• facebook
  • whatsapp
  • telegram

Polytechnic Course: పాలిసెట్‌ పాసయ్యారా.. డిమాండ్‌ ఉన్న డిప్లొమా కోర్సులో  చేరండి 

* పాలిటెక్నిక్‌ కోర్సులు, ఉద్యోగావకాశాల వివరాలు
 


పదో తరగతి తర్వాత.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్, బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ.. కోర్సులు చదవాలనుందా? అయితే పాలిటెక్నిక్‌ డిప్లొమాలో చేరిపోండి. ఇప్పుడీ కోర్సులు ఎంతో వైవిధ్యాన్ని సంతరించుకున్నాయి. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా వీటిని తీర్చిదిద్దుతున్నారు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలూ పొందవచ్చు లేదా స్వయం ఉపాధి, ఉన్నత విద్యలోనూ రాణించవచ్చు. అభిరుచి, ఆసక్తి ప్రకారం ఎంచుకోవడానికి పదుల సంఖ్యలో డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 


సత్వర ఉపాధికి డిప్లొమా మార్గం

సాంకేతిక విజ్ఞానంపై ఆసక్తి ఉండి, తక్కువ వ్యవధిలో స్థిరపడాలని ఆశించేవాళ్లు డిప్లొమా కోర్సులకు ఓటేయొచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో పట్టున్నవారు వీటిలో రాణించగలరు. కొన్ని బ్రాంచీల్లో కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో డిప్లొమాలో చేరడానికి పాలిటెక్నిక్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలీసెట్‌)లో మంచి ర్యాంకు సాధించాలి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న వివిధ డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి.

కోర్సులు

సివిల్, ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్, గార్మెంట్‌ టెక్నాలజీ, క్రాఫ్ట్‌ టెక్నాలజీ, హోమ్‌ సైన్స్, మెటలర్జికల్, కెమికల్, సిరామిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్, పెట్రోలియం టెక్నాలజీ, పెట్రో కెమికల్‌ టెక్నాలజీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, ఎంబడెడ్‌ సిస్టమ్స్, ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, లెదర్‌ టెక్నాలజీ.. తదితర బ్రాంచీలను ఏపీ, తెలంగాణ పాలిటెక్నిక్‌ల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో అందిస్తున్నారు.  

ఉద్యోగాలు 

కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు పలు ప్రభుత్వ అనుబంధ సంస్థలు, విభాగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. మహారత్న, నవరత్న, మినీరత్న, పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల్లో వీరు సేవలు అందించవచ్చు. రైల్వేలో జూనియర్‌ ఇంజినీర్‌ (జేఈ) పోస్టులకు డిప్లొమాతోనే పోటీపడవచ్చు. అలాగే వివిధ కేంద్రీయ సంస్థల్లో జేఈ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఏడాది/ రెండేళ్లకు ఒకసారి ప్రకటన విడుదల చేస్తోంది. పరీక్షలో ప్రతిభ చూపినవారు లెవెల్‌-6 మూలవేతనం రూ.35,400తో మొదటి నెల నుంచే సుమారు రూ.55,000 జీతం పొందుతారు. 


విస్తృత అవకాశాలు

రాష్ట్ర స్థాయిలో విద్యుత్తు పంపిణీ, రహదారులు, భవనాలు; పంచాయతీరాజ్, నీటిపారుదల.. శాఖల్లో డిప్లొమాతో దూసుకుపోవచ్చు. వీరికి ప్రైవేటు రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. నిర్మాణ రంగం, ఆటోమొబైల్, పవర్‌ ప్లాంట్లు, ఇంజినీరింగ్‌ సంస్థల్లో సులువుగానే నిలదొక్కుకోవచ్చు. ప్రభుత్వ, పేరొందిన పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలూ జరుగుతున్నాయి. పలు రంగాల్లో సేవలు అందిస్తోన్న కార్పొరేట్‌ సంస్థలు ఆకర్షణీయ వేతనంతో వీరికి ఉద్యోగాలిస్తున్నాయి. రైల్వేలో లోకో పైలట్‌ పోస్టుకు సంబంధిత బ్రాంచీల్లో డిప్లొమా పూర్తిచేసుకున్నవారు పోటీపడొచ్చు. 

సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ బ్రాంచీలవారికి ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలుంటాయి. 

‣ విద్యుదుత్పాదక, పంపిణీ సంస్థల్లో ఎలక్ట్రికల్‌ విభాగం వాళ్లు రాణించగలరు.

‣ సివిల్‌ డిప్లొమాతో.. నీటిపారుదల శాఖ, ప్రజారోగ్యం, రహదారులు, రైల్వే, నిర్మాణ రంగంలో సేవలు అందించవచ్చు. 

కొన్ని బ్రాంచీల వారికి రక్షణ రంగంలోనూ కొలువులు ఉన్నాయి. ఎయిర్‌ ఫోర్సులో ఎక్స్, వై ట్రేడులు; కోస్టుగార్డులో యాంత్రిక్‌ పోస్టులకు డిప్లొమా అర్హతతో పోటీ పడవచ్చు. డిప్లొమాతోనే సౌదీ, దుబాయ్, సింగపూర్, మలేసియా.. మొదలైన దేశాల్లో మంచి అవకాశాలు అందుతున్నాయి. 

ఉన్నత విద్య

డిప్లొమా తర్వాత ఈసెట్‌తో నేరుగా బీటెక్‌ రెండో సంవత్సరం కోర్సుల్లో చేరిపోవచ్చు. వీరు ఎంసెట్‌/ఈఏపీసెట్, ఐఐటీ-జేఈఈ రాసుకోవచ్చు. డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరినవాళ్లు ఇంజినీర్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అందించే బీటెక్‌తో సమానమైన.. అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ది ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఏఎంఐఈ) పూర్తిచేసుకోవచ్చు. అనంతరం ఎంటెక్‌లో చేరవచ్చు. కొన్ని డిప్లొమాలతో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం కోర్సుల్లోకి అనుమతిస్తున్నారు. 

‣ కొన్ని డీమ్డ్, ప్రైవేటు సంస్థలు పదో తరగతి తర్వాత ఆరేళ్ల వ్యవధితో డిప్లొమా + బీటెక్‌ కోర్సులను నడుపుతున్నాయి. ఆసక్తి ఉన్నవారు వాటిలోనూ చేరవచ్చు.

‣ కొన్నేళ్లుగా.. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (ఏఐ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్, కమ్యూనికేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ నెట్‌

‣  వర్కింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ, వెబ్‌ డిజైనింగ్, 3డీ యానిమేషన్‌ గ్రాఫిక్స్, యానిమేషన్‌-మల్టీ మీడియా టెక్నాలజీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ.. మొదలైన కోర్సులను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కళాశాలల్లో డిప్లొమాలో భాగంగా అందిస్తున్నారు. పాలీసెట్‌లో చూపిన ప్రతిభతో వీటిలోనూ చేరవచ్చు. ఇవే కోర్సులను బీఎస్సీ/ బీటెక్‌లో భాగంగానూ చదువుకోవచ్చు.   AP Polycet 2024 Results   

Posted Date : 08-05-2024

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌