• facebook
  • whatsapp
  • telegram

మౌర్య సామ్రాజ్యం (క్రీ.పూ. 321 - 184)

         మగధలో నందవంశాన్ని పడగొట్టి మౌర్యులు (చంద్రగుప్త మౌర్యుడు) అధికారంలోకి వచ్చారు. బౌద్ధ సంప్రదాయాలు, పూర్వపు ధర్మశాస్త్ర గ్రంథాలు, పురావస్తు తవ్వకాల్లో బయటపడిన వస్తువులు మౌర్యుల చరిత్రను తెలుసుకోవడానికి తోడ్పడతాయి. కౌటిల్యుడి అర్థశాస్త్రం కూడా మౌర్య పరిపాలనలో పరిణామాలను వివరిస్తుంది. మౌర్య వంశ రాజుల్లో ప్రసిద్ధి చెందిన అశోకుడు వేయించిన పలు శాసనాలు నాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి.
    ప్రసిద్ధి చెందిన అర్థశాస్త్ర రచనా కాలంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, ఈ గ్రంథంలోని కొన్ని భాగాలు (II, III, IV) మౌర్యులకు సంబంధించిన ముఖ్య ఆధారాలని చాలామంది పండితుల ఏకాభిప్రాయం. గ్రీకు చరిత్రకారుడైన మెగస్తనీస్ రచించిన 'ఇండికా' మరో ముఖ్య ఆధారం.
 ఈ గ్రంథంలో కొన్ని భాగాలే లభ్యమైనా, దాదాపు అందరు గ్రీకు చరిత్రకారులు ఇండికా గురించి ప్రస్తావించారు (అరియన్, జస్టీన్, స్ట్రాబో). దీనికి, కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని అంశాలకు పోలికలు ఉన్నాయి. అశోకుడు వేయించిన శాసనాలు మౌర్యుల గురించి కచ్చితమైన ఆధారాలను అందిస్తాయి. భారత ద్వీపకల్పంలో, అఫ్గనిస్థాన్‌లో అనేక రహదారులపై 45 ప్రాంతాల్లో 181 శాసనాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.
ఇవి ప్రాకృత భాషలో, బ్రహ్మి లిపిలో ఉన్నాయి. మౌర్య సామ్రాజ్యానికి వాయవ్య దిశలో లభించిన శాసనాలు మాత్రం 'అరామిక్, ఖరోష్ఠి' లిపితో ఉన్నాయి. అఫ్గనిస్థాన్‌లో లభించిన శాసనాలు అరామిక్ గ్రీకు భాషలో ఉన్నాయి. తర్వాతి కాలంలో రచించిన పురాణాలు కూడా మౌర్యుల చరిత్రకు ఆధారాలే. అయితే వాటిని సమర్థించే చారిత్రక ఆధారాలు లేనందున అవి కచ్చితమైనవని చెప్పలేం.

 

చంద్రగుప్త మౌర్యుడు
       క్రీ.పూ. 321లో కౌటిల్యుడి సహకారంతో చంద్రగుప్తమౌర్యుడు నందరాజుల్లో చివరివాడైన ధననందుడిని ఓడించాడు. నందరాజ్య శిథిలాలపై మౌర్య వంశస్థాపన చేశాడు.
* కౌటిల్యుడు రాసిన 'చంద్రగుప్త కథ' చంద్రగుప్త మౌర్యుడి జీవిత చరిత్రను తెలుపుతుంది. విశాఖదత్తుడు తన ముద్రారాక్షసం నాటకంలో నందరాజు ఉంపుడుకత్తె 'ముర' అనే స్త్రీకి చంద్రగుప్త మౌర్యుడు జన్మించాడని, అందుకే శూద్రుడని, కులహీనుడని (వృషల) ప్రస్తావించాడు. పురాణాలు కూడా చంద్రగుప్తుడిని శూద్రుడిగా పేర్కొన్నాయి. మహావంశం 'మోరియా' అనే క్షత్రియ కులస్థుడిగా పేర్కొంది.
* పాణిని తన అష్టాధ్యాయి వ్యాకరణ గ్రంథంలో 'ముర' అనే పదం నుంచి మౌర్య అనే పదం ఉత్పన్నం కాదు, 'మోరియా' నుంచి 'మౌర్య' ఉత్పన్నం అవుతోందని వివరించాడు.
* గ్రీకు సాహిత్యం చంద్రగుప్త మౌర్యుడిని 'శాండ్రకోటస్‌'గా పేర్కొంటే, ప్లూటార్క్ 'యాండ్రఖోటన్‌'గా పేర్కొన్నాడు.
* గ్రీకు ఆధారాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు వాయవ్య దిశగా దండెత్తి అలెగ్జాండర్ వదలి వెళ్లిన గ్రీకు సైన్యాలను అణచివేశాడు.
* క్రీ.పూ. 305లో అలెగ్జాండర్ సేనాని 'సెల్యుకస్ నికేటర్‌'ను చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు. అతడి కుమార్తె హెలెనాను వివాహమాడి, సెల్యుకస్‌కు 500 ఏనుగులను బహుమతిగా ఇచ్చాడు.
* సెల్యుకస్ ఆధీనంలో ఉన్న నాలుగు సాత్రపీలను (రాష్ట్రాలను) తన రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. అవి:
1. అరకోషియో (నేటి కాందహార్), 2. పరోపనిషత్ (నేటి కాబూల్), 3. గెడ్రోసియా (నేటి బెలూచిస్థాన్),
4. ఏరియా - హిరాట్ (అఫ్గనిస్థాన్ - ఇరాన్ సరిహద్దు ప్రాంతం).
* సెల్యుకస్ నికేటర్ రాయబారిగా చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి వచ్చిన మెగస్తనీస్ కొంతకాలం పాటలీపుత్రంలో ఉన్నాడు. భారతదేశానికి వచ్చిన మొదటి విదేశీ రాయబారి ఇతడే.
* చంద్రగుప్త మౌర్యుడు గుజరాత్‌లో 'సుదర్శన తటాకం' తవ్వించి, దాని బాధ్యతలను పుష్యగుప్తుడికి అప్పగించాడు. తర్వాతి కాలంలో స్కందగుప్తుడు ఈ తటాకానికి మరమ్మతులు చేయించాడు.
* హేమచంద్రుడు రాసిన 'పరిశిష్ఠ పర్యన్' అనే జైన సాహిత్యం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు భద్రబాహుని సహకారంతో మైసూర్‌లోని శ్రావణ బెళగొళకు వెళ్లి, అక్కడే సల్లేఖన జైనవ్రతాన్ని స్వీకరించి మరణించినట్లు తెలుస్తుంది.

 

బిందుసారుడు
         బిందుసారుడికి సింహసేనుడు, అమిత్రఘాతుడు అనే బిరుదులున్నాయి.
* 'అమిత్రఘాత' అంటే శత్రువులను సంహరించేవాడని అర్థం. గ్రీకు సాహిత్యం బిందుసారుడిని 'అమిత్రఖేట్స్‌'గా వర్ణించింది.
* ఇతడికి సిరియా రాజైన ఆంటియోకస్ - I తో సంబంధాలుండేవి. టిబెట్‌లో ఉన్న బౌద్ధమతాచార్యుడు లామ తారానాథ్, బిందుసారుడు రెండు సముద్రాల మధ్య భూభాగాన్ని ఆక్రమించాడని పేర్కొన్నాడు.
* బిందుసారుడి సైన్యాలు తమిళనాడు వరకు చేరాయి. సంగమ సాహిత్యంలో (తమిళ) తమిళదేశ రహదారులపై ప్రయాణించిన 'మౌర్య రథాల వర్ణనలు' కనిపిస్తాయి.
* బిందుసారుడి కుమారులైన సుమనవేదా సుశీన తక్షశిలకు, అశోకుడు ఉజ్జయినికి రాజ్య ప్రతినిధులుగా ఉండేవారు.
* తక్షశిలలో సుశీనపై ప్రజలు తిరుగుబాటు చేయగా, అతడు దాన్ని అణచివేయలేకపోయాడు. దాంతో బిందుసారుడి ఆజ్ఞ మేరకు అక్కడికి వెళ్లిన అశోకుడు ఆ తిరుగుబాటును అణచి, తక్షశిలకు కూడా తానే రాజప్రతినిధిగా వ్యవహరించాడని 'దివ్యవదన' గ్రంథం పేర్కొంటోంది.
* బిందుసారుడు దక్కన్, మైసూర్ ప్రాంతాలను జయించాడు. తూర్పున ఉన్న కళింగ (నేటి ఒడిశా) మగధ రాజ్య విస్తరణను వ్యతిరేకించింది. అశోకుడు దాన్ని జయించాడు.

 

అశోకుడు
        అశోకుడు మౌర్య పాలకుల్లో గొప్పవాడు. ఇతడు బిందుసారుడు - సుభద్రాంగిల కుమారుడు. దేవానాంప్రియ, ప్రియదర్శిని అనేవి అశోకుడి బిరుదులు.
* అశోకుడు తన మంత్రి రాధాగుప్తుడి సహాయంతో 98 మంది సోదరులను వధించి, చిన్నవాడైన మొగ్గలిపుత్తతిస్సను క్షమించి సింహాసనాన్ని ఆక్రమించినట్లు (చండాశోకుడు) 'మహావంశ' గ్రంథం పేర్కొంటోంది. కానీ శాసనాలు ఈ వాదనను సమర్థించడం లేదు. 4, 5, 6 శిలాశాసనాల్లో సోదర సోదరీమణులను, బంధువులను ప్రేమించినట్లు ఉంది.
* అశోకుడు క్రీ.పూ.261లో కళింగపై యుద్ధం ప్రకటించాడు. అప్పటి కళింగరాజు 'మహామేఘవాహనుడు'. కళింగకు చెందిన నాగ తెగలవారు మౌర్యులకు చెందిన సముద్ర వర్తక వ్యాపారులను దోపిడి చేయడం ఈ యుద్ధానికి దారితీసింది.
* కళింగకు సమీపంలో 'థౌళి లేదా జౌగడ' వద్ద (లాంగుల్య - వైతరణి నదుల మధ్య) మహా మేఘవాహనుడిని అశోకుడు ఓడించినట్లు 13వ శిలాశాసనం తెలుపుతోంది.
* కళింగ యుద్ధంలో అపార ధన, ప్రాణనష్టం వాటిల్లింది. లక్షమంది మరణించగా, లక్షన్నర మంది క్షతగాత్రులయ్యారు. వారి దుఃఖాన్ని చూసి చలించిపోయిన అశోకుడు జీవితంలో మళ్లీ యుద్ధం చేయలేదు. 'యుద్ధభేరి స్థానంలో ధర్మభేరి' మోగించాడు. ఈ యుద్ధంలో బందీలుగా దొరికిన వారితో వ్యవసాయ పనులు చేయించాడు. కళింగ యుద్ధం జరిగిన 2 1/2 ఏళ్ల తర్వాతే అశోకుడు బౌద్ధమతాన్ని సమర్థించినట్లు తెలుస్తోంది.

 

మౌర్యుల చరిత్ర - ఆధారాలు

అర్థశాస్త్రం
* అర్థశాస్త్రాన్ని చాణక్యుడు (కౌటిల్యుడు) రచించాడు. ఈయన అసలు పేరు విష్ణుగుప్తుడు.
* సంస్కృత భాషలో ఉన్న అర్థశాస్త్రంలో 15 అధికరణాలు, 180 ప్రకరణాలు ఉన్నాయి.
* 1909లో ఆర్. శ్యామశాస్త్రి అర్థశాస్త్ర పూర్తి ప్రతిని సంపాదించి ఆంగ్లంలోకి అనువదించారు.
* కౌటిల్యుడు మౌర్యుల పాలనా వ్యవస్థను ప్రధానంగా ప్రస్తావించాడు. రాజ్యానికి చెందిన లక్షణాలను అంటే 'సప్తాంగ సిద్ధాంతాన్ని' ఇందులోనే పేర్కొన్నాడు.
* గూఢచారులు రాజుకు (చక్రవర్తికి) కళ్లు - చెవుల లాంటి వారని అర్థశాస్త్రం పేర్కొంది.
* అర్థశాస్త్రం ప్రకారం సివిల్ కేసులు విచారించడానికి 'ధర్మస్థీయ', క్రిమినల్ కేసుల విచారణకు 'కంఠక శోధన' అనే న్యాయస్థానాలు ఉండేవి.

 

ఇండికా
* మెగస్తనీస్ 'ఇండికా' గ్రంథాన్ని రచించాడు.
* రాజధాని పాటలీపుత్రం. 30 మంది సభ్యులతో కూడిన నగరమండలి పరిపాలనా వ్యవహారాలను నిర్వహించేది.
* బానిస వ్యవస్థ లేదు. 
*  భారతదేశ సమాజంలో ఏడు కులాలు ఉన్నాయి.
*  సైనిక వ్యవస్థ ఉంది.
మహావంశ, దీపవంశ: ఇవి శ్రీలంక బౌద్ధవాఙ్మయానికి సంబంధించినవి. సింహళ భాషలో ఉన్నాయి.
దివ్యవదన, అశోక వదన: ఇవి టిబెట్‌కు చెందిన బౌద్ధ సాహిత్యాలు.
ఎపిటోమ్: ఈ గ్రంథాన్ని 'జస్టీన్' అనే చరిత్రకారుడు గ్రీకు భాషలో రచించాడు.
ది లైవ్స్ (The Lives)
దీని రచయిత ప్లూటార్క్ అనే చరిత్రకారుడు. ఈ గ్రంథంలో ప్రాచీనకాలంలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యక్తుల వివరాలు ఉన్నాయి.

 

ముద్రారాక్షసం
* ఈ సంస్కృత నాటకాన్ని రచించింది విశాఖదత్తుడు.
* ఈ నాటకంలో మహాపద్మనందుడి మంత్రి అయిన రాక్షసుడు చంద్రగుప్త మౌర్యుడికి ప్రధానమంత్రిగా నియమితుడైనట్లు వర్ణించారు.
* విశాఖదత్తుడు గుప్త వంశానికి చెందిన రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉండేవాడు.

 

శాసనాలు
* భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా శాసన రచనను ప్రారంభించింది అశోకుడు. అశోకుడి శాసనాలను మొదట అధ్యయనం చేసింది - జేమ్స్ ప్రిన్సెప్ (1837).
* బ్రహ్మి లిపి ఎడమ నుంచి - కుడికి, ఖరోష్ఠి లిపి కుడి నుంచి - ఎడమకు రాసేవారు.
* 1915లో కర్ణాటకలో 'మస్కి శాసనం' బయటపడింది. ఇందులో 'అశోక' ప్రస్తావన ఉంది. 'అశోక' పేరున్న ఇతర శాసనాలు గుజ్జరా, ఉదెగళ్, నిట్టూర్.

Posted Date : 11-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు