• facebook
  • whatsapp
  • telegram

తొలివేద నాగరికత (రుగ్వేద నాగరికత)

           భారతదేశంలో ఆర్య నాగరికత క్రీ.పూ. 1500 నుంచి 600 మధ్యకాలంలో విలసిల్లింది. దీనికి రెండు దశలున్నాయి. తొలిదశలో (క్రీ.పూ. 1500 - 1000) వర్థిల్లిన వేద సంస్కృతిని 'తొలివేద లేదా రుగ్వేద సంస్కృతి' గా, రెండో దశ (క్రీ.పూ. 1000-600)లోని సంస్కృతిని 'మలివేద నాగరికత'గా చరిత్రకారులు పేర్కొంటున్నారు.
          ఆర్యులు అంటే పూజ్యులు, తెల్లటి శరీరవర్ణం ఉన్నవారు, గౌరవింపబడే వారు అనే అర్థాలు ఉన్నాయి. సింధూ ప్రజలపై విజయం సాధించిన ఆర్యులు భారతదేశంలో ప్రవేశించినట్లు భావిస్తున్నారు. తొలివేద కాలంనాటి ఆర్యులు భారత, యదు, తుర్మష, పురు లాంటి వివిధ తెగలుగా (సమూహాలుగా) పంజాబ్‌లోని 'సప్త సింధూ మైదాన ప్రాంతాన్ని' చేరుకున్నారు. దీన్ని 'ఆర్యావర్తం' అని పిలుస్తారు. ఆర్యుల కాలంనాటి వేద భావాలు నేటికీ భారతదేశంలో బలీయమైన శక్తులుగా ఉన్నాయని వి.ఎ. స్మిత్ పేర్కొన్నారు. ఆర్యులు - ఆనార్యుల సంస్కృతుల సమ్మేళనమే భారతీయ సంస్కృతిగా కొనసాగుతోంది.
          తొలివేద ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన సాహిత్య ఆధారం 'రుగ్వేదం'. ఇది ప్రపంచ చరిత్రలోనే ప్రాచీనమైన మత గ్రంథమని పురావస్తు ఆధారాలైన 'భోగజ్ కోయీ', కెసైట్ శాసనాలు తెలుపుతున్నాయి. 
    ఆర్యుల గమనంపై అనేక వివాదాలున్నాయి. బాలగంగాధర తిలక్, సి.వి. వైద్య వారు ఆర్కిటిక్ ప్రాంతవాసులని; స్వామి దయానంద సరస్వతి- టిబెట్ ప్రాంతవాసులని; పి.సి. లెంక జర్మనీవాసులని; పోకోర్ని- వోల్గా ప్రాంతమని, జర్మనీ పండితుడు మాక్స్‌ముల్లర్ మధ్య ఆసియావాసులని పేర్కొన్నారు. తొలివేద ఆర్యులు మధ్య ఆసియా వాసులని కపడోషియా ప్రాంతంలోని 'భోగజ్ కోయీ శాసనం' ద్వారా తెలుస్తోంది. ఈ శాసనంలో ఇంద్ర, అగ్ని, వరుణ, అదితి, పృథ్వి, ఉషస్ అనే ఆర్యదేవతల గురించి ప్రస్తావించారు (ఇది ఎక్కువ మంది ఆమోదం పొందింది.)
                ఆర్యులు మధ్య ఆసియా నుంచి బయలుదేరే క్రమంలో మార్గమధ్యంలో పర్షియా (ఇరాన్)లో కొంతకాలం విడిది చేసినట్లు తెలుస్తోంది. ఇరానియన్ల పవిత్ర గ్రంథం 'జెండా అవెస్తాలో' ఆర్య అనే పదం ఉంది. ఇరానియన్ల కెసైట్ శాసనంలో వరుణదేవుడి ప్రస్తావన ఉన్నట్లు చెబుతారు. 'విద్' అనే పదం నుంచి వేదం పుట్టింది. 'విద్' అంటే తెలుసుకోవడం అని అర్థం. వేదం అంటే జ్ఞానం. వేదాలు నాలుగు అవి: రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. కానీ, రుగ్వేదం మాత్రమే తొలివేద నాగరికతను వివరిస్తోంది. రుగ్వేదాన్ని 10 మండలాలుగా విభజించారు. దీంట్లో 1028 శ్లోకాలున్నాయి. రుగ్వేదంలో సావిత్రి దేవత ఉపాసనకు సంబంధించిన 'గాయత్రీ మంత్రం' ఉంది. వేదాలకు మరో పేరు 'అపౌరుషేయాలు'. అంటే మానవులు సృష్టించలేదని, సృష్టికర్త మానవుడికి అందజేశాడని అర్థం. వేదాలు ఒకరి నుంచి ఒకరికి వల్లెవేసే విధానంలో (మౌఖికంగా) ఉండేవి. గుప్తులకాలంలో వీటిని వాఞ్మయ రూపంలో రాశారు.

 

రాజకీయ వ్యవస్థ

               రుగ్వేదం ప్రకారం వివిధ తెగలతో కూడిన రాజకీయ వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తోంది. రుగ్వేదంలో అనేక యుద్ధాల గురించి పేర్కొన్నారు. రావి నది జలాలు, పచ్చిక బయళ్ల కోసం వివిధ తెగల మధ్య యుద్ధాలు జరిగేవి.
     సాధారణంగా విల్లమ్ములు, గండ్ర గొడ్డలి, కత్తి, ఈటె లాంటి ఆయుధాలను ఉపయోగించేవారు. యుద్ధవీరులు రక్షణ కోసం కవచాలు, శిరస్త్రాణాలు ధరించేవారు. రుగ్వేదంలో రథ, పదాది దళాల గురించి ప్రస్తావించారు. దళాలకు సర్వసైన్యాధిపతి రాజన్.  పదాతి దళం పేరు పట్టి, రథదళాల పేరు 'రథినులు'.
యుద్ధంలో ఏనుగులను ఉపయోగించేవారు కాదు. 'గవిష్ఠి' అంటే గోవుల కోసం వెతకడం అని అర్థం. తర్వాతి కాలంలో యుద్ధం అనే అర్థంతో ఆ పదాన్ని ఉపయోగించారు. రుగ్వేదంలో 'దశరాజ్ఞ యుద్ధం' గురించి ప్రస్తావించారు. 10 మంది రాజుల మధ్య జరిగిన యుద్ధం. దీన్నే 'ఇంద్ర-శాంబిర యుద్ధం' అంటారు. ఇది రావి నది ఒడ్డున జరిగింది. ఈ యుద్ధ విజేత భరతుల తెగకు చెందిన సుధాముడు. సుధాముడికి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న తెగలు - పురు, యదు, తుర్వశ, అనులు, ద్రుహ్రులు, అలిన, పక్త, భాలన, శివవిష్ణనినులు. అనార్య తెగలైన అజుల, సిగ్రులు, యక్షులు భౌదుడి నాయకత్వంలో సుధాముడితో పోరాడారు. సుధాముడే విజయం సాధించాడు.
      తొలి వేదకాలంలో తెగ నాయకుడిని 'రాజన్' అని పిలిచారు. ఇతడి విధి తమ తెగలోని ప్రజలు, పశుసంపదను రక్షించడం, శత్రువులను ఓడించడం. కొన్ని కుటుంబాలు కలిసి ఒక గ్రామంగా ఏర్పడ్డాయి. కొన్ని గ్రామాలు కలిసి ఒక 'విస్‌'గా, 'విస్‌'లు ఒక జనపదం లేదా తెగగా ఏర్పడ్డాయి. రాచరికం వంశ పారంపర్యం. కొన్ని పర్యాయాలు రాజును ఎన్నుకునేవారు. పాలనలో రాజన్‌కు సహకరించడానికి పురోహిత, సేనాని, యువరాజు ఉండేవారు. రాజు ప్రజల నుంచి 'బలి' అనే పన్ను వసూలు చేసేవాడు. రాజన్ పాలనను నియంత్రించడానికి ప్రజాసంఘాలైన సభ - సమితి - విదాత - గణాలు ఏర్పడ్డాయి. ప్రాచీన భారతదేశ చరిత్రలోనే ప్రజాస్వామ్య విధానానికి బీజం పడిందనడానికి ఉదాహరణగా చరిత్రకారులు దీన్ని పేర్కొంటారు. సభలో సభ్యులు పెద్దలు. ప్రతి తెగలోని వ్యక్తి సమితిలో సభ్యుడిగా ఉండేవాడు. విదాతలో స్త్రీలు మాత్రమే సభ్యులు. పైమూడింటినీ కలిపి 'గణ' అని పిలిచేవారు.
              సర్వన్యాయాధ్యక్షుడు రాజన్. దివ్య పరీక్షల ద్వారా న్యాయ నిర్ణయాలు చేసేవారు. నేరం స్థాయిని బట్టి నష్టపరిహారాన్ని విధించేవారు. హంతకుడు, హతుడి కుటుంబానికి 100 గోవులు ఇవ్వాల్సి ఉండేది.

 

సామాజిక వ్యవస్థ

             పితృస్వామిక వ్యవస్థ ఉండేది. కుటుంబ పెద్దను 'గహపతి/ దళపతి' అనేవారు. కుటుంబాన్ని 'కుల'గా పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ (20-30 సభ్యులు) ఉండేది. వర్ణవ్యవస్థ లేదు. రుగ్వేదంలో ఒక శ్లోకం అర్థం ఈవిధంగా ఉంది: 'నేను కవిని. నా తండ్రి వైద్యుడు. మా తల్లి పిండి విసురుతోంది'. అంటే ఒకే ఇంట్లో వివిధ వృత్తుల వారున్నట్లు తెలుస్తోంది. వర్ణాంతర వివాహాలకు అభ్యంతరాలు లేకపోవడం, క్షత్రియుడైన యయాతి, బ్రాహ్మణ స్త్రీ అయిన దేవయానిని వివాహమాడటం, వృత్తుల మార్పిడి, వృత్తులు వంశపారంపర్యం కాకపోవడం, సహపంక్తి భోజన విషయంలో అభ్యంతరాలు లేకపోవడం, అస్పృశ్యత లేకపోవడం లాంటివి కులవ్యవస్థ కఠినమైంది కాకుండా సరళమైంది అని చెప్పడానికి ఆధారాలు. బాల్య వివాహాలు, సతీసహగమనం, పరదా పద్ధతి లాంటి దురాచారాలు లేవు. స్త్రీలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలున్నాయి. రుగ్వేదంలో అపాల, విశ్వవర, లోపాముద్ర, ముద్గలిని, ఘోష అనే విదుషీమణులు పురుషులతో సమానంగా రుషి స్థాయి పొందారు. ఈ కవయిత్రి వర్గాన్ని 'విశ్వవందినులు' అంటారు.
 

ఆర్థిక వ్యవస్థ

              రుగ్వేద ఆర్యుల ముఖ్యవృత్తి పశుపోషణ. వీరిది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. వీరికాలంలో భూమి ఆస్తిలేదు. 'గ్రామ' అనే పదాన్ని రుగ్వేదంలో 200 సార్లు ప్రస్తావించారు. గ్రామ అంటే 'ప్రజా సముదాయం' అని అర్థం. రుగ్వేదంలో నీరు అనే అర్థంతో 'సముద్ర' పదాన్ని వాడారు. హిమాలయాల ప్రస్తావన ఉంది. వింద్య పర్వతాల ప్రసక్తి లేదు. గోమాతను పూజించేవారు. వ్యవసాయంలో గుర్రాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. రుగ్వేద ఆర్యులకు రుతువులపై పరిజ్ఞానం ఉంది. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర రుతువులున్నాయి. ప్రధాన ఆహారం గోధుమ, బార్లీ (యవ), పరిమితంగా పండించిన పంట వరి (వ్రీహి). తిల (నువ్వుల) పంటను పండించారు. పశుసంపద ఉన్న వ్యక్తిని గోమత్ అని పిలిచేవారు. 'అఘాయ' అనే పదం వధించడం నుంచి ఆవులకు మినహాయింపునిచ్చినట్లు తెలియజేస్తోంది. రవాణా సాధనాలుగా రథాలు, ఎడ్ల బండ్లు ఉండేవి. రథాలు (రథ), బండ్లు (అనస్), పడవ (నవ్)లను తయారు చేసేవారిని తక్షణ అనేవారు. వస్తు మార్పిడి విధానంలో వర్తక వ్యాపారాన్ని కొనసాగించారు.
 

మత విధానం

             ఆర్యులు ప్రకృతి శక్తులకు దైవత్వం ఆపాదించి ఆరాధించారు. రుగ్వేద మతాన్ని 'హెనోథీయిజమ్ లేదా మోనిజమ్' అని నిర్వచించవచ్చు. అంటే భగవంతుడు ఒక్కడే, రూపాలు వేరు అన్న భావన. దేవతలు అనే పదానికి మూలం 'దివ్' అనే సంస్కృత ధాతువు. 'దివ్' అంటే ప్రకాశించడం అని అర్థం. వీరి ప్రధాన ఆరాధ్య దైవం ఇంద్రుడు. రుగ్వేదంలో ఇంద్రుడికి అంకితం చేసిన శ్లోకాలు 250. ఇతడు యుద్ధ దేవుడు, విజయాల దేవుడు. ఇంద్రుడు హరప్పా- మొహంజొదారో పట్టణాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.
      ఈ కారణంగా ఇతడికి 'పురందరుడు' అనే బిరుదు వచ్చింది. హరప్పాను రుగ్వేదంలో హరియుపురంగా ప్రస్తావించారు. ఇంద్రుడు వృత్తాసుర అనే రాక్షసుడిని సంహరించాడని, అందువల్ల 'వృత్తాసుర' అనే బిరుదు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంద్రుడి ఆయుధం 'వజ్రాయుధం'. రెండో ప్రధాన దైవం 'అగ్ని'. అగ్ని గురించి రుగ్వేదంలో 200 సార్లు ప్రస్తావించారు.
ఇతడు భగవంతుడికి - భక్తుడికి మధ్య సంధానకర్త. అగ్నిదేవుడు ఆర్యులకు ఇంటి దైవం (God of the Home). ఇతడికి 'హవ్యవాహనుడు' అనే బిరుదుంది. మూడో దేవుడు 'వరుణ'. ఇతడు రుతుదేవుడు, ఉన్నతమైన నైతిక ప్రవర్తన నియమావళిని అందించే దేవుడు. వరుణుడు స్వర్గంలో అత్యంత విశాలమైన భవనంలో నివసించేవాడు. రుగ్వేద ఆర్యులు మంచి సంతానం, పశువులు, ఆహారం కోసం దేవుళ్లని ప్రార్థించేవారు.
రుగ్వేదంలో 'మోక్షం', 'నరకం' లాంటి పదాలను ఉపయోగించలేదు. మిత్ర అనే సూర్య దేవత, అదితి, పృథ్వి, ఉషస్, అరణ్యని లాంటి స్త్రీ దేవతలనూ పూజించారు. దేవతలకు తల్లి అదితి. 
             గాయత్రీ మంత్రం సావిత్రి దేవతకు సంబంధించింది. ఈమెను సూర్యదేవుడికి అంకితమిచ్చినట్లు చెప్పారు. సోమ, సుర అనే మత్తు పానీయాలను సేవించినట్లు తెలుస్తోంది. సోమ రసాన్ని సేవించిన ఇంద్రుడు యుద్ధంలో శత్రువులను సంహరించాడని విశ్వాసం. ఈ సోమ రసాన్ని హిమాలయాల్లోని ముజవంత్ శిఖరంపై ఉన్న సోమ వృక్షం నుంచి తీసినట్లు చెబుతారు. హిమాలయాలను రుగ్వేదంలో 'హిమవంతగా' పేర్కొన్నారు. వృక్షదేవత 'సోమ'. సరస్వతి నదిని పూజించేవారు. గ్రీకులు, రోమన్లు పూజించిన 'జూపిటర్' దేవతతో ఆర్యుల దేవత 'ద్యుస్‌'కు పోలిక ఉంది.

 

రుగ్వేదంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు

'దథీక్రీ' అనే దేవత గుర్రం, 'శరమ' అనే కుక్కపిల్ల ప్రస్తావన ఉంది. జూదగాని ప్రేలాపన (Gamestars Lament), స్వర్గం, ఆర్య, సముద్ర, గవిష్ఠి, విస్, కుల, ఓమ్, జన, యుమున, గంగా, వరి (వ్రీహి), బార్లీ (యవ), సింహం.
 

రుగ్వేదంలో సప్తనదుల పేర్లు

 రావి          పరుషుని      బియాస్        విపాస్
 సట్లెజ్      సతుద్రి       సరస్వతి        సరౌతి
 జీలం        వితస్థ        సింధు నది     సింధు నది
 చినాబ్     అసిక్నె

 

Posted Date : 11-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు