• facebook
  • whatsapp
  • telegram

వర్ణ, జాతి/ కుల వ్యవస్థ క్రమపరిణామం

    వేదకాలంనాటి ఆర్థిక అభివృద్ధితోపాటు సామాజిక సంబంధాల్లో వచ్చిన మార్పులు వర్ణవ్యవస్థ ఏర్పడటానికి దారితీశాయి. ప్రాచీన గ్రంథాలు ఆర్యవర్ణం, దాసవర్ణం గురించి పేర్కొన్నాయి. ఆర్యవర్ణానికి చెందినవారు సంపద, హోదా కలిగి ఉండేవారు. రాజన్యులు, విష్ తరగతికి చెందినవారైన వీరు బ్రాహ్మణులకు విరివిగా బహుమానాలు ఇచ్చేవారు. దాసవర్ణంవారు కూడా బ్రాహ్మణులకు బహుమానాలు ఇచ్చే స్థాయిలో ఉన్నప్పటికీ వారిని ప్రత్యేక తరగతిగా పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నీ క్రమంగా వర్ణవ్యవస్థ ఏర్పడటానికి బీజాలు వేశాయి. తదనంతరకాలంలో వివిధ తెగలు, కులాలు ఆవిర్భవించిన క్రమాన్ని గురించి తెలుసుకుందాం...
         రుగ్వేదంలోని దాసవర్ణం హరప్పా సంస్కృతి అనంతరం ఏర్పడిన వ్యవసాయ వర్గానికి చెందింది. ఈ వర్గాన్నే తర్వాత కాలంలో బానిసలు అనే అర్థంతో పిలిచారు. దస్యులు, ఆర్యుల కంటే భిన్నమైన మత విశ్వాసాలు, ఆచారాలు పాటించారు. మలివేద సాహిత్యంలో ఆర్య, మ్లేచ్ఛ విభజన కనిపిస్తుంది. ఇండో-ఆర్య భాషలు మాట్లాడేవారిని ఆర్యులుగా, అనాగరిక వర్గాలను మ్లేచ్ఛులుగా పేర్కొన్నారు.

              రుగ్వేదకాలంలో జననం ఆధారంగా కులం ఏర్పడలేదు. వ్యక్తులు వారికి నచ్చిన కులాన్ని ఎంచుకునేవారు.  దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
'నేను మంత్రాలను ఉచ్ఛరిస్తాను. నా తండ్రి వైద్యుడు. నా తల్లి మొక్కజొన్నలను దంచుతుంది. మేము వివిధ వృత్తుల ద్వారా సంపదను పొందాలని కోరుకుంటున్నాం.' అని రుగ్వేదంలోని 9వ మండలంలో ఒక కవి పేర్కొన్నాడు.
ఇదే కవి 3వ మండలంలో 'ఓ ఇంద్రుడా! నన్ను రాజును చేస్తావా? రుషిని చేస్తావా? నాకు అనంతమైన సంపదను ఇస్తావా?'అని ప్రార్థించాడు. దీని ఆధారంగా ఒకే వ్యక్తి రుషి లేదా రాజు కావచ్చు అని తెలుస్తోంది. ఆర్యవర్ణంలోని వివిధ వర్గాల మధ్య కులాంతర వివాహాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. క్షత్రియ వర్ణానికి చెందిన యయాతి, బ్రాహ్మణుడి కూతురైన దేవయాని మధ్య జరిగిన వివాహమే దీనికి నిదర్శనం.
         వర్ణం అంటే రంగు అని అర్థం. రుగ్వేద కాలంనాటి తెగలతో కూడిన సమాజంలో ప్రజల వృత్తుల ఆధారంగా యుద్ధవీరులు, పురోహితులు, సాధారణ ప్రజలు అనే మూడు వర్గాలు ఏర్పడ్డాయి. రుగ్వేదకాలం చివరి నాటికి శూద్రులు అనే నాలుగో వర్గం ఏర్పడింది. రుగ్వేదంలోని 10వ మండలంలో ఉన్న పురుషసూక్తంలో సమాజాన్ని నాలుగు వర్ణాలుగా విభజించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. ప్రజాపతి ముఖం నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు జన్మించినట్లు వివరించారు. వీరిలో మొదటి మూడు వర్ణాల వారిని ద్విజులుగా పేర్కొన్నారు. బృహదారణ్యక ఉపనిషత్తు, మహాభారతం, మనుస్మృతి కూడా కులవ్యవస్థ ఆవిర్భవం గురించి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. పురుషసూక్తంలో బ్రాహ్మణ, రాజన్య, వైశ్య, శూద్ర పదాలు ఉన్నప్పటికీ, వర్ణం అనే పదాన్ని వాడలేదు. రుగ్వేదంలో బ్రాహ్మణ అనే పదం అనేకసార్లు కనిపించినా దీన్ని కులం అనే అర్థంతో వాడలేదు. 'రాజన్య' అనే పదం పురుషసూక్తంలో మాత్రమే కనిపిస్తుంది. 'క్షత్రియ' అనే పదాన్ని రుగ్వేదంలో చాలాచోట్ల ప్రస్తావించారు. 'వైశ్య' పదం పురుషసూక్తంలో మాత్రమే కనిపించగా, విష్ అనే పదాన్ని తరచుగా ఉపయోగించారు. విష్ అంటే వైశ్యులు అని కాకుండా, పశుపోషణ వృత్తిగా ఉండే ప్రజలు అనే అర్థంతో వాడారు.    
  మలివేదకాలంలో వర్ణ వ్యవస్థలో గొప్ప మార్పులు సంభవించాయి. మొదటి రెండు వర్గాలైన బ్రాహ్మణులు, క్షత్రియులు అనేక సౌకర్యాలను అనుభవించారు. ఆ కాలంలో వర్ణవ్యవస్థ మరింత దృఢంగా మారింది. కులాల వారీగా దేవతల విభజన జరిగింది. బ్రాహ్మణులు అగ్ని, బృహస్పతిని; క్షత్రియులు ఇంద్రుడు, వరుణుడు, సోమ, యముడిని; వైశ్యులు రుద్రుడు, మారుతిని; శూద్రులు పుషాణ్ దేవతలను పూజించారు.

              మలివేదకాలంలో బ్రాహ్మణులు క్షత్రియుల కంటే ఉన్నత స్థానాన్ని ఆక్రమించారు. అయితే కొన్నిసార్లు క్షత్రియులు ఉన్నత స్థానం కోసం పోటీపడి, బ్రాహ్మణులకు సరైన గౌరవాన్ని ఇవ్వలేదు.  
బృహదారణ్యక ఉపనిషత్తులో క్షత్రియుల కంటే ఉన్నతమైనవారు ఎవరూ లేరని పేర్కొన్నారు. ఉపనిషత్తుల్లో క్షత్రియులు తత్త్వవేత్తలను పోషించినట్లుగా, కొందరు తత్త్వ సంబంధమైన వాదనలో పాల్గొన్నట్లుగా ప్రస్తావించారు.
         వర్ణం అనేది 'ధర్మం' అనే భావనతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. కాబట్టి వర్ణధర్మం అంటే ఒక సామాజిక చట్టాన్ని ఏర్పాటు చేయడానికి చేసిన ప్రయత్నం లేదా సమాజ శ్రేయస్సు కోసం ఒక క్రమపద్ధతిలో పనిచేసేటట్లు చూడటం. ఒక వ్యక్తి తన జీవితకాలంలో వర్ణ హోదాను మార్చుకోవడానికి వీల్లేదు. చతుర్వర్ణాలు, ఒకటి లేదా మరొక వర్ణం కిందకు వచ్చే అనేక కులాలను ఒక క్రమానుగత శ్రేణిలో ఏర్పాటు చేశారు. ఒక వర్ణం వారు వేరొక వర్ణానికి చెందినవారిని వివాహం చేసుకోకూడదు, వారికంటే తక్కువ వర్ణం వారి నుంచి ఆహారాన్ని తీసుకోకూడదు. ఎక్కువ లేదా తక్కువ వర్ణం అనే భావన పుట్టుక, వారసత్వంపై ఆధారపడుతుంది. 
     సాధారణంగా రెండు విధాలుగా వర్ణ హోదాను పెంపొందించుకోవచ్చు.
మొదటిది: సమాజం నుంచి బయటకు వచ్చి, సన్యాసిలా మారడం.
రెండోది: మరో జన్మలోనైనా అధిక సామాజిక హోదా కలిగిన వర్ణంలో జన్మించేలా చూడటం.
         ఒక వర్ణం నుంచి మరో వర్ణంలోకి మారడం పూర్తిగా కష్ట సాధ్యమైనదేమీకాదు. అయితే ఒక వ్యక్తి తక్కువ కులంలోకి మారడం చాలా సులభం, కానీ ఎక్కువ కులంలోకి మారడం మాత్రం సాధ్యం కాదు. ఒక వర్గం కాలక్రమేణా దీన్ని సాధించవచ్చు. నివసిస్తున్న ప్రదేశంలో మార్పు ద్వారా కూడా ఇది సాధ్యమవుతుంది.
         ఒక కులంవారు మరో కులానికి చెందినవారిని వివాహమాడటం వర్ణ సంక్రమణనానికి దారితీసింది. ప్రామాణిక ధర్మశాస్త్ర గ్రంథమైన మనుస్మృతిలో మిశ్రమ కులాలను వృత్తిపరమైన వర్గాలుగా పేర్కొన్నారు. ఒక బ్రాహ్మణుడు వైశ్య స్త్రీని వివాహమాడితే వారికి కలిగే సంతానాన్ని అంబస్థ కులంగా వర్గీకరించారు. అదేవిధంగా ఒక బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని వివాహమాడితే, వారికి కలిగే సంతానాన్ని నిషాద కులంగా వర్గీకరించారు.

 

వర్ణ వ్యవస్థ - చారిత్రక నేపథ్యం
         రుగ్వేద ఆర్యుల కాలంనాటి సమాజం ప్రధానంగా తెగలతో కూడి ఉండేది. పశుపోషణ ప్రధానవృత్తిగా ఉండి, అసమానతలు లేని సమాజంగా వర్థిల్లింది. యుద్ధంలో దోచుకున్న సంపద, పశువులే ప్రధాన సంపదగా ఉండేవి. బలమైన ఆహారోత్పత్తితో కూడిన ఆర్థికవ్యవస్థ లేకపోవడంతో మిగులు ఆహార ఉత్పత్తిపై జీవించే పురోహితులు, యుద్ధవీరులు ఆవిర్భవించలేదు. మలివేదకాలంలోనూ వ్యవసాయం రైతుల సొంత అవసరాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేసే స్థాయిలో అభివృద్ధి చెందలేదు.
వేదకాలం చివరినాటికి ఆర్యులు, ఆర్యేతరులు కలిసిపోవడంతో వ్యవసాయం అభివృద్ధి చెందింది. దీంతో ప్రజల మతపరమైన అవసరాలను చూసుకోవడానికి 17 రకాల పురోహితులు అవసరమయ్యారు. వీరిలో బ్రాహ్మణులు ఒక రకం వారు మాత్రమే. బ్రాహ్మణులు క్రమంగా మిగతావారిని వెనక్కినెట్టి పురోహిత వర్గానికి ప్రతినిధులయ్యారు.

              బుద్ధుడి కాలంనాటికి వ్యవసాయంలో ఇనుప పనిముట్ల వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో పశుపోషణే ప్రధానవృత్తిగా ఉన్న సమాజం పూర్తిస్థాయి వ్యవసాయ ఆధారిత ఆర్థికవ్యవస్థగా ఎదిగింది.  
దట్టమైన అడవులతో కూడిన మధ్య గంగా మైదాన ప్రాంతం ఇనుప గొడ్డలి వాడకం వల్ల వ్యవసాయానికి, నివాసానికి అనుకూలంగా మారింది. రైతులు వారి అవసరాని కంటే ఎక్కువ ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. వ్యవసాయంతోపాటు చేతివృత్తుల ఉత్పత్తులు పెరిగాయి. చేతివృత్తులవారు వ్యవసాయదారులకు పనిముట్లు, దుస్తులు సరఫరా చేయడంతోపాటు పాలకులకు, పురోహితులకు ఆయుధాలు, విలాస వస్తువులను అందించారు. మొదటి మూడు వర్ణాలవారి నుంచి నాలుగో వర్ణంవారిని విడదీశారు. నాలుగో వర్ణంవారు బానిసలుగా, పనివారిగా మిగిలిన మూడు వర్ణాల వారికి సేవ చేశారు. ఈవిధంగా ద్విజులుగా ప్రసిద్ధి చెందిన మొదటి మూడు వర్ణాలవారిని పౌరులుగా, శూద్రులను పౌరేతరులుగా పేర్కొన్నారు.
         పౌరుల మధ్య తేడాలు పెరిగాయి. ద్విజుల్లో మొదటి రెండు ఉన్నత వర్ణాల వారు శారీరక శ్రమ పట్ల అసహ్యం పెంచుకున్నారు. వైశ్యులు 'ద్విజ' వర్గానికి చెందినప్పటికీ వారు రైతులుగా, పశుపోషకులుగా, చేతివృత్తులవారిగా, వ్యాపారులుగా పనిచేశారు. వీరే రాజ్యానికి ఎక్కువ మొత్తంలో పన్నులు చెల్లించారు. ఈ పన్నుల పైనే బ్రాహ్మణులు, క్షత్రియులు ఆధారపడి జీవించేవారు.
సామాజిక మిగులును పంచుకోవడంలో బ్రాహ్మణులు, క్షత్రియుల మధ్య తరచూ సంఘర్షణలు సంభవించేవి. అందుకే ప్రాచీన గ్రంథాలు రెండు ఉన్నత వర్ణాల మధ్య ఉండాల్సిన పరస్పర సహాయం, సహకారం గురించి నొక్కి చెప్పాయి.
         క్రీ.శ. 3వ శతాబ్దం నాటికి వైశ్యులు పన్నులు చెల్లించడానికి, శూద్రులు తమ శ్రమను అందించడానికి నిరాకరించారు. ఇది సమాజం, రాజ్యం సక్రమంగా పనిచేయడానికి ఇబ్బందిని కలిగించింది. ఈ సమస్యను అధిగమించడానికి రాజులు భూదానాలు ఇచ్చే పద్ధతిని అవలంబించారు. పురోహితులు, అధికారులకు భూదానాలు చేయడం ద్వారా రాజ్యంలోని చాలా భాగాల్లో పన్నులు వసూలు చేయడం, శాంతి భద్రతల నిర్వహణ లాంటి బాధ్యతల నుంచి ఉపశమనం లభించింది. ఈ పద్ధతి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న, వెనకబడ్డ ప్రాంతాలకు విస్తరించింది. ఇది వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి దోహదం చేసింది. ప్రాచీనకాలం చివరిదశ - మధ్యయుగం తొలిదశ నాటి గ్రంథాలు శూద్రులను రైతులుగా పేర్కొన్నాయి. ఈ గ్రంథాలు శూద్రులకు అనేక సంస్కారాలు, వ్రతాలు, తీర్థాలను నిర్ణయించాయి. దీనివల్ల సాధారణ బ్రాహ్మణులు, పురోహితులకు రావాల్సిన వాటా దక్కేది. శూద్రులకు ఇతిహాసాలు, పురాణాల పఠనాన్ని వినడానికి అవకాశం కల్పించారు.

              గుప్తులు, వారి అనంతర కాలంలో కులాల సంఖ్య వేగంగా పెరిగింది. తెగల ప్రాంతాల్లో ఎక్కువ భూదానాలు చేయడం వల్ల, ప్రతి తెగను శూద్రులుగా హిందూ వ్యవస్థలోకి తీసుకున్నారు. మనుస్మృతిలో 61 కులాల గురించి పేర్కొన్నారు. అలాగే 'బ్రహ్మవైవర్త పురాణం'లో 100 కులాలున్నట్లు ప్రస్తావించారు.  
వీరిలో చాలామంది తెగలకు చెందిన వారైనప్పటికీ, వర్ణ సంక్రమణం వల్ల ప్రత్యేక కులాలకు చెందినవారిగా హిందూ ధర్మశాస్త్రాలు పేర్కొన్నాయి. అదేవిధంగా తెగల నాయకులు, కొంతమంది విదేశీ రాజులను ద్వితీయశ్రేణి క్షత్రియులుగా హిందూ సమాజంలోకి తీసుకున్నారు. వీరే గుప్తుల అనంతర కాలంలో రాజపుత్రులుగా ప్రసిద్ధికెక్కారు. ఈ కాలంలో భూదానాలు పెరగడంవల్ల వ్యాపారం, పట్టణీకరణ క్షీణించాయి. స్థానిక అవసరాలను స్థానికులే తీర్చడంతో చేతివృత్తులవారు, వ్యాపారులు ప్రాధాన్యాన్ని కోల్పోయారు. దీంతో వృత్తులు వంశపారంపర్యమయ్యాయి. ఈవిధంగా ప్రాచీనకాలం చివరిభాగంలో కుల/ జాతి వ్యవస్థ అభివృద్ధికి పరిస్థితులు అనుకూలించాయి.
ఆశ్రమాలు 
         ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశల్లో నిర్వహించాల్సిన బాధ్యతల గురించి ఆశ్రమాలు తెలియజేస్తాయి.
మొదటిదశ: బ్రహ్మచర్యం. ఈ దశలో వేదాలను అధ్యయనం చేయాలి.
రెండోదశ: గృహస్థం. ఈ దశలో వైవాహిక జీవితాన్ని గడపాలి. పూజలు, దానాలు చేయాలి. విద్యార్థిగా, గృహస్థుడిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేవారు మోక్షాన్ని పొందుతారని, పునర్జన్మ ఉండదని 'చాందోగ్య ఉపనిషత్తు'లో పేర్కొన్నారు.
         వృద్ధాప్యంలో సుఖాలను త్యజించి సంతానం, సంపద, ప్రపంచం పట్ల కోరికలను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని బృహదారణ్యక ఉపనిషత్తులో పేర్కొన్నారు. మానవ సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను విడిచిపెట్టి అడవిలో జీవించడానికి సిద్ధపడే ఈ దశను 'వానప్రస్థం' అంటారు. ఈ దశలో ఆత్మను శుద్ధిచేయడం కోసం అడవిలో దొరికే కందమూలాలను తిని జీవించాలి.

        జీవిత చరమాంకంలో వ్యక్తి నాలుగో దశలోకి ప్రవేశిస్తాడు. దీన్నే 'సన్యాసం' అంటారు. ఈదశలో జీవిత తుది లక్ష్యాన్ని చేరుకోవడానికి, చావు, పుట్టుక బంధం నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తాడు.      
వైఖాసన ధర్మసూత్రంలో సన్యాస ఆశ్రమం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైందని పేర్కొన్నారు. క్షత్రియులు మొదటి మూడు దశలు, వైశ్యులు మొదటి రెండు దశలను పాటిస్తే చాలు. శూద్రులు వేదాలను అధ్యయనం చేయకపోవడం వల్ల వారికి గృహస్థాశ్రమం గురించి మాత్రమే తెలుసు. ఈవిధంగా ఆశ్రమ జీవితం కూడా కులాల ఆధారంగా నిర్ణయమైనట్లు తెలుస్తోంది.

Posted Date : 11-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు