• facebook
  • whatsapp
  • telegram

మగధ రాజ్యం 

          భారతదేశ రాజకీయ చరిత్రలో క్రీ.పూ. 6వ శతాబ్దం తర్వాత జరిగిన సంఘటనలు గణ, రాజరిక రాజ్యాల మధ్య జరిగిన పోరాటాన్ని తెలియజేస్తాయి. ఈ కాలంలో మల్ల, కురు - పాంచాల, శూరసేన, మత్స్య, కాంభోజ, గాంధార, శాక్య, కోలియ, విజ్జి రాజ్యాలు ప్రధాన గణ రాజ్యాలు. విజ్జి గణ సమాఖ్యలో ఎనిమిది తెగలు ఉండేవి. అందులో లిచ్ఛవీ రాజ్యం బలమైంది. దీని రాజధాని వైశాలి. ఈ గణ రాజ్యాలు గంగా హరివాణంలోని ఈశాన్య ప్రాంతంలో, హిమాలయ పర్వత పాద భూభాగాల్లో విస్తరించి ఉండేవి.
          క్రీ.పూ. 6వ శతాబ్దంలో మగధ, అంగ, అవంతి, కాశీ, కోసల, వత్స బలమైన రాజరిక రాజ్యాలు. ఇవి ఉత్తర భారతదేశంలో సారవంతమైన గంగా పరివాహ ప్రాంతానికి పరిమితమై ఉండేవి. గంగా హరివాణంపై ఆధిపత్యం కోసం గణ, రాజరిక రాజ్యాల మధ్య నిరంతరం యుద్ధాలు జరిగేవి. ఈ పోరాటంలో మగధ రాజ్యం తన సైనిక బలంతో మిగతా రాజ్యాలను అణచివేసింది. దీంతో మగధ రాజ్యం క్రీ.పూ. 6వ శతాబ్దంలో బలమైన సామ్రాజ్యంగా అవతరించింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
భౌగోళిక కారణాలు: సారవంతమైన గంగా హరివాణం వ్యవసాయ అభివృద్ధికి బాగా తోడ్పడింది. ఇది రాజ్యానికి స్థిరమైన ఆదాయ వనరులను అందించింది. రాజకీయ భద్రత, ఆర్థిక సుస్థిరత చేకూర్చింది. ఆర్థిక సుస్థిరత వల్ల మగధ రాజులు బలమైన సిద్ధ సైన్యాన్ని పోషించారు. నంద రాజైన మహాపద్మనందుడి వద్ద 2 లక్షల కాల్బలం, 2 వేల రథాలు, 3 వేల గజదళంతో బలమైన సైన్యం ఉన్నట్లు గ్రీకు చరిత్రకారులు పేర్కొన్నారు. అలెగ్జాండర్ దండయాత్ర పంజాబ్ ప్రాంతంలోనే ముగియడంతో నంద రాజులకు తమ సైనిక బలాన్ని ప్రదర్శించే అవకాశం రాలేదు.
         గంగానదికి అవతల ఉన్న దక్షిణ బీహార్ ప్రాంతం దట్టమైన అడవులతో ఉండేది. ఈ అడవుల్లో భవన నిర్మాణానికి, సైన్యంలో ఉపయోగించే రథాలను రూపొందించడానికి కావాల్సిన కలప లభించేది. మగధ ప్రాంతంలో రాగి, ఇనుప ఖనిజాలు ఎక్కువగా దొరికేవి. అంగ రాజ్యంలోనూ ఇవి విరివిగా లభించేవి. అంగ రాజ్యం మగధలో విలీనమవ్వడంతో రాగి, ఇనుప ఖనిజం లభ్యత మరింత పెరిగింది. ఇనుము వాడకం పెరగడంతో రక్షణ, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక పురోగతి కనిపించింది.
          మగధ రాజ్యానికి కొన్ని వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రాజ్యానికి రెండు రాజధానులు ఉండేవి. మొదటిది రాజగృహం, రెండోది పాటలీపుత్రం. ఈ రెండూ వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్నాయి. గిరివ్రజం అని పిలిచే రాజగృహం అయిదు కొండల మధ్య శత్రు దుర్భేద్యంగా ఉండేది. పాటలీపుత్రాన్ని గంగా, గండక్, సోనా, సరయు నదుల సంగమ ప్రాంతంలో నిర్మించారు. పాటలీపుత్రం జలదుర్గంగా పేరు పొందడమే కాకుండా జల మార్గాలపై ఆధిపత్యం కలిగి ఉండేది.
         ఇలాంటి భౌగోళిక అంశాలు మగధ బలమైన రాజ్యాంగా అభివృద్ధి చెందడానికి దోహదం చేశాయి.
వాణిజ్య అభివృద్ధి: వ్యవసాయ అభివృద్ధి, మిగులు ఉత్పత్తి వ్యాపార అభివృద్ధికి తోడ్పడ్డాయి. దీంతో మగధ ఒక ప్రధాన వ్యాపార, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. వ్యవసాయ మిగులు, వాణిజ్య అభివృద్ధి పట్టణాలు, నగరాల అభివృద్ధికి దారితీసింది. వ్యాపారం బాగా అభివృద్ధి చెందడం వల్ల పన్నులు, సుంకాల రూపంలో రాజ్యానికి అదనపు ఆదాయం సమకూరింది.

మగధ ప్రజల దృక్పథం: మగధ ప్రజల ప్రత్యేక దృక్పథం కూడా మగధ రాజ్య అభ్యున్నతికి తోడ్పడింది. మగధ రాజ్యంలో అనార్య తెగలకు చెందిన ప్రజలు నివసించేవారు. వారిని సనాతన బ్రాహ్మణులు చిన్న చూపు చూసేవారు. అయితే ఆర్యుల రాకతో మగధ సమాజంలో వర్ణ సంక్రమణం జరిగింది. ఇది మగధ ప్రజలను సామ్రాజ్య స్థాపనకు పురిగొల్పేలా చేసింది.
సమర్థమైన రాజుల పాలన: మగధ రాజ్యాన్ని సమర్థులైన, దూరదృష్టి ఉన్న రాజులు పరిపాలించారు. బిందుసారుడు ఉత్తర భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో హర్యంక వంశ పాలనను ప్రారంభించాడు. సైనికబలం, చతురతతో బిందుసారుడు సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మొదట ఆర్థికంగా అభివృద్ధి చెందిన అంగరాజ్యాన్ని ఆక్రమించాడు.
 
   ఈ విజయం వల్ల అంగరాజ్యం మగధ రాజ్యంలో విలీనమైంది. దీంతో అంగ రాజ్యంలో లభించే రాగి, ఇనుప ఖనిజంపై కూడా ఆధిపత్యం సంపాదించాడు. బింబిసారుడు కూడా మగధ సామ్రాజ్య విస్తరణలో ప్రముఖ పాత్ర పోషించాడు. అతడు ప్రసిద్ధి పొందిన రాజరిక రాజ్యాలతో వైవాహిక సంబంధాలు ఏర్పరుచుకోవడం ద్వారా తన బలాన్ని పెంచుకున్నాడు. కోసల రాజు ప్రసేనజిత్తు సోదరి కోసలదేవిని పెళ్లి చేసుకోవడం ద్వారా కాశీ పట్టణాన్ని వరకట్నంగా పొందాడు. బింబిసారుడు లిచ్ఛవీ, మద్ర రాజ్యాలతో సైతం వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఇదే సమయంలో గంగా హరివాణంలో బౌద్ధ, జైనమతాలు బాగా ప్రచారంలో ఉండేవి. బింబిసారుడు పరమత సహనాన్ని పాటించి, రాజ్యంలో శాంతిని నెలకొల్పాడు.
          బింబిసారుడి తర్వాత అతడి కుమారుడు అజాతశత్రువు రాజ్యానికి వచ్చాడు. ఇతడు కూడా తన సమర్థ పాలనతో తండ్రిలా పేరు పొందాడు. తండ్రి అవలంబించిన విధానాలను కొనసాగించాడు. రాజగృహాన్ని పటిష్టం చేయడమే కాకుండా 'పాటలీపుత్రం' అనే నగరాన్ని నిర్మించాడు. ఇది ఉత్తర భారతదేశంలో గొప్ప నగరంగా అభివృద్ధి చెంది క్రీ.శ. 7వ శతాబ్దం వరకు తన ఖ్యాతిని నిలబెట్టుకుంది.
          తర్వాతి కాలంలో అజాతశత్రువు కోసల రాజ్యాన్ని ఆక్రమించాడు. విజ్జి సమాఖ్యను విడగొట్టి గంగా మైదానంలోని చాలా భూభాగాల్లో తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేశాడు.
          హర్యంక వంశం తర్వాత శిశునాగ వంశం మగధను 50 ఏళ్ల పాటు పరిపాలించింది. శిశునాగ వంశం పాలనా కాలంలో జరిగిన ప్రధాన సంఘటన - వైశాలిలో రెండో బౌద్ధ సంగీతిని నిర్వహించడం.
          శిశునాగ వంశం తర్వాత మగధ నంద వంశ పాలన కిందకు వచ్చింది. నంద వంశ పాలనా కాలంలో వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థ ఆధారంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలనే ఆలోచన భారతీయుల్లో పుట్టింది. మహాపద్మనందుడు కురు-పాంచాల, ఇక్ష్వాకు, శూరసేన, అస్మక లాంటి క్షత్రియ రాజవంశాలను నిర్మూలించి గంగా హరివాణంలో చాలా భాగం ఆక్రమించినట్లు తెలుస్తోంది. దీంతో అతడు శక్తిమంతమైన సైన్యాన్ని ఏర్పాటు చేయగలిగాడు. ఈ సైన్యమే అలెగ్జాండర్ ఆధ్వర్యంలోని గ్రీకు సైనికుల్లో భయాన్ని కలిగించింది. మహాపద్మనందుడి తర్వాత నంద వంశ ప్రతిష్ఠ దిగజారింది. ధననందుడి నిరంకుశ పాలనతో విసుగు చెందిన ప్రజలు మార్పు కోసం ఎదురు చూశారు.
        మౌర్యుల రాకతో ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. వీరి పాలనలో మగధలో సామ్రాజ్యవాదం వాస్తవిక రూపం దాల్చింది. భారతదేశంలో రాజకీయ ఏకీకరణ సాధించి, నిజమైన సామ్రాజ్య స్థాపన చేసిన ఘనత మౌర్యులకే దక్కుతుంది.
ప్రశ్నలు
1. మగధ సామ్రాజ్య ఆవిర్భవానికి దోహదం చేసిన పరిస్థితులను వివరించండి.
2. మగధ సామ్రాజ్య విజృంభణకు భౌగోళిక పరిస్థితులు ఎలా తోడ్పడ్డాయో తెలపండి.

 

మౌర్య సామ్రాజ్యం 

         క్రీ.పూ. 4వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్య స్థాపన ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. మొదట్లో ఉత్తర భారతదేశంలోనూ, తర్వాతి కాలంలో భారతదేశమంతా రాజకీయ ఏకీకరణ సాధించడానికి మౌర్యుల యుగమే ప్రధాన కారణం. సమాజం, పరిపాలన, మతం, ఆర్థిక వ్యవస్థల్లో గుణాత్మకమైన మార్పులకు మౌర్యుల కాలం సాక్ష్యంగా నిలిచింది. మౌర్యుల రాకతో ప్రాచీన భారతదేశ చరిత్రలో కాలనిర్ణయం చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోయాయి.
మౌర్యుల చరిత్రకు ఆధారాలు:
       మౌర్యుల రాజకీయ, సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవడానికి అనేక రకాల ఆధారాలు ఉన్నాయి. సాహిత్య, పురావస్తు ఆధారాలుగా వీటిని విభజించవచ్చు.
సాహిత్య ఆధారాలు: వీటిని స్వదేశీ, విదేశీ ఆధారాలుగా విభజించవచ్చు. స్వదేశీ ఆధారాలను తిరిగి వైదిక, బౌద్ధ, జైన ఆధారాలుగా విభజించవచ్చు.
వైదిక సాహిత్యం: మౌర్యుల పుట్టుక, తొలి చరిత్ర గురించి వాయు, విష్ణుపురాణాలు అమూల్యమైన సమాచారాన్ని తెలియజేస్తున్నాయి. నంద రాజు రాణి లేదా ఉంపుడుగత్తె 'ముర' నుంచి 'మౌర్య' అనే పేరు వచ్చినట్లు వీటిలో పేర్కొన్నారు. అయితే పురాణాల్లో ఈ రెండు రాజవంశాలకు సంబంధం ఉన్నట్లు చెప్పలేదు. నందవంశస్థులు శూద్ర కులానికి చెందడం దీనికి కారణమై ఉండవచ్చు. మౌర్యులు కూడా నీచ స్థాయికి చెందిన శూద్ర కులానికి చెందినవారుగా ఇవి పేర్కొన్నాయి. మొత్తం మీద పురాణాల్లో మౌర్యులను శూద్ర కులానికి చెందినవారిగా ప్రస్తావించారు.
బౌద్ధ సాహిత్యం: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతంలో మౌర్య అనే క్షత్రియ తెగ నివసిస్తున్నట్లు బౌద్ధ సాహిత్యంలో పేర్కొన్నారు. చంద్రగుప్తుడు కూడా ఇదే తెగకు చెంది ఉండవచ్చని తెలిపారు. బౌద్ధ గ్రంథాల్లో అశోకుడి తొలి జీవితం గురించి ప్రస్తావించారు. శ్రీలంకకు చెందిన బౌద్ధ గ్రంథాల్లో అశోకుడు తన తొంభై తొమ్మిది మంది సోదరులను చంపి సింహాసనం అధిష్ఠించినట్లు వివరించారు. ఇందులో వాస్తవం లేదు. అశోకుడు సింహాసనం అధిష్ఠించిన 18 సంవత్సరాల వరకు ఆయన సోదరులు, సోదరీమణులు జీవించే ఉన్నారని చెప్పడానికి ఆధారాలున్నాయి.
        మహావంశం, దీపవంశం గ్రంథాల్లో బుద్ధుడి నిర్యాణం తర్వాత 218 ఏళ్లకు అశోకుడు రాజైనట్లు ప్రస్తావించారు. ఈ ప్రస్తావన మౌర్యులు, అశోకుడు సింహాసనం అధిష్ఠించిన కాలాన్ని నిర్ణయించడానికి బాగా ఉపయోగపడింది. బిందుసారుడి పాలనా కాలంలో తక్షశిలలో తిరుగుబాటు జరిగినట్లు 'అశోక వదన' అనే గ్రంథంలో తెలిపారు. ఈ సమయంలో ఆశోకుడు ఉత్తర పథానికి గవర్నర్‌గా వ్యవహరించేవాడు. బిందుసారుడు ఈ తిరుగుబాటును అణచివేయడానికి అశోకుడిని పంపాడు. అశోకుడు తనకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తిచేశాడు.
         బిందుసారుడి కాలంలో వారసత్వ యుద్ధాలు జరిగినట్లు బౌద్ధ గ్రంథాల్లో పేర్కొన్నారు. దివ్యవదన గ్రంథం ప్రకారం బిందుసారుడు తన చివరి రోజుల్లో పెద్ద కుమారుడు సుసిమను వారసుడిగా ప్రకటించాలని భావించాడు. అయితే బిందుసారుడి ముఖ్యమంత్రి రాధాగుప్తుడు ఇతర మంత్రులు అశోకుడిని రాజుగా చేశారు. దీని ద్వారా వారసత్వ యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. మహావంశ, దీపవంశ గ్రంథాల్లో ఇచ్చిన సమాచారం కూడా దీనికి బలాన్ని చేకూరుస్తోంది. 

    జైనసాహిత్యం: జైన సాహిత్యం చంద్రగుప్తుడి మతం గురించి ఆసక్తికరమైన సమాచారం తెలియజేస్తోంది. హేమచంద్రుడు రచించిన పరిశిష్ట పర్వన్ ప్రకారం చంద్రగుప్తమౌర్యుడు జైనమతాన్ని అనుసరించాడు. మగధలో కరవు సంభవించినప్పుడు చంద్రగుప్తుడు సింహాసనాన్ని బిందుసారుడికి అప్పగించి, మైసూరు దగ్గరలోని శ్రావణ బెలగోళకు వెళ్లి, జైన సంప్రదాయం ప్రకారం సల్లేఖనవ్రతం ద్వారా తనువు చాలించాడు. చంద్రగుప్తుడు దక్కన్ ప్రాంతానికి వలస వెళ్లడం అక్కడ జైనమతం వ్యాప్తికి దోహదపడింది.  
లౌకిక సాహిత్యం: కౌటిల్యుడి అర్థశాస్త్రం మౌర్యుల కాలంనాటి పరిపాలన, సమాజం తదితర విషయాలపై అమూల్యమైన సమాచారాన్ని తెలియజేస్తోంది. ఇందులో వ్యవస్థీకృతమైన ఉద్యోగస్వామ్యంతో కూడిన ప్రభుత్వ విధానం గురించి విపులంగా వివరించారు.
          అర్థశాస్త్రంలో పరిపాలనకు అధిపతి రాజు, అతడికి సహాయం చేయడానికి మంత్రి పరిషత్ ఉండేది. మౌర్య సామ్రాజ్యాన్ని అనేక రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలుగా విభజించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రాలు రాజవంశానికి చెందిన వైశ్రాయ్‌ల ఆధీనంలో ఉండేవి. జిల్లాలకు 'స్థానిక', గ్రామాలకు 'గోప' అధిపతులుగా వ్యవహరించేవారు. గ్రామానికి అధిపతి 'గ్రామణి'. వీరితో పాటు వివిధ శాఖలను పర్యవేక్షించడానికి అధ్యక్షులను నియమించేవారు. అర్థశాస్త్రంలో పన్నుల విధానం, సామాజిక, గూఢచారి, సైనిక వ్యవస్థల గురించి వివరంగా పేర్కొన్నారు. ఈ విధంగా కౌటిల్యుడి అర్థశాస్త్రం మౌర్యుల యుగానికి సంబంధించిన అన్ని విషయాలపై సమగ్ర సమాచారాన్ని తెలియజేస్తోంది.
          విశాఖదత్తుడు రాసిన 'ముద్రారాక్షసం' మరో స్వదేశీ సాహిత్య ఆధారం. ఇది క్రీ.శ. 5వ శతాబ్దంలో రాసిన నాటకం. ఇందులో నంద వంశపాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు వల్ల ఆ వంశం పతనం కావడం, మగధ సింహాసనాన్ని చంద్రగుప్తుడు అధిష్ఠించిన విషయం గురించి వివరించారు. ఈ గ్రంథంలో మౌర్యులను క్షత్రియ వంశానికి చెందినవారిగా పేర్కొన్నారు.
విదేశీ ఆధారాలు: మెగస్తనీస్ రచించిన ఇండికా (Indica) గ్రంథం విదేశీ ఆధారాల్లో చాలా ముఖ్యమైంది. ఈ పుస్తకంలో కొన్ని భాగాలు మాత్రమే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. గ్రంథంలో ప్రస్తావించిన అనేక విషయాలు స్ట్రాబో, అరియన్, జస్టిన్ తదితర గ్రీకు, రోమన్ రచయితల పుస్తకాల్లో quotations రూపంలో కనిపిస్తాయి. మెగస్తనీస్ చంద్రగుప్తుడి ఆస్థానానికి సెల్యూకస్ పంపిన గ్రీకు రాయబారి.
      ఇండికా గ్రంథం ద్వారా మౌర్య చక్రవర్తులు విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు తెలుస్తోంది. వారు 6 లక్షల కాల్బలం, 30 వేల అశ్వక దళం, 9 వేల గజదళం, 8 వేల రథాలతో ఉన్న అతిపెద్ద సైన్యాన్ని పోషించారు. సైనిక వ్యవస్థను 30 మందితో కూడిన కమిటీ ద్వారా నిర్వహించేవారు. మొత్తం సైనికశాఖను 5 మంది సభ్యులతో 6 బోర్డులుగా విభజించారు.
          మెగస్తనీస్ మౌర్యుల రాజధాని నగరమైన పాటలీపుత్రం గురించి కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. ఇది భారతదేశంలోని గొప్ప నగరాల్లో ఒకటి. పాటలీపుత్ర పరిపాలనను 30 మందితో ఉన్న కమిటీ పర్యవేక్షించేది. దీన్ని 5 మంది సభ్యులతో 6 బోర్డులుగా విభజించారు. ఈ బోర్డులు పరిశ్రమలు, విదేశీయుల సంక్షేమం, జనన మరణాల నమోదు, పన్నుల వసూలు, ఉత్పత్తి వస్తువుల పర్యవేక్షణ తదితర బాధ్యతలను నిర్వహించేవి. మౌర్యుల కాలం నాటి సమాజాన్ని తత్త్వవేత్తలు, వ్యవసాయదారులు, సైనికులు, పశువుల కాపరులు, కళాకారులు, న్యాయమూర్తులు, కౌన్సిలర్లు అనే ఏడు కులాలుగా విభజించినట్లు మెగస్తనీస్ పేర్కొన్నాడు. అయితే ఇది వాస్తవం కాదు. మెగస్తనీస్ పొరపాటున వృత్తులను కులాలుగా భావించి ఇలా విభజించినట్లు తెలుస్తోంది.
          మౌర్యుల కాలం నాటి ప్రజలు నిజాయతీపరులని, సుఖసంతోషాలతో జీవించారని, రాజ్యంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్లు మెగస్తనీస్ పేర్కొన్నాడు. బ్రాహ్మణులు సమాజంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించారు. ఈ విధంగా ఇండికా గ్రంథం మౌర్యుల కాలానికి సంబంధించిన రాజకీయ, సామాజిక అంశాలను సమీక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది.
        గ్రీకు చరిత్రకారులు జస్టిన్, డియోడోరస్ ప్రకారం చంద్రగుప్తుడు సామాన్య కుటుంబంలో జన్మించి మౌర్య సింహాసనాన్ని అధిష్ఠించాడని తెలుస్తోంది.
పురావస్తు ఆధారాలు: పురావస్తు ఆధారాలను శాసనాలు, కట్టడాలు, నాణేలు అని మూడు రకాలుగా విభజించవచ్చు.
ఎ) శాసనాలు: భారతదేశంలో శాసనాలను జారీ చేసిన మొదటి చక్రవర్తి అశోకుడు. ఈ విషయంలో అశోకుడు పర్షియా చక్రవర్తి మొదటి డేరియస్ నుంచి స్ఫూర్తి పొందినట్లు తెలుస్తోంది. అశోకుడు తన శాసనాల్లో చారిత్రక, రాజకీయ అంశాల కంటే నైతిక, మతపరమైన వాటికి ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ శాసనాలు సమకాలీన రాజకీయ వ్యవస్థ, సంస్కృతి గురించి తెలుసుకోవడానికి బాగా దోహదపడుతున్నాయి.
అశోకుడి శాసనాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి 1) శిలా శాసనాలు 2) స్తంభ శాసనాలు
శిలా శాసనాలు: అశోకుడు రాజ్య సరిహద్దుల్లో శిలాశాసనాలు (రాళ్ల పై) చెక్కించాడు.
స్తంభ శాసనాలు: ఒకే రాతి నుంచి మలచిన స్తంభాలపై చెక్కిన స్తంభ శాసనాలను అశోకుడి సామ్రాజ్యంలోని వివిధ ప్రదేశాల్లో వేయించారు.
శాసనాలు ప్రధానంగా బ్రాహ్మి లిపితో, ప్రాకృత భాషలో ఉన్నాయి. అయితే వాయువ్య సరిహద్దులోని శాసనాల్లో ఖరోస్తి (kharosthi) లిపిని ఉపయోగించారు. కాందహార్ శాసనం గ్రీకు, అరామిక్ (ద్విభాష) భాషల్లో వేశారు.
అశోకుడి శాసనాలను 8 గ్రూపులుగా విభజించవచ్చు.
చిన్న శిలాశాసనాలు: ఈ గ్రూపులో రెండు శాసనాలు ఉన్నాయి. మొదటిది అశోకుడి వ్యక్తిగత చరిత్ర, రెండోది అశోకుడి దమ్మ (Dhamma) సారాంశాన్ని తెలియజేస్తున్నాయి.

బబ్రూ శాసనం: ఈ శాసనం గౌతమ బుద్ధుడి బోధనల పట్ల అశోకుడికి ఉన్న శ్రద్ధను తెలియజేస్తోంది. ఈ శాసనం బౌద్ధ మతస్థులకు చాలా ప్రధానమైంది.
పద్నాలుగు శిలాశాసనాలు: వీటిని మౌర్య సామ్రాజ్య సరిహద్దు రాష్ట్రాల్లో వేయించారు. ఇందులో అశోకుడి ప్రభుత్వ విధానం, నైతిక నియమాల గురించి వివరించారు. వీటన్నింటిలో చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా 13వ శిలాశాసనం చాలా ముఖ్యమైంది.
i) కళింగ ఆక్రమణ యుద్ధంలో సంభవించిన ప్రాణనష్టంతో పాటు అశోకుడి పశ్చాత్తాపం గురించి ఈ శిలాశాసనం తెలియజేస్తోంది.     
ii) అశోకుడు బేరిఘోష స్థానంలో దమ్మ ఘోషకు ప్రాధాన్యమివ్వడం గురించి ఈ శాసనంలో ప్రస్తావించారు.
iii) దమ్మ ప్రచారం కోసం అశోకుడు సమకాలీన విదేశీ రాజుల ఆస్థానాలకు ప్రచారకులను పంపడాన్ని ప్రస్తావించారు. ఈ శాసనంలో పేర్కొన్న విదేశీ రాజులు - సిరియాకు చెందిన ఆంటియోకస్, ఈజిప్టుకు చెందిన టాలమి ఫిలడెల్ఫస్, ఎపిరస్‌కు చెందిన అలెగ్జాండర్, మాసిడోనియాకు చెందిన ఆంటిగోనస్ గొనటస్, సైరీన్‌కు చెందిన మెగస్ (Megas) తదితరులు ఉన్నారు.
iv) రెండు కళింగ శాసనాలు: ఈ శాసనాలు ఒరిస్సాలోని ధౌలి, జౌగడ్‌లో లభించాయి. కళింగ, దాని సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ఆటవిక తెగల పరిపాలన ఏవిధంగా ఉండాలో ఈ శాసనాల్లో పేర్కొన్నారు.
v) బరాబర్ కొండగుహ శాసనాలు: ఇక్కడ మొత్తం మూడు శాసనాలు ఉన్నాయి. ఇందులో జైనమతం అజీవక తెగకు చెందిన వారికి అశోకుడు చేసిన దానాల గురించి పేర్కొన్నారు. ఈ శాసనం పరమతసహనానికి నిదర్శనంగా నిలుస్తోంది.
vi) నేపాలీ తరై శాసనం: ఈ శాసనాలు రుమ్మిందై, నిగాలి సాగర్ లో ఉన్నాయి. అశోకుడు బుద్ధుడి జన్మస్థానమైన లుంబిని సందర్శించడం గురించి, నిగాలిసాగర్‌లో స్తూపాన్ని పునర్‌నిర్మించడం గురించి ఈ శాసనాల్లో తెలియజేశారు.
vii) ఏడు స్తంభ శాసనాలు: ఈ శాసనాలు అశోకుడి మత సామరస్యం ప్రచారం చేయడానికి, నైతిక విధాన
అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆయన తీసుకున్న చర్యలను గురించి తెలియజేస్తాయి. రజుక అనే అధికారుల విధులైన న్యాయ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాలు, బ్రాహ్మణులు, శ్రమణులు, అజీవకులు, నిగ్రంథుల నుంచి మహామాత్రల నియామకం తదితర విషయాల గురించి తోపారా శాసనం తెలియజేస్తుంది.
viii) చిన్న స్తంభ శాసనాలు: ఈ కోవకు చెందినవి నాలుగు శాసనాలు ఉన్నాయి. బౌద్ధ మతంలో చీలిక ప్రమాదం ఉందని గ్రహించిన అశోకుడు ఈ శాసనాలు వేయించినట్లు తెలుస్తోంది. బౌద్ధ సంఘంలో అనైతిక కార్యకలాపాలు పెరిగినట్లు ఈ శాసనాల ద్వారా అర్థమవుతోంది. ఇదే సమయంలో అశోకుడు పాటలీపుత్రంలో మూడో బౌద్ధ సంగీతిని నిర్వహించి బౌద్ధమతంలో చీలికను నివారించడానికి ప్రయత్నం చేశాడు.
కర్ణాటకలోని మస్కి, మధ్యప్రదేశ్‌లోని గుజ్జరి శాసనాల్లో అశోకుడి పేరును మాత్రమే ప్రస్తావించారు. ఇంగ్లిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి పదవీ విరమణ పొందిన అధికారి జేమ్స్ ప్రిన్సెస్ అశోకుడి శాసనాలపై అధ్యయనం చేశాడు.
అశోకుడి శాసనాల ప్రాధాన్యం:
అశోకుడి శాసనాల ద్వారా కింది విషయాలు తెలుస్తున్నాయి.
i) అశోకుడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు.
ii) సమకాలీన విదేశీ రాజులతో ఉన్న సంబంధాలు.
iii) అశోకుడి దమ్మ సూత్రాలు.
iv) మౌర్యుల కాలంలో వాడిన వేర్వేరు భాషలు, లిపికి సంబంధించిన సమాచారం.
v) శాసనాలు లభించిన ప్రదేశాల ఆధారంగా అశోకుడి రాజ్య విస్తీర్ణం.
vi) 13వ శిలాశాసనం ద్వారా కళింగ ఆక్రమణ, బౌద్ధ సన్యాసి ఉపగుప్తుడి కోరిక మేరకు బౌద్ధమతంలోనికి
మారడం లాంటి విషయాలు.
vii) అశోకుడు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు - సంక్షేమ రాజ్య భావనకు పితామహుడు లాంటి విషయాలు తెలుస్తున్నాయి.
viii) పరిపాలనలో ప్రవేశపెట్టిన కొత్త సంస్కరణలు, ధర్మ మహామాత్రుల నియామకం తదితర విషయాలు.

బి) కట్టడాలు: మౌర్య సామ్రాజ్యంలో దొరికిన విహారాలు, చైత్యాల రూపంలోని గుహలు, స్తూపాలు, స్తంభాలు మొదలైనవి మౌర్యుల వాస్తు శాస్త్రం, కళల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు. మౌర్యుల కాలం నాటి స్తంభాలు చూనార్ నుంచి తెచ్చిన రాతితో తయారు చేశారు. ఇది నునుపుగా ఉండి ఇసుకరాయి రకానికి చెందింది. ఈ స్తంభాలు ఆ కాలంలో అభివృద్ధి చెందిన కళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.      
వీటన్నింటిని ఏకశిలతో తయారు చేశారు. పెద్ద రాళ్లను క్వారీల నుంచి సుదూర ప్రాంతాలకు తరలించడం, వాటిని పాలిష్ చేయడం, అందంగా తీర్చిదిద్దడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఇదంతా ఆ కాలం నాటి వృత్తిపని వారి నైపుణ్యానికి నిదర్శనం.
            కట్టడాలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మౌర్యుల కళపై పర్షియన్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పాటలీపుత్రంలోని రాజప్రసాదం పర్షియా రాజధాని 'పెర్సొపోలిస్' (Persopolis) లోని మొదటి డేరియస్ రాజ ప్రసాదాన్ని పోలి ఉంది. దీన్ని బట్టి ఆ కాలంలో పర్షియా, భారత రాజ్యాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సి) నాణేలు: మౌర్య చక్రవర్తులు విద్ధాంక నాణేలను (Punch market coins) జారీ చేశారు. వీటిని వెండి, రాగి లోహాలతో తయారు చేశారు. ఈ నాణేలపై నెమలి, కొండ, నెలవంక (Crescent) చిహ్నాలు ఉన్నాయి. ఇవి మౌర్యుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ నాణేలు లభించిన ప్రాంతాల ఆధారంగా సామ్రాజ్య విస్తరణను తెలుసుకోవచ్చు. మౌర్య వంశ చివరి రాజులు తక్కువ విలువ ఉన్న నాణేలను జారీచేయడం ఆ కాలంలో దిగజారిన ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తుంది.
           ఈ విధంగా కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీస్ ఇండికా, విశాఖదత్తుడి ముద్రారాక్షసం, పురాణాలు, బౌద్ధ, జైనమత సాహిత్యం, అశోకుడి శాసనాలు, వివిధ కట్టడాలు, నాణేలు మౌర్యుల కాలం నాటి చరిత్రను తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలుగా చెప్పవచ్చు.

Posted Date : 11-09-2020

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు