• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయ రంగం - అభివృద్ధి - సమస్యలు

  ఉత్పత్తి పెంచుతూ.. ఉపాధి కల్పిస్తూ!
 


దేశంలోని ముఖ్యమైన వ్యవసాయ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. ఇక్కడ అనేక రకాల ఆహార పంటలు, నాణ్యమైన ఆహారేతర పంటలు పండుతాయి. సగానికి పైగా జనాభాకు వ్యవసాయం ప్రధాన ఉపాధి మార్గం. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, మత్స్యశాఖ లాంటివి కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నాయి. ఉద్యాన పంటలు, కోడిగుడ్లు, చేపల ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది.  అయితే, చిన్న కమతాల పెరుగుదల, ఆధునిక సాంకేతికతల వినియోగంలో వెనుకబాటు లాంటి కారణాల వల్ల పంటల ఉత్పాదకతలో ఇంకా మెరుగుదల సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు రాష్ట్ర వ్యవసాయ రంగంపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి.  రాష్ట్రంలోని వివిధ పంటలు, వాటి దిగుబడి, జిల్లాల వారీగా సాగు విస్తీర్ణం, సాగుదారుల సంఖ్య, అభివృద్ధి చెందుతున్న అనుబంధ రంగాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ అభివృద్ధి పథకాలు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, వాటిని అధిగమించడానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు అవకాశాలపై కూడా పట్టు సాధించాలి.

వ్యవసాయ రంగంలో ప్రధాన, అనుబంధ రంగాలుంటాయి. వర్షపాతం ఆధారంగా, నీటిపారుదల సౌకర్యాలతో పంటలు సాగు చేసే రంగాన్ని ప్రధాన రంగంగా చెప్పొచ్చు. వ్యవసాయంపై ఆధారపడిన ప్రజల ఆదాయ స్థిరీకరణకు, అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి ఉపయోగపడే పలు వృత్తులు లేదా కార్యక్రమాలను వ్యవసాయ ఉప రంగాలుగా పేర్కొనవచ్చు. పశుపోషణ, పాడి పరిశ్రమ, కోళ్లు, చేపలు, అడవుల పెంపకం; పట్టు పరిశ్రమ, ఉద్యాన పంటల విస్తరణ లాంటివి వ్యవసాయ అనుబంధ రంగాలు. పాత జిల్లాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఆరు వ్యవసాయ వాతావరణ జోన్లు ఉన్నాయి. రాష్ట్ర పురోభివృద్ధిలో అనేక విధాలుగా సేద్యరంగం ప్రాధాన్యాన్ని సతరించుకుంది. 

రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (ఎస్‌జీడీపీ)లో వాటా: 1956-2012 మధ్యకాలంలో ఎస్‌జీడీపీకి వ్యవసాయ రంగం సమకూర్చిన ఆదాయం నాలుగు రెట్ల కంటే ఎక్కువగా పెరిగింది. 2012-22 మధ్య ఎస్‌జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 26.88% నుంచి 35.47 శాతానికి పెరిగింది. అయితే వృద్ధి రేటులో హెచ్చుతగ్గులున్నాయి. ఉప రంగాల్లో అత్యధిక వృద్ధి రేటు నమోదైన రంగాలు.. చేపల ఉత్పత్తి (25.92%), ఉద్యాన పంటలు (13.24%).

వ్యవసాయ రంగంలో ఉపాధి: 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 62% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. ఏపీలో వ్యవసాయదారులు 33.40 లక్షలు (14.47%), వ్యవసాయ కూలీలు 110.5 లక్షలు (47.89%). శ్రమవారీ విభజనలో వ్యవసాయ రంగం మీదే ఎక్కువ జనాభా ఆధారపడి ఉంది. రాష్ట్రంలో ప్రధాన వ్యవసాయదారుల కంటే వ్యవసాయ కూలీలే అధికం. అత్యధిక వ్యవసాయ కూలీలు గుంటూరు జిల్లాలో ఉండగా, అత్యల్పంగా విశాఖలో ఉన్నారు. ఉపాధి పొందుతున్న వ్యవసాయదారుల్లో అధిక శాతం చిత్తూరు జిల్లాలో, అతితక్కువగా కృష్ణా జిల్లాలో ఉన్నారు. ఉపాధి పొందుతున్న వ్యవసాయ కూలీలు ఎక్కువగా గుంటూరు జిల్లాలో 10.35 లక్షలు, తక్కువగా విశాఖపట్నంలో 3.76 లక్షల మంది ఉన్నారు.

పరిశ్రమలకు ముడిసరకుల సరఫరా: జనపనార, నూలు దుస్తులు, చక్కెర, వంటనూనెలు లాంటి కీలక పరిశ్రమలకు రాష్ట్రంలోని ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులైన పత్తి, చెరకు, నూనెగింజల సరఫరానే ఆధారం. ఆర్థిక సంస్కరణల వల్ల అనేక విదేశీ సంస్థలు ఇక్కడ ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పి ఉత్పత్తి ప్రక్రియను విస్తరిస్తున్నాయి. వీటివల్ల వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్, ఉద్యోగావకాశాలు పెరిగి కొంతమేరకు    ఎగుమతులు కూడా అధికమవుతున్నాయి.

చిన్న పరిశ్రమలు - వ్యవసాయ ఉత్పత్తులు: రాష్ట్రంలోని చిన్న పరిశ్రమ రంగంలోని అనేక యూనిట్లు వ్యవసాయ ఉత్పత్తులపై ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నాయి. బియ్యం, నూనె మిల్లులు; చేనేత పరిశ్రమలు లాంటివి.. వ్యవసాయ ఉత్పత్తులైన వరి, నూనెగింజలు, పత్తి తదితరాలపై ప్రత్యక్షంగా ఆధారపడి నడుస్తున్నాయి. తయారీ రంగంలోని అనేక యూనిట్లు ఈ పంటల ఉత్పత్తులపై ఆధారపడి ఉన్నాయి. తయారీ రంగం నుంచి వచ్చే ఆదాయంలో 50 శాతం వరకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వల్లే లభిస్తోంది.
వ్యవసాయ వృద్ధి - పారిశ్రామిక వస్తువులకు డిమాండ్‌:  వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో వినియోగ వస్తువులకు డిమాండ్‌ అధికమవుతోంది. దీనివల్ల వినియోగ వస్తు పరిశ్రమ రంగానికి ప్రోత్సాహం లభిస్తోంది. వ్యవసాయ ఉత్పాదకాలైన ఎరువులు, క్రిమిసంహారక మందులు, తయారీ పరిశ్రమలు వృద్ధి చెందుతున్నాయి.

ఎగుమతుల్లో వృద్ధి: రాష్ట్రంలో ప్రధాన వ్యవసాయ  ఉత్పత్తులైన వరి, పత్తి, పొగాకు, చెరకు లాంటి పంటల ద్వారా ఎగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్యం  లభిస్తుంది. మొత్తం ఎగుమతుల్లో దాదాపు 200%  వ్యవసాయ ఉత్పత్తులే ఉన్నాయి. ప్రపంచీకరణ    నేపథ్యంలో నూలు దుస్తులు, బియ్యం ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. వీటి మొత్తం విలువలో  వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 1980-2022 మధ్య దాదాపు 13%.

వ్యవసాయ ఉపరంగాల ఉత్పత్తులకు డిమాండ్‌: అభివృద్ధి ప్రక్రియలో ప్రజల ఆదాయాలు పెరుగుతుండటంతో వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులైన పండ్లు, కూరగాయలకు డిమాండ్‌ ఎక్కువవుతోంది. వీటితోపాటు పాలు, కోడిగుడ్లు, చేపలు లాంటి    ఉత్పత్తులు గణనీయంగా పెరిగి వీటి తలసరి     వినియోగం వృద్ధి చెందింది.

వ్యవసాయ ఉత్పత్తులు - ఆహార భద్రత: ఆహార భద్రత వ్యవస్థలో వ్యవసాయ ఉత్పత్తులైన ఆహార పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజలకు ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వం ధాన్యం సేకరించి చౌకధరల డిపోల ద్వారా పేదలకు పంపిణీ చేస్తోంది.

రాష్ట్రంలో వ్యవసాయ రంగం - అభివృద్ధి: 1950 నాటికి భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల వల్ల సాగులో ఉన్న సాగు భూమి 29.73 లక్షల హెక్టార్లు. ఆ తర్వాత అనేక చిన్నతరహా ప్రాజెక్టులు, మైనర్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మార్గాల ద్వారా 1956 - 2015 మధ్య వరుసగా 25.60 లక్షల హెక్టార్లు, 7.03 లక్షల హెక్టార్ల భూమిని సాగులోకి తెచ్చారు. 2021-22 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 106.13 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చింది.

భూమి వినియోగం:  2013-14 నుంచి 2019-22 వరకు రాష్ట్రంలో భూమి వినియోగంతోపాటు నికర సేద్య భూమి వివరాలు-

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 160.20 లక్షల హెక్టార్లు. అందులో అడవుల విస్తీర్ణం దాదాపు 23% శాతం.

* రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం - 36.88 లక్షల హెక్టార్లు (ల.హె.)      

* బంజరు వ్యవసాయ యోగ్యం కానిది - 13.36 ల.హె.

* వ్యవసాయేతర భూములు - 20.74 ల.హె.

* బంజరు బీళ్లు - 25.06 ల.హె.బీ నికర సేద్య భూమి - 60.48 ల.హె.

* ఒకసారి కంటే ఎక్కువగా సేద్యం చేసిన భూములు - 14.03 ల.హె.

* ఇతర రకాల భూములు - 6.18 ల.హె.

రాష్ట్రంలో భూకమతాలు: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయదారులు సుమారు 1.4 కోట్లు. వీరిలో కౌలుదారులు దాదాపు 50 లక్షలు. రాష్ట్రంలో కౌలుదార్ల సంఖ్య గత పదేళ్లలో 30 లక్షల నుంచి 50 లక్షలకు పెరిగిందని అంచనా. 2015-16లో రాష్ట్రంలో ఒక హెక్టారు కంటే తక్కువ ఉన్న కమతాలు 59.04 లక్షలు ఉండగా, 20.0 హెక్టార్ల కంటే ఎక్కువ పరిమాణం ఉన్న కమతాలు కేవలం 1966 ఉన్నాయి. జనాభా పెరుగుదల వల్ల కమతాల విభజన జరిగి తక్కువ పరిమాణ కమతాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఏపీలో 2015-16లో సగటు కమతం పరిమాణం కేవలం 0.94 హెక్టార్లుగా ఉండటం వ్యవసాయ అభివృద్ధికి ఆటంకంగా మారింది. సగటు కమత పరిమాణం అనంతపురం జిల్లాలో 1.63 హెక్టార్లు, చిత్తూరు జిల్లాలో 1.42 హెక్టార్లు, కర్నూలు జిల్లాలో 1.15 హెక్టార్లు.

ఆహార - ఆహారేతర పంటల విస్తీర్ణం: వ్యవసాయ పంటలను ముఖ్యంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి-

1) ఆహార పంటలు

2) ఆహారేతర పంటలు.

1) ఆహార పంటలు: వరి, గోధుమ, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు ముఖ్యమైన ఆహార పంటలు.

2) ఆహారేతర పంటలు: పత్తి, పొగాకు, జనుము ముఖ్యమైన ఆహారేతర పంటలు. నూనెగింజల ఉత్పత్తి గత 50 సంవత్సరాల్లో రెట్టింపు అయ్యింది. సాగునీటి లభ్యత ఉన్న భూముల విస్తీర్ణం పెరగడం ఇందుకు ఒక కారణం. పప్పుధాన్యాల ఉత్పత్తిలోనూ ఇదే రకమైన మార్పు ఉంది. ముతక ధాన్యాలైన మొక్కజొన్న, ఇతర తృణధాన్యాల ఉత్పత్తి స్థాయి పెరిగింది. వీటి పెరుగుదలకు సంకర జాతి విత్తనాలు అందుబాటులోకి రావడం ముఖ్య కారణం. వర్షాధారంగా సాగయ్యే భూముల్లో ఉత్పత్తి హెక్టారుకు టన్ను ఉంటే, నీటిపారుదల సౌకర్యాలున్న భూముల్లో మాత్రం హెక్టారుకు 3 టన్నులు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో పంటల తీరులో కొన్ని లక్షణాలు గుర్తించవచ్చు.  

1) మొత్తం సాగయ్యే భూమిలో ఆహార పంటల భూమి ప్రాధాన్యం వహిస్తుంది.

2) ఆహార పంటల్లో పప్పుధాన్యాలు పండించే భూమి తగ్గిపోతోంది.

3) ఆహారేతర పంటల భూమి పెరుగుదల శాతం ఎక్కువగా ఉంది.

పెరుగుతున్న అనుబంధ వృత్తుల ప్రాధాన్యం:  భారతదేశంలో పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ 5వ స్థానంలో ఉంది, మాంసం ఉత్పత్తిలో రెండో స్థానం, గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. చేపల ఉత్పత్తిలో 46.23 లక్షల మెట్రిక్‌ టన్నులతో (29.40%) దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ రంగం 16.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. భారత మత్స్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ది మొదటి స్థానం (36%).

జాతీయ ఉద్యాన బోర్డు నివేదిక ప్రకారం (2021-22) వివిధ స్థూల ఉత్పత్తుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ స్థానం వివరాలు -

* మొదటి స్థానం: అరటి, నిమ్మ, బత్తాయి, బొప్పాయి, ఎండు మిరప దీ

* రెండో స్థానం: జీడిపప్పు, మామిడి పండ్లు, ద్రాక్ష 

* మూడో స్థానం: పూలు, టమాటాలు

* నాలుగో స్థానం: సుగంధ ద్రవ్యాలు, దానిమ్మ, కొబ్బరి, పసుపు, చింతపండు

* అయిదో స్థానం: సపోటా

* ఏడో స్థానం: ఉల్లిపాయలు.

రచయిత : ధరణి శ్రీనివాస్‌ 
 

Posted Date : 08-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు