతకు అమెరికా, భారత్‌ వంటి దేశాలతో కలిసి నడవడమూ కీలకమే. ఉక్రెయిన్‌ సంక్షోభంతో ఇన్నాళ్లూ రష్యాపై దూకుడుగా మాట్లాడిన ఆమె- ఇంధన ఇక్కట్లు ముంచుకొస్తున్న వేళ మాస్కోపై ఆంక్షల విషయంలో ఇకపై ఎలా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠగా మారింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన ఇండియాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ట్రస్‌ ఎలా కృషి చేయనున్నారన్నదీ ఆసక్తి రేకెత్తిస్తోంది. బ్రిటన్‌ను తోసిరాజని ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్‌ తాజాగా అయిదో స్థానానికి ఎగబాకింది. ఇరు దేశాలు దీర్ఘకాలంగా కాంక్షిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) త్వరితగతిన సాకారం చేయడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకోవచ్చు.

ఇంగ్లాండ్‌ గత ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హయాములో భారత్‌, బ్రిటన్‌ సంబంధాలు బాగా బలపడ్డాయి. ట్రస్‌ కూడా దిల్లీతో బలమైన సంబంధాలను ఆకాంక్షించే అవకాశం ఉంది. జాన్సన్‌ కేబినెట్‌లో విదేశాంగ మంత్రిగా, అంతర్జాతీయ వాణిజ్య శాఖామాత్యులుగా పనిచేసినన్నాళ్లూ ఇండియాతో వ్యూహాత్మక, ఆర్థిక బంధాల బలోపేతానికే ఆమె ప్రాధాన్యమిచ్చారు. ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ట్రస్‌ భారత్‌లో పర్యటించారు. రక్షణ, భద్రత రంగాల్లో మాస్కోతో కంటే తమతో పటిష్ఠ బంధాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గుచూపాలని మోదీ ప్రభుత్వాన్ని కోరారు. రష్యా, చైనా బాగా దగ్గరవుతున్న సంగతిని గుర్తుచేశారు. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు పెరుగుతుండటంతో- భారత్‌తో సంబంధాలను తాము మరింతగా బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత పెరిగిందని నాడు వ్యాఖ్యానించారు. చైనా దుందుడుకు వైఖరిని ట్రస్‌ గతంలో అనేక అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టారు. అదీ ఇండియాకు సానుకూలాంశమే.

ఇండియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువ ప్రస్తుతం 2,500 కోట్ల పౌండ్ల వరకు ఉన్నట్లు అంచనా. ఇది భారీ మొత్తమే. వాణిజ్యంతోపాటు రక్షణ, పర్యాటక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా ఉభయ దేశాలు లబ్ధి పొందేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాలిస్తే- దిల్లీ, లండన్‌ మధ్య దిగుమతి సుంకాలు తగ్గుతాయి. వ్యాపార కార్యకలాపాలు సులభతరమవుతాయి. భారత్‌-యూకే మెరుగైన వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం(ఈటీపీ)పై బ్రిటన్‌ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి హోదాలో ట్రస్‌ సంతకం చేశారు. దీపావళికల్లా పూర్తిస్థాయి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలనూ ఆమె రూపొందించారు. బ్రిటన్‌లో రాజకీయ అనిశ్చితి కారణంగా అది కాస్త నెమ్మదించింది. ఇకపై సంప్రతింపులు మళ్ళీ జోరందుకొనే అవకాశాలున్నాయి. ప్రధాని పదవికి పోటీపడుతున్నప్పుడు- ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తానని, సంక్షేమ కార్యక్రమాలపై భారీగా నిధులు ఖర్చు చేస్తానని ట్రస్‌ హామీలిచ్చారు. వాటిపై ఆర్థిక నిపుణులు పెదవి విరిచారు. ట్రస్‌ ప్రధానిగా ఎన్నికైన వెంటనే ఆ హామీల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కొంత కనిపించింది. పౌండ్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్లో కొద్దిగా పతనమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థతో స్వేచ్ఛా వాణిజ్యం బ్రిటన్‌కు చాలా అవసరమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ట్రస్‌ ప్రధాని పీఠమెక్కగానే మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె హయాములో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆకాంక్షించారు. ట్రస్‌ కేబినెట్‌లో భారత సంతతి నేతలు సుయెలా బ్రావెర్మన్‌, అలోక్‌ శర్మలకు చోటుదక్కడమూ స్వాగతించదగిన పరిణామం. బ్రిటన్‌లో భారత సంతతి జనాభా దాదాపు 15 లక్షలు. ట్రస్‌ తన ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో వారి ప్రయోజనాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇండియాలో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసి తమ దేశంలో తలదాచుకొంటున్న విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ వంటి ఆర్థిక నేరగాళ్ల అప్పగింత ప్రక్రియను వేగవంతం చేయాలి. బ్రిటన్‌ వేదికగా ఖలిస్థానీ ఉగ్రవాదుల కార్యకలాపాలకు ముకుతాడు వేయాల్సిన అవసరమూ ఉంది.

- మండ నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉజ్జ్వల భారత్‌ సాకారమే లక్ష్యంగా...

‣ జీవవైవిధ్యానికి గొడ్డలి పెట్టు

‣ అందరికీ అందని బ్యాంకింగ్‌ సేవలు

‣ గాలి అందుబాటులోనూ అసమానతలు

Posted Date: 12-09-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం