• facebook
  • whatsapp
  • telegram

ఏపీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నెగ్గేదెలా?

సమగ్ర సన్నద్ధత వ్యూహం

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను జనవరి 8కి వాయిదా వేయడంతో ఈ పరీక్ష సమగ్ర సస్నద్ధతకు అభ్యర్థులకు తగిన సమయం దొరికిందని చెప్పవచ్చు. రాబోయే 40 రోజుల్లో సరైన ప్రణాళికతో తగిన కృషి చేస్తే గ్రూప్‌-1 పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపికవటం సాధ్యమే. అందుకు అవసరమైన సూచనలు.. 


సాధారణ పరిస్థితుల్లో పేపర్‌ 1 కంటే పేపర్‌ 2 స్కోరింగ్‌ అని గమనించాలి. మంచి స్కోరు సాధించేందుకు పేపర్‌ 2 లో ఉన్న మెంటల్, సైకలాజికల్‌ ఎబిలిటీస్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్‌ భాగాలను శాస్త్రీయంగా చదివితే 120కి 90 మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. అయితే ఆర్ట్స్‌ సబ్జెక్టుల నేపథ్యం ఉన్న అభ్యర్థులకు మొదటి రెండు విభాగాలు కొద్దిగా మింగుడు పడకపోవచ్చు. సైన్స్, ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు ఈ పేపర్‌ ఆశావహంగా ఉంటుంది. 

 మెయిన్స్‌కి ఎంపికవ్వాలంటే అభ్యర్థులు ఎవరైనా సరే తప్పనిసరిగా మూడు విభాగాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి.


1) మెంటల్, సైకలాజికల్‌ ఎబిలిటీస్‌: ఈ విభాగంలో ఒక మాదిరి క్లిష్టత నుంచి అధిక క్లిష్టత ఉన్న ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. షార్ట్‌ కట్స్‌ తెలియకపోతే ఈ ప్రశ్నలు చాలా ఎక్కువ సమయం తీసుకుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని విభిన్న రకాల ప్రశ్నలకు విభిన్న రకాలైన షార్ట్‌కట్స్‌ను పాటించి సాధించే నిపుణతను అలవర్చుకోవాలి. 


సైకలాజికల్‌ ఎబిలిటీస్‌లో ప్రధానంగా అభ్యర్థి పాజిటివ్‌ దృక్పథాన్ని పరిశీలిస్తారు. ఈ మూల సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా అంశాలపై ప్రాక్టీస్‌ చేయాలి. ఇప్పటినుంచైనా ప్రతిరోజూ రెండు గంటల సమయాన్ని ఈ విభాగానికి కేటాయిస్తే పరీక్ష తేదీ నాటికి మంచి ఫలితాలు రాబట్టవచ్చు. వివిధ మెలకువలు నేర్చుకునేటప్పుడు నిర్దిష్ట సమయాన్ని అనుసరించకుండా, నేర్చుకున్న తర్వాత నిర్దిష్ట సమయాన్ని పాటిస్తూ సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.


2) సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: ఈ విభాగంలో ప్రధానంగా బేసిక్స్‌ ముఖ్యం. తాజాగా కనుగొన్న/ ప్రయోగించిన విషయాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధికి భారతదేశంలో ఏర్పరిచిన అవస్థాపన సౌకర్యాలు, విధానాలు మొదలైన వాటిపై అవగాహన అవసరం. ప్రధానంగా భారతదేశం రాణిస్తున్న అంతరిక్ష, ఐటీ, బయోటెక్నాలజీ, వైద్య, రక్షణ రంగాలు, శక్తి వనరుల పరిజ్ఞానంపై ప్రశ్నలు రావొచ్చు. వివిధ టెక్నాలజీల అనువర్తనాలు, సాధనాలు, ప్రజలు పొందుతున్న సౌకర్యాలు ప్రశ్నల రూపంలో వచ్చే అవకాశం ఎక్కువ. 


3) కరెంట్‌ అఫైర్స్‌- అంతర్జాతీయ సంఘటనలు: సాధారణంగా పరీక్ష తేదీకి ఆరు నెలల కాలంలోని వర్తమాన అంశాలు వస్తుంటాయి. కానీ ఇటీవలి ఏపీపీఎస్సీ పరీక్షల్లో పరీక్ష తేదీ నుంచి ఏడాది వెనక్కి కూడా వెళ్లి ప్రశ్నలు రూపొందిస్తున్నారు. ఎక్కువ ప్రశ్నలు అంతర్జాతీయ, జాతీయ సంబంధాలుగా ఉంటున్నాయి. కరెంట్‌ అఫైర్స్‌ ప్రశ్నలు క్లిష్టంగానే ఉంటున్నాయి. భారతదేశపు అంతర్జాతీయ సంబంధాలు సరిహద్దు దేశపు సంబంధాలు కూడా ప్రశ్నలుగా అడుగుతున్నారు. ప్రధానమైన అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల భారతదేశం జీ 20 అధ్యక్ష హోదా పొందింది ఆ క్రమంలో భారతదేశం ఇప్పటివరకు అధ్యక్షత వహించిన వివిధ అంతర్జాతీయ వేదికల గురించీ ప్రశ్నలు రావొచ్చు. ఈ విభాగంలో ప్రిపేర్‌ అయ్యేందుకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా దినపత్రికలూ, గత 11 నెలల్లో జరిగిన వివిధ విషయాలను వివరించగలిగిన పక్ష/ మాస పత్రికలను చదవాలి. ఇయర్‌ బుక్‌ ఏదైనా ఒకటి చదివితే మంచిది. ఈ 40 రోజులూ ప్రతిరోజూ రెండు గంటల సమయం కేటాయించుకుని చదివితే మంచి ఫలితాలను రాబట్టవచ్చు.

పేపర్‌ 1 


దీర్ఘకాలికంగా ప్రిపేరవుతున్న అభ్యర్థులు ఈ పేపర్లో ఎక్కువ స్కోరు సాధించవచ్చు. తాజాగా సిద్ధమవుతున్న అభ్యర్థులతో పాటు మిగతా అభ్యర్థులకు ఒకరకంగా ఈ పేపర్లో స్కోరు క్లిష్టమని చెప్పవచ్చు.


ఈ పేపర్‌లోని ఇండియన్‌ పాలిటీ.. మిగతా విభాగాలతో పోలిస్తే తేలిక, స్కోరింగ్‌ విభాగం. అందువల్ల ఈ పేపర్‌పై పట్టు సాధించే క్రమంలో ముందుగా ఈ విభాగాన్ని ఎంచుకుని వర్తమానాంశాలతో అనుసంధానించి అధ్యయనం చేస్తే సులువుగా పట్టు సాధించవచ్చు.


ఇండియన్‌ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీల నుంచి కూడా కచ్చితమైన ప్రశ్నలను ఆశించవచ్చు. ఈ భౌగోళిక అంశాలపై పట్టుకు ముందుగా పాఠశాల స్థాయి పుస్తకాలను చదవాలి. ఇంగ్లిష్‌ మీడియం వారైతే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవొచ్చు. ఏపీ జాగ్రఫీకి సంబంధించి 26 జిల్లాల సమాచారం అధీకృతంగా ఇంతవరకు లభ్యం కానందున.. 13 జిల్లాల సమాచారం ప్రస్తుతానికి ప్రిపేరవటం మంచిది. ఆర్థిక, భౌగోళిక అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి, ఎకనామిక్‌ సర్వేను అనుసంధానం చేసుకొని చదివితే ప్రయోజనం అధికమవచ్చు. లభించే సమయాన్ని బట్టి ప్రపంచ భౌగోళిక అంశాల అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.


సిలబస్‌ సగం చాప్టర్లలో ప్రాచీన, మధ్యయుగ భారతదేశ గురించి పేర్కొన్నారు. మిగతా సగం చాప్టర్లలో యూరోపియన్ల రాక నుంచి స్వాతంత్య్రం వరకు ప్రాధాన్యం ఇచ్చారు. పోటీ పరీక్షలను గమనిస్తే ప్రాచీన, ఆధునిక భారతదేశ చరిత్ర అందునా స్వాతంత్య్రోద్యమం మీద ప్రశ్నలు ఎక్కువ అడుగుతుంటారు. ఇప్పటివరకు హిస్టరీ మీద పట్టు సాధించకుండా ఉన్నట్లయితే ప్రస్తుత 40 రోజుల్లో ప్రాచీన, ఆధునిక భారతదేశ చరిత్రపై దృష్టి పెట్టాలి. 


భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలు మరొక విభాగం. ఇప్పటివరకు ఈ విభాగాలపై పట్టు దొరక్కపోతే ప్రస్తుతం లభిస్తున్న వ్యవధిలో భారతదేశ సర్వే, బడ్జెట్, ఆంధ్రప్రదేశ్‌ సర్వే, బడ్జెట్లపై పట్టు బిగించే ప్రణాళిక రచించుకోవాలి. అవి పూర్తి అయిన తర్వాత మిగతా సిలబస్‌ విషయాలు చూసుకోవాలి. 


ఆంధ్రప్రదేశ్‌ విభజన సమస్యలు అనే అంశం ఒక చాప్టర్‌ కాబట్టి.. తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. వాటి మీద కూడా పట్టు సాధించే ప్రణాళిక ఉండాలి. ఈ మధ్య పరీక్షల్లో 4 - 5 ప్రశ్నలు ఈ విభాగంపై అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లోని ప్రధాని అంశాలతో పాటు కరెంట్‌ అఫైర్స్‌ కూడా అనుసంధానించుకొని చదివితే మంచిది.

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పాఠాలు 


తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష అక్టోబర్‌ 16న జరిగింది. మూస ధోరణితో బిట్లు బట్టీ పట్టే అభ్యర్థులు ప్రతికూల ఫలితాలను చూశారు. కోచింగ్‌ సెంటర్‌ నోట్సులు, ఏవో పుస్తకాలను పట్టుకుని అవే సర్వస్వమని చదువుకున్న అభ్యర్థులకు తీవ్ర నిరాశ ఎదురయింది. తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అనుభవాల నుంచి కింది విషయాలను నేర్చుకోవాలి.


1. బేసిక్స్‌: సబ్జెక్టుల ప్రాథమికాంశాల్లో (బేసిక్స్‌) బలంగా ఉండాలి. వివిధ సబ్జెక్టులకు చెందిన పాఠశాల పరిజ్ఞానమే బేసిక్స్‌ అని చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో విఫలమయ్యే అత్యధిక అభ్యర్థుల్లో కనిపించే ప్రధాన లోపం సరైన బేసిక్స్‌ లేకపోవటం. ప్రిలిమ్స్‌ పరీక్షల్లో అడిగిన అనేక ప్రశ్నలకు బేసిక్స్‌ బలంగా ఉన్న అభ్యర్థులు తేలిగ్గా సమాధానం గుర్తించారు. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ నెగ్గాలనుకునేవారు బేసిక్స్‌పై ముందు పట్టు సాధించాలి.


2. సమయ నిర్వహణ: ఇది సరిగా లేని అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో ఎదురీదాల్సి వచ్చింది. గతంలో లేని విధంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ఎక్కువ సమయాన్ని కోరే పెద్ద పెద్ద బిట్లు ఇచ్చారు. దానికి తోడు జతపరచమనే ప్రశ్నలు, ఎసర్షన్‌- రీజన్‌ ప్రశ్నలు అభ్యర్థులకు ఎక్కువ సమయం పట్టే పరిస్థితి తీసుకొచ్చాయి. రేపు రాబోయే పరీక్షల్లో ప్రశ్నల క్లిష్టత తగ్గవచ్చు గానీ ప్రశ్నల నమూనాలు అవే కొనసాగవచ్చు. అదే జరిగితే వ్యూహాత్మకంగా అన్ని ప్రశ్నలనూ సాధించే మెలకువలు అనుసరించే అభ్యర్థులనే విజయం వరిస్తుంది. సమయ నిర్వహణ మెరుగుపరుచుకోవాలంటే వీలైనన్ని ప్రాక్టీస్‌ టెస్టులను చేయాలి. అది కూడా నిర్దిష్ట సమయాన్ని పాటిస్తూ చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అందువల్ల కోచింగ్‌ నోట్సు లేదా ఏదైనా పుస్తకం మాత్రమే చదువుతూ కూర్చుంటే ఆశించిన ప్రయోజనం నెరవేరకపోవచ్చు.


3. భావన వికాసం: భావన వికాసంతో కూడిన అభ్యసనం ఉన్న అభ్యర్థులకు ప్రిలిమ్స్‌ మంచి ప్రయోజనాన్ని ఇచ్చింది. అంటే.. ఒక విషయాన్ని దానికి సంబంధించిన ఉదాహరణలు, పోలికలు, తేడాలు, కారణ ఫలిత సంబంధాలు, పరిష్కార మార్గాలు, ఇతర సబ్జెక్టు అంశాలతో ఉన్న అనుబంధాలు అనే వివిధ రూపాల్లో అధ్యయనం చేయటమే. ఇలా చదివినవారు పోటీ పరీక్షలో ఏ విధమైన ప్రశ్నలు వచ్చినప్పటికీ తేలికగా జవాబు ఇవ్వగలుగుతారు. అందుకని భావనాత్మక అభ్యసనానికి అలవాటైతే మంచి ప్రయోజనం సమకూరుతుంది.

- కొడాలి భవానీ శంకర్‌
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

‣ వేదికలెక్కి.. వాదం చేసి!

‣ ఒకేసారి గ్రూప్స్‌ అన్ని నోటిఫికేషన్లు వస్తే ఏంచేయాలి?

‣ డిగ్రీతో ఐఐటీలో ఉద్యోగాలు

Posted Date : 29-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌