• facebook
  • whatsapp
  • telegram

వ్య‌వ‌సాయ బీమా రంగం

ప్రకృతిపై ఆధారపడి సేద్యం చేసే రైతులకు పంటల/ వ్యవసాయ బీమా అతి ముఖ్యమైన, అవసరమైన సౌకర్యం. దీని వల్ల వారికి భరోసా కలుగుతుంది. వ్యవసాయ బీమా రెండు రకాలు అవి: 

వ్యక్తిగత విధానం (Individual approach):

 ఈ విధానంలో పంట బీమా చేసిన ప్రతి రైతుకు వ్యక్తిగత ప్రాతిపదికన నష్టపరిహారాన్ని నిర్ణయిస్తారు. ఇది ప్రతి కమతాకి విడిగా లేదా అన్ని కమతాలకు కలిపి సమష్టిగా ఉంటుంది.

 వ్యక్తిగత విధానంలో సేద్యం ఖర్చులకు మాత్రమే నష్టపరిహారాన్ని అందిస్తారు. అధిక విలువగల పంటలను సేద్యం చేసే రైతులకు మాత్రమే ఈ విధానం ఉపయోగపడుతుంది.

సజాతీయ ప్రాంతీయ విధానం (Homogeneous area approach): 

 ఈ విధానంలో సజాతీయంగా గుర్తించిన ఒక ప్రాంతంలోని అన్ని పంటలకు నష్టపరిహారం ఒకే విధంగా ఉంటుంది. ఆ ప్రాంతం ఒక జిల్లా/ తాలూకా/ మండలం/ బ్లాకు కావొచ్చు.

 పంట బీమా చేసిన రైతుకు నష్టపోయిన పంట విలువను లేదా పంట ద్వారా వచ్చే ఆదాయంలో ఒక నిర్దిష్ట శాతాన్ని నష్టపరిహారంగా చెల్లిస్తారు. ప్రాంతం ఆధారంగా నష్టపరిహార శాతం ఉంటుంది. 

​​​​​​​ సజాతీయ ప్రాంతాల్లో ప్రయోగాలు, సర్వేలు నిర్వహించి; వాటి ఫలితాల ఆధారంగా వివిధ పంటల సాధారణ దిగుబడిని అంచనా వేస్తారు. దీని ఆధారంగానే బీమా పాలసీల్లో సొమ్ముకు హామీ ఉంటంది.

​​​​​​​ హామీ కంటే వాస్తవిక దిగుబడి తక్కువగా ఉంటే, సంబంధిత పాలసీదారు నష్టపరిహారానికి అర్హుడు అవుతాడు.

బీమా మొత్తం (Sum Assured):

​​​​​​​​​​​​​​ప్రతి రాష్ట్రంలో జిల్లాస్థాయి సాంకేతిక సంఘం (DLTC) జిల్లాలో సేద్యం చేసే అన్ని పంటలకు విత్త తరహాను (Scale of Finance) నిర్ణయిస్తుంది. 

​​​​​​​హెక్టారు భూమిలో పంట వేయడానికి కావాల్సిన మొత్తాన్ని విత్తతరహా అంటారు. ఇది సాగునీటి సౌకర్యం ఉన్న పొలాలకు ఒక రకంగా, లేనివాటికి మరోరకంగా ఉంటుంది. పంటను బట్టి ఇది మారుతుంది. ఈ మొత్తం ఏటా ఒకేలా ఉండదు.

​​​​​​​డీఎల్‌టీపీ ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి సాంకేతిక సంఘం ఆమోదిస్తుంది. 

​​​​​​​బీమా మొత్తం గరిష్ఠ పరిమిత దిగుబడికి (Threshold yield) సమానంగా ఉంటుంది.

గరిష్ఠ దిగుబడి (Threshold yield):

 బీమా యూనిట్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఒక పంటకు సంబంధించి గడిచిన మూడేళ్ల దిగుబడి సగటును, కనీస మద్దతు ధరతో గుణిస్తే వచ్చే మొత్తాన్ని గరిష్ఠ పరిమితి అంటారు. దీన్నే గరిష్ఠ దిగుబడిగా పేర్కొంటారు. ఈ మొత్తాన్నే బీమా కంపెనీ పాలసీ హామీగా నిర్ణయిస్తుంది.

​​​​​​​ ఒక హెక్టారు పొలానికి నిర్ణయించిన విత్త తరహా మొత్తాన్ని, పంట బీమా వర్తించే హెక్టార్ల సంఖ్యతో గుణించి బీమా మొత్తాన్ని నిర్ణయిస్తారు. రైతు తీసుకున్న రుణానికి బీమా మొత్తం పరిమితం అవుతుంది.

ప్రీమియం: బీమా మొత్తంలో లేదా నష్టపరిహారం వాస్తవిక అంచనా (Actuarial rate)లో ప్రీమియం శాతాన్ని నిర్ణయిస్తారు.

​​​​​​​ ఇది పంటను బట్టి మారుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం మొత్తాన్ని లేదా అందులో కొంత శాతాన్ని సబ్సిడీ రూపంలో భరిస్తాయి.

వ్యవసాయ బీమా పథకం


భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక వ్యవసాయ బీమాను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి కేంద్ర శాసనసభలో వ్యవసాయ మంత్రిత్వశాఖ ఒక హామీ ఇచ్చింది. పంట బీమా వ్యక్తిగత ప్రాతిపదికన ఉండాలా లేదా సజాతీయ ప్రాంతం ఆధారంగా ఉండాలా అనే అంశంపై 1947-48లో అధ్యయనం జరిగింది.

పంటల బీమా బిల్లు, 1965: 

​​​​​​​ కేంద్ర ప్రభుత్వం 1965లో పంటల బీమా బిల్లును రూపొందించి, దానికి సంబంధించిన నమూనా పథకాన్ని అన్ని రాష్ట్రాలకు పంపి, వాటి అభిప్రాయాలను కోరింది. ఆ బిల్లు ప్రకారం పంటల బీమా ఒక నిర్బంధ పథకం. 

​​​​​​​ ఈ పథకం వల్ల తమపై ఆర్థిక భారం పడుతుందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అంగీకరించలేదు. దీంతో బిల్లును పరిశీలించడానికి కేంద్రం 1970లో నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది.

​​​​​​​ వ్యవసాయ ధరల కమిషన్‌ అధ్యక్షుడ్ని ఈ సంఘానికి ఛైర్మన్‌గా నియమించింది. 

బీమా పథకాలు

1972-73 నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ బీమా పథకాలు

1. పంట బీమా పథకం (1972)

2. పైలట్‌ పంటల బీమా పథకం (1979)

3. సమగ్ర పంట బీమా పథకం (1985)

4. ప్రయోగాత్మక పంట బీమా పథకం (1997-98)

5. జాతీయ వ్యవసాయ బీమా పథకం (1999)

6. సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం (2011)

7. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (2007లో ప్రవేశపెట్టారు. 2016లో సవరించారు)

8. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (2016 జనవరి 13)

9. సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (2016) (Restructured Weather Based Crop Insurance Scheme - WBCIS)

పంటల బీమా పథకం (Crop Insurance scheme):

మన దేశంలో వ్యవసాయ బీమా పథకాన్ని మొదట 1972-73లో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ప్రవేశపెట్టింది. దీనికి ‘పంటల బీమా పథకం’ అని పేరు పెట్టారు. హెచ్‌-4 పత్తికి ఈ పథకాన్ని వర్తింపజేశారు. తర్వాత దీన్ని వేరుసెనగ, బంగాళాదుంప, గోధుమ పంటలకు విస్తరింపజేశారు. 

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ్‌ బంగా రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

ఇది 1978 వరకు అమల్లో ఉంది.

పైలట్‌ పంటల బీమా పథకం (Pilot Crop Insurance Scheme - PCIS):

 ఈ పథకాన్ని 1979లో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ప్రారంభించింది. ఆచార్య వి.ఎం.దండేకర్‌ సిఫార్సుల మేరకు దీన్ని రూపొందించారు. 

 పంట దిగుబడి నిర్దిష్ట స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ లోటుకు బీమా వర్తిస్తుంది. 

 తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, పత్తి, బంగాళాదుంప, నల్లసెనగ పంటలకు ఈ పథకం వర్తిస్తుంది. 

 1979 నుంచి 1985 వరకు మొత్తం 12 రాష్ట్రాల్లో దీన్ని అమలు చేశారు. 

 ప్రీమియం వ్యయాన్ని 2 : 1 నిష్పత్తిలో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకున్నాయి. మొదటి రుణానికి సమానంగా బీమా మొత్తాన్ని నిర్ణయించారు. తర్వాత బీమా సొమ్మును రుణంపై 150 శాతానికి పెంచారు. 

 బీమా మొత్తంలో 5 నుంచి 10 శాతం ప్రీమియంగా వసూలు చేశారు. 

 ఇది స్వచ్ఛంద పథకం. సంస్థాగత రుణం పొందిన రైతులు మాత్రమే దీనికి అర్హులు. చెరకు, పత్తి పంటలకు ఇది వర్తించదు.

సమగ్ర పంటల బీమా పథకం

 1985 ఖరీఫ్‌ కాలంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని 15 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేశాయి. సజాతీయ ప్రాంతం ప్రాతిపదికన దీన్ని ఆహార పంటలు, నూనెగింజల పంటలకు వర్తింపజేశారు. స్వల్పకాలిక పరపతికి దీన్ని అనుసంధానం చేశారు. 

 వాణిజ్య బ్యాంకులు, సహకార పరపతి సంఘాలు, గ్రామీణ బ్యాంకుల నుంచి పరపతి పొందిన రైతులకు ఈ పథకాన్ని తప్పనిసరి చేశారు. రూ.10,000 పరిమితికి లోబడి పరపతి మొత్తానికి బీమా మొత్తాన్ని సమానం చేశారు.

 తృణధాన్యాలు, చిరుధాన్యాలకు 2 శాతం; పప్పుధాన్యాలు, నూనెగింజలకు ఒక శాతం చొప్పున ప్రీమియం వసూలు చేశారు. ఇందులో సగభాగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2 : 1 నిష్పత్తిలో భరించాయి. 

 1999 వరకు  ఈ పథకం అమల్లో ఉంది. దీని ద్వారా గుజరాత్‌లోని రైతులు ఎక్కువగా లబ్ధి పొందారు.

ప్రయోగాత్మక పంట బీమా పథకం (Experimental Crop Insurance Scheme - ECIS): 

 రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు సమగ్ర పంట బీమా పథకంలో ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. దీన్ని 1997-98 రబీ పంటకాలంలో ప్రయోగాత్మకంగా 5 రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో ప్రవేశపెట్టారు.

​​​​​​​ సంస్థాగత పరపతి పొందని సన్నకారు, ఉపాంత రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సీడీ రూపంలో 4 : 1 నిష్పత్తిలో భరించాయి.

జాతీయ వ్యవసాయ బీమా పథకం

​​​​​​​ ఈ పథకాన్ని 1999 - 2000  రబీ కాలంలో ప్రవేశపెట్టారు. దీన్నే ‘రాష్ట్రీయ కృషి బీమా యోజన’ అంటారు. ఈ పథకం నిర్వహణను ప్రభుత్వం మొదట జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి అప్పగించింది. 2002, డిసెంబరులో దీని నిర్వహణ కోసం భారత వ్యవసాయ బీమా సంస్థను (Agricultural Insurance company of India) ప్రత్యేకంగా నెలకొల్పింది. 

​​​​​​​ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న నాలుగు సాధారణ బీమా సంస్థలు, నాబార్డు దీనికి మూలధనాన్ని సమకూర్చాయి.

లక్ష్యాలు: 1. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, రోగాల వల్ల ప్రతిపాదిత పంటలకు నష్టం వాటిల్లితే, బీమా సంరక్షణ ద్వారా రైతులకు ఆర్థిక సహాయం చేయడం. తర్వాతి పంట కాలంలో వారికి పరపతి పొందే అర్హతను పునరుద్ధరించడం.

2. వ్యవసాయంలో ఆధునిక సేద్య పద్ధతులను, సాంకేతికతను అవలంబించేలా రైతులను ప్రోత్సహించడం.

3. వ్యవసాయ ఆదాయాన్ని (ముఖ్యంగా విపత్తుల కాలంలో) స్థిరీకరించడం.

అర్హులు: బ్యాంకులు, ఇతర రుణ సంస్థల ద్వారా సేద్యానికి అప్పులు తీసుకున్నవారికి/ తీసుకోనివారికి ఈ పథకాన్ని వర్తింపజేశారు. రుణాలు తీసుకున్న వారికి తప్పనిసరి చేశారు.

పంటలు: ఆహారధాన్యాలు (తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు), నూనెగింజలు.

దిగుబడికి సంబంధించిన గణాంకాల సమాచారం అందుబాటులో ఉన్న వార్షిక ఉద్యాన, వాణిజ్య పంటలు (చెరకు, బంగాళాదుంప, పత్తి, అల్లం, ఉల్లి, పసుపు, మిరప, ధనియాలు, జీలకర్ర, కర్రపెండలం, అరటి, పైనాపిల్‌.)

నష్టభయాలు (Risk Coverage): సహజమైన అగ్ని ప్రమాదాలు, మెరుపులు, పెనుగాలులు, వడగండ్ల వాన, గాలి వానలు, తుపాను, ఉప్పెన, వరదలు, కొండచరియలు విరిగి పడటం, కరవు, వర్షాభావం, చీడలు, తెగుళ్ల కారణంగా నష్టపోయిన పంటలకు బీమా మొత్తం లభిస్తుంది.

విధానం: విస్తృతమైన విపత్తులు: సజాతీయ ప్రాంతం 

స్థానిక విపత్తులు: వ్యక్తిగతం

యూనిట్‌: ఈ పథకంలో బీమా యూనిట్‌గా మొదటి బ్లాకును నిర్ణయించారు. ప్రతి పంచాయితీలో మూడేళ్ల కాలంలో పండిన పంటల దిగుబడిని యూనిట్‌గా పరిగణిస్తారు.

నష్టపరిహారం: అత్యధిక నష్టభయం ఉన్న పంటలకు 60%, మధ్యతరహా నష్టభయం కలిగిన పంటలకు 80%, తక్కువ నష్టభయం ఉన్న పంటలకు 90%.

గరిష్ఠ పరిమిత దిగుబడి:

 వరి, గోధుమ: గడచిన మూడేళ్ల సగటు దిగుబడి.

 ఇతర పంటలు: గడచిన అయిదేళ్ల సగటు దిగుబడి.

బీమా మొత్తం: గరిష్ఠ పరిమిత దిగుబడి x నష్టపరిహారం. దీన్ని 150% వరకు పెంచొచ్చు.

ప్రీమియం: బీమా మొత్తంలో ఒక శాతంగా ఉంటుంది.

​​​​​​​ సజ్జ, నూనెగింజల పంటలకు 3.5%, ఇతర ఖరీఫ్‌ పంటలకు 2.5%.

​​​​​​​ గోధుమకు 1.5%, ఇతర రబీ పంటలకు 2%.

సబ్సిడీ: మొదటి ప్రీమియంలో 50 శాతానికి, అయిదేళ్ల కాలంలో 10 శాతానికి తగ్గించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాయి.

వర్ష బీమా పథకం: భారతీయ వ్యవసాయ బీమా కంపెనీ 2004లో నైరుతి రుతుపవన కాలంలో ఈ పథకాన్ని ప్రారంభించింది.

​​​​​​​ అల్ప వర్షపాతం కారణంగా పంట దిగుబడి తగ్గి, రైతుకు నష్టం వాటిల్లుతుంది. దీని నుంచి  రక్షణ కల్పించటమే ఈ పథకం లక్ష్యం. 

 బీమా చేసిన రైతులకు దీని ద్వారా నష్టపరిహారం లభిస్తుంది.


సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం (Modified National Agricultural Insurance Scheme - MNAIS)


​​​​​​​జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని మరింత సులభతరం చేసి, రైతులకు చేరువచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం సిఫార్సులకు అనుగుణంగా 2011-12 రబీ పంట కాలంలో 50 జిల్లాల్లో ఒక పైలట్‌ పథకంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఇది 2012 ఖరీఫ్‌ పంట కాలంలో మరో 44 జిల్లాలకు విస్తరించింది.

అర్హులు: బ్యాంకులు, ఇతర రుణ సంస్థల నుంచి వ్యవసాయానికి అప్పు తీసుకున్న/ తీసుకోని వారికి ఈ పథకం వర్తిస్తుంది. రుణాలు తీసుకున్న వారికి మాత్రం తప్పనిసరి చేశారు.

పంటలు: 

ఆహారధాన్యాలు (తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు), నూనెగింజలు.

​​​​​​​దిగుబడికి సంబంధించిన గణాంకాల సమాచారం అందుబాటులో ఉన్న వార్షిక ఉద్యాన, వాణిజ్య పంటలు (చెరకు, బంగాళాదుంప, పత్తి, అల్లం, ఉల్లి, పసుపు, మిరప, ధనియాలు, జీలకర్ర, కర్రపెండలం, అరటి, పైనాపిల్‌.)

నష్టభయాలు: 

సహజమైన అగ్నిప్రమాదాలు, మెరుపులు, పెనుగాలులు, వడగండ్ల వాన, గాలివానలు, తుపాను, ఉప్పెన, వరదలు, కొండచరియలు విరిగిపడటం, కరవు, వర్షాబావం, చీడలు, తెగుళ్లు.

విధానం: 

    విస్తృతమైన విపత్తులు: సజాతీయ ప్రాంతం 

     స్థానిక విపత్తులు: వ్యక్తిగతం

యూనిట్‌: ఈ పథకంలో బీమా యూనిట్‌గా మొదటి బ్లాకును నిర్ణయించారు. ప్రతి పంచాయితీలో మూడేళ్ల కాలంలో పండిన పంటల దిగుబడిని యూనిట్‌గా పరిగణిస్తారు.

నష్టపరిహారం: అత్యధిక నష్టభయం ఉన్న పంటలకు 80%, అల్ప నష్టభయం ఉన్న పంటలకు 90%.

గరిష్ఠ పరిమిత దిగుబడి: గడచిన ఏడేళ్ల సగటు దిగుబడి ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు (2 కరవు సంవత్సరాలు మినహాయించి).

బీమా మొత్తం:

గరిష్ఠ పరిమిత దిగుబడి x కనీస మద్దతు ధర (ఫార్మ్‌ గేటు ధర)

ప్రీమియం, సబ్సిడీ: 

బీమా మొత్తంలో ఒక శాతంగా ఉంటుంది.

​​​​​​​సజ్జ, నూనెగింజల పంటలకు 3.5%, ఇతర ఖరీఫ్‌ పంటలకు 2.5%.

​​​​​​​గోధుమకు 1.5%, ఇతర రబీ పంటలకు 2%.

​​​​​​​మొదటి ప్రీమియంలో 75 శాతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాయి.


వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (Weather Based Crop Insurance Scheme - WBCIS)


​​​​​​​ వర్షపాతం, ఉష్ణోగ్రత, మంచు, గాలిలో తేమ మొదలైన వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే రైతులు పంట నష్టపోతారు. ఈ సమయాల్లో వారికి కలిగే ఆర్థిక నష్టాన్ని తగ్గించడం ఈ పథకం లక్ష్యం. 

​​​​​​​ ఇందులో పంట దిగుబడి తగ్గడం వల్ల కలిగే నష్టానికి పరిహారం చెల్లిస్తారు. 

​​​​​​​ వాతావరణ ఆధారిత బీమాలో వాతావరణ ప్రమాణాలను దిగుబడికి ‘‘ప్రతినిధిగా (Proxy)’’ తీసుకుంటారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కలిగే నష్టానికి పరిహారం లభిస్తుంది. 

​​​​​​​ బీమా పాలసీలో ప్రస్తావించిన వాతావరణ సూచీలో తేడా ఉన్నప్పుడు నష్టపరిహారం సమస్య ఏర్పడుతుంది.

​​​​​​​ ఈ పథకాన్ని 2007లో ప్రవేశపెట్టగా, 2016లో సవరించారు. రుణాలు తీసుకున్న రైతులందరికీ ఈ పథకం తప్పనిసరి, ఇతరులకు స్వచ్ఛందం.


వ్యవసాయ బీమా పథకాలు - లోపాలు

 ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం వివిధ బీమా పథకాలను అమలుచేసినా, వాటి వల్ల రైతులు ఆశించిన స్థాయిలో ప్రయోజనం పొందలేదు. స్థూల సేద్యపు విస్తీర్ణంలో 23% వరకే బీమా పరిధిలోకి వచ్చింది.

 అన్ని రకాల విపత్తులకు బీమాను వర్తింపజేయలేదు.

 వాణిజ్య, ఉద్యాన పంటలకు ఎక్కువ ప్రీమియం ఉంటుంది. వాటికున్న నష్ట భయం స్థాయి ఆధారంగా నష్టపరిహారం ఉండటమే దీనికి కారణం.

 సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించకపోవడంతో క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం ఎక్కువగా ఉంది.

 ఈ లోపాలను సవరిస్తూ ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది.

Posted Date : 18-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌