• facebook
  • whatsapp
  • telegram

విజయనగర సామ్రాజ్య రాజకీయ చరిత్ర 


           సంగముడి కుమారులైన మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు క్రీ.శ. 14వ శతాబ్దంలో స్థాపించిన విజయనగర సామ్రాజ్యం క్రీ.శ. 17వ శతాబ్దం వరకు కొనసాగింది. విజయనగర సామ్రాజ్యాన్ని వరుసగా సంగమ, సాళువ, తుళువ, ఆరవీడు వంశాలు పాలించాయి. తుళువ వంశ పాలనలో అత్యున్నత దశకు చేరుకున్న విజయనగర సామ్రాజ్యం, ఆరవీడు వంశపాలన కాలంలో అంతమైంది. విజయనగర చక్రవర్తులు గొప్ప యుద్ధవీరులు, దౌత్యవేత్తలు, భవన నిర్మాతలు, కవి, పండిత పోషకులే కాకుండా మంచి పరిపాలనను ప్రవేశపెట్టడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
 

విజయనగర చరిత్రకు ఆధారాలు 
(i) సాహిత్య ఆధారాలు

 

(ఎ) విదేశీ యాత్రికుల రచనలు: ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశానికి చెందిన యాత్రికుడు ఇబన్ బటూటా మొదటి హరిహర రాయల గురించి విలువైన సమాచారాన్ని అందించాడు. ఇటలీ దేశంలోని వెనీస్ నగరానికి చెందిన యాత్రికుడు నికోలో డి.కోంటి మొదటి దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు. పర్షియా దేశానికి చెందిన రాయబారి అబ్దుల్ రజాక్ రెండో దేవరాయల కాలం నాటి విజయనగర సామ్రాజ్య చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడే విలువైన సమాచారాన్ని అందించాడు. పోర్చుగీసు యాత్రికులు డొమింగో పేస్, ఎడ్వర్డో బార్బోసాలు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించారు. మరో పోర్చుగీసు యాత్రికుడు నూనిజ్ అచ్యుత దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు. వీరి రచనలు ఆ కాలంనాటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

(బి) స్వదేశీ రచనలు: శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించిన 'ఆముక్తమాల్యద' గ్రంథం విజయనగర రాజుల పరిపాలన, రాజకీయ భావాలను గురించి తెలియజేస్తోంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవుల్లో ముఖ్యుడైన అల్లసాని పెద్దన రచించిన 'మనుచరిత్ర' ఆ కాలంనాటి సామాజిక పరిస్థితులు... ముఖ్యంగా వర్ణవ్యవస్థను గురించి వివరంగా తెలియజేస్తోంది. మొదటి బుక్కరాయల కుమారుల్లో ఒకడైన కుమార కంపన భార్య గంగాదేవి రచించిన 'మధురా విజయం' అనే గ్రంథం కుమార కంపన మొదటి బుక్కరాయల కాలంలో మధురై పట్టణాన్ని ఆక్రమించుకున్న విషయాన్ని తెలియజేస్తోంది. గంగాధరుడు రచించిన 'గంగదాస ప్రతాప విలాసం' అనే సమకాలీన నాటకం రెండో దేవరాయల మరణం తర్వాత బహమనీ సుల్తాన్, ఒరిస్సా గజపతులు విజయనగరాన్ని ముట్టడించిన విషయాన్ని వివరించింది. రాజనాధ డిండిముడు రచించిన 'సాళువాభ్యుదయం' సాళువ వంశ ప్రశస్తిని తెలియజేస్తోంది.
 

(ii) పురావస్తు ఆధారాలు
 

(ఎ) శాసనాలు: మొదటి హరిహరరాయలు వేయించిన బాగవెల్సి తామ్రరేకు (Plate) శాసనం అతడి విజయాల గురించి తెలియజేస్తోంది. కుమార కంపన కుమారుడైన రెండో సంగముడు వేయించిన బిట్రగుంట శాసనం విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకులైన అయిదుగురు సంగమ సోదరుల వంశ వృక్షాన్ని పేర్కొంటోంది. రెండో హరిహరరాయల చెన్న పట్టణ శాసనం ద్వారా మొదటి బుక్కరాయలు అనేక ప్రాంతాలను విజయవంతంగా ఆక్రమించినట్లు తెలుస్తోంది. రెండో దేవరాయలు వేయించిన శ్రీరంగం తామ్ర రాగిరేకు శాసనం ద్వారా అతడి విజయాలు తెలుస్తున్నాయి. ఇమ్మడి నరసింహుడు వేయించిన దేవులపల్లి తామ్రశాసనం సాళువ వంశ వృక్షాన్ని తెలియజేస్తోంది.

(బి) నాణేలు: విజయనగర చక్రవర్తులు ఎక్కువ సంఖ్యలో వరహాలనే బంగారు నాణేలను విడుదల చేశారు. ఈ నాణేలకు ఒకవైపు హిందూ దేవతల చిత్రాలు, జంతువులు ముఖ్యంగా ఎద్దు, ఏనుగు, గండబేరుండ పక్షి చిత్రాలు ఉండగా, మరోవైపు రాజు పేరు నాగరి లేదా కన్నడ లిపిలో ఉంది. రెండో దేవరాయలు వేయించిన పావు వరహాలు (Quarter Varahas) పై 'గజబేంటకార' అనే బిరుదు ఉంది.
 

(iii) రాజకీయ చరిత్ర
 

(ఎ) పుట్టుక: విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలు క్రీ.శ. 1336లో స్థాపించారు. వరంగల్లును పాలించిన రెండో ప్రతాపరుద్రుడి ఆస్థానంలో హరిహరుడు మంత్రిగా, బుక్కరాయలు కోశాధికారిగా పనిచేశారు. అయితే కాకతీయ రాజ్యాన్ని క్రీ.శ. 1323లో ముస్లింలు ఆక్రమించుకున్న తర్వాత హరిహర, బుక్కరాయలు ప్రస్తుత కర్ణాటకలోని కంపిలి రాజ్యానికి వెళ్లి, మంత్రి పదవులు పొందారు. కంపిలి పాలకుడు ముస్లిం తిరుగుబాటుదారుడికి ఆశ్రయం ఇవ్వడంతో మహమ్మద్ బిన్ తుగ్లక్ కంపిలి రాజ్యాన్ని ఆక్రమించాడు. ముస్లింలు హరిహర, బుక్క సోదరులను బంధించి ఇస్లాం మతాన్ని స్వీకరించేలా చేశారు. కంపిలి రాజ్యంలో తిరుగుబాట్లను అణచే బాధ్యతను వీరిరువురికి అప్పగించారు. కొంతకాలం తర్వాత విద్యారణ్యస్వామి ప్రోత్సాహంతో తిరిగి హిందూ మతాన్ని స్వీకరించి, స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుని, తుంగభద్ర నది దక్షిణతీరంలో విజయనగరం (లేదా) విద్యానగరం అనే నగరాన్ని స్థాపించారు.

(బి) సామ్రాజ్యవ్యాప్తి - ఇబ్బందులు: రాజ్యాన్ని స్థాపించిన వెంటనే విజయనగర రాజులు మైసూరుకు చెందిన హోయసాల రాజ్యంతో, మధురై సుల్తానులతో యుద్ధాలు చేయవలసి వచ్చింది. మధురై సుల్తానును, హోయసాల రాజును యుద్ధంలో ఓడించి ఉరితీశారు. హోయశాల రాజ్యం అంతమవడం హరిహర, బుక్కరాయలు తమ రాజ్యాన్ని విస్తరించడానికి దోహదపడింది. క్రీ.శ. 1346 నాటికి మొత్తం హోయశాల రాజ్యం విజయనగర రాజుల వశమైంది. విజయనగర రాజులు, మధురై సుల్తాను మధ్య యుద్ధం నాలుగు దశాబ్దాలు జరిగింది. క్రీ.శ. 1377 నాటికి మధురై రాజ్యం అంతమైంది. దాంతో విజయనగర రాజ్యం రామేశ్వరం మినహా మొత్తం దక్షిణ భారతదేశమంతా వ్యాపించింది.
 

(సి) బహమనీ సుల్తానులతో పోరు: మూడు ప్రాంతాలపై ఆధిపత్యం కోసం బహమనీ సుల్తానులకు, విజయనగర రాజులకు మధ్య పోరు జరిగింది. ఇందులో మొదటిది తుంగభద్ర అంతర్వేది. ఇది కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం. రెండోది చాలా సారవంతమైన కృష్ణ-గోదావరి డెల్టా. ఈ ప్రాంతం అనేక ఓడరేవులతో విదేశీ వ్యాపారాన్ని నియంత్రించేది. మూడోది మరత్వాడ దేశం. కొంకణ్ మీద ఆధిపత్యం కోసం రెండు రాజ్యాల మధ్య పోరు జరిగింది.
           మొదటి బుక్కరాయలు క్రీ.శ. 1367లో ముద్కల్‌పై దాడిచేసి బహమనీ సుల్తాన్ సైన్యాన్నంతా సంహరించాడు. ఈ వార్తను తెలుసుకున్న బహమనీ సుల్తాను ముద్కల్‌ను తిరిగి ఆక్రమించుకుని, తర్వాత తుంగభద్ర నదిని దాటి, మొదటి బుక్కరాయలను ఓడించాడు. రెండో హరిహరరాయలు తూర్పు తీరం వైపు సామ్రాజ్య విస్తరణకు ప్రయత్నించాడు. ఇది వరంగల్, బహమనీ రాజ్యం మధ్య 50 సంవత్సరాలపాటు స్నేహ సంబంధాలకు దారితీసింది. రెండో హరిహర రాయలు బెల్గాం, గోవాలను బహమనీ రాజ్యం నుంచి ఆక్రమించుకున్నాడు.

మొదటి దేవరాయలు బహమనీ సుల్తాను ఫిరోజ్‌షా చేతిలో ఓడిపోవడంతో పెద్దమొత్తంలో నష్టపరిహారం చెల్లించడమే కాకుండా, తన కుమార్తెను సుల్తానుకిచ్చి వివాహం చేశాడు. రెడ్డి రాజ్యంలో ఏర్పడిన గందరగోళంతో దేవరాయలు, వరంగల్ రాజ్యంతో పొత్తుపెట్టుకుని, రెడ్డి రాజ్యాన్ని పంచుకోవడానికి ప్రయత్నించాడు. వరంగల్‌ను బహమనీ రాజ్యం నుంచి విడదీయడంతో దేవరాయలు ఫిరోజ్‌షాను ఓడించి కృష్ణానది ముఖద్వారం వరకు ఉన్న భూభాగాన్ని తన రాజ్యంలో కలిపేసుకున్నాడు.
           సంగమ వంశంలో గొప్పవాడు రెండో దేవరాయలు. తన సైన్యాన్ని బలోపేతం చేయడానికి సైన్యంలోకి ముస్లింలను చేర్చుకున్నాడు. రెండో దేవరాయలు తన సైన్యంతో తుంగభద్ర నదిని దాటి ముద్కల్‌ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. రెండో దేవరాయల మరణం తర్వాత సింహాసనం కోసం అంతర్యుద్ధం జరిగింది. అనేక మంది సామంత రాజులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. రాజులు విలాసాల్లో మునిగి, రాజ్య వ్యవహారాలను పట్టించుకోలేదు. మంత్రి సాళువ నరసింహుడు సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. దీంతో సంగమ వంశపాలన అంతమై సాళువ వంశ పాలన ప్రారంభమైంది.
           సాళువ వంశ పాలన కూడా కొద్దిరోజులకే అంతమైంది. తుళువ వంశానికి చెందిన వీర నరసింహుడు తుళువ వంశాన్ని స్థాపించాడు. ఇతడి తరువాత విజయనగర రాజులందరిలో గొప్పవాడైన శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్టించాడు. ఇతడు వీర నరసింహుడి సవతి సోదరుడు.

(సి) పతనం: కృష్ణ దేవరాయల మరణం తర్వాత వారసత్వపోరు జరిగింది. అచ్యుత రాయలు, వెంకటరాయలు తర్వాత సదాశివ రాయలు సింహాసనం అధిష్టించారు. వీరి కాలంలో నిజమైన అధికారం శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన రామరాయల చేతిలో ఉండేది. రామరాయలు ముస్లిం రాజ్యాల మధ్య విభేదాలు సృష్టించాడు. పోర్చుగీసు వారితో ఒక సంధి కుదుర్చుకోవడం ద్వారా బీజపూరు సుల్తానుకు పోర్చుగీసువారు గుర్రాలు సరఫరా చేయకుండా అడ్డుకున్నాడు. తద్వారా బీజపూరు సుల్తానును వరుస యుద్ధాల్లో ఓడించాడు. తర్వాత బీజపూర్ సుల్తాన్‌తో కలసి గోల్కొండ, అహ్మద్‌నగర్ రాజ్యాలను ఓడించాడు. బీదర్ తప్ప మిగిలిన ముస్లిం రాజ్యాలు ఏకమై 1565లో తళ్లికోట వద్ద విజయనగర రాజును ఓడించాయి. ఈ యుద్ధానికే బన్నిహట్టి, రాక్షస తంగడి అనే పేర్లు ఉన్నాయి. తర్వాత రామరాయలును ఖైదు చేసి, వెంటనే ఉరితీశారు. తళ్లికోట యుద్ధం విజయనగర సామ్రాజ్యం అంతం కావడానికి కారణమైంది. ఈ యుద్ధం తరువాత ఆరవీడు వంశం విజయనగర సామ్రాజ్యాన్ని 100 సంవత్సరాల పాటు పాలించింది. అయితే ఈ కాలంలో రాజ్య విస్తీర్ణం బాగా తగ్గిపోయింది.
           విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ.శ. 1336లో స్థాపించారు. క్రీ.శ. 1678లో అంతమైంది. సుమారు 342 సంవత్సరాల పాటు దక్షిణ భారతదేశాన్ని పాలించిన విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశ చరిత్రలోనే కాకుండా, భారతదేశ చరిత్రలోనే గొప్ప స్థానాన్ని ఆక్రమించింది. దక్షిణ భారతదేశంపై ముస్లింల దండయాత్రలను అడ్డుకుని, రాజకీయ సుస్థిరతకు బాటలు వేసింది. అనేకమంది విదేశీ యాత్రికులు విజయనగరాన్ని సందర్శించి, విజయనగర వైభవాన్ని గొప్పగా వర్ణించడం విజయనగర చక్రవర్తుల సామర్థ్యానికి, ఆ కాలంనాటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి అద్దం పడుతోంది.

Posted Date : 11-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు