• facebook
  • whatsapp
  • telegram

ఉజ్జ్వల భారత్‌ సాకారమే లక్ష్యంగా...

అయిదు ప్రతిజ్ఞలు

రాబోయే పాతికేళ్లలో ఆత్మనిర్భర భారత్‌ ఉజ్జ్వల ప్రకాశాన్ని ప్రపంచమంతా వీక్షించాలనే బృహత్‌ సంకల్పంతో ప్రధాని నరేంద్రమోదీ శంఖం పూరించారు. మొన్నటి స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ... 2047నాటికి అభివృద్ధి చెందిన భవ్య భారతాన్ని ఆవిష్కరించే మహత్తర బాధ్యతను ప్రజలంతా స్వీకరించాలని ఆయన పిలుపిచ్చారు. అమృతకాల మార్గంలో పయనిస్తున్న కోట్ల మంది దేశ ప్రజల అసంఖ్యాక ప్రయత్నాలకు అనుపమానమైన శక్తినిస్తూ- అయిదు ప్రతిజ్ఞలకు అందరూ కట్టుబడి ఉండాలని ప్రధాని ప్రతిపాదించారు. వాటిని పంచప్రాణ ఉపదేశంగా పేర్కొన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా గత 20 ఏళ్ల సేవాకాలంలో నరేంద్ర మోదీ ఆలోచనలు, వ్యవహారశైలిలో ఆ ప్రతిజ్ఞల ప్రేరణ కనిపిస్తుంది.

మనసుంటే మార్గం...

దేశాభివృద్ధి కోసం ప్రజలు భారీ సంకల్పాలతో ముందడుగు వేసేందుకు ప్రతినబూనాలనేది ప్రధాని మోదీ మొదటి ప్రతిపాదన. సంకల్పం లేకుండా పెద్ద లక్ష్యాలను సాధించడం సాధ్యంకాదు. ప్రస్తుత సాంకేతిక యుగంలో మనం పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోకపోతే దేశ నవోదయ వైభవాన్ని సాకారం చేసుకోవడం కష్టమవుతుంది. ఈ సంకల్పానుసారం మన ఇంజినీర్లు 4జీ సాంకేతికతను సంపూర్ణంగా అభివృద్ధి చేశారు. భారత్‌ ఇప్పుడు 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించి ప్రపంచంతో సమానంగా ముందడుగు వేస్తోంది. అదే సమయంలో 6జీ అభివృద్ధి విషయంలో ‘మేమూ ప్రపంచంతో సమానంగా అడుగేస్తున్నాం’ అనే విశ్వాసంతో పయనిస్తోంది. మొబైల్‌ తయారీ ప్రస్థానం గత ఎనిమిదేళ్లలో రెండు యూనిట్ల స్థాయి నుంచి రెండు వందలకు పైగా యూనిట్లకు చేరింది. భారత్‌ ఇప్పుడు మొబైల్‌ తయారీలో ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఆవిర్భవించింది. వచ్చే ఇరవై ఏళ్ల కోసం దేశంలో సెమీకండక్టర్‌ మిషన్‌ ప్రణాళికను రూపొందించారు. ఈ రోజు ప్రపంచంలో 20శాతం చిప్‌ డిజైనర్లు భారతీయులే. అలాంటి 85వేల మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రపంచంకోసం విశ్వసనీయమైన, నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారుచేస్తున్నాం.

మన మదిలో బానిసత్వ జాడలన్నింటినీ సంపూర్ణంగా తుడిచేసే ప్రతిజ్ఞ చేయాలన్నది ప్రధాని రెండో ప్రతిపాదన. ఇది మనల్ని ఓటమి అంచుల నుంచి గెలుపు తీరాలవైపు నడిపిస్తుంది. మన మనసుల్లో బానిసత్వపు జాడలు ఉంటే ఆత్మన్యూనతతో మనల్ని మనం తక్కువగా భావిస్తాం. అప్పుడు మనం పూర్తి సామర్థ్యాలతో పనిచేయలేం. గడచిన ఎనిమిదేళ్లలో ఎన్నోరంగాల్లో ప్రపంచంతో పోటీ పడగలనని భారత్‌ చాటిచెప్పింది. విభిన్న రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించగలనని నిరూపించింది. ఈ విషయాన్ని మనం డిజిటల్‌ చెల్లింపులు, టీకా, సాంకేతిక రంగాల్లో నిరూపించాం. ఆధార్‌ మద్దతుతో లబ్ధిదారులకు ప్రయోజనాలు కచ్చితంగా అందుతున్నాయి. కరోనా సంకట సమయంలో విదేశీ టీకాలకంటే ముందే దేశీయ టీకాలను అందుబాటులోకి తేవడం బానిసత్వాన్ని ఛేదించడమే. ఈ రోజు భారత్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వందే భారత్‌ రైళ్లు, దేశానికి చెందిన నిపుణులైన ఇంజినీర్ల ద్వారా కవచ్‌ సురక్ష వ్యవస్థలను రూపొందించింది. 

మన సంస్కృతి, వారసత్వాలను చూసి గర్వించాలన్నది ప్రధాని మోదీ మరో పిలుపు. ఏ దేశమైనా, సమాజమైనా తన సంస్కృతి, వారసత్వాలను అర్థం చేసుకోకుండా బలోపేతం కాలేదు. ఒక దేశ ఐక్యత, సమృద్ధికి అవే మూలం. ఈ భావన ఆధారంగా ఇండియా సాంస్కృతిక వైభవాన్ని దేశ, విదేశాలకు తీసుకెళ్ళడానికి భారత్‌ గౌరవ యాత్ర పేరుతో రామాయణ్‌, దివ్యకాశీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రణాళికలు రూపొందించాం. ఆహారం, వేషభాషలు, వాతావరణ వైవిధ్యం దేశీయంగా ఆయా ప్రాంతాల్లోని సంస్కృతికి ఒక విలక్షణతను ఇచ్చాయి. దానికి అనుగుణంగా చెన్నై రైల్వేస్టేషన్లో కాంచీపురం పట్టుచీరలు, న్యూ జల్‌పాయీగుడీ స్టేషన్లో వెదురు ఉత్పత్తులు, పూరీ స్టేషన్లో చెక్క బొమ్మల్లాంటి వాటికి ప్రోత్సాహం అందిస్తున్నాం. స్థానిక వారసత్వం, సంస్కృతి ప్రతిబింబించేలా రైల్వేస్టేషన్లను రూపొందిస్తున్నాం. వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తున్న ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్లు సాంస్కృతిక చరిత్ర, వారసత్వ వైభవం, అత్యధిక సాంకేతిక పరిజ్ఞాన సమ్మేళనానికి నమూనాగా నిలుస్తాయి. 

ప్రజాఉద్యమ రూపం

దేశంలోని ప్రతి పౌరుడూ తన బాధ్యతలకు త్రికరణశుద్ధిగా కట్టుబడి ఉండాలని ప్రధానమంత్రి అయిదో ప్రతిపాదనలో పిలుపిచ్చారు. పౌరులు తమ విధ్యుక్త ధర్మానికి కట్టుబడి ఉండకపోతే సామాజిక మార్పులు సాధ్యంకావు. అనుకున్న లక్ష్యాలనూ చేరుకోలేం. భారత్‌ను సుసంపన్నం చేయడానికి అభివృద్ధి యాత్రను ప్రజాఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్ళాలి. భారతీయ రైల్వేలో ఆధునిక రైల్వే స్టేషన్లు, రైళ్ల ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలను అందుబాటులోకి తేవడానికి మేం కంకణబద్ధులై ఉన్నాం. అయితే, వాటిని శుభ్రంగా, సురక్షితంగా ఉంచడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శనంలో స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమం ప్రజా ఉద్యమ రూపాన్ని సంతరించుకొని జనావళి కర్తవ్యాన్ని చాటిచెప్పింది. దేశానికి నేతృత్వం వహించేవారి దగ్గరి నుంచి చిట్టచివరన నిలుచున్న వ్యక్తి దాకా, ప్రతి ఒక్కరినీ ఈ ప్రతిజ్ఞలు ఏకం చేస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ పంచప్రాణాలను ఆవాహన చేసుకొని లక్ష్యసాధన కోసం పయనించాలి. 140 కోట్ల భారతీయుల ప్రాణశక్తితో ప్రధాని మోదీ నినదించిన ఈ అయిదు ప్రతిజ్ఞలను చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో నెరవేరిస్తే నిర్దేశిత వికాస భారత్‌ లక్ష్యాన్ని అత్యంత వేగంగా చేరుకోవడంలో తప్పకుండా విజయం సాధించగలం!

ఐకమత్యమే బలం

అందరూ ఒక్కటిగా ఉంటూ ఏక్‌భారత్‌ శ్రేష్ఠ్‌భారత్‌ నిర్మాణం చేపట్టాలనేది ప్రధానమంత్రి నాలుగో ప్రతిజ్ఞ. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే అమోఘమైన శక్తి ఐకమత్యంలోనే దాగి ఉంటుంది. దీని ఆధారంగానే ప్రభుత్వంలోని విభిన్న విభాగాలు ఏకతాటిపైకి వచ్చి సమగ్ర మౌలికవసతుల అభివృద్ధి విధానాన్ని ఖరారు చేయబోతున్నాయి. ఈ జాతీయ బృహత్‌ ప్రణాళిక రానున్న 25 ఏళ్ల అభివృద్ధికి ఒక బలమైన పునాది కానుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, ఉజ్జ్వల్‌ యోజన, స్వచ్ఛభారత్‌ అభియాన్‌, ప్రతి ఇంటికీ కొళాయినీరు, ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు లాంటి విస్తృతమైన పథకాలకు ఊతమిస్తోంది. 21వ శతాబ్దపు సమ్మిళిత సమాజ నిర్వచనాన్ని మరింత బలోపేతం చేస్తోంది. కరోనా మహమ్మారి కాలంలో వందేభారత్‌ మిషన్‌, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగినప్పుడు ఆపరేషన్‌ గంగ లాంటి కార్యక్రమాల ద్వారా స్వదేశంలో, విదేశాల నుంచి భారతీయులను గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రధానమంత్రి విశేష కృషి చేశారు. తద్వారా భారతీయుల్లో ఎనలేని విశ్వాసం పాదుకొల్పారు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జీవవైవిధ్యానికి గొడ్డలి పెట్టు

‣ అందరికీ అందని బ్యాంకింగ్‌ సేవలు

‣ గాలి అందుబాటులోనూ అసమానతలు

‣ ఇంధన సంక్షోభం ముంగిట ఐరోపా

‣ అంతర్గత ప్రజాస్వామ్యం ఎండమావి

‣ ఎన్‌సీసీతో ఆర్మీలో ఆఫీసర్‌

‣ కొత్త డిగ్రీలు ఎన్నో అవకాశాలు

Posted Date: 12-09-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం