• facebook
  • whatsapp
  • telegram

సింధు నాగరికత/ హరప్పా సంస్కృతి

                   ఏ దేశంలోనైనా లిఖిత పూర్వక ఆధారాలు లేని కాలం గురించి తెలుసుకోవడానికి చరిత్రకారులు పురావస్తు శాస్త్రజ్ఞులు ఇచ్చే సమాచారం పైనే ఆధారపడతారు. ముఖ్యంగా భారతదేశంలో పురావస్తు శాస్త్రజ్ఞులు చేపట్టిన తవ్వకాల్లో లభించిన వస్తువులను అధ్యయనం చేయడం ద్వారానే ప్రాచీన కాలానికి సంబంధించిన చరిత్రను పూర్తిగా తెలుసుకునే వెసులుబాటు కలిగింది. క్రీ.శ. 1921లో జరిపిన తవ్వకాలు భారతదేశ చరిత్ర గతినే మార్చివేశాయి. రావ్ బహద్దూర్ దయారాం సహాని సింధూ ఉపనది అయిన రావి నది ఒడ్డున హరప్పా నగరాన్ని కనుక్కున్నాడు. 1922లో ఆర్.డి. బెనర్జీ సింధు నది కుడి ఒడ్డున మొహంజోదారో నగరాన్ని కనుక్కున్నాడు. ఈ రెండు తవ్వకాల్లో సర్ జాన్ మార్షల్ కీలక పాత్ర పోషించాడు. ఈ తవ్వకాల ద్వారా ప్రాచీన భారతదేశంలో దేదీప్యమానంగా వెలుగొందిన ఒక గొప్ప నాగరికతకు సంబంధించిన విశేషాలు బాహ్య ప్రపంచానికి తెలిశాయి.
                    భారతదేశ చరిత్రలో సింధూ నాగరికతకు ప్రముఖ స్థానం ఉంది. ఇది కంచు యుగానికి సంబంధించింది. దయారాం సహాని, ఆర్.డి. బెనర్జీ తర్వాత మార్టిమర్ వీలర్, మేకి, ఎం.జి. మజుందార్, ఎస్.ఆర్.రావ్ లాంటి పురావస్తు శాస్త్రజ్ఞులు హరప్పా, మొహంజోదారో, చాన్హుదారో, లోథాల్, కాలిబంగన్, రూపార్, బన్వాలి మొదలైన ప్రదేశాల్లో తవ్వకాలు జరిపించారు.
* వీటి ద్వారా ఈ నాగరికతకు చెందిన అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 

నాగరికత - వివిధ పేర్లు:
          సింధూ నాగరికతకు పురావస్తు శాస్త్రజ్ఞులు వివిధ పేర్లను ప్రతిపాదించారు. క్రీ.పూ. 3000 సంవత్సరం నాటికి సుమేరియా నాగరికతతో హరప్పా నాగరికతకు ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా మొదట దీన్ని 'ఇండో - సుమేరియా' నాగరికతగా పిలిచారు. సింధూ నది లోయలో అభివృద్ధి చెందినందువల్ల దీన్ని 'సింధూ నాగరికత' అని పిలిచారు. ఒక నాగరికత మొదటగా ఏ ప్రదేశంలో వెలుగులోకి వస్తుందో దాని ఆధారంగా ఆ సంస్కృతికి పేరు పెట్టడం పురావస్తు శాస్త్ర సంప్రదాయం. అందువల్ల సర్ జాన్ మార్షల్ దీన్ని హరప్పా నాగరికత అని పిలిచాడు. సింధూ లోయకు చెందిన అనేక ప్రదేశాలు హక్ర - ఘగ్గర్ నదీ ప్రాంతంలో కనుక్కోవడం వల్ల సరస్వతీ - సింధు నాగరికత అని కూడా పిలుస్తున్నారు.

 

కాలం: 
          వేద సాహిత్యం ప్రకారం క్రీ.పూ. 2000 సంవత్సరానికి ముందు భారతదేశ చరిత్ర, సంస్కృతి ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే మొహంజోదారో, హరప్పా, చాన్హుదారోతోపాటు సింధూ లోయకు చెందిన ఇతర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల ఆధారంగా క్రీ.పూ. 3200 సంవత్సరాల సంస్కృతి వెలుగులోకి వచ్చింది. సుమేరియా, అక్కడ్, బాబిలోనియా, ఈజిప్టు, అస్సీరియా లాంటి ప్రాచీన నాగరికతలకు ఏ మాత్రం తీసిపోని నాగరికత హరప్పా ప్రాంతంలో విలసిల్లినట్లు నిర్ధరించారు. రేడియో కార్బన్ డేటింగ్ విధానం ప్రకారం క్రీ.పూ. 2500 - క్రీ.పూ. 1750 మధ్య ఈ నాగరికత ఉన్నత స్థితిలో ఉన్నట్లు గుర్తించారు.

 

భౌగోళిక  వ్యాప్తి: 
        ఈ నాగరికత ప్రస్తుత పాకిస్థాన్‌తోపాటు వాయువ్య భారతదేశంలో విలసిల్లింది. ఇది పంజాబ్, సింధు, బెలూచిస్థాన్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు వ్యాపించింది. ఈ నాగరికత ఉత్తరాన జమ్మూలోని మండు నుంచి దక్షిణాన దైమాబాద్ వరకూ, తూర్పున పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని అలంఘీర్‌పూర్ నుంచి పశ్చిమాన బెలూచిస్థాన్‌లోని సుత్కాజెండర్ వరకు విస్తరించింది.
        పాకిస్థాన్‌లోని హరప్పా, మొహంజోదారో, చాన్హుదారో; ఇండియాలో గుజరాత్‌కు చెందిన లోథాల్, రంగపూర్, సుర్కోటుడా, రాజస్థాన్‌లోని కాలిబంగన్, హర్యానాలోని బన్వాలి, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని అలంఘీర్‌పూర్ ఈ నాగరికతకు చెందిన ప్రధాన నగరాలు. ఈ నాగరికతకు సంబంధించి తాజాగా కనుక్కున్న ప్రదేశం గుజరాత్‌లోని ధోలవీరా. డాక్టర్ జగపతి జోషి, డాక్టర్ ఆర్.ఎస్. బిస్త్ ఈ ప్రదేశంలో నిర్వహించిన తవ్వకాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఇది సింధూలోయ నాగరికతకు సంబంధించిన అతి పెద్ద ప్రదేశం. హరప్పా సంస్కృతి క్రీ.పూ. 3000 - క్రీ.పూ. 2000 మధ్య విలసిల్లిన ప్రపంచ నాగరికతల్లో ఎక్కువ విస్తీర్ణంలో (1.3 మిలియన్ చ.కి.మీ.) వ్యాపించిన నాగరికతగా ప్రాముఖ్యం సంతరించుకుంది.

 

సామాజిక జీవనం:
          హరప్పా ప్రజల సామాజిక జీవనాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు తవ్వకాల్లో లభించిన వస్తువులే. దీని గురించి తెలుసుకోవడానికి శాసనాలు లేదా లిఖిత ఆధారాలు లేవు. హరప్పా ప్రజలది బొమ్మల లిపి, దీన్ని చదివి అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

 

హరప్పా ప్రజల సామాజిక జీవితం ప్రధాన లక్షణాలు:
i) హరప్పా సంస్కృతికి చెందిన సమాజాన్ని ఆర్థిక హోదా ఆధారంగా విభజించినట్లు తెలుస్తోంది. హరప్పా నగరాలను అనేక భాగాలుగా విభజించడమే దీనికి నిదర్శనం. వీరిది మాతృస్వామిక సమాజమని సర్ జాన్ మార్షల్ అభిప్రాయపడ్డాడు. ఇతడు రెండు కారణాలతో ఈ అభిప్రాయానికి వచ్చాడు.  అవి:
  a) హరప్పా నగరాల్లో లభించిన బంకమట్టితో చేసిన బొమ్మల్లో పురుషుల కంటే స్త్రీల బొమ్మలు అధిక సంఖ్యలో ఉండటం.
  b) హరప్పా ప్రజలు ఎక్కువగా అమ్మతల్లిని పూజించడం. దీంతోపాటు బంకమట్టితో చేసిన అమ్మతల్లి బొమ్మలు అధిక సంఖ్యలో లభించడం.
ii) జంతువులను మచ్చిక చేసుకోవడం అనేది హరప్పా ప్రజల సామాజిక జీవనానికి చెందిన మరో ప్రధాన లక్షణం. హరప్పా ప్రజలు ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, ఒంటెలు మొదలైన జంతువులను మచ్చిక చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆహార, వ్యవసాయ, గృహ అవసరాలే దీనికి ప్రధాన కారణమై ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. హరప్పా ప్రజలకు గుర్రం గురించి తెలుసు. బంకమట్టితో చేసిన గుర్రపు నమూనాలు, గుర్రానికి సంబంధించిన అవశేషాలు మొహంజోదారో, లోథాల్, సుర్కోటుడాలో లభించాయి. అయితే హరప్పా ప్రజలు గుర్రాన్ని ఎక్కువగా ఉపయోగించనట్లుగా తెలుస్తోంది. సమకాలీన సుమేరియన్లు కూడా హరప్పా ప్రజలు  మచ్చిక  చేసుకున్న  జంతువులనే  మచ్చిక  చేసుకున్నారు. గుజరాత్‌లోని కొన్ని హరప్పా నాగరికతకు  చెందిన   ప్రాంతాల్లో  వరిని   పండించినట్లుగా   ఆధారాలున్నాయి. ఏనుగులను మచ్చిక చేసుకున్నారు. కానీ సుమేరియన్లకు ఇది తెలియదు.

iii) దుస్తులు, కేశాలంకరణ, ఆభరణాలు: హరప్పా సంస్కృతికి చెందిన స్త్రీ, పురుషులు దుస్తులు, కేశాలంకరణ పట్ల మక్కువ చూపినట్లుగా ఆధారాలున్నాయి. నూలు, ఉన్నితో చేసిన దుస్తులను వాడారు. మొహంజోదారోలో కనుక్కున్న బంకమట్టితో చేసిన బొమ్మ ఆధారంగా హరప్పా ప్రజలకు కుట్లు, అల్లికల గురించి అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. హరప్పా స్త్రీలు అలంకార ప్రియులు. వీరు జుట్టును వేర్వేరు రకాలుగా ముడి వేసుకునేవారు.

* ఆ కాలం నాటి ప్రజలు కొయ్య, దంతాలతో చేసిన దువ్వెనలు, గాజులు, వివిధ రకాల ఆభరణాలను వాడేవారు. బంకమట్టితో చేసిన బొమ్మల ఆధారంగా స్త్రీలు చేతినిండా గాజులు ధరించినట్లు తెలుస్తోంది. అందాన్ని ఇనుమడింపజేసేలా కేశాల మధ్యలో దువ్వెనలు, పువ్వులు పెట్టుకునేవారు. పురుషులకు గడ్డం, క్షవరం చేసుకోవడం గురించి తెలుసు.
 

iv) ఆహారం: హరప్పా ప్రజలు శాకాహారం, మాంసాహారం తినేవారు. కోడి, చేప, మాంసం, గోధుమలు, వరి లాంటివి వీరి ఆహారంలో ప్రధానమైనవి.
 

v) స్నానపు అలవాట్లు: హరప్పా నగరాల్లో జరిపిన తవ్వకాల్లో అనేక స్నానపు ఘట్టాలు బయటపడ్డాయి. మొహంజోదారోలో ప్రసిద్ధి చెందిన మహా స్నానవాటిక ఉండేది.
* స్నానపు గదులు ఇంటి మూలలో లేదా వరండాలో ఉండేవి. హరప్పా ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత పట్ల ఉన్న అవగాహనకు ఇదే నిదర్శనం.
 

వినోదాలు: హరప్పా ప్రజలకు ఇంటిలో ఆడుకునే ఆటలైన నృత్యం, జూదం గురించి తెలుసు. అయితే వీరికి రథం పందాలు, వేట గురించి తెలియదు. దీని ఆధారంగా గమనిస్తే హరప్పా ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో జీవించినట్లు తెలుస్తోంది. ఉన్నత వర్గాలు విలాసవంతమైన జీవితాన్ని గడపగా, సామాన్య ప్రజలు సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపారు. ఈవిధంగా హరప్పా సమాజంలో అసమానతలున్నట్లు తెలుస్తోంది.
 

ఆర్థిక వ్యవస్థ: హరప్పా ప్రజలది వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ. వీరు సారవంతమైన వరద మైదానాలను వ్యవసాయం కోసం బాగా ఉపయోగించుకున్నారు. వీరికి భూమిని దున్నడం తెలుసు. కొయ్యతో చేసిన నాగలిని ఉపయోగించారు.
కాలిబంగన్‌లో నాగలితో దున్నిన చాళ్లు, బన్వాలిలో బంకమట్టితో చేసిన నాగలి నమూనా బయటపడ్డాయి. హరప్పా ప్రజలు కాల్వల ద్వారా పంటలకు నీటి పారుదల సౌకర్యం కల్పించారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సింధూ హరివాణం సారవంతంగా ఉండటానికి ప్రధాన కారణం ఏటా ఈ నది వరదలకు గురికావడమే. నదీ తీరాల్లో ఉన్న నగరాలను వరదల నుంచి రక్షించడానికి నగరాల చుట్టూ ఇటుకలతో గోడలు నిర్మించారు. 

 వరద సమయంలో సింధూ నది ఈజిప్టులోని నైలునది కంటే ఎక్కువ సారవంతమైన ఒండ్రుమట్టిని వరద మైదానాల్లో నిక్షిప్తం చేసేది. ఈజిప్టు అభివృద్ధికి నైలునది దోహదం చేసిన విధంగానే, హరప్పా నాగరికత అభివృద్ధికి సింధునది తోడ్పడింది. హరప్పా ప్రజలు వరద నీరు తగ్గుముఖం పట్టిన తర్వాత నవంబరులో విత్తనాలు వేసి, వరదలు రావడానికి ముందే ఏప్రిల్‌లో గోధుమ, బార్లీ పంటల మార్పిడి పూర్తి చేసేవారు. సింధూ హరివాణంలో గోధుమ, బార్లీ, పత్తి మొదలైన పంటలు పండించగా; గుజరాత్, కథియవార్ ప్రాంతాల్లో వరి పండించేవారు. హరప్పా ప్రజలు ప్రపంచంలోనే మొదటిసారిగా వరి, పత్తి పంటలను పండించారు. గ్రీకులు క్రీ.పూ. 4వ శతాబ్దంలో పత్తి పంటను పరిశీలించి, దానికి సింధూనది పేరు ఆధారంగానే 'సిండాన్' (Sindon) అనే పేరు పెట్టారు. లోథాల్, కాలిబంగన్‌లో జరిపిన తవ్వకాలు వరి వాడకం గురించి తెలియజేస్తున్నాయి. ధాన్యాగారాల ఏర్పాటు హరప్పా ప్రజల వ్యవసాయ రంగానికి చెందిన ప్రధాన లక్షణం. ఆహార ధాన్యాలను సులభంగా రవాణా చేయడానికి వీలుగా ధాన్యాగారాలను నదీ తీరాల్లో ఏర్పాటు చేశారు. హరప్పా నాగరికతకు సంబంధించిన అనేక నగరాల్లో ధాన్యాగారాలు ఉండటం ఈ కాలానికి చెందిన ప్రజలు వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడటాన్ని తెలియజేస్తుంది.
పరిశ్రమలు: హరప్పా ప్రజలు పరిశ్రమల అభివృద్ధిలోనూ ఎక్కువ శ్రద్ధ చూపారు. ఆ కాలంలో అనేక పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.

 

కుండల తయారీ: కుమ్మరి చక్రం వాడుకలో ఉండేది. తవ్వకాల్లో ఆకర్షణీయంగా, వివిధ పరిమాణం, ఆకారాలతో తయారుచేసిన కుండలు లభించాయి. ఇవి ఎరుపు, నలుపు రంగుల్లో ఉన్నాయి. పక్షులు, చేపలు, జంతువులు, మొక్కలు, చెట్లు మొదలైన బొమ్మలతో వీటిని అలంకరించారు. లోథాల్‌లో లభించిన కుండలు, తయారీదారుల హస్తకళా నైపుణ్యాన్ని గురించి తెలియజేస్తున్నాయి. 

ముద్రికలు: హరప్పా నగరాల్లో లెక్కకు మించిన ముద్రికలు లభించాయి. వీటిని 'స్టీయటైట్' అనే పదార్థంతో రూపొందించారు. కొన్ని ముద్రికలను బంకమట్టి, లోహాలు, రాతితో తయారు చేశారు. ఇవి దీర్ఘచతురస్రం లేదా చతురస్ర ఆకారాల్లో ఉన్నాయి. మట్టితో రూపొందించిన తర్వాత కాల్చిన ముద్రికలు కూడా లభించాయి.
* అందంగా ఉన్న ఈ ముద్రికలపై లిపి కూడా ఉంది. ఇది బొమ్మలతో కూడిన లిపి. ఈ లిపి ప్రాధాన్యం తెలియడం లేదు. ఈ ముద్రికలను వర్తక, వాణిజ్యపరమైన లావాదేవీల్లో ఉపయోగించినట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఇటుకల పరిశ్రమ: హరప్పా ప్రజలు ప్రైవేటు, ప్రభుత్వ కట్టడాల్లో వేర్వేరు పరిమాణం, ఆకారాలతో ఉన్న ఇటుకలను వినియోగించారు. హరప్పా నగరాల్లో ఇటుకబట్టీలు బయటపడ్డాయి.
లోహ పరిశ్రమ: హరప్పా ప్రజలకు బంగారం, వెండి, కంచు, రాగి లాంటి లోహాల వాడకం గురించి తెలుసు. ఇనుము వాడకం గురించి తెలియదు. రాగి, కంచుతో చేసిన పాత్రలు, కంచుతో చేసిన చేతిలో దీపం ఉన్న స్త్రీ విగ్రహం, దైమాబాద్‌లో లభించిన కంచుతో చేసిన రథం లాంటివి హరప్పా ప్రజల లోహాలకు చెందిన పని నైపుణ్యానికి నిదర్శనాలు.
పూసల పరిశ్రమ: హరప్పా ప్రజలకు వివిధ రకాలైన పూసల తయారీ గురించి తెలుసు. లోథాల్, చాన్హుదారోలో పూసలు తయారుచేసే దుకాణాలను కనుక్కున్నారు.
* చాన్హుదారోలో జరిపిన తవ్వకాల్లో లభించిన వస్తువుల ద్వారా అక్కడి ప్రజలు చేతి వృత్తులపై ఆధారపడేవారని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో కంచు, రాగితో చేసిన పనిముట్లు, ముద్రికలు లభించాయి.
బంకమట్టితో చేసిన వస్తువులు: హరప్పా నాగరికతకు చెందిన వివిధ నగరాల్లో చేపట్టిన తవ్వకాల్లో బంకమట్టితో చేసిన వస్తువులు ఎక్కువగా లభించాయి. బంకమట్టితో మనుషులు, జంతువులు, బండ్లు, పక్షులకు సంబంధించిన బొమ్మలతోపాటు ముద్రికలు మొదలైనవాటిని రూపొందించారు. ఇది హరప్పా ప్రజల ముఖ్య వృత్తి అయి ఉండవచ్చు.
దంత పరిశ్రమ: హరప్పా నగరాల్లో జరిపిన తవ్వకాల్లో దంతాలతో చేసిన దువ్వెనలు, పిన్నులు లభించాయి. ఈ పరిశ్రమకు అంతగా ప్రాధాన్యం లేనట్లు తెలుస్తోంది.
ఆభరణాల తయారీ: హరప్పా సంస్కృతి నాటి స్త్రీ, పురుషులు వివిధ ఆకారాల్లో చేసిన ఆభరణాలను ధరించడానికి మక్కువ చూపినట్లు తెలుస్తోంది. వీరు వడ్డాణం, కంఠహారం, చెవిపోగులు, గాజులు, వివిధ రకాల గొలుసులు వాడారు. వీటి తయారీలో బంగారం, వెండి, వివిధ రకాల పూసలను ఉపయోగించారు.

 కళలు: అనేక ప్రదేశాల్లో చేపట్టిన తవ్వకాల్లో స్త్రీ, పురుషుల శిల్పాలు బయటపడ్డాయి. మొహంజోదారోలో రాతితో చేసిన గడ్డంతో కూడిన పురోహితుడి శిల్పం, కంచుతో చేసిన నాట్యగత్తె శిల్పం లభించాయి. ఇవన్నీ హరప్పా కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం. 
     పై విషయాల ఆధారంగా హరప్పా ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది.
* అవసరానికంటే ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తి జరిగడంతో  అనేక కళలు, చేతివృత్తులు అభివృద్ధి చెందాయి.

 

వ్యాపారం: కొన్ని అవసరమైన ముడి పదార్థాలు లభించనందువల్ల హరప్పా ప్రజలు భారత ఉపఖండం లోపలి, వెలుపలి ప్రాంతాలతో వర్తక సంబంధాలను నెలకొల్పారు. తాము రూపొందించిన వస్తువులను అమ్ముకోవడానికి కూడా వర్తక సంబంధాలను కొనసాగించారు.
 

ఉపఖండం లోపల వర్తకం: ఈ నాగరికతకు చెందిన ప్రజలు హరప్పా నగరాల మధ్య అంతర్గతంగానే కాకుండా ఇరుగు పొరుగు ప్రదేశాలైన దక్కను, దక్షిణ భారతదేశం లాంటి ప్రాంతాలతోనూ వ్యాపారం నిర్వహించారు. వీరు వివిధ రకాలైన లోహాలు, విలువైన రాళ్లను వేర్వేరు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. వీరు దక్షిణ భారతదేశం, అఫ్గానిస్థాన్, ఇరాన్ నుంచి బంగారం; రాజస్థాన్‌లోని ఖేత్రి గనుల నుంచి రాగి; బీహార్ నుంచి తగరం; దక్షిణ భారతదేశం, సౌరాష్ట్ర, రాజస్థాన్, దక్కను ప్రాంతం నుంచి విలువైన రాళ్లను దిగుమతి చేసుకున్నారు.
 

పురావస్తు ఆధారాలు: సర్ లియొనార్డ్ ఊలి సుమేరియాలోని ఉర్, సుస, లగాష్, టెలస్మార్ లాంటి ప్రదేశాల్లో తవ్వకాలు జరిపించాడు. ఈ తవ్వకాల ద్వారా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సుమేరియాలో లభించిన రెండు డజన్ల ముద్రికల ఆధారంగా హరప్పా ప్రజలు సుమేరియాతో వర్తక సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. సుమేరియాలో లభించిన హరప్పా శైలికి చెందిన ముద్రికల ద్వారా హరప్పా నాగరికతకు చెందిన కొంతమంది వర్తకులు సుమేరియాలో నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. మెసపటోమియాలోని 'ఉమ్మ' అనే ప్రదేశంలో భారీ స్థాయిలో బయటపడిన వస్త్రాలు దీనికి మరింత బలాన్నిస్తున్నాయి. హరప్పా ప్రాంతంలో సుమేరియా నాగరికతకు చెందిన ముద్రికలు, లోహ వస్తువులు కూడా లభించాయి. ఈ ఆధారాలన్నీ హరప్పా, సుమేరియా ప్రాంతాల మధ్య వర్తక సంబంధాలున్నాయనే విషయాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి.

 

సాహిత్య ఆధారాలు: మెసపటోమియా సాహిత్యంలో ఉర్ నగరానికి చెందిన వర్తకులు విదేశీ వ్యాపారం చేసినట్లుగా ఉంది. దీంట్లో తరచుగా పేర్కొన్న ప్రదేశాలు దిల్మన్, మెగోన్, మెలూవో. దిల్మన్‌ను పర్షియా సింధుశాఖలోని బహ్రైన్ ద్వీపంగా, మెగోన్‌ను సౌదీ అరేబియాకు చెందిన ఒక ఓడరేవుగా గుర్తించారు. మెలూవోను ఇండియాగా.. ప్రత్యేకించి సింధూ హరివాణం (Basin) , సౌరాష్ట్రగా గుర్తించారు.
 

రవాణా సౌకర్యాలు, వ్యాపార స్వభావం: పశ్చిమ ఆసియా దేశాలతో సముద్ర మార్గం ద్వారా వ్యాపారం చేసేవారు. లోథాల్, సుర్కోటుడా, సుక్తాజెండర్ అనేవి హరప్పా కాలంనాటి ఓడరేవులు. ఎస్.ఆర్. రావు లోథాల్‌లో జరిపిన తవ్వకాల్లో ప్రాచీన ఓడరేవు బయట పడింది. ఇది హరప్పా ప్రజలకు చెందిన సుసంపన్న ఓడరేవుగా భావిస్తున్నారు.
     మొహంజోదారోలో లభించిన కొన్ని ముద్రికలపై ఓడబొమ్మలున్నాయి. ఇవి అంతర్జాతీయ వ్యాపారం గురించి, వ్యాపారం కోసం పడవలను వినియోగించారనే విషయాన్నీ తెలియజేస్తున్నాయి. హరప్పా ప్రజలకు లోహ నాణేల వాడకం గురించి తెలియదు. అందువల్ల ఈ ముద్రికలను వ్యాపార చిహ్నాలుగా ఉపయోగించారని భావిస్తున్నారు. హరప్పా ప్రజలు వస్తుమార్పిడి విధానం ద్వారా వ్యాపారం చేశారు. వీరు వ్యవసాయ, ఇతర ఉత్పత్తులను ఎగుమతి చేసి లోహాలు, ముడిసరుకులను దిగుమతి చేసుకునేవారు. పడవలు, ఎడ్లబండ్లను రవాణా సాధనాలుగా వినియోగించేవారు. బలమైన చక్రాలతో కూడిన బండ్ల వాడకం గురించి వీరికి తెలుసు. వీటి ద్వారా హరప్పా ప్రజలకు కావాల్సినంత వ్యవసాయ మిగులు ఉండేదని, ఈ కాలంలో పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయని, లాభదాయకమైన అంతర్గత, అంతర్జాతీయ వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. వీరి కాలంలో దిగుమతుల కంటే ఎగుమతులే ఎక్కువగా ఉండేవి.

పట్టణ సంస్కృతి: హరప్పా నాగరికతా కాలంలో భారతదేశంలో మొదటిసారిగా పట్టణీకరణ జరిగింది. ఈ కాలంలో ఆర్థికంగా సాధించిన అభివృద్ధే దీనికి ప్రధాన కారణం.
 

హరప్పా, పట్టణ సంస్కృతి ప్రధాన లక్షణాలు:
* క్రమబద్ధమైన పట్టణ ప్రణాళిక ఉండేది.
* బాగా తీర్చిదిద్దిన వీధులు ఉండేవి.
* పటిష్ఠమైన మురుగు నీటి కాల్వలను నిర్మించారు.
* నివాస, ప్రభుత్వ గృహాలున్నాయి.
*కళలు, చేతి వృత్తులు బాగా అభివృద్ధి చెందాయి.
* జీవన ప్రమాణస్థాయి అభివృద్ధి చెందింది.
* పట్టణాలు, నగరాలు ఆవిర్భవించాయి.
హరప్పా నాగరికతకు సంబంధించి అనేక పట్టణాలు, నగరాలను కనుక్కున్నప్పటికీ వీటిలో ఆరింటిని గొప్ప నగరాలుగా గుర్తించారు.
అవి: మొహంజోదారో, హరప్పా, చాన్హుదారో, కాలిబంగన్, బన్వాలి, లోథాల్

 

పట్టణ ప్రణాళిక: పట్టణ నిర్మాణంలో గ్రిడ్ విధానాన్ని అనుసరించారు. పట్టణాన్ని పెద్ద దీర్ఘచతురస్రాకార, చతురస్రాకార బ్లాకులుగా విభజించేలా రోడ్లు, వీధులు ఒకదానికొకటి లంబంగా ఖండించుకునేవిధంగా ఉండేవి. కొన్ని ప్రాంతాల్లో దీపస్తంభాలు కూడా బయటపడ్డాయి. వీటి ఆధారంగా ఈ కాలంలో వీధి దీపాల సౌకర్యం ఉన్నట్లు తెలుస్తోంది. హరప్పా ప్రజలు నిర్మాణాల్లో నాణ్యమైన, కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. ఇదేకాలంలో ఇతర దేశాల్లో ఎండబెట్టిన ఇటుకలను మాత్రమే వాడేవారు. గృహాలను వేర్వేరు పరిమాణాల్లో నిర్మించారు. ఇవి రెండు, అంతకంటే ఎక్కువ అంతస్తులతో ఉండేవి. పెద్ద గృహాలకు సొంత బావులుండేవి. పై అంతస్తుల్లోని చదునైన పైకప్పుల పైకి వెళ్లడానికి ఇటుకలతో మెట్లను నిర్మించేవారు. వీధికి అభిముఖంగా కిటికీలను నిర్మించలేదు. సుమారుగా అన్ని ఇళ్లలోనూ స్నానపుగదులున్నాయి. వీటిని పెంకులతో నిర్మించారు. స్నానాలగది నుంచి నీరు పోవడానికి తగిన ఏర్పాట్లుండేవి. ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటిని వీధుల్లో ఏర్పాటు చేసిన కాల్వల్లోకి పంపేవారు. ఈ మురుగునీటి కాల్వలను సున్నం, జిప్సం, మోర్టార్‌తో నిర్మించారు. ఈ కాల్వలు రాతిపలకలు లేదా ఇటుకలతో కప్పి ఉండేవి. వీటిపై నిర్ణీత ప్రదేశాల్లో మనుషులు దిగి చెత్తను తొలగించడానికి వీలుగా మ్యాన్‌హోళ్లను ఏర్పాటు చేశారు. మురుగునీటి పారుదల వ్యవస్థ, స్నానపు గదుల నిర్మాణం లాంటివాటిని సింధూ ప్రజలు ఆరోగ్యం, పరిశుభ్రత పట్ల తీసుకున్న జాగ్రత్తలకు నిదర్శనాలుగా చెప్పవచ్చు.
పట్టణాన్ని ఎగువ లేదా కోట (దుర్గం) ప్రాంతం, దిగువ భాగాలుగా విభజించారు. కోట చుట్టూ ఎండబెట్టిన ఇటుకలతో నిర్మించిన ప్రహారి గోడ ఉండేది. ప్రభుత్వ భవనాలన్నీ దుర్గం ప్రాంతంలోనే ఉండేవి. దిగువ భాగంలో సామాన్య ప్రజలు నివసించేవారు. మొహంజోదారోలో 'మహా స్నానవాటిక'ను (12 మీ. × 7 మీ. × 2.4 మీ.) కనుక్కున్నారు. పండుగలు, ఉత్సవాల సమయంలో ప్రజలు ఇక్కడే సామూహిక స్నానాలు చేసేవారు.

 

రాజకీయ వ్యవస్థ: హరప్పా ప్రజల రాజకీయ వ్యవస్థ గురించి స్పష్టమైన అవగాహన లేదు. వీరు వ్యాపారంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినందువల్ల వ్యాపార వర్గాలకు చెందినవారే పాలించినట్లుగా భావిస్తున్నారు. ప్రజల అవసరాల పర్యవేక్షణకు నగరపాలక సంస్థ లాంటి వ్యవస్థలు ఉండేవి.
 

మతవ్యవస్థ: హరప్పా ప్రజల మత విశ్వాసాలను తెలుసుకోవడానికి కూడా పురావస్తు వస్తువులే ప్రధాన ఆధారం.
         * హరప్పా ప్రజలు బహుదేవతారాధన చేశారు. ఇదే విధానం ప్రాచీన, మధ్యయుగంలోనూ కొనసాగి, ఆధునిక యుగంలోనూ ఉంది.  
         * హరప్పా ప్రజలు వారికి అర్థంకాని ప్రకృతి శక్తులకు దైవత్వాన్ని ఆపాదించి, పూజించారు. భూమిని అమ్మతల్లిగా పూజించడాన్ని దీనికి మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎరుపు, జేగురు రంగు మట్టితో చేసిన స్త్రీ బొమ్మ లభ్యమైంది. దీని గర్భం నుంచి ఒక మొక్క జన్మించినట్లుగా ఉంది. ఈ బొమ్మ భూదేవతను పోలి ఉంది. ఈజిప్టు ప్రజలు నైలూనదిని ఇసిస్ (ISIS) దేవత రూపంలో పూజించినవిధంగానే సింధూ ప్రజలు భూమిని అమ్మతల్లిగా పూజించారు.     
* హరప్పాలో లభించిన ఒక ముద్రికలో (Seal) పురుషదేవుడు యోగిలా కూర్చొని ఉన్నాడు. అతడికి మూడు తలలు, నాలుగు చేతులు ఉన్నాయి. మధ్యభాగంలోని తలపై త్రిశూలం ఉంది. అతడి చుట్టూ అనేక జంతువులున్నాయి. ఈ దేవుడిని 'పశుపతి'గా గుర్తించారు. దీని ఆధారంగా హరప్పా ప్రజలు మొదటిసారిగా శివుడిని పూజించినట్లుగా తెలుస్తోంది. అందువల్ల భారతదేశంలో అతి ప్రాచీన మతం శైవమేనని భావిస్తున్నారు.
        * హరప్పా ప్రజలు శివుడిని లింగం రూపంలోనూ పూజించారు.
        * హరప్పా ప్రజలు వృక్షాలను కూడా పూజించారు. బోధి వృక్షం, దాని చుట్టూ ఏర్పాటు చేసిన కంచె, భక్తులు పూజిస్తున్నట్లుగా చిత్రీకరించి ఉన్న ముద్రికలు కూడా లభ్యమయ్యాయి.
      * హరప్పా ప్రజలు జంతువులనూ పూజించారు. సింధూ ప్రజలు ప్రధానంగా మూపురం ఉన్న ఎద్దు, ఏకశృంగ జంతువులను పూజించారు.
      * హరప్పా నగరాల్లో ఎరుపు, జేగురు రంగు మట్టితో రూపొందించిన నాట్యగత్తెల బొమ్మలు అనేకం కనిపించాయి. ఇవి ఆ కాలంలో నాట్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయి. ఇదే ప్రాచీన, మధ్యయుగ భారతదేశంలో దేవదాసి విధానంగా కొనసాగింది.
    * హరప్పా ప్రజలకు అగ్నిదేవుడినీ, సూర్యుడినీ పూజించడం తెలుసు. ఈ సంప్రదాయం గుప్తుల కాలం నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
       * అధర్వణ వేదంలో ప్రస్తావించిన, నేటివరకూ ప్రచారంలో ఉన్న మంత్రతంత్రాలు, తాయత్తుల వాడకం, వైద్య పరిజ్ఞానం లాంటివి హరప్పా సంస్కృతి నుంచి స్వీకరించినవేనని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.

 

హరప్పా సంస్కృతి పతనమవడానికి కారణాలు: హరప్పా సంస్కృతి పతనం కావడానికి అనేక కారణాలున్నాయి.
ప్రజల బలహీనతలు: హరప్పా ప్రజలకు మెసపటోమియా ప్రజలతో సంబంధాలున్నప్పటికీ, వారి నుంచి ఇనుము వాడకం గురించి తెలుసుకోలేకపోయారు. మొహంజోదారోలో చేపట్టిన తవ్వకాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే, వరదలు నాశనం చేసిన ప్రతిసారి అదే ప్రదేశంలో నగర నిర్మాణం చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇది వీరి ఆలోచనా విధానంలోని లోపాలను ప్రస్ఫుటం చేస్తోంది. వీరు ఉపయోగించిన భాష, లిపి వీరికి సృజనాత్మకత లేదనే విషయాన్ని వ్యక్తపరుస్తోంది. వీరి శాసనాల్లో ఎక్కువగా 6 నుంచి 7 చిహ్నాలే ఉన్నాయి. ఏ శాసనంలోనూ 20 కంటే ఎక్కువ చిహ్నాలు లేవు. హరప్పా ప్రజలు రక్షణ విషయంలో పెద్దగా శ్రద్ధ వహించలేదు. హరప్పా నగరాల్లో ఆయుధాలు పెద్దగా లభించలేదు.

 

నేలలో భూసారం తగ్గడం: సింధూ ప్రాంతం పొరుగున ఉన్న థార్ ఎడారి క్రమంగా విస్తరించడం వల్ల నేలలో భూసారం తగ్గి, ఉప్పదనం (Salinity) పెరిగింది. హరప్పా నాగరికత క్షీణించడానికి ఇది కూడా ఒక కారణమని కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం. అరేబియా సముద్ర మట్టం పెరగడం వల్ల కూడా సింధూ ప్రాంతంలో ఉప్పదనం పెరిగింది. నేల స్వభావంలో వచ్చిన మార్పు ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి తగ్గింది. దీంతో ఈ ప్రాంతంలో అంతర్గత, విదేశీ వ్యాపారం క్షీణించింది. ఈ విధమైన ఆర్థిక ఒత్తిడి కూడా హరప్పా సంస్కృతి పతనమవడానికి కారణమైంది.
 

సింధూ ప్రాంతంలో వరదలు: హరప్పా సంస్కృతి పతనానికి మరో కారణం సింధూ నది ప్రాంతంలో విపరీతంగా సంభవించిన వరదలు. గుట్టల పైన, దిగువ సింధూ హరివాణంలో జరిపిన తవ్వకాల్లో ఒండ్రుమట్టి అవశేషాలు కనిపించాయి. వీటి ఆధారంగా ఈ ప్రాంతంలో వచ్చిన వరదలు సింధు నాగరికతపై విపరీతమైన ప్రభావం చూపినట్లుగా తెలుస్తోంది.
భూకంపాలు: సింధూ నాగరికతా ప్రాంతంలో సంభవించిన తీవ్రమైన భూకంపాలు కూడా ఈ నాగరికత పతనానికి కారణమై ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం.

 

ఆర్యుల దండయాత్ర: ఆర్యులు భారతదేశంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో అనేక నగరాలను ధ్వంసం చేశారు. ఇంద్రుడు యవజావతి నదీ తీరంలోని 'హరయుప్రియ' అనే నగరాన్ని నాశనం చేసినట్లు రుగ్వేదంలో పేర్కొన్నారు. యవజావతిని సింధూ ఉపనదైన 'రావి'గా గుర్తించారు. ఇంద్రుడిని పురంధరుడు అని పేర్కొన్నారు. అంటే నగరాలను ధ్వంసం చేసినవాడు అని అర్థం. ఇది హరప్పా ప్రజలకు, ఆర్యులకు మధ్య జరిగిన యుద్ధాన్ని గురించి తెలియజేస్తోంది.
ఉత్తర బెలూచిస్థాన్‌లోని అనేక ప్రదేశాల్లో దట్టంగా కాలిన పొరలు కనిపించాయి. దీని ద్వారా ఈ ప్రాంతమంతా అగ్ని వల్ల దహనమైందని భావిస్తున్నారు. స్థానిక ప్రజలను ఓడించడంలో ఆర్యులకు అగ్ని సహాయపడ్డాడని రుగ్వేదంలో పేర్కొన్నారు.
          మొహంజోదారోతోపాటు అనేక ఇతర ప్రాంతాల్లో బయటపడిన అస్థిపంజరాల అవశేషాలు ఈ అంశానికి సంబంధించి విలువైన సమాచారాన్నిస్తున్నాయి. మలిదశకు చెందిన మొహంజోదారోలో లభించిన అరడజను మానవ అస్థిపంజరాల ఆధారంగా ఈ నగరంపై దాడి జరిగినట్లు భావిస్తున్నారు. ఒక ఇంట్లో బయల్పడిన కళేబరాల సమూహం, బావి మెట్లపై కనిపించిన స్త్రీ అస్థిపంజరం ఆధారంగా ఆర్యులు హరప్పా ప్రజలను ఓడించి, చంపారని భావిస్తున్నారు. అస్థిపంజరాలపై ఉన్న కత్తిగాట్లు కూడా ఆర్యులకు, హరప్పా ప్రజలకు యుద్ధం జరిగిన విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
హరప్పా నాగరికత పతనం అంటే ఆ సంస్కృతి కనుమరుగైందని కాదు. సింధూ నాగరికతకు చెందిన అనేక లక్షణాలు వేదకాలంలోనూ కొనసాగాయి.

 

నమూనా ప్రశ్నలు:
* సింధూ నాగరికత కాలంనాటి వ్యాపార, సాంస్కృతిక సంబంధాలు భారతదేశంలోనూ, ఇతర దేశాలతోనూ  ఏవిధంగా ఉండేవో చర్చించండి.
*  సింధూ ప్రజల పట్టణ ప్రణాళిక ముఖ్య లక్షణాలను తెలియజేసి, ఈ నాగరికత పతనానికి దారితీసిన కారణాల గురించి విశ్లేషించండి.
*  సింధూ నాగరికతా కాలంనాటి మతవ్యవస్థను వివరించి, ఇది నేటికీ ఏవిధంగా కొనసాగుతుందో చర్చించండి.
 * హరప్పా నాగరికతా కాలంలో మొదటి పట్టణీకరణకు దోహదం చేసిన ఆర్థిక పరిస్థితులను విశ్లేషించండి.
* ఆర్యులు రావడానికి ముందు భారతదేశంలో నాగరికత ఉందా? ఉంటే ఆ నాగరికత వ్యాప్తి, దాని విశిష్ట  లక్షణాలను పేర్కొనండి.

Posted Date : 11-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు