• facebook
  • whatsapp
  • telegram

సింధు, ఆర్య నాగరికతల మధ్య భేదాలు

హరప్పా నాగరికతకు, వైదిక సంస్కృతికి మధ్య అనేక అంశాల్లో స్పష్టమైన భేదాలు కనిపిస్తాయి.


బ్రాహ్మణ మతంతో బౌద్ధ-జైనాలకు ఉన్న తేడాలు
తులనాత్మక అధ్యయనం చేయడానికి ముందు బౌద్ధ, జైన మతాలు బ్రాహ్మణ మతం నుంచే ఉద్భవించాయని భావిస్తున్నారు. మతం, తత్వచింతనలో బ్రాహ్మణమతంతో వీటికి కొన్ని విషయాల్లో స్పష్టమైన విభేదాలు కనిపిస్తాయి.


* పై రెండు మతాల్లో అనేక తారతమ్యాలున్నా, కొన్ని పోలికలు కూడా కనిపిస్తాయి.

 

పోలికలు
*  బ్రాహ్మణ మతంలోని ఉపనిషత్తుల వాదాన్ని రెండు మతాలూ అంగీకరించాయి.
*  దైవం ఉనికిపై కూడా బౌద్ధం మౌనాన్ని పాటించిందే తప్ప వ్యతిరేకించలేదు. జైనమతం దేవుడు ఉన్నాడని ప్రకటించింది.
*  మోక్షానికి మార్గాలు వేరైనా, ఈ భావనను రెండు మతాలూ అంగీకరించాయి.
*  కర్మమార్గం, పునర్జన్మ వాదం రెండింటినీ అంగీకరించాయి.
*  సామాజికపరంగా కులవ్యవస్థలోని లోపాలను వ్యతిరేకించాయి కానీ, కులవ్యవస్థను కాదు.

 

బౌద్ధ - శైవ మతాల మధ్య పోలికలు
*  బౌద్ధం శైవ సంప్రదాయానికి దగ్గరగా ఉండేది.
*  చోళుల కాలంలో శివుడిని నాట్యానికి సంబంధించిన దేవుడిగా (నటరాజు) కొలవడం ప్రారంభమైంది. బౌద్ధంలో అమితాచిగా (స్వర్గలోకంలో బుద్ధుడి పేరు) బుద్ధుడిని కొలవడానికి ఇదే కారణమైంది.
*  శైవంలో జ్ఞానానికి మూలమైన శివుడు దక్షిణమూర్తిగా, బౌద్ధంలో బుద్ధుడు చేతిలోని పుస్తకంతో మంజుశ్రీగా కనిపిస్తారు.
*  శివుడిలా ధ్యానంలో ఉండే బుద్ధుడి రూపాన్ని 'అవలోకితేశ్వర' అంటారు.
*  లలిత కళలకు మూలమైన శివుడు 'సుందరేశుడు' కాగా, చేతిలో కలువ పువ్వు ఉన్న బుద్ధుడిని 'పద్మపాణి'గా ఆరాధిస్తున్నారు.

 

బౌద్ధ, జైన మతాల మధ్య తేడాలు
          బౌద్ధ, జైనమతాలను స్థాపించింది క్షత్రియ రాజవంశాలు. అన్ని వర్గాల మోక్షసాధన కోసం కృషి చేసినా, కొన్ని విషయాల్లో ఈ రెండింటి మధ్య భేదాలున్నాయి. గౌతమబుద్ధుడు - వర్థమాన మహావీరుడు ఒకే కాలానికి చెందినవారైనా ఎప్పుడూ కలుసుకోలేదని చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.

జైన - బౌద్ధమతాల మధ్య పోలికలు
          ఈ రెండింటిలో కొన్ని సాధారణాంశాలు ఉన్నాయి. మొదటిది ఈ మత ప్రబోధకులిద్దరూ శారీరక, మానసిక శ్రమతో కూడిన ప్రయత్నం చేశారు. ఈ విషయం గౌతమబుద్ధుడు, వర్థమాన మహావీరుడు గడిపిన కఠిన సన్యాస జీవితం ఆధారంగా తెలుసుకోవచ్చు.
* రెండు మతాలూ వేదాల ఆధిక్యాన్ని, జంతు బలులను వ్యతిరేకించాయి. ఫలితంగా ఛాందస బ్రాహ్మణ వర్గాలకు వ్యతిరేకమయ్యాయి. ఆ కాలంలో వ్యవసాయంలో ఇనుప పనిముట్లను ఉపయోగించేవారు. వ్యవసాయం పరోక్షంగా పశుసంపదపై ఆధారపడి జరిగింది. వీటి ఆధారంగా జీవహింస చేయరాదనే సిద్ధాంతానికి ప్రాముఖ్యం ఉందని తెలుస్తోంది. మొదటిసారిగా అహింసా సిద్ధాంతం ప్రధానమైన వ్యవసాయాభివృద్ధికి తోడ్పడింది. అహింసకు ప్రాముఖ్యం ఇవ్వడం వల్ల పొలాల్లో చీడపురుగులను చంపే రైతుల్లో జైన మతం ఎక్కువగా ప్రాచుర్యం పొందలేదు.
*  ప్రాచీన బౌద్ధ సాహిత్యం తల్లితండ్రులు, బంధువుల్లా పశువులు కూడా మనకు స్నేహితులేనని, వ్యవసాయం వీటిపై ఆధారపడి ఉంది కాబట్టి వీటిని వధించకూడదని పేర్కొంది. వ్యవసాయానికి పశుసంపద ఆధారం అనే విషయాన్ని బౌద్ధం గుర్తించింది.
*  వ్యాపార విషయాల్లో ఈ రెండింటికీ ఒకే అభిప్రాయం ఉంది. ప్రాచీన బ్రాహ్మణులు సమాజంలో మూడో వర్గమైన వైశ్యులు వ్యవసాయం, వర్తకం చేయాలనీ, అత్యవసర పరిస్థితుల్లో బ్రాహ్మణులు కూడా వర్తకం చేయవచ్చని పేర్కొన్నారు. 'బౌద్ధాయనుడు' సముద్ర ప్రయాణాన్ని పాపంగా పరిగణించాడు. దీనికి విరుద్ధంగా బౌద్ధ సాహిత్యం సముద్రయానాన్ని సమ్మతించింది.
*  ఈ రెండు మతాలు ఉదారమైన వైఖరి ప్రదర్శించాయి. బుద్ధుడు ఒకసారి ఆమ్రపాలి (వేశ్య) ఆతిథ్యాన్ని స్వీకరించాడు. బుద్ధసంఘంలో స్త్రీలకు ప్రవేశం లేకపోయినప్పటికీ, ప్రియశిష్యుడైన ఆనందుడి కోరిక మేరకు అతడి పినతల్లి 'గౌతమీ ప్రజాపతి' బౌద్ధసంఘంలో చేరడానికి బుద్ధుడు అనుమతించాడు. బౌద్ధసంఘంలో వేశ్యలను కూడా చేర్చుకున్నారని తెలుస్తోంది.
*  మహావీరుడు కూడా తమ సంఘంలో స్త్రీలను చేర్చుకున్నట్లు తెలుస్తోంది. మహావీరుడి మొదటి శిష్యురాలు బందీగా పట్టుబడిన బానిస. ఓ ప్రాచీన జైన గ్రంథం ప్రకారం జైనమతంలో అనేక మంది స్త్రీలు చేరినా, వీరందరికీ ముక్తి లభించిందా లేదా అనేది వివాదాస్పద అంశం.
*  ఈ రెండు మతాల ప్రకారం ఏ కులస్థుడైనా గురువును గౌరవించాలి. బౌద్ధ జాతక కథల్లో ఒక బ్రాహ్మణుడు, కులం తక్కువవాడనే కారణంగా చండాలుడిని తన గురువుగా గుర్తించకపోవడంతో అతడి వద్ద నేర్చుకున్న మంత్రాన్ని కోల్పోతాడు. అదేవిధంగా ఒక రాజు 'చండాలుడి' వద్ద తంత్రవిద్య నేర్చుకునేటప్పుడు కిందిస్థానంలో కూర్చునేవాడని, చండాలుడు ఉన్నత స్థానంలో కూర్చునేవాడని ఒక జైనగ్రంథంలో పేర్కొన్నారు.
*  ఈ రెండు మతాలూ బానిసల స్థితిని మెరుగుపరచడానికి కొంతవరకూ ప్రయత్నించాయి. అది ఏ వర్ణం వారికి పనికిరాదని నిషేధించాయి. 'దిఘానికాయ' యజమానులకు తమ బానిసలను గౌరవప్రదంగా చూడమని సలహా ఇచ్చింది. ఒక జైన గ్రంథం కూడా దాస-దాసీలను, కర్మకాండలు చేసేవారిని ఆదరించాలని పేర్కొంటోంది. దీని ఆధారంగా బౌద్ధ, జైన భిక్షువుల్లో దయ, ఉదారత అనే గుణాలుండేవని, అందువల్లే ఈ మతాలు సామాన్యుల్లో బాగా ప్రచారం పొందాయని చెప్పవచ్చు.

 

అజీవక మతం
         ఈ మతశాఖను స్థాపించింది మక్కలి గోసలిపుత్ర. ఈయన వర్థమాన మహావీరుడికి స్నేహితుడు. శ్రావస్థిలో జరిగిన సభలో ఇతడు వర్థమాన మహావీరుడితో తీవ్రంగా విభేదించాడు. అజీవకమతం 'నియుతి' విధానాన్ని విశ్వసించింది. అంటే 'విశ్వం ఏవిధంగా మార్పు చెందాలో ముందే నిర్ణయించబడింది, దాని మార్గాన్ని మార్చడం ఎవరితరం కాదు' అని అర్థం. మౌర్యుల కాలం వరకూ అజీవకమతం ఉంది. అజీవకులకు పవిత్రమైన జంతువు జింక. బిందుసారుడు ఈ మతాన్ని అభిమానించాడు. బిందుసారుడి ఆస్థానంలోని అజీవక భవిష్యవేత్త 'పింగళావత్స'. అశోకుడు, దశరథుడు అజీవకుల కోసం లోహమ, సుధామ అనే గుహలను దానం చేశారు. ఈ మతంలో దిగంబర సిద్ధాంతాలు, కఠిన నియమాలు ఉండేవి.

 

చార్వాక మతం
       'అజితకేశకంబలి' చార్వాక మతశాఖ స్థాపకుడు. ఇది భౌతికవాదం, నాస్తిక (హేతు) వాదాలకు దారితీసింది.
క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందిన జయరాశి 'తత్వోపవిప్లవసింహ' అనే గ్రంథాన్ని రాశాడు. దీంట్లో ఇతడు నాస్తిక వాదాన్ని సమర్థించాడు. మనిషి ప్రధానంగా నాలుగు మూల పదార్థాలతో రూపొందాడని, అతడి మరణంతో ఆ నాలుగు మూల పదార్థాలు తిరిగి అసలు మూల పదార్థమైన ధూళితో కలసిపోతాయని 'కేశకంబలి' పేర్కొన్నాడు. పై రెండు మతశాఖలు క్రీ.పూ. 6వ శతాబ్దంలో జైన-బౌద్ధాలతోపాటు ప్రాచుర్యం పొందాయి.

Posted Date : 11-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు