• facebook
  • whatsapp
  • telegram

మౌర్యుల పరిపాలన - ఆర్థిక, సామాజిక పరిస్థితులు

          ప్రాచీన భారతదేశ పరిపాలనలో మౌర్యుల యుగం ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. వీరి కాలంలో బాగా వ్యవస్థీకృతమైన, కేంద్రీకృత పరిపాలనను ప్రవేశపెట్టారు. చిన్న రాజ్యాల సమాఖ్యలు లేదా గణతంత్ర రాజ్యాలు మౌర్యులకు ముందు భారతీయులకు బాగా పరిచయమున్న పరిపాలన విధానం. అయితే నందుల కాలంలో ఈ విధానం మారింది. వారు మొదటిసారిగా కేంద్రీకృత రాజరికాన్ని ప్రవేశపెట్టారు. మౌర్యుల కాలంలో దీన్ని చాలా పటిష్ఠంగా అమలు చేయగలిగారు.
కేంద్ర పరిపాలన: మౌర్యుల పరిపాలనకు కేంద్రం రాజు. రాజు అధికారాలు విపరీతంగా పెరిగాయి. అయితే రాజు నియంతలాగా వ్యవహరించలేదు. అశోకుడు తన శాసనంలో ''మానవులంతా నా బిడ్డలే" అని ప్రకటించాడు. అశోకుడు ఒక ఆదర్శ రాజరికాన్ని అనుసరించాడు. ''ప్రజల సంతోషంలోనే నా సంతోషం ఇమిడి ఉంది. వారి సంక్షేమంలో నా సంక్షేమం ఉంది. రాజుగా నాకు ఏదైతే సంతోషాన్నిస్తుందో దాన్ని మంచిగా భావించకూడదు. నా ప్రజలకు సంతోషం కలిగించే దాన్నే మంచిగా భావించాలి" అని అశోకుడు పేర్కొన్నాడు. దీన్నిబట్టి మౌర్యుల కాలంలో రాజు ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకున్నట్లు తెలుస్తోంది.
రాజు అధికారాలపై నియంత్రణ: రాజును అదుపులో ఉంచడం ద్వారా రాజు నియంతృత్వ పోకడలను అడ్డుకోవడానికి అవకాశం కలిగింది. దీనికి కింది అంశాలు దోహదపడ్డాయి.
(i) రాజు బ్రాహ్మణుల పట్ల గౌరవంతో, భక్తితో వ్యవహరించాలి.
(ii) రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు వస్తాయనే భయం మరో అంశం. అందుకే చంద్రగుప్తుడు కుట్రలకు వ్యతిరేకంగా నిరంతరం జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా, ప్రతి రాత్రి తన పడకగదిని మార్చేవాడు.
(iii) ఒక చక్రం సహాయంతో బండి నడపడం సాధ్యం కాదని, అలాగే రాజు మంత్రుల సహాయం లేకుండా పరిపాలనను నిర్వహించలేడని కౌటిల్యుడు పేర్కొన్నాడు. విద్యార్థి గురువును, కుమారుడు తండ్రిని, సేవకుడు యజమానిని అనుసరించినట్లు రాజు మంత్రుల సలహాలను పాటించాలని కూడా కౌటిల్యుడు పేర్కొన్నాడు.
          మౌర్యుల కాలంలో మంత్రి పరిషత్తు ఉన్నట్లు కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీస్ 'ఇండికా' ద్వారా తెలుస్తోంది. మంత్రి పరిషత్తు రాజు నియంతగా మారకుండా ఉండటానికి తోడ్పడింది. దీని అధికారాలు రాజు బలం, మంత్రి పరిషత్తు సభ్యుల శక్తి సామర్థ్యాలమీద ఆధారపడి ఉండేవి. ఉదాహరణకు అశోకుడు ప్రధానమంత్రి రాధాగుప్తుడి సహాయంతో సింహాసనాన్ని అధిష్టించాడు. అశోకుడు తన శాసనాల్లో మంత్రి పరిషత్తు గురించి ప్రస్తావించాడు. రాజు నిర్ణయాలను మంత్రి పరిషత్తు చర్చించవచ్చు, అవసరమైతే సవరణలు చేయవచ్చు. అయితే తుది నిర్ణయం రాజు చేతిలో ఉండేది. అందువల్ల మంత్రి పరిషత్తును సలహా సంఘంగా భావించవచ్చు.
          మంత్రి పరిషత్తు సభ్యులను రాజు స్వయంగా ఎన్నుకోవడంవల్ల మంత్రి పరిషత్తు మీద రాజు నియంత్రణ పెరిగినట్లు తెలుస్తోంది. మంత్రి పరిషత్తు సభ్యులకు ఉండవలసిన లక్షణాలను అర్థశాస్త్రం వివరించింది. మంత్రుల పుట్టుక, నిజాయితీ, తేలివితేటలకు ప్రాధాన్యత ఇచ్చింది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో మంత్రుల విధేయత, నిజాయితీలను పరీక్షించే విధానాలను పేర్కొన్నాడు. మంత్రి పరిషత్తులో సభ్యుల సంఖ్య కాలాన్ని, అవసరాన్ని బట్టి మారేది. మౌర్యుల కాలంలో ఎక్కువ మందితో కూడిన మంత్రి పరిషత్తు ఉన్నట్లు తెలుస్తోంది.

 

రాజు యాత్రలు: అశోకుడు సామ్రాజ్యమంతటా స్వయంగా పర్యటనలు చేయడం ద్వారా పరిపాలన వ్యవస్థలో ఒక నూతన ఒరవడిని ప్రవేశపెట్టాడు. వీటిలో ప్రధానమైనవి.
i) ఈ యాత్రల ద్వారా చక్రవర్తికి ప్రజల స్థితిగతులను తెలుసుకునే అవకాశం కలిగింది.
ii) అశోకుడు ఈ యాత్రలను 'ధమ్మ' ప్రచారం కోసం వినియోగించుకున్నాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అశోకుడు, మహామాత్యులు, యుక్త, రజుక అనే అధికారులను సైతం యాత్రలను చేపట్టి ప్రజల స్థితిగతులను తెలుసుకోవాలని ఆదేశించాడు.
iii) ఈ యాత్రలు అధికారుల పనితీరును పర్యవేక్షించడానికే కాకుండా పరిపాలన సామర్థ్యాన్ని పెంపొందించడానికి సహాయపడ్డాయి.
iv) ఈ యాత్రల వల్ల రహదారులు, ప్రసార సాధన వ్యవస్థలు బాగా మెరుగుపడ్డాయి. ఇది ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా వెళ్లడానికి సహాయపడింది.
          రాజు తన అధికారులకు, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని అర్థశాస్త్రంలో చెప్పారు. రాజు అందుబాటులో లేకుంటే అది గందరగోళానికి దారి తీస్తుందని కౌటిల్యుడు పేర్కొన్నాడు. ఈ సలహాను మౌర్య చక్రవర్తులందరూ పాటించినట్లు తెలుస్తోంది. రాజు శారీరక మర్ధన (Massage) సమయంలో సైతం అందుబాటులో ఉండేవాడనే విషయం 'ఇండికా' గ్రంథం ద్వారా తెలుస్తోంది. తాను ఎక్కడున్నా, భోంచేస్తున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా, తోటలో ఉన్నా గూఢచారులు తనను కలుసుకోవచ్చని అశోకుడు ఒక శాసనంలో పేర్కొన్నాడు.
   రాజు, మంత్రి పరిషత్తుతోపాటు సన్నిధాత (కోశాధికారి), సమాహార్త మొదలైన ఉద్యోగులు కేంద్ర పరిపాలనలో ప్రముఖ పాత్ర పోషించారు. సన్నిధాత, సమాహార్తలు ఆదాయానికి సంబంధించి గణాంకాలు చూసేవారు. సమాహార్త గుమస్తాల సహాయంతో వివిధరకాల పన్నుల వసూలుకు సంబంధించిన వివరాలను భద్రపరిచేవాడు. పరిపాలనను సాఫీగా నిర్వహించడానికి అధ్యక్షుల (Superintendents) నియంత్రణలో పనిచేసే వేర్వేరు శాఖలను సృష్టించినట్లు అర్థశాస్త్రంలో పేర్కొన్నారు. వర్తక వాణిజ్యాలు, అడవులు, తూనికలు - కొలతలు, గనులు, వ్యవసాయం, పన్నులు, సుంకాలు తదితర అనేక శాఖలు ఉండేవి.

 

రాష్ట్ర పరిపాలన: పరిపాలన సౌలభ్యం కోసం ఒకేరకమైన పరిపాలన విధానాన్ని ప్రవేశపెట్టడం కోసం సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. చంద్రగుప్తుడి కాలంలో నాలుగు రాష్ట్రాలు ఉండగా, అశోకుని కాలంలో వీటి సంఖ్య ఆరుకు పెరిగింది. ఈ రాష్ట్రాలు రాజు కుటుంబీకుల నియంత్రణలో ఉండేవి. వారిని 'కుమార' లేదా 'ఆర్యపుత్ర' అని పిలిచేవారు. 'కుమార' అనేవారు రాజకుమారులు, ఆర్య పుత్రులు రాజు దగ్గర బంధువులు అయి ఉండవచ్చు. వారు సాధారణంగా గవర్నర్లు, రాజ ప్రతినిధులుగా వ్యవహరించారు. రాకుమారులను గవర్నర్లు, రాజ ప్రతినిధులుగా నియమించడం వారికి పరిపాలనలో తగినంత శిక్షణ పొందడానికి ఉపయోగపడింది. అదే సమయంలో రాజ ప్రతినిధిగా పనిచేసే రాకుమారులు రాజుకు వ్యతిరేకంగా తమ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నించారు. అశోకుడు మొదట్లో పశ్చిమ ఇండియా వైస్రాయిగా, తర్వాత తక్షశిల వైస్రాయిగా తన స్థానాన్ని పదిలం చేసుకుని, తన అన్నను కాదని, తండ్రికి ఇష్టం లేకున్నా సింహాసనాన్ని అధిష్టించాడు.
 

రాష్ట్ర స్థాయిలో మంత్రి పరిషత్తు: రాష్ట్ర గవర్నర్లు తమ సొంత మంత్రి పరిషత్తును కలిగి ఉండేవారు. రాష్ట్ర మంత్రి పరిషత్తు, కేంద్ర మంత్రి పరిషత్తుతో పోల్చినప్పుడు ఎక్కువ అధికారాలు కలిగి ఉండేది. వారు కొన్ని సందర్భాల్లో రాజును నియంత్రించడానికి ప్రయత్నించేవారు. బిందుసారుడి కాలంలో తక్షశిలలో తిరుగుబాటుకు కారణం స్థానిక మంత్రులపై వ్యతిరేకతే గానీ, రాకుమారుడి మీద వ్యతిరేకత కాదు.
తక్షశిలలో తిరుగుబాటుకు ఇతర కారణాలు 
i) గాంధార గణతంత్ర రాజ్యానికి రాజధాని అయిన తక్షశిల మౌర్యుల పూర్వయుగంలో స్వాతంత్య్రాన్ని అనుభవించింది.
ii) ఆ ప్రాంతంలో ప్రజలు పర్షియా దేశస్తులు
iii) మౌర్య చక్రవర్తులు ప్రవేశపెట్టిన కేంద్రీకృత పరిపాలన స్వేచ్ఛను ప్రేమించే ఆ ప్రాంత ప్రజలకు నచ్చలేదు.
iv) మంత్రుల అణచివేత విధానం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
          తక్షశిల తిరుగుబాటు గురించి తక్షశిల దగ్గరలోని సిర్‌కాప్ అనే ప్రదేశంలో ఒక ఇంటిలో లభ్యమైన అరమైక్ లిపిలో వేయించిన శాసనంలో పేర్కొనిఉంది. ఈ తిరుగుబాటును అణచివేయడానికి బిందుసారుడు అశోకుడిని పంపగా, అశోకుడు దాన్ని విజయవంతంగా అణచివేశాడు.
          రాష్ట్ర గవర్నర్లు, వైస్రాయిలకు కొంతమంది అధికారులను నియమించుకునే అధికారం ఉంది. అయిదు సంవత్సరాలకు ఒకసారి యాత్రలు చేపట్టే మహామాత్యుల్లో కొందరిని రాజు నియమించగా, మరికొందరిని వైస్రాయిలు నియమించేవారు.
మహామాత్యులకు పరిపాలనలో వివిధ అంశాలపై నియంత్రణ ఉండటంతో వారికి కీలకస్థానం ఇచ్చారు. వారు సాధారణ పరిపాలకులుగా, న్యాయ అధికారులుగా వ్యవహరించేవారు. అశోకుడు రాజ్యానికి వచ్చిన 14వ సంవత్సంలో ధర్మ మహామాత్యులు అనే కొత్త అధికారులను నియమించారు. ధమ్మప్రచారం చేయడం వీరి బాధ్యత.
          రాష్ట్రాలను ఆహారాలనే జిల్లాలుగా విభజించారు. వీటిని కొంతమంది అధికారుల బృందం పరిపాలించేది. ఆహారానికి అధిపతి ప్రాదేశిక. ఇతడు ప్రస్తుత జిల్లా కలెక్టరుకు సమానం. ఇతడి విధులు కిందివిధంగా ఉన్నాయి.
i) ఇతడు జిల్లా సాధారణ పరిపాలనకు బాధ్యుడు
ii) జిల్లాను క్రమం తప్పకుండా సందర్శించి, జిల్లా అధికారులు, గ్రామ అధికారుల పనులను పర్యవేక్షించి, ముఖ్య కలెక్టర్ అయిన సమాహార్తకు నివేదికలు పంపాలి.
iii) రజుక, రెవెన్యూ అధికారులను నియంత్రించాలి.
          రెవెన్యూ వసూలును పర్యవేక్షించడం, గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాలోని పట్టణాల్లో శాంతిభద్రతలు కాపాడటం, అయిదు సంవత్సరాలకొకసారి జిల్లాలో పర్యటించి, తమ నియంత్రణలోని రజుక, యుక్త, ఉపయుక్త తదితర అధికారుల పనితీరును పర్యవేక్షించడం ప్రాదేశిక అనే అధికారుల ప్రధాన బాధ్యత.
          అశోకుడు ఒక శాసనంలో పూర్తిగా రజుక విధులను గురించి పేర్కొన్నాడు. దీన్నిబట్టి వారు జిల్లాలోని రెవెన్యూ పరిపాలనలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. వారు కింది అధికారాలను కలిగి ఉండేవారు.
i) బహుమతులు ఇవ్వడానికి, శిక్షలు విధించడానికి అధికారం ఉండేది.
ii) వ్యవసాయం, భూతగాదాలకు సంబంధించిన సమస్యలపై నియంత్రణ కలిగి ఉండేవారు.
iii) భూమి సర్వే చేయడానికి, భూమి శిస్తు నిర్ణయించడానికి అధికారం వారికి ఉండేది.
          జిల్లా పరిపాలనలో ఇతర ముఖ్య అధికారులు. యుక్త, ఉపయుక్తలు. యుక్త కిందిస్థాయి అధికారి. యుక్త అతడి సహాయకుడైన ఉపయుక్త జిల్లా కోశాధికారులు అయి ఉండవచ్చు.

 

ముఖ్య విధులు: జిల్లాలో రాజుకు సంబంధించిన భూములను చూసుకోవడం, రెవెన్యూ వసూలు, దానికి సంబంధించిన వివరాలను నమోదు చేయడం.
 

గ్రామం, జిల్లా మధ్య పరిపాలన విభాగం: మౌర్యుల కాలంలో గ్రామం, జిల్లా మధ్య ఒక మధ్యస్థాయి పరిపాలన విభాగం ఉండటం ఆసక్తికరమైన విషయం. అయిదు గ్రామాలకు ఒక విభాగం ఉండేది. గోప, స్థనిక అనే అధికారులు ఈ విభాగం బాధ్యతలను నిర్వహించేవారు. గోప అనే అధికారి గణాంక అధికారి. గ్రామ సరిహద్దులను నిర్ణయించడం, వివిధ రకాల భూములు, భవనాలు, బహుమానాలు, భూమి శిస్తు మినహాయింపు మొదలైన వాటిని నమోదు చేయడం ఇతని ప్రధాన విధులు. ఇతడు ప్రతి గ్రామానికి సంబంధించిన జనాభా లెక్కలు నమోదు చేసేవాడు. ఇందులో పన్ను చెల్లించే సామర్థ్యం, గ్రామ ప్రజల వృత్తులు, వారి వయసు, ఆదాయ, వ్యయాలు, పశు సంపద వివరాలను పొందుపరచేవాడు.
          స్థనిక అనే అధికారి ముఖ్య విధి పన్నులు వసూలు చేయడం. ఇతడు ప్రాదేశిక అనే అధికారి సూచనల మేరకు పనిచేసేవాడు. గోప, స్థనికల పనితీరును సీనియర్ అధికారులు పర్యవేక్షించేవారు. స్థనిక ప్రస్తుత సహాయ కలెక్టర్‌తో సమానమైన హోదా కలిగి ఉండవచ్చు.

 

గ్రామ పరిపాలన: పరిపాలన వ్యవస్థలో గ్రామం చివరి విభాగం. గ్రామానికి అధిపతి గ్రామణి. ప్రతి గ్రామంలో గ్రామణితోపాటు మరికొంతమంది అధికారులు ఉండేవారు. వారిలో గణాంక అధికారి ఒకడు. ఇతడు గ్రామ సరిహద్దులు, భూమిని అమ్మడం, కొనడం, జంతు సంపద, జనాభా లెక్కలు మొదలైన రికార్డులను నిర్వహించేవాడు. మరో అధికారి భూమిశిస్తు వసూలు చేసేవాడు. ఈ అధికారులంతా గోప అధీనంలో ఉండేవారు. గ్రామాధికారులకు జీతానికి బదులు భూదానాలు లేదా పన్ను మినహాయింపు ఇచ్చేవారు. అధికారులు ఈ భూముల నుంచి వచ్చే పంటను మాత్రమే అనుభవించవచ్చు. వీరు భూమికి యజమానులు కారు. వారికి ఈ భూములు అమ్మడానికి లేదా తాకట్టు పెట్టడానికి వీలులేదు.
 

నగరపాలన: కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీస్ రచించిన 'ఇండికా' గ్రంథాలు నగర పరిపాలనకు సంబంధించి ఆసక్తికరమైన సమాచారాన్ని తెలియజేస్తున్నాయి. మౌర్యుల రాజధాని అయిన పాటలీపుత్రం, ఇతర పెద్ద పట్టణాల పరిపాలనను అధికారులు నిర్వహించేవారు. పాటలీపుత్రం నగరాన్ని నాలుగు వార్డులుగా విభజించి ఒక్కో వార్డును స్థనిక అనే అధికారి అధీనంలో ఉంచినట్లు అర్థశాస్త్రం ద్వారా తెలుస్తోంది. ఇతడికి సహాయపడటానికి గోప అనే అధికారి ఉండేవాడు. నగరంలోని అనేక గృహాల పర్యవేక్షణ బాధ్యతలను గోప అనే అధికారులకు ఇచ్చారు. నగరిక అనే అధికారి నగర పాలనకు అధిపతి. నగరపాలనకోసం నియమించిన అధికారులు నగరంలోని స్త్రీ, పురుషులకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలి.
     మెగస్తనీస్ రచించిన ఇండికా గ్రంథంలో నగర పరిపాలనకు సంబంధించి ఆసక్తికరమైన, అదనపు సమాచారం ఉంది. పాటలీపుత్రం పరిపాలనను 30 మంది సభ్యులతో కూడిన ఒక కమిషన్‌కు అప్పగించారు. వీరిని అయిదుగురితో కూడిన 6 బోర్డులుగా విభజించారు. ప్రతిబోర్డుకు కొన్ని శాఖలను కేటాయించారు. దాంతో పాటు కమిషన్‌లోని సభ్యులందరూ ప్రజా సంక్షేమానికి సంబంధించిన రోడ్ల మరమ్మతులు, మార్కెట్ల నిర్వహణ, దేవాలయాలు, ఓడరేవులు, ధరలను అదుపు చేయడం మొదలైన విషయాలపై చర్చించేవారు.
 

6 బోర్డుల శాఖపరమైన విధులు ఇలా ఉన్నాయి..
 

i) మొదటి బోర్డు: ఇది పరిశ్రమలు, చేతివృత్తులను పర్యవేక్షించేది.
ii) రెండోబోర్డు: ఇది నగరాన్ని సందర్శించే విదేశీయులు, యాత్రికుల పట్ల శ్రద్ధ వహిస్తూ వారి సంక్షేమం కోసం పనిచేసేది. ఎవరైనా విదేశీ యాత్రికుడు మరణిస్తే, మరణించిన వ్యక్తి ఆస్తులను అతడి బంధువులకు జాగ్రత్తగా అప్పగించడం ఈ బోర్డు బాధ్యత.
          మౌర్య సామ్రాజ్యం విదేశీ రాజ్యాలతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండేదని, వ్యాపారరీత్యా అనేకమంది విదేశీయులు పాటలీపుత్ర నగరాన్ని సందర్శించేవారని చెప్పడానికి ఈ బోర్డే సాక్ష్యం.
iii) మూడో బోర్డు: ఈ బోర్డు జనన మరణాల నమోదును, పన్నుల విధింపు అవసరమైన సమాచారాన్ని పర్యవేక్షిస్తుంది.
iv) నాలుగో బోర్డు: వస్తువుల అమ్మకాన్ని నియంత్రించడం, తూనికలు, కొలతలను పరీక్షించడం, వ్యాపారులకు లైసెన్సులు జారీచేయడం ఈ బోర్డు ప్రధాన బాధ్యత.
v) అయిదో బోర్డు: తయారైన వస్తువులను పర్యవేక్షించడంతోపాటు కల్తీని నివారించడం ఈ బోర్డు ముఖ్యవిధి.
vi) ఆరో బోర్డు: నగరంలో అమ్మే అన్ని వస్తువులపై 1/10వ వంతు పన్ను వసూలు చేయడం ఈ బోర్డు ముఖ్యవిధి.
          ఈ బోర్డులు చేపట్టిన శాఖాపరమైన విధులను జాగ్రత్తగా గమనిస్తే పాటలీపుత్రంలో చక్కగా వ్యవస్థీకృతమైన పరిపాలన అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉజ్జయిని, తక్షశిల, మొదలైన ఇతర పెద్ద పట్టణాల్లో కూడా ఇదేవిధమైన పరిపాలన విధానం ఉండేదని చెప్పవచ్చు.
న్యాయపరిపాలన: చక్రవర్తి న్యాయ పరిపాలనకు అధిపతి. నగరాల్లో, ఇతర రాష్ట్రాల్లో న్యాయ పరిపాలనకోసం మహత్తరులు, రజుక అనే అధికారుల ఆధ్వర్యంలో స్పెషల్ ట్రైబ్యునళ్లు ఉండేవి. విదేశీయులకు సంబంధించిన కేసులను పరిష్కరించడానికి రాజు ప్రత్యేక న్యాయమూర్తులను నియమించాడు. గ్రామణి, గ్రామంలోని ఇతర పెద్దలు గ్రామాల్లోని కేసులను పరిష్కరించేవారు. రజుక అనే అధికారులకు న్యాయ పరిపాలనలో తగినంత స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా అశోకుడు న్యాయపరిపాలనను సంస్కరించాడు. రెవెన్యూ విషయాలకు సంబంధించిన కేసులను పరిష్కరించే అధికారం వారికి ఇచ్చాడు.
          రాష్ట్రాల్లో న్యాయ పరిపాలనను చక్కదిద్దడానికి సమర్థులైన న్యాయాధికారులను మూడేళ్లు లేదా అయిదేళ్లకోసారి రొటేషన్ పద్ధతిలో పంపేవారు. నేర చట్టం కఠినంగా ఉండేది. శిక్షలు కఠినంగా ఉంటే నేరాలు తగ్గుతాయనే సిద్ధాంతాన్ని మౌర్య చక్రవర్తులు బలంగా నమ్మారు. వివిధ నేరాలకు శిక్షలు చిన్న అపరాధ రుసుం మొదలు అంగవిచ్ఛేదనం, ఉరిశిక్ష వరకు ఉండేవి.
ఉద్దేశపూర్వకంగా పవిత్ర వృక్షాలను నాశనం చేయడం, నగరంలో అమ్మే వస్తువులపై చెల్లించవలసిన పన్నులను చెల్లించకపోవడం, రాజు వద్ద పనిచేసే చేతివృత్తుల వారికి హానిచేయడం, ఆనకట్టలను నాశనం చేయడం 40 పణాలను దొంగిలించడం మొదలైన వాటిని తీవ్రమైన నేరాలుగా పరిగణించేవారు. బ్రాహ్మణులు, స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మొదలైన వారికి కఠిన శిక్షల నుంచి మినహాయింపు ఉండేది.
          అశోకుడు బౌద్ధమతాన్ని అవలంభించినా, మరణశిక్షను రద్దుచేయలేదు. అయితే మరణశిక్ష విధించిన వారికి మూడురోజుల సమయాన్ని ఇచ్చేవారు. ఈ కాలంలో నేరస్థుడు న్యాయమూర్తికి చివరి అప్పీలు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

 

సైనిక వ్యవస్థ: మౌర్యుల సైనిక వ్యవస్థ గురించి కౌటిల్యుడు, మెగస్తనీస్ తగినంత సమాచారాన్ని ఇచ్చారు. మౌర్యుల సైన్యంలో కాల్బలం, అశ్వికదళం, గజదళం, రథాలు ఉండేవి. మౌర్యులు సిద్ధసైన్యాన్ని పోషించారు. సైనికులకు రాజ్యమే జీతాలు చెల్లించి, వారికి కావలసిన సదుపాయాలను కల్పించింది. మౌర్యులు సైన్యంలో ఇండో-ఆర్యుల సంప్రదాయమైన నాలుగు విభాగాలను నిర్వహించారు. సైనిక పరిపాలన 30 మంది సభ్యులతో కూడిన ఒక కమిషన్ ఆధ్వర్యంలో ఉండేది. ఈ కమిషన్‌ను అయిదుగురు సభ్యులతో కూడిన 6 బోర్డులుగా విభజించారు. ఈ బోర్డులు కాల్బలం, అశ్వికదళం, గజదళం, రథాలు, నౌకాదళం, రవాణాలను నియంత్రించేవి. సైన్యానికి అవసరమైన ఆయుధాలను తగినంతగా సమకూర్చేవారు. సైన్యానికి కావలసిన శిక్షణ, క్రమశిక్షణ పట్ల మౌర్య చక్రవర్తులు ప్రత్యేక శ్రద్ధ వహించారు.
          యుద్ధసమయంలో గాయపడిన సైనికులకు సహాయం చేయడానికి డాక్టర్లు, మందులు, నర్సులు, ఆహారంతో కూడిన అత్యవసర చికిత్సా విభాగం నిరంతరం శ్రమించేది.
       మెగస్తనీస్ ఇచ్చిన సమాచారాన్ని బట్టి సమాజంలో రైతుల తర్వాత సైనికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. వారు రాజ్యంనుంచి క్రమం తప్పకుండా జీతాలు పొందేవారు- స్వేచ్ఛ, సుఖంతో కూడిన జీవితాన్ని అనుభవించారు. సైనిక విధులు మాత్రమే నిర్వహించేవారు. యుద్ధంలేని సమయంలో సంతోషకరమైన జీవితాన్ని గడిపారు. యుద్ధసమయంలో వారి గుర్రాలను చూసుకోవడానికి ఆయుధాలను శుభ్రం చేయడానికి, ఏనుగులను నడపడానికి, రథాలు తయారు చేయడానికి, వాటిని నడపటానికి అవసరమైన సేవకులు ఉండేవారు.
 

మౌర్యుల కాలంనాటి ఆర్థిక పరిస్థితులు
 

1) వ్యవసాయం: మలివేదకాలంలో అమల్లోకి వచ్చిన వ్యవసాయం నందులు, మౌర్యుల కాలంలో బాగా అభివృద్ది చెందింది. మౌర్యుల కాలంలో వ్యవసాయం కింది విధానాల చుట్టూ కేంద్రీకృతమై ఉండేది.
i) గంగా హరివాణంలోని సారవంతమైన ఒండ్రు నేలను వినియోగించుకోవడం
ii) వృథాగా ఉన్న భూమిని వ్యవసాయం కిందికి తీసుకురావాలనే కాంక్ష
iii) నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం
          క్రీ.పూ. 3వ శతాబ్దం నాటికి ఉత్తర భారతదేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడింది. వ్యవసాయం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం పట్ల మౌర్యులు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. నీటిపారుదల సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి మౌర్యులు తీసుకున్న చర్యలను కౌటిల్యుడు, మెగస్తనీస్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. నీటిపారుదల కింద ఉన్న భూమిని కొలవడం, కాలువలను నిర్వహించడం, నీటి సరఫరాను నియంత్రించడం, నీటి పన్ను వసూలు చేయడం మొదలైన బాధ్యతలను నీటిపారుదల శాఖకు అప్పగించారు.
కౌటిల్యుడి ప్రకారం నీటిపన్ను మొత్తం ఉత్పత్తిలో 1/5 నుంచి 1/3 వరకు ఉండేది. రుద్రదాముని జునాగడ్ శాసనం ద్వారా మౌర్యులు కథియవార్ లాంటి మారుమూల రాష్ట్రంలో కూడా నీటిపారుదల నిర్వహణకు ఎక్కువ కృషిచేసినట్లు తెలుస్తోంది. చంద్రగుప్తుడి గవర్నర్ అయిన పుష్యగుప్తుడు సుదర్శన సరస్సును నిర్మించినట్లు ఈ శాసనం తెలియజేస్తోంది. అశోకుడి కాలంలో ఈ సరస్సు నుంచి అనేక కాలువల ద్వారా నీటిని సరఫరా చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ సరస్సుకు శకరాజు రుద్రదాముడు, గుప్తరాజు స్కందగుప్తుడు మరమ్మత్తులు చేశారు. దీన్నిబట్టి పశ్చిమ ఇండియాలో, ముఖ్యంగా కథియవార్ ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధిలో ఈ సరస్సు ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.
          మౌర్య చక్రవర్తులు బంజరు భూమిని వ్యవసాయం కిందకు తీసుకురావడానికి ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శించారు. అడవులను నరికించి, కొత్త భూభాగాలలో ప్రజలు స్థిరపడడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి వచ్చిన శూద్రులను, కళింగ యుద్ధంలో యుద్ధ ఖైదీలుగా తీసుకువచ్చిన ఒక లక్ష యాభైవేల మందిని అటవీభూములను వ్యవసాయ యోగ్యంగా మార్చే పనిలో వినియోగించారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడమే వీరిపని. ప్రభుత్వం మిగులు ఉత్పత్తిని తీసుకునేది. రాజే సామ్రాజ్యంలోని మొత్తంభూమికి యజమాని. అయితే ఈ కాలంలో కొద్దిభూమి వ్యక్తిగత యాజమాన్యం కింద కూడా ఉండేది. భూములను రైతులే స్వయంగా పండించడం లేదా కూలీలతో పండించడం జరిగేది. భూసారం, పంట దిగుబడి, పండించిన పంట రకాన్ని బట్టి భూమి శిస్తు నిర్ణయించేవారు. రాజు పండిన పంటలో 1/4 వ వంతు శిస్తుగా స్వీకరించేవాడు. కొన్ని సందర్భాల్లో రాజు 1/6వ వంతు శిస్తుగా వసూలు చేసే వాడు. రైతులు భూమి శిస్తును నేరుగా రాజాధికారాలకు చెల్లించేవారు.
సాగుకింద ఉన్న భూమి, రాజుకు చెల్లించవలసిన శిస్తు మొదలైన సమాచారాన్ని తెలుసుకోవడం కోసం రజుక లేదా రజ్జుగాహక అనే ఉద్యోగిని నియమించారు. రాజులు బ్రాహ్మణులు, మత సంస్థల నిర్వహణ కోసం గ్రామాలను దానంగా ఇచ్చేవారు. వీటిని భోగ గ్రామాలు అనేవారు. ఈ గ్రామాలకు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు లేదు. అయితే దానం పొందిన వ్యక్తి ఆ గ్రామాల నుంచి వచ్చే ఆదాయాన్ని అనుభవించవచ్చు. అవసరమైనపుడు రాజు రైతులను ఎక్కువ పండించాల్సిందిగా బలవంత పెట్టినట్లు, మత సంస్థలకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకున్నట్లు కౌటిల్యుని అర్థశాస్త్రం ద్వారా తెలుస్తోంది.

 

2) వర్తక వాణిజ్యాలు: మౌర్యుల పూర్వ యుగంలో వర్తక వాణిజ్యాలు కొంత అభివృద్ది చెందాయి. మౌర్యుల కాలంలో ఈ రంగంలో విశేష అభివృద్ధి జరిగింది. దీనికి ఈ కింది అంశాలు దోహదపడ్డాయి.
i) మౌర్యులు మొట్టమొదటి సారిగా భారతదేశంలో రాజకీయ ఐక్యతను సాధించారు.
ii) మౌర్యుల కాలంలో శాంతియుత పరిస్థితులను నెలకొల్పారు.
iii) మౌర్య సామ్రాజ్యంలో ఒకేరకమైన తూనికలు-కొలతలు, నాణేలు ప్రవేశపెట్టారు.
iv) మౌర్య చక్రవర్తులు చేతివృత్తుల వారికి రక్షణ కల్పించారు. వారి పని సామర్థ్యాన్ని బట్టి జీతాలు నిర్ణయించారు. వారికి ప్రోత్సాహకాలు ఇచ్చారు.
v) వ్యవసాయ మిగులు రాజు చేతిలో ఉండేది.
vi) కేంద్రీకృత పరిపాలన, మెరుగైన రవాణా, ప్రసార సాధనాలు వర్తక వాణిజ్యాల అభివృద్ధికి తోడ్పడ్డాయి.
   చేతివృత్తుల వారు మౌర్యుల కాలంలో శ్రేణులుగా ఏర్పడినట్లు స్వదేశీ, విదేశీ రచనల ద్వారా తెలుస్తోంది. మౌర్య చక్రవర్తులు వ్యాపార నియమాలను జాగ్రత్తగా రూపొందించి అమలు చేశారు. వస్తువుల అమ్మకాన్ని రాజ్యమే పర్యవేక్షించేది. ఒక వస్తువు ధర నిర్ణయించేటప్పుడు డిమాండు, సప్త్లె, ధరల పెరుగుదల, తగ్గుదల, రవాణా సాధనాలు, వస్తువు ఉత్పత్తికి అయిన ఖర్చు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకునే వారు. వ్యాపారస్థుడికి అందవలసిన లాభాన్ని నిర్ణయించి, మిగిలిన లాభాన్ని ఖజానాకు పంపేవారు. ఈ కాలంలో భూమార్గం, సముద్ర మార్గం ద్వారా వ్యాపారం జరిగేది. తక్షశిల నుంచి పాటలీపుత్రం వరకూ గంగా హరివాణం ద్వారా వెళ్లే మార్గం భూమార్గాల్లో ప్రధానమైంది. ప్లిని తాను రచించిన 'హిస్టోరియ నేచురాలిస్' అనే గ్రంథంలో ఈ మార్గాన్ని గురించి ప్రస్తావించాడు. సముద్రమార్గం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందడానికి ముందు పశ్చిమ దేశాలతో వ్యాపారం చేయడానికి ఇదే ప్రధానమార్గం. జాతక కథల్లో ఇచ్చిన సమాచారాన్ని బట్టి మౌర్యుల కాలంలో సముద్రమార్గం ద్వారా వ్యాపారం బాగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. కాకులు భూభాగం దిశగా ప్రయాణిస్తాయి కాబట్టి సముద్ర మార్గం ద్వారా వ్యాపారం చేసే వర్తకులు, నావికులు తమ ఓడలకు ముందు కాకులను దారి తెలుసుకోవడానికి పైలట్లుగా పంపేవారు. ఈ పద్ధతిని భారతీయులు బాబిలోనియన్ల నుంచి గ్రహించినట్లు తెలుస్తోంది.
          మౌర్యుల కాలంలో భారతదేశం నుంచి పశ్చిమదేశాలకు ఎగుమతి చేసిన వస్తువుల్లో ప్రధానమైనవి- మిరియాలు, దాల్చినచెక్క, సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, వజ్రాలు, నూలుబట్టలు, నెమళ్లు, దంతపు వస్తువులు మొదలైనవి. పశ్చిమదేశాల నుంచి ప్రధాన దిగుమతులు- గుర్రాలు, పగడాలు, గాజులు మొదలైనవి.
         మౌర్యులకు తూర్పు రాజ్యాలతో, ఉత్తర బర్మా తీర ప్రాంతంతో వర్తక సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. తామ్లుక్ (తామ్రలిప్తి), బర్యాగజ ( బ్రోచ్), సోర్‌పరాకే (సోపారా) మొదలైనవి ఆ కాలం నాటి ప్రధాన ఓడరేవులు. ఆ కాలంలో భారతదేశం ఆగ్నేయ ఆసియా, పశ్చిమ దేశాలతో సంబంధం కలిగి ఉండేది. ఇవి ప్రధానంగా వ్యాపార సంబంధాలు అయినప్పటికీ, దీని ద్వారా భారతదేశ సంస్కృతి ఆ దేశాలకు వ్యాప్తి చెందడానికి, అక్కడి సంస్కృతి భారతదేశంలో వ్యాప్తి చెందడానికి దోహదపడింది.

 

మౌర్యుల పరిపాలనలో కొన్ని ప్రధాన అంశాలు: 
గూఢచారి వ్యవస్థ: మౌర్యుల కాలంలో పటిష్ఠమైన గూఢచారి వ్యవస్థ ఉండేది. రాజ్యంలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి రాజు తరచుగా గూఢచారులను వినియోగించాడని, గూఢచారులు గృహస్తులు, వ్యాపారులు, రుషులు, విద్యార్థులు, స్త్రీలు, వ్యభిచారుల వేషంలో పనిచేయాలని అర్థశాస్త్రంలో పేర్కొన్నారు. రాజులు రాష్ట్రాల్లో నియమించిన వార్తాహరుల నుంచి రహస్య నివేదికలను పొందేవారు. అశోకుడి శాసనాలు, అర్థశాస్త్రంలో పేర్కొన్న పులిసాని, ప్రతివేదిక, చరాస్, గూఢ పురుష మొదలైన వారిని గూఢచారులుగా పేర్కొనవచ్చు.
జనాభా లెక్కల విధానం: మౌర్యులు ప్రతి సంవత్సరం జనాభా లెక్కలు సేకరించారు. మౌర్యులకు ముందు ఏ దేశంలోనూ శాస్త్రీయ పద్ధతిలో జనాభా లెక్కలు సేకరించలేదు. ఈ జనాభా లెక్కలను రాజకీయ, ఆర్థిక, సైనిక అవసరాల కోసం వినియోగించేవారు. కుటుంబంలోని ప్రతివ్యక్తి వయసు, లింగం, కులం, ఆదాయం, వ్యయం, వృత్తి మొదలైన వివరాలను నమోదు చేసేవారు. ఆధునిక కాలంలోలాగా పదేళ్లకోసారి కాకుండా, ప్రతి ఏడాది జనాభాలెక్కలు సేకరించడం మౌర్యుల గొప్పదనానికి నిదర్శనం.
జీతాలు, ప్రజాపనులు: సామ్రాజ్యంలోని వనరుల్లో ఎక్కువ భాగం ఉద్యోగుల జీతాలు; ప్రజాపనుల కోసం వినియోగించేవారు. ఉన్నతాధికారులకు పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించడంవల్ల ఖజానాపై భారం అధికంగా పడేది. పురోహితుడు, సేనాపతి 48000 పణాలు, కోశాధికారి, ముఖ్య కలెక్టర్ 24,000 పణాలు, మంత్రులు 12,000 పణాలు ఏడాది జీతంగా పొందేవారు. ప్రజాపనుల కింద ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, నిర్వహణ, బావులు, విశ్రాంతి గృహాలు, నీటిపారుదల పనులు చేపట్టేవారు. అలాగే సైన్యం నిర్వహణ, గనుల నిర్వహణ, ప్రభుత్వం చేపట్టే ఉత్పత్తులు, పండితులకు, మత సంస్థలకు రాజులు ఇచ్చే దానాలు, ఇతర ప్రజాపనుల కిందికి వస్తాయి. మౌర్యుల పరిపాలనలో ముఖ్యలక్షణం- అధికారులు ప్రభుత్వానికి చేసిన సేవలకు బదులుగా వారికి భూమిని ఇచ్చే సంప్రదాయం వీరి కాలంలో లేదు.

 

మౌర్యుల పరిపాలనలో బలాలు, బలహీనతలు: 
బలాలు:
i) పౌర, సైనిక శాఖలను వేరు చేయడం.
ii) పటిష్ఠమైన జనాబా లెక్కల సేకరణ విధానాన్ని ప్రవేశ పెట్టడం.
iii) అభివృద్ధి చెందిన గూఢచారి వ్యవస్థ
iv) వ్యవస్థీకృతమైన పన్నుల విధానం, అభివృద్ధి చెందిన వ్యవసాయ, ద్రవ్య ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగులకు జీతాలు నగదు రూపంలో చెల్లించడం, అభివృద్ధి చెందిన శ్రేణి విధానం మొదలైనవి మౌర్యుల పరిపాలన ప్రధాన లక్షణాలు.
బలహీనతలు:
i) నేర చట్టం చాలా కఠినంగా ఉండటం.
ii) గూఢచారులు రాజుకు కళ్లు, చెవుల్లా ఉండేవారు. అందువల్ల ప్రజలు రాజుకంటే గూఢచారులను చూసి ఎక్కువగా భయపడేవారు.
iii) కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ.
iv) మౌర్యులు ఉద్యోగస్వామ్య వ్యవస్థను కలిగి ఉండేవారు. దీనివల్ల వివిధ పథకాలను రూపొందించి, అమలు చేయడంలో ఆలస్యం జరిగేది.
ప్రశ్నలు:
1) మౌర్యుల పరిపాలన విధానాన్ని చర్చించండి
2) ప్రాచీన భారతదేశంలో క్రీ.పూ. 3వ శతాబ్దంలో ప్రజల సాంఘిక, ఆర్థిక జీవితాన్ని గురించి మీకేమి తెలుసు? 

Posted Date : 11-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు