• facebook
  • whatsapp
  • telegram

జైన మతం (క్రీ.పూ. 6వ శతాబ్దం)

        ప్రపంచ చరిత్రలో క్రీ.పూ. ఆరో శతాబ్దానికి అత్యంత ప్రాధాన్యముంది. ఈ కాలానికి చెందిన ప్రముఖ నాగరికతలన్నింటిలో సాంఘిక, ఆధ్యాత్మిక రంగాల్లో సంచలనాత్మక మార్పులు వచ్చాయి. వైదిక మతంలోని బ్రాహ్మణాధిక్యత, వ్యయ ప్రయాసలతో కూడుకున్న యజ్ఞయాగాది క్రతువులు; కర్మకాండలు, జంతు బలులతో నాటి సమాజం విసిగిపోయింది. ఈ దశలో కొత్త భావాలకు ఆదరణ పెరిగింది. అన్ని వర్గాల మోక్షసాధన కోసం మన దేశంలో వర్థమాన మహావీరుడు జైనమతాన్ని, గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించారు. వీరిద్దరూ క్షత్రియ వంశానికి చెందిన వారే. సమకాలీన ప్రపంచంలో గ్రీస్‌లో సోక్రటీస్; పర్షియాలో జొరాస్టర్; చైనాలో కన్‌ఫ్యూషియస్, లౌత్స లాంటివారి నేతృత్వంలో అనేక మత భావాలు ఆవిర్భవించాయి. ఈ నేపథ్యంలోనే జైనమతం కూడా రూపుదిద్దుకుంది.
         అనార్య జాతుల ఉద్ధరణ కోసం ఉద్భవించినవే జైన, బౌద్ధ మతాలు - అని ప్రొఫెసర్ జాకోబి అభిప్రాయం. సింధూ నాగరికతకు చెందిన మత విశ్వాసాల నుంచే జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయని ఆయన పేర్కొన్నాడు. జైన మత ప్రచారకులను 'తీర్థంకరులు' అంటారు. దీని అర్థం 'మార్గదర్శకులు'. 'అనుస్తుతి' అనేది జైనులకు అతి పవిత్రమైన సాహిత్యం. దీని ప్రకారం జైన తీర్థంకరులు 24 మంది. మొదటి తీర్థంకరుడు రుషభనాథుడు, 22వ తీర్థంకరుడు అరిష్ఠనేమి గురించి వేదాల్లో ప్రస్తావన ఉంది. కళింగ ప్రాంతవాసులు పదో తీర్థంకరుడైన శీతలనాథుడిని పూజించారు. అజితనాథ, కుంతనాథ, నేమినాథ మొదలైన తీర్థంకరుల విగ్రహాలను ఖజురహో దేవాలయాల్లో ప్రతిష్ఠించారు.
                23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు చారిత్రకంగా జైనమత స్థాపకుడని ప్రొఫెసర్ జాకోబి అభిప్రాయం. కానీ, 24వ తీర్థంకరుడైన వర్థమాన మహావీరుడే నిజమైన జైనమత స్థాపకుడని చరిత్రకారులు పేర్కొంటారు. 
         షాద్వాదం లేదా అనేకాంతవాదాన్ని జైనుల తాత్విక సిద్ధాంతంగా చెబుతారు. అంటే చేతనమైన, అచేతనమైన ప్రతిదాంట్లో ప్రాణమున్నట్లు విశ్వసించేది. దీని స్థాపకులు కొనకుందాచార్యులు. అభివృద్ధి పరిచింది సోమదేవసూరి (షాద్వాదసింహాచలక బిరుదాంకితుడు).

 

పార్శ్వనాథుడు 

         ఇతడు కాశీదేశ రాజైన అశ్వసేన, వామలకు జన్మించాడు. ఇతడు 23వ తీర్థంకరుడు. జైనమత సిద్ధాంతాలైన సత్యం, అహింస, ఆస్తేయం (ఆస్తి ఉండరాదు), అపరిగ్రహం (దొంగతనం చేయరాదు) లాంటివాటిని ప్రబోధించాడు.
* పంచ సిద్ధాంతమైన బ్రహ్మచర్యాన్ని వర్థమానుడు ప్రవేశ పెట్టాడు.

 

వర్థమాన మహావీరుడు 
 

         ఇతడు 24వ తీర్థంకరుడు. వర్థమాన మహావీరుడి అసలు పేరు వర్థమానుడు. బీహార్‌లోని వైశాలికి సమీపంలో సిద్ధార్థుడు, త్రిశాల దంపతులకు క్రీ.పూ. 540లో జన్మించాడు. 
         వర్థమానుడి భార్య యశోద. కుమార్తె అణోగ్ని/ ప్రియదర్శిని, అల్లుడు జమాలి. ఇతడినే వర్థమానుడి మొదటి శిష్యుడిగా భావిస్తున్నారు. అన్నయ్య 'నందివర్థనుడి' అనుమతితో వర్థమానుడు ప్రపంచ పర్యటనకు బయలుదేరాడు.
సన్యాసాశ్రమంలో వర్థమానుడు 'మక్కలి గోసలిపుత్ర' అనే గొప్ప తాత్వికుడిని కలిశాడు. 13 ఏళ్లపాటు దిగంబర సన్యాసిగా సంచరించాడు. వర్థమానుడు 43వ ఏట రిజుపాలిక నదీతీరంలోని జ్వంభిక గ్రామంలో సాల వృక్షం కింద తపస్సు చేసి జ్ఞాని అయ్యాడు. ఇతడు తనను తాను 'జైన్' (జయించినవాడు)గా ప్రకటించుకున్నాడు. ఇతడి అనుచరులను జైనులు అని పిలిచారు. నిర్‌గ్రంధులు అని కూడా పిలిచేవారు. అంటే 'భవ బంధాల నుంచి స్వేచ్ఛను పొందినవారు' అని అర్థం. న్యాయపుత్ర, దేహదిన్నె, మహావీరుడు, జినుడు అనేవి వర్థమానుడి బిరుదులు. ఇతడు బ్రహ్మచర్యం అనే సిద్ధాంతాన్ని, సల్లేఖనం (ఆహారం తీసుకోకుండా శరీరాన్ని శుష్కింపజేసుకోవడం) అనే వ్రత విధానాన్ని, త్రిరత్నమాల (సరైన విశ్వాసం, జ్ఞానం, నడవడిక) అనే సూత్రాన్ని ప్రవేశపెట్టాడు. కైవల్యం (పరిపూర్ణ జ్ఞానం) గురించి ప్రబోధించాడు. కైవల్యాన్నే 'సిద్ధశీల' అని కూడా అంటారు. చంపా, వైశాలి, రాజగృహ, మిథిల, శ్రావస్థి ప్రాంతాల్లో బోధనలు చేశాడు. మహావీరుడు, గౌతమ బుద్ధుడు సమకాలికులైనా ఎప్పుడూ కలుసుకోలేదు. మహావీరుడికి సమకాలికులైన మగధ రాజులు బింబిసారుడు, అజాతశత్రువు. వర్థమానుడు మరణించే నాటికి అతడికి 13 మంది శిష్యులున్నట్లు పేర్కొంటారు. మహావీరుడి అనంతరం జైనుల ముఖ్య గురువుగా ఆర్య సుధర్ముడు అవతరించాడు. మహావీరుడి ముఖ్య అనుచరులు శంభుత్తర విజయ, భద్రబాహు. 'లిచ్ఛవి' రాజ్యం జైన మతాన్ని అధికార మతంగా గుర్తించింది. ఈ మతవ్యాప్తి కోసం మూడు సమావేశాలు జరిగాయి. వీటినే 'జైన పరిషత్‌లు' అంటారు.
మొదటి జైనపరిషత్: ఇది పాటలీపుత్రంలో స్థూలభద్రుడి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పూర్వాలు అనే జైన మత గ్రంథాలను సంస్కరించి, 12 అంగాలుగా సంకలనం చేశారు. ఇవి జైనమత ప్రామాణిక గ్రంథాలు. ఇవి ప్రాకృత భాషలో ఉన్నాయి. వట్టుకార, కార్తికేయ ఈ భాషకు చెందిన కవులు. తర్వాతి కాలంలో ఈ 12 అంగాలకు 'నిర్యుక్తులు' అనే వ్యాఖ్యాన గ్రంథాలను రాశారు. స్థూలభద్రుడు, భద్రబాహుడికి మధ్య వస్త్రాలంకరణ విషయంలో వచ్చిన విభేదాల వల్ల జైనం శ్వేతాంబర (తెల్లటి వస్త్రాలు ధరించడం), దిగంబర (నగ్నంగా ఉండటం) అనే రెండు శాఖలుగా విడిపోయింది. శ్వేతాంబర శాఖకు స్థూలభద్రుడు, దిగంబర శాఖకు భద్రబాహుడు ప్రాతినిధ్యం వహించారు. భద్రబాహుడు 'కల్పసూత్రాలు' రచించాడు.
రెండో జైనపరిషత్: గుజరాత్‌లోని వల్లభిలో దేవార్థి, క్షమాశ్రమణ అధ్యక్షతన జరిగింది. గుజరాత్ పాలకులైన సిద్ధరాజు, కుమార పాలుడు ఈ సమావేశాన్ని ఆదరించారు. ఈ సమావేశంలో 12 అంగాలకు వ్యాఖ్యానాలుగా ఉపాంగాలు రాశారు. ఇవి అర్థమాగథి భాషలో ఉన్నాయి. ఈ సమావేశంలో శ్వేతాంబర నుంచి థెరపంథీలు, దిగంబర నుంచి సమయానులు అనే మరో రెండు శాఖలు ఏర్పడ్డాయి.
మూడో జైనపరిషత్: శ్వేతాంబర, దిగంబర శాఖల మధ్య ఐక్యత కోసం కళింగ రాజైన ఛేది వంశానికి చెందిన ఖారవేలుడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఇతడికి సహకరించిన వర్తక-వ్యాపార వర్గం యాపనీయులు. ఖారవేలుడు ఒరిస్సాలోని ఉదయగిరిలో 17 జైనగుహలను నిర్మించినట్లు హతిగుంఫా శాసనం ద్వారా తెలుస్తోంది.
         ఉచితంగా ఆశ్రయం, భోజనం, విద్యను కల్పించడం, తాంబూలం ఇవ్వడం లాంటివాటిని జైనులు దాన ధర్మాలుగా భావించేవారు.

ప్రాంతీయ భాషల అభివృద్ధి

           ప్రాంతీయ భాషలను మొదట అభివృద్ధి చేసింది జైనులే. వర్థమానుడు అర్థమాగథిని వాడుకభాషగా చేసుకున్నాడు. జైన గ్రంథాలన్నింటినీ ప్రాకృత భాషలో రాశారు.
నేటి బీహారి భాష (అర్థమాగథి), కన్నడ భాష (కనరాసి), మరాఠి భాష (సౌరసేని) లాంటి ప్రాంతీయ భాషలను జైనులే అభివృద్ధి చేశారు. అమోఘవర్షుడు కన్నడ భాషలో కవిరాజమార్గం, రత్నమాలిక అనే గ్రంథాలను రచించాడు.
విద్యాలయాలు: జైనుల విద్యాలయాలను గచ్ఛలు, సరస్వతి గచ్ఛలు, పుష్పమేషాణ గచ్ఛలు లాంటి పేర్లతో పిలుస్తారు. వీటి స్థాపకుడు కొనకుందాచార్యులు. ఢిల్లీ, కొల్హాపూర్, కంచి, పెనుగొండ లాంటి ప్రాంతాల్లో విద్యాలయాలు స్థాపించారు. కొనకుందాచార్యులు, ఉమాస్వాతి, గృథపింఛ, బాలకపింఛ, సింహనంది వీటికి ఉపకులపతులుగా పనిచేశారు. చివరివారైన సింహనంది పేరూరు (కడప) ప్రాంతవాసి.

జైన నిర్మాణాలు (బసదీలు)

* చాముండరాయలు మైసూరు (కర్ణాటక)కు సమీపంలోని శ్రావణ బెళగొళలో గోమఠేశ్వర (బాహుబలి) విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడే చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని స్వీకరించి పరమపదించాడు.
* కుమారపాల, సిద్ధపాల, తేజపాల రాజస్థాన్‌లోని మౌంట్ అబూ శిఖరంలో పాలరాతితో 'దిల్వారా దేవాలయాలను' నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఈ దేవాలయంలో జైనుల స్త్రీ దేవత 'విద్యాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
* మధ్యప్రదేశ్ చందేల రాజులు నిర్మించిన ఖజురహో దేవాలయాల్లోనూ 'విద్యాదేవి' విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
* మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉన్న 34 గుహల్లో 17 వైదిక మతానికి, 12 బౌద్ధానికి, 5 జైనమతానికి చెందినవి. ఇవి పరమత సహనానికి నిదర్శనంగా ఉన్నాయి.
* ఒరిస్సాలోని ఉదయగిరిలో ఉన్న 17 గుహలు జైనమతానికి సంబంధించినవే.
ఆంధ్రప్రదేశ్: అనంతపురంలోని 'కొండాంద కొండాపురం'లో జైనుల నిర్మాణాలున్నాయి. ఇక్కడి ప్రధాన ఆచార్యులు 'పద్మనంది' (కొనకొందాచార్యులు). ఇతడు 'సమయసారం' గ్రంథాన్ని రచించాడు. పశ్చిమగోదావరి - పెనుగొండలో వైశ్యుల కులదేవతగా ప్రసిద్ధి చెందిన (వేంగి చాళుక్యుల కాలంలో) 'వాసవీ కన్యకా పరమేశ్వరి' దేవాలయం ఉంది. నల్లగొండ జిల్లాలోని కొలనుపాకలో జైన దిగంబర క్షేత్రం ఉంది. మెదక్‌లోని పొట్లచెరువులో 500 జైన బసదులున్నాయి. ఆంధ్రదేశంలో జైనం ఉన్నట్లు 'ముషినికొండ తామ్ర శాసనం' ద్వారా తెలుస్తోంది. దీన్ని మూడో విష్ణువర్థనుడు వేయించాడు.


* సంప్రతిని 'రెండో జైన అశోక' అని పిలుస్తారు.
* IV వ ఇంద్రుడు సల్లేఖన వ్రతాన్ని స్వీకరించిన రెండో భారతీయ పాలకుడు.
* జైనాన్ని స్వీకరించిన మొదటి మహిళ కుబ్జ విష్ణువర్థనుడి భార్య అయ్యణ మహాదేవి, రెండో మహిళ చామెకాంబ.

క్షీణించడానికి కారణాలు
* అహింస విధానం (ఇదే ప్రధానమైంది)
* శ్వేతాంబర - దిగంబర శాఖలు
* సల్లేఖన వ్రతం
* స్త్రీ నగ్న ప్రతిమలు చోటు చేసుకోవటం (కంబదూర్)
* కర్మ - పునర్జన్మ అనే హైందవ సిద్ధాంతాల పట్ల నమ్మకం ఏర్పడటం.

Posted Date : 11-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌