• facebook
  • whatsapp
  • telegram

మొదటి సామ్రాజ్యం... మగధ రాజ్యం

     క్రీ.పూ.6వ శతాబ్దంలో రాజకీయ పరిస్థితుల కారణంగా మగధ క్రమంగా బలం పుంజుకుని ఇతర రాజ్యాలపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పింది. తద్వారా భారతదేశ చరిత్రలో ప్రథమ సామ్రాజ్యంగా రూపొందింది. దీనికి నైసర్గిక, ఆర్థిక, సైనిక, రాజకీయ అంశాలు దోహదపడ్డాయి.
 

మగధను పాలించిన రాజవంశాలు
 

1. హర్యాంక             
2. శైశునాగ               
3. నంద (వరుస క్రమంలో)
(ఇతిహాస యుగంలో మగధను పాలించిన రాజవంశం బృహద్రద వంశం. ఈ వంశంలోని వారే జరాసంధుడు, రిపుంజయుడు)
బింబిసారుడు: క్రీ.పూ. 6వ శతాబ్దంలో మగధ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి చక్రవర్తి బింబిసారుడు. బుద్ధుడికి సమకాలీకుడు. ఇతడు బౌద్ధమతాన్ని పోషించినప్పటికీ బౌద్ధ గ్రంథాల్లో ఇతడి వంశ చరిత్రకు సంబంధించిన చర్చ లేదు. ఈ గ్రంథాలు బింబిసారుడ్ని 'సేనియ (సైన్యం ఉన్నవాడు)' అని పేర్కొన్నాయి. దీన్ని బట్టి శాశ్వత సైన్యం ఉన్న మొదటి రాజు ఇతడే అయి ఉండొచ్చని అర్థమవుతుంది.
* వివాహ సంబంధాలు, దండయాత్రలు, దౌత్యనీతి ద్వారా రాజ్య విస్తరణ విధానానికి నాంది పలికాడు. కోసల రాజైన ప్రసేనజిత్తుడి సోదరిని వివాహమాడి పదివేలకు పైగా ఆదాయం వచ్చే 'కాశీ' గ్రామాన్ని కట్నంగా పొందాడు.
* లిచ్ఛవుల నాయకుడైన చేతకుడి కుమార్తె  'చెల్లన'ను, అలాగే పంజాబ్ ప్రాంతంలోని మద్ర దేశాధిపతి కుమార్తె 'ఖేమ'ను వివాహమాడాడు. ఇలా బింబిసారుడి వివాహ సంబంధాలు ఆనాటి రాజవంశాల మధ్య సఖ్యతతో పాటు, బింబిసారుడి ఆధిక్యతను పెంచాయి. బింబిసారుడు అవంతి రాజ్యాధిపతియైన ప్రద్యోధనుడితో కూడా మైత్రిని పెంచుకుని, అతడి ఆరోగ్యాన్ని బాగుచేయడానికి తన ఆస్థాన వైద్యుడైన జీవకుడిని ఉజ్జయినికి పంపాడు. బింబిసారుడు వైరం పెంచుకున్న ఒకే ఒక్క మహాజన పదం అంగరాజ్యం. అంగరాజైన బ్రహ్మదత్తుడిని ఓడించి దాన్ని మగధలో విలీనం చేశాడు. ఇతడి రాజధాని గిరివ్రజం (రాజగృహ). మంత్రుల నియామకం, పనితీరు, అధికార విధి నిర్వహణ, గ్రామ పరిపాలన, పంట భూముల సర్వే, పన్నుల వసూలు లాంటి విషయాల్లో శ్రద్ధ వహించి బింబిసారుడు మంచి పాలనను అందించాడు.

 

అజాతశత్రువు

             కోసల - మగధ రాజ్యాల మధ్య ఘర్షణ అజాతశత్రువు కాలంలో మొదలైంది. ఇతడు పదవీకాంక్షతో తన తండ్రినే బంధించి వధించాడు. దీన్ని భరించలేక బింబిసారుడి భార్య (కోసల రాజవంశీయురాలు) మరణించింది. తన సోదరి మరణానికి ప్రతీకారంగా ప్రసేనజిత్తు తాను కట్నంగా ఇచ్చిన 'కాశీ'ని తిరిగి వశం చేసుకున్నాడు.
వర్తకం వల్ల కాశీకి ప్రాధాన్యం ఏర్పడటంతో అజాతశత్రువు, ప్రసేనజిత్తుతో యుద్ధం చేశాడు. వీరిద్దరి మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. చివరకు ప్రసేనజిత్తు మంత్రి అయిన ధీర్ఘాచరాయనుడు రాజును మోసం చేసి, అతడు బుద్ధుడిని చూడటానికి వెళ్లిన సమయంలో రాజముద్రికనూ, సైన్యాధికారాన్ని విదుదాబుడికి ఇచ్చాడు. రాజభ్రష్టుడైన ప్రసేనజిత్తు రాజగృహానికి చేరుకుని, కోట తలుపులు మూసి ఉండటంతో అలసట వల్ల అక్కడే మరణించాడు. అజాతశత్రువు అతడికి రాజోచితంగా దహన సంస్కారాలు జరిపించి, తాను మేనల్లుడైనందున కోసల రాజ్యంపై తనకు హక్కుందని అడిగాడు. అదే సమయంలో 'రాప్తి' నదికి అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో విదుదాబుడు, అతడి సైన్యం కొట్టుకుపోయారు. ఈ విధంగా యుద్ధం లేకుండానే కోసల రాజ్యం మగధలో విలీనమైంది.
                   అజాతశత్రువు ఉపయోగించిన నూతన యుద్ధ పరికరాలు మహాశిలకంఠక (శత్రువులపై బరువైన రాళ్లు విసిరే యంత్రం), రథ ముసలం (రథ చక్రాలకు కట్టిన ఇనుప దూలం). అజాతశత్రువును జైనులు జైనుడని, బౌద్ధులు బౌద్ధుడని పేర్కొన్నారు. వైశాలి నగరానికి చెందిన వేశ్య స్త్రీ ఆమ్రపాలిని ప్రేమించి వివాహమాడాడు. బుద్ధుడి రాక కోసం, దర్శనాల కోసం అజాతశత్రువు వేచి ఉన్నట్లు బార్హూత్ శిల్పం (మధ్యప్రదేశ్) చిత్రణలు నిరూపిస్తున్నాయి. పాటలీపుత్రాన్ని ప్రారంభించింది అజాతశత్రువు, పూర్తిచేసింది ఉదయనుడు. అజాతశత్రువు పాలనాకాలంలో రాజగృహంలో మొదటి బౌద్ధసంగీతికి అధ్యక్షుడు మహాకాశ్యప.

 

ఉదయనుడు

     రాజధానిని రాజగృహ నుంచి పాటలీపుత్రానికి మార్చాడు. అతడి తర్వాత సింహాసనం అధిష్ఠించిన నలుగురు రాజులు పితృహంతకులేనని చరిత్రకారులు భావించారు. ఈ విధంగా పితృహంతకులు రాజ్యాన్ని పాలించడంతో కోపించిన ప్రజలు క్రీ.పూ. 413లో వీరిలో ఆఖరివారిని గద్దెదించి, రాజ్య ప్రతినిధిగా ఉన్న 'శిశునాగుడి'ని మగధకు రాజుగా చేశారు.

శైశునాగ

     శైశునాగ వంశ స్థాపకుడు శిశునాగుడు. అర్ధ శతాబ్దం పాటు మగధ సామ్రాజ్యాన్ని పాలించాడు. ప్రద్యోతనుడు అనే అవంతి రాజును నిర్మూలించింది శిశునాగుడు. శైశునాగ వంశంలో గొప్పవాడు కాలాశోకుడు. ఇతడు రాజధానిని పాటలీపుత్రం నుంచి వైశాలికి మార్చాడు . ఇతడి కాలంలో రెండో బౌద్ధ సంగీతి జరిగింది. అధ్యక్షుడు సభాకామి. కాలాశోకుడు తన పదిమంది కుమారులతో దుర్మరణం పాలైనట్లు తదనంతర సాహిత్యంలో వర్ణనలు ఉన్నాయి. కానీ శైశునాగ వంశాన్ని తుదముట్టించింది మహాపద్మనందుడు. ఇతడి వంశం మగధను క్రీ.పూ. 321 వరకు పాలించింది.
 

నందవంశం

     పురాణాల్లో పేర్కొన్న నందవంశ స్థాపకుడు మహా పద్మనందుడు (మహాభోది వంశం అనే బౌద్ధ గ్రంథం ప్రకారం నందవంశ స్థాపకుడు ఉగ్రసేనుడు). కొన్ని ఆధారాల ప్రకారం మహాపద్మనందుడు ఒక శూద్ర స్త్రీకి జన్మించినవాడు. మగధను పాలించిన ఒకే ఒక శూద్రవంశం నందులు. పురాణాల్లో మహాపద్మనందుడిని క్షత్రియవంశ నిర్మూలకుడిగా పేర్కొన్నారు. అపారమైన తమ సంపద, సైన్యం ద్వారా రాజ్య సరిహద్దులను సుదూర ప్రాంతాలకు విస్తరింపజేశారు. వీరిసైన్యంలో 20 వేలమంది అశ్వికదళం, 20 వేల మంది పదాతిదళం, రెండువేల రథాలు, మూడువేల గజబలం ఉంది. క్రీ.పూ. 1వ శతాబ్దానికి చెందిన ఖారవేలుడి 'హాథిగుంఫా శాసనం' ప్రకారం నందులు ఒరిస్సా లోని కళింగ ప్రాంతంపై కూడా అధికారం కలిగి ఉండేవారు. 12వ శతాబ్దికి చెందిన అనేక మైసూరు శాసనాలను బట్టి మహారాష్ట్రలోని కుంతల ప్రాంతంలో దక్షిణ భాగం నందుల అధికారంలో ఉందని తెలుస్తోంది. దక్కన్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా వీరి అధికారంలో భాగంగా ఉండొచ్చు. కానీ ఈ ఆధారాలు విశ్వసనీయం కాదు. నంద సామ్రాజ్యానికి అసలు సరిహద్దులు నిర్ణయించటం కష్టం. కానీ క్రీ.పూ. 6వ శతాబ్దిలో ఆవిర్భవించిన 16 మహాజన పదాలన్నింటిలో గాంధార, కాంభోజ తప్ప మిగిలినవన్నీ మహాపద్మనందుడి సామ్రాజ్యంలో అంతర్భాగమే. (ఏకరాట్ బిరుదాంకితుడు మహాపద్మనందుడు).

* మహాపద్మనందుడి తదనంతరం ధననందుడు వచ్చాడు. నందవంశంలో చివరివాడు ధననందుడు. గ్రీకు రచయితలు ధననందుడిని 'అగ్రమిస్‌'గా వర్ణించారు. ధననందుడి అపార ధన సంపదను ప్రస్తావించింది బౌద్ధ వాజ్ఞయం.
* అమిత ధనకాంక్ష, అధిక పన్నులు, బలాత్కార వసూలు మొదలైన లోపాల వల్ల ప్రజాదరణ కోల్పోయాడు ధననందుడు. అలెగ్జాండర్‌కు సమకాలీకుడైన నందరాజు ధననందుడు. ధననందుడిని చంద్రగుప్తమౌర్యుడు కౌటిల్యుడి సహకారంతో ఓడించి మౌర్య రాజ్యస్థాపన చేశాడు.

 

విదేశీ దండయాత్రలు
 

     భారతదేశంపై మొదటిసారిగా దండయాత్ర చేసిన విదేశీయులు పర్షియన్లు. వీరు ఇరాన్ దేశానికి చెందినవారు. క్రీ.పూ. 530 ప్రాంతంలో పర్షియన్ చక్రవర్తి 'సైరస్' హిందూకుష్ పర్వతాన్ని దాటి వాయువ్య భారతదేశంలో ప్రవేశించాడు. గాంధార, కాంభోజ మొదలైన రాజ్యాలు సైరస్‌కు కప్పం చెల్లించాయి. ఆ తర్వాత మొదటి డేరియస్ క్రీ.పూ. 516లో పంజాబ్, సింధు ప్రాంతాలను జయించి తన రాజ్యంలో కలిపాడు. (డేరియస్-1 రాజ్యంలో పంజాబ్-సింధు 20వ సాత్రపి అయ్యాయి. సాత్రపి అంటే రాష్ట్రం.)
ఈ దండయాత్రల వల్ల పర్షియన్ భావ ధోరణుల ప్రభావం భారతీయ జీవనంలో అనేక రంగాల మీద పడింది.
పర్షియన్ నాణేలని భారతదేశం అనుకరించింది. పర్షియన్ లిపితో దగ్గర సంబంధం ఉన్న ఖరోష్ఠి లిపి వాయువ్య భారతదేశంలో వ్యాప్తి చెందింది. డేరియస్ కాలంలో పర్షియాలోని శిలాశాసనాల సాంప్రదాయమే అశోకుడు శిలాశాసనాలు వేయించటానికి ప్రేరణ కావచ్చు.

 

అలెగ్జాండర్ దండయాత్ర
 

     భారతదేశంపై దండయాత్ర చేసిన రెండో విదేశీయులు - గ్రీకులు. గ్రీకు రాజైన అలెగ్జాండర్ తన తండ్రి ఫిలిప్స్ తర్వాత మాసిడోనియా ప్రాంతానికి అధిపతి అయ్యాడు. నందరాజైన ధననందుడికి ఉన్న విశేష ధనరాశులు, అపారసైనిక బలాలను గుర్తించి అలెగ్జాండర్ వారిపైకి దండెత్తడానికి సాహసించలేదని అర్థమవుతోంది.


     'గౌగమేళ' యుద్ధంలో అలెగ్జాండర్ పర్షియా రాజు మూడో డేరియస్‌ను ఓడించి తన అధికారాన్ని పటిష్ఠం చేసుకున్నాడు. తర్వాత హిందూకుష్ పర్వతాలను దాటి క్రీ.పూ. 327లో భారతదేశపు వాయువ్యప్రాంతంలో పాదం మోపాడు. (భారతదేశంపైకి దండెత్తి రావాల్సిందిగా అలెగ్జాండర్‌ను ఆహ్వానించింది తక్షణశిల రాజైన అంభి. పురుషోత్తముడు - అంభి శత్రువులు). అలెగ్జాండర్, పురుషోత్తముడికి (పోరస్)కి మధ్య జీలం నది ఒడ్డున 'కర్రి' మైదానంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని జీలం నది యుద్ధం లేదా హైడాస్పస్ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో అంభి సహాయంతో అలెగ్జాండర్ పురుషోత్తముని ఓడించాడు. పురుషోత్తముడి ధైర్య సాహసాలను మెచ్చుకొని, అలెగ్జాండర్ అతడి రాజ్యాన్ని తిరిగి అతడికిచ్చాడు.
     గ్రీకు చరిత్రకారుల ప్రకారం మనదేశంలోని వివిధ తెగలు- అశ్వాయన, అహ్మకస్, కథాన్, మాళవ, క్షుద్రక, సివి, అగలసోయ్ తెగలు అలెగ్జాండర్‌ను తీవ్రంగా ప్రతిఘటించాయి. అశ్వాయనులతో జరిగిన యుద్ధంలో అలెగ్జాండర్ తీవ్రంగా గాయపడినప్పటికీ, వారిని అణచివేశాడు. అలెగ్జాండర్‌కు మాళవులు, క్షుద్రకులు తెగల సమాఖ్య నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. మాళవుల కోట గోడను ఎక్కుతుండగా బాణం తగిలి అలెగ్జాండర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఉద్రిక్తులైన గ్రీకు సైనికులు కోటలోని అందరినీ చంపేశారు. వాయువ్య భారతంలో గ్రీకుల దండయాత్ర రెండేళ్లపాటు సాగింది. ఈ యుద్ధాలతో విసిగిపోయిన అలెగ్జాండర్ సైనికులు భారతదేశంలో తూర్పు వైపు అక్రమణ కొనసాగించడానికి నిరాకరించారు. ఈ విధంగా గ్రీకు సైనికులకు, మగధను పాలిస్తున్న నందుల సైన్యానికి మధ్య యుద్ధం తప్పింది. క్రీ.పూ. 323లో బాబిలోనియాలో అలెగ్జాండర్ మరణించాడు.

 

అలెగ్జాండర్ దండయాత్ర ఫలితాలు
1. అలెగ్జాండర్‌తో పాటు వచ్చిన గ్రీకు పండితులు నాటి భారతదేశం గురించి విపుల సమాచారం మనకు అందించారు.
2. భారతీయ విద్యావేత్తలు అలెగ్జాండర్‌తో గ్రీకు వెళ్లారు. గ్రీకు, భారతీయ సంస్కృతుల మధ్య పొత్తు పెరిగింది.
3. అలెగ్జాండర్ దండయాత్ర తక్షణ ఫలితం- మనదేశంలోని వివిధ తెగల విధ్వంసం. ఫలితంగా చిన్న రాజ్యాలు పెద్ద రాజ్యాలలోకి విలీనమయ్యాయి. రాజకీయ సమైక్యత మొదలైంది. అలెగ్జాండర్ మనదేశం వదలిన కొన్నేళ్లకే చంద్రగుప్త మౌర్యుడు వాయువ్య ప్రాంతంలోని చిన్న రాజ్యాలన్నింటినీ మగధ సార్వభౌమాధికారంలోకి తీసుకొచ్చాడు.

 

మగధ రాజ్య విజృంభణకు తోడ్పడిన అంశాలు
 

నైసర్గిక అంశాలు
* దిగువ గంగా మైదానంపై ఆధిపత్యం.
* గంగానదీ పరివాహాక ప్రాంత సారవంత భూములు.
* గిరివ్రజం లేదా రాజగృహం చుట్టూ పెట్టని కోట మాదిరిగా ఉన్న పర్వతాలు.
* గంగా-శోణ నదుల కూడలిలో పాటలీపుత్రం జలదుర్గం మాదిరి సురక్షితంగా ఉంది.
* దట్టమైన అరణ్యాలు.
* ఇనుప ఖనిజ నిల్వలు.
ఆర్ధిక అంశాలు
* భూమి శిస్తు
* చక్కటి జల రవాణా మార్గాలు
* వ్యాపార సుంకాలు
సైనిక అంశాలు
* మగధ వాయువ్య భారతానికి చాలా దూరంగా ఉండటం వల్ల విదేశీ దండయాత్రల ప్రమాదం లేదు.
* ఆయుధాల తయారీ
* పటిష్ఠమైన రాజధానులు
* ఏనుగుల లభ్యత
రాజకీయ అంశాలు
* సమర్థులైన రాజులు
* పటిష్ఠ పాలనా వ్యవస్థ
* దౌత్య సంబంధాలు

 

Posted Date : 11-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు